సునీలు ఏమయ్యాడో

అబ్బయ్య, అమ్మి ..మూడేళ్ళ పసివాడు “సునీలు ఏమయ్యాడో” . ఆ మందల తెలియాలంటే మీరు ఓ తూరి నెల్లూరు విజయమహల్ సెంటర్ కాడికి వెళ్లాల్సిందే మరి.. విశాలాక్షి మాసపత్రిక జూన్ 2021 సంచికలో..

“బాటలకు ఇరువైపులా చెట్లు నాటించిన చక్రవర్తి …. ” ఆఖరి ఖాళీలో “అశోకుడు” అని రాసి “అమ్మయ్య” అనుకున్నా. క్లాసులో ఎనక కూర్చొని రాస్తావున్న ఆ అమ్మి హిమబిందు మెల్లగా ” రాసేసావా. అయిపోయిందా” అంటా సైగ చేసింది. రాసేశా అంటా తలవూపినా. యూనిట్ పరీక్షల్లో ఆఖరి సోషల్ పరీక్షా అయిపోయింది.
జవాబుల కాగితం ఫుల్ టావును మడిచి పేరు, నెంబర్ రాసి రంగారావు అయివారిచేతికి ఇచ్చేసాను. గెంట సాయ, బడి లీడర్ నాగరాజా సాయ చూస్తా ఉండా. నాగరాజా ఇంటి గంట కొట్టేదానికి పోయాడు. గణ గణ మంటా మోగింది గంట. బిల బిల మంటా బయటకు పరుగెత్తినాం పిలకాయలమంతా. శని, ఆదివారం రెండు రోజులు బడి సెలవలు. నేను, సునీతా, హిమబిందు, రాధా, శిల్ప అందరం కల్సి ఆడుకోవాలనుకున్నాం. గబా గబా ఇంటికి లాగెత్తినాం.
ఇంటికాడ పంచలో నులక మంచం మీద పండుకోనుండాది ఉమక్క. అమ్మ ఉమక్కకి బార్లీ నీళ్ళు కలిపి ఇస్తా ఉండాది .
నేనుండుకొని ” ఏంది మా..? ఉమక్క ఇప్పుడు పనుకోనుండాది” అన్నా
“ఉమక్కకి ఒళ్ళు బాగాలేదు. జరం. అక్కని తీసుకొని నేను రాధా మాధవా హాలు ఎనక జొన్నలగడ్డ వారి వీధిలో ఉండే చక్కిలాల సుబ్రహ్మణ్యం డాక్టర్ కాడికి పోతాను.
నువ్వు బయటకి పోయి రిక్షా చెంచురాముడిని పీల్చక రాపో ” అనింది. చెక్క తలుపు తీసుకుని వాకిట్లోకి పొయినా. వాకిట్లో గోడ వారగా రిక్షాలో కూర్చొని ఆరమోడ్పు కళ్ళతో బీడీ కాలస్త ఉండాడు రిక్షా చెంచురాముడు.
” చెంచురామన్నా…. నిన్ను పిలస్తా ఉండాది మా అమ్మ ” అన్నాను.
“వస్తన్నా పా బుజ్జమ్మా..”
అంటా బీడీని గోడకేసి రుద్ది ఆర్పేసి మిగిలిన ముక్కను చెవులో దోపుకున్నాడు. రిక్షాలో సీటు సరిగా యేసి గుడ్డతో తుడిచాడు. అమ్మ, అక్కా వచ్చి వాకిట్లో నిలబడుకున్నారు.
” ఉమక్కని జాగ్రత్తగా రిక్షా ఎక్కించి, అమ్మ కూడా రిక్షా ఎక్కి ” జొన్నల గడ్డ వారి వీధిలోకి పోనీ చెంచురామయ్య ” అనింది.
” ఉమమ్మకు బాగాలేదా ఏందమ్మా..నీరసంగా అవపడతా ఉన్నాది. సుబ్రహ్మణ్యం డాక్టర్ కాడికే కదా” అన్నాడు చెంచురామయ్య రిక్షా తొక్కతా.
డాక్టర్ కాడి నుంచి వొచ్చినాక మందులు వేసుకుని ఉమక్క పడుకునింది. నాయన శాంతి స్వీట్ హోమ్ కాడికి పోయి బ్రెడ్డు తెచ్చాడు. గంట తొమ్మిది కావస్తా ఉండాది. అన్నం తిని పనుకున్నా నాయన పక్కన. పొద్దన కన్నా అక్కకి జరం తగ్గాలని దేవుడికి మొక్కతా నిద్రలోకి జారుకున్న.
తాటాకుల పందిరి చిల్లుల్లోనుంచి నేరుగా హాల్లోకి వొచ్చి నవారా వైరు మంచం మీద పనుకోనున్న నా ముఖం మీద చురుక్కు మనిపించింది ఎండ. ఆవులిస్తా లేచి పక్కకు తిరిగి పడుకున్న.
“గెంట ఎనిమిదవతా ఉంది. పనుకున్నది చాలు ఇంక లే మీ ” అమ్మ అరుపుల దండకం ఎత్తుకున్నాది.
సందులో నాయన టెంకాయ చెట్టు మట్టలను రెండిటిని కొట్టి ఆకులను, టెంకాయ ఆకు పుల్లలను చీలస్తా ఉండాడు. అమ్మ పెసల దోశలు పోస్తా ఉండాది. ఉమక్క ఇంకా పనుకొనే ఉన్నాది. అంటే అక్కకి ఇంకా జరం తగ్గినట్లు లేదు. మరోసారి నిరాశగా నేను పంచలో ఉన్న కిటికీ గూట్లో చేయి పెట్టి గోపాల్ పళ్ళపొడి పొట్లం తీసాను. రోజా రంగులో ఉండే పళ్ళపొడిని రవంత అరచేతిలో వేసుకొని ఒక చుక్క నీళ్ళతో తడిపి చూపుడువేలుకి అద్దుకుని నోట్లో పెట్టుకున్నాను. పళ్ళ పొడి తియ్యంగా నాలుకకి తగిలింది. రవంత పొడి మింగి పళ్ళు తోముకుంటా ఉన్నాను.
వాకిట్లో ఏదో కలకలం మొదలైంది. మైకు లో ఇనపడే అరుపులకు అమ్మ విసుక్కుంటా ఉన్నాది. ” ఛీ..సెలవు రోజైతే చాలు. ఇంటి ముందర ఈ వెధవ గోల. సాయంత్రం దాక చెవులు చిల్లులు పడిపోతాయి” అని విసురుగా నాయన చేతికి పెసల దోశల పళ్లెం ఇచ్చింది.
” ఆదెమ్మ .. దానికి నేనేం చేసేది. ఎన్ని తూర్లు చెప్పినా వాళ్ళు మన తావుని వదలకుండా ఈడ్నే రిక్షాలు పెడతా ఉండారు” అన్నాడు.
” ఆళ్ళని మా ఇంటి తావులో రిక్షాలు పెట్టవద్దని నువ్వు గట్టిగా చెప్తే కదా. నువ్వు ఇచ్చిన అలుసుతోనే వాళ్ళు మన ఇంటి అమ్మిడిన రిక్షాలు పెట్టేది ” అమ్మ ఆరస్తా ఉండాది. నాయన గమ్మున పెసల దోశ తింటా ఉన్నాడు.
” ఒక తూరి ఒకే ఒక్క తూరి మా రిక్షా అమ్మిడికి రాండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే చిటికెలో మాయం. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, ఆస్తి, ఆరోగ్యం, వశీకరణం మీ సమస్య ఏదైనా సరే. అన్నింటికీ ఒకటే పరిష్కారం మా మహా మహిమాన్వితమైన నవగ్రహ పంచలోహ ఉంగరం. ఐదు రూపాయలు మాత్రమే.” అని మైకులో నుంచి పెద్దగా ఇనపడతా ఉంది మా కిష్టమామ బంకు కి అమ్మిడిగా ఉన్న రిక్షాలోనుంచి.
ఆ మైకు ఆగగానే ఈ పక్క నుంచి ” దురద, మహా దురద. మహా మొండి దురద. ఎంతకీ వదలని దురద. గోకితే పుండ్లు పడి వదలని నవ. మహా మొండి నవ. మీ దురద, నవ గజ్జి, తామర లకి చిటికెలో పరిష్కారం మా అశ్వని యునాని దురద నివారిణి పొడి, లేహ్యం. ధర ఒక పొట్లం మూడు రూపాయలు మాత్రమే” మహా జోరుగా పెద్ద సౌండ్ తో చెప్తా ఉండాడు తండలు ఓబులేసు. అమ్మకి ఒళ్ళు మండిపోతా ఉండాది. నాయన సాయ చూసి ” ఏమయ్యో.. ఆళ్ళకి చెప్పడం నీకు చేతకాదుకాని ఈ తూరి నేను పోయి చెప్తా వాళ్ళకి వేరే సెంటర్ కి పొమ్మని. ఇంటి ముందర ఈ ముదనష్టపు గోల ఆపమని” అంటా అమ్మ కొంగు బిగించి నడుంకి చుట్టుకొని వాకిట్లోకి పోబోయింది.
నాయన ఉండుకొని ” ఆదెమ్మ..ఆగు.. నేను పోయి చెప్తాలే వాళ్ళకు. అయినా యెంత సేపు మధ్యాన్నానికి వెళ్ళిపోతారు లే ” అంటా అమ్మని బతిమాలతా ఉండాడు.
” అమ్మ అరవడం, నాయన బతిమాలడం. సెలవు రోజుల్లో ఎప్పుడూ ఉండే సంబడమేలే ఇది ” అనుకుంటా అమ్మ ఇచ్చిన ఒవుల్టిన్ కలిపిన పాలు తాగతా మళ్ళా ఓ చెవ్వు వీధిలోకి వేసినా.
రిక్షాల్లో ఇద్దరు పోటీలు పడి మైకులో చెప్తా ఉండారు. ఒకరు ఆపగానే ఇంకొకరు మళ్ళా ఎత్తుకున్నారు.
“ఆలసించిన ఆశా భంగం. స్టాకు అయిపోవచ్చింది. పెళ్ళి కాలేదని చింత మీకు ఎందుకు. ఆస్తి కలిసి రాలేదని నిరాశ మీకెందుకు. విదేశాలకు పోవాలనుకుంటే కుదరడం లేదా? విఫలమైన మీ ప్రేమ సఫలం కావాలా ? మీరు ఎవరినైనా వశపరచుకోవాలా? మీరు చేసిన అప్పులు తీరడం లేదా? మీ అన్నీ సమస్యలు తీరే మార్గం ఒకటే. మా నవగ్రహ పంచలోహ ఉంగరం మీ వేలికి ధరించారంటే మీరు అనుకున్నది జరిగి తీరుతుంది. ఐదు రూపాయలు మాత్రమే. త్వరపడండి. త్వరపడండి.” రిక్షా చుట్టూరా జనాలు చేరి బిక్షపతి కాడ ఎగబడి ఉంగరాలు కొంటా ఉండారు.
ఇంకో పక్క ” సంకల్లో గజ్జి , దురద, గజ్జల్లో తామర, నవ, జిల. మహా మొండి జిల. యెంత గోకినా తగ్గని జిల. ఎన్ని మందులు వాడినా తగ్గని జిల. నలుగురిలోకి ఉన్నప్పుడు గీరుకోవాలంటే సిగ్గు పడుతున్నారా. ఈ గజ్జి వల్ల మీ పెళ్ళి కాన్సిలు అవుతుందని బెంగ పడుతున్నారా.. మీ సమస్యకు మా ఏకైక పరిష్కారం మా యునాని వైద్యులు ఎన్నో ప్రయోగాలు చేసి కనుగొన్న మందు మా అశ్వని యునాని దురద నివారిణి ” త్వరపడండి. మీ గజ్జి తగ్గించుకోండి. స్టాకు అయిపోవచ్చింది” ఇంకా పెద్దగా ఆరస్తా ఉండాడు ఓబులేసు.
“మా నేను ఒక ఉంగరం కొనుక్కుంటాను.. అది వేలికి ఏసుకుంటే చదువు బాగా వస్తుందట మా “అన్నాను.
“నోరుమూసుకుని ఇంట్లోకి పా మీ ” అన్నాది అమ్మ.
“ఛీ ఛీ. మాయదారి సంత. చెవులు తుప్పు పట్టి పోతా ఉండాయి ” అంటా అమ్మ వాకిటి సైడు ఉన్న కిటికి తలుపులన్నీ ఏసేసింది.అయినా వాళ్ళ అరుపులు మైకులో ఇనపడతానే ఉండాయి.
” ఈ సెంటర్ లో ఇల్లు అమ్మేసి వేదాయపాలానికో, లేదా బాలాజి నగర్ చివరికో పోయి ఇల్లు కట్టుకోవడం మేలు” అని తిట్టుకుంటా వంట చేస్తా ఉంది అమ్మ.
మధ్యాన్నం రెండు అయింది గంట. అమ్మ ఉమక్కకి మెత్తగా కలిపిన చారు అన్నం ఇచ్చింది తినమని. జరం తగ్గింది కానీ ఇంకా నీరసంగా కనిపిస్తా ఉండాది ఉమక్క. బిక్షపతి చెక్క తలుపు తీసుకుని ఇంటిలోపలకు వచ్చి “ఆదెక్కా..పొద్దన నుంచి మైకులో అరిచి అరిచి గొంతు ఎండిపోతా ఉండాది. రొవ్వన్ని కుండలో నీళ్ళు ఈవా ” అని అడిగాడు.
అప్పటిదాకా వాళ్ళని అరిచిన అమ్మ బిక్షపతి దాహం అనగానే వంటింట్లోకి పోయి లోటాలో చల్లటి మజ్జిగ తెచ్చి ఇచ్చింది అతనికి. చల్లటి మజ్జిగ తాగి ” మా ఆదెక్క మనసు యెన్నపూస ” అనుకుంటా పోయినాడు. కాసేపటికి వాళ్ళు ఇద్దరు వెళ్లిపోయారు. మళ్ళా సాయంత్రానికి వస్తారు. నాయన కునుకు తీసాడు. నిద్రపోతే జరం వస్తదని అక్కని నిద్రపోనీకుండా అమ్మ కాపలా కాస్త ఉండాది.
అంతలోనే వీధిలో పెద్ద పెద్దంగా మైకు అప్పారావు గొంతు ఇనపడతా ఉండాది. ఊర్లో ఏ ప్రకటన చేయాలన్నా మైకు అప్పారావు ని పిలిచేటోళ్లు. ఒళ్ళంతా తెల్లటి బొల్లి మచ్చలతో ఉండే అప్పారావు గొంతు మార్చి సినిమా యాక్టర్ల గొంతులతో మైకు లో మాట్లాడేవాడు. ఆడ గొంతుతో మాట్లాడేవాడు. ప్రతిరోజూ మైకు అప్పారావు గొంతు వీధుల్లో వినపడాల్సిందే.
” ఏం కొంప మునిగిందో. మిట్ట మధ్యాన్నం పూట ఈ అరుపులు ” అన్నాది అమ్మ. కానీ మైకు సౌండ్ బాగా దగ్గరకి వొచ్చాక ” అందరు వినండి. సునీలు కనపడం లేదు. సునీలు బాబు తప్పిపోయాడు. బాలాజి నగర్ రెండవ అడ్డరోడ్డులో ఉండే పద్మావతి, శ్రీనివాసుల పిలగాడు మూడేళ్ళ సునీలు పొద్దున నుంచి కనపడం లేదు. పిలగాడు బులుగు రంగు చొక్కా, నల్ల నిక్కరు వేసుకొని ఉండాడు. చామన ఛాయా రంగు. రింగుల జుట్టు తో ఉండాడు. సునీలు చెవులకు బంగారు పోగులు, వేలికి బంగారు ఉంగరం ఉండాయి. ఆచూకీ తెలిసిన వాళ్ళు నెల్లూరు పోలీస్ స్టేషన్ లో తెలిపితే వారికీ తగిన బహుమతి ఇవ్వబడుతుంది ” పెద్ద గా అరిచి చెప్తున్నాడు.
అందరం దిగ్గున లేచి వీధిలోకి పరుగెత్తాం. సునీలు మా లక్ష్మయ్య మామ మనవడు. పోయిన ఆదివారం బాలాజి నగర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి చాల సేపు సునీలుని ఎత్తుకుని వాడితో ఆడుకుని వచ్చాను. పాపం వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో.
నాయన మైకు అప్పారావుని అడిగి వివరాలు కనుక్కుంటున్నాడు. అమ్మ ఉండుకొని ” అయ్యో..మూడేళ్ళ పసి కుంక సునీలు. ఏమయ్యాడో ! వాడికి మాటలు కూడా రాలేదు ఇంకా. పసివాడి ఒంటి మీద బంగారం వేయవద్దు అంటే వినదు ఆఎమ్మి . నేను పద్మ వాళ్ళ ఇంటికాడికి పోయి వస్తాను ” అనింది అమ్మ నాయనతో
” మా.. నేను నీతో వస్తాను” అన్నాను
” నువ్వెందుకు మీ. అక్క కాడ ఉండు” అనింది అమ్మ
“పోనీలే ఉమను నేను చూసుకుంటాను. నువ్వు ఈ అమ్మిని తీసుకుపో ” అన్నాడు నాయన.
వెంటనే అమ్మ, నేను అదలా బదలా కొండయ్య రిక్షా ఎక్కి కూర్చున్నాం పద్మక్క వాళ్ళ ఇంటికి పోయేదానికి. రిక్షా దిగి ఇంట్లోకి పరుగెత్తాను నేను. అమ్మ కూడా గబా గబా ఇంట్లోకి వచ్చింది. అందరు దిగాలు ముఖాలు ఏసుకొని కూర్చుని ఉండారు. సునీలు పొద్దన వీధిలోకి వొచ్చి ఆడుకుంటా తప్పిపోయాడట. వాడు తప్పి పోయినప్పటినుంచి పద్మక్క ఏడస్తా ఏమి తినలేదుట.
ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే రామచంద్రారెడ్డి ఆసుపత్రి పెద్ద డాక్టరమ్మ వింజావళమ్మ వచ్చి చూస్తా ఉండాది పద్మక్కని. శ్రీనివాసులు బావ వాళ్ళ స్నేహితులను తీసుకుని మోటార్ బండి మీద తిరగతా ఊరంతా సునీలు కోసం వెతకతా ఉన్నారంట. లీల పెద్దమ్మ కూడా ఏడుస్తా ఉంది. పద్మక్క అలా పడి ఉంటే నాకు చాల దిగులు పుట్టింది. అమ్మ లీల పెద్దమ్మను ఓదారుస్తా ఉంది. నాకు ఏడుపు ఎగతన్నుకు వచ్చింది. బుజ్జి సునీలు ఎక్కడ ఉన్నాడో ఏమో. పోలీస్ స్టేషన్ లో కూడా రిపోర్ట్ ఇచ్చారు కదా పోలీస్ వాళ్ళు కూడా సునీలు ను వెతకతా ఉండారంట. ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు. అప్పటికప్పుడు సునీలు ఫోటో, ఇంటి అడ్రస్ ఉన్న కాగితాలను ఆ రాత్రంతాఊరంతా తిరగతా , వీధుల్లో గోడలకు అతికిస్తానే ఉండినారంట శ్రీనివాసులు బావ అంగట్లో పని చేసే వాళ్ళు.
పొద్దన తొమ్మిది గంటలకు శ్రీనివాసులన్న కోసం ఎవరో వచ్చి వాకిట్లో నించి పిలిచారు. మైకు అప్పారావు మళ్ళా సునీలు తప్పిపోయిన విషయం చెప్పడానికి రిక్షాలో మైకు పెట్టుకుని వచ్చాడు. శ్రీనివాసులు బావ గబా గబా బయటకు పోయాడు. చిన్న పిలగాడు ఎవరో బుజ బుజ నెల్లూరులో ఉన్నాడు అని చెప్పాడు ఒకాయన. వెంటనే శ్రీనివాసులు బావ వేన్ తీసుకుని బయలుదేరాడు. పద్మక్క, అమ్మ కూడా వేను ఎక్కినారు. వాళ్ళ ఎనకే నేను కూడా ఎక్కాను. వేనుని మేఘాల మీద పరిగెత్తించినట్లు పదిహేను నిముషాల్లో బుజ బుజ నెల్లూరికి తీసుకుపోయినాడు డ్రైవర్.
అందరం వేను దిగాం. మాతో వచ్చిన పెద్దాయన మమ్మలిని కొంత దూరం నడిపించి ఓ గుడిసె లోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఓ అవ్వ ఒడిలో కూర్చొని ఏడస్తా ఉన్నాడు సునీలు. గబా గబా పద్మక్క సునీలును ఎత్తుకుని ఏడస్తా ముద్దులు పెట్టుకుంది. అందరం సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాం. నిన్న పొద్దున తప్పిపోయిన సునీలును ఎవరు ఎత్తుకుపోయారు తెలియదు. ముసలామె ను అడిగితే తనకి మాటలు రావని సైగ చేసింది.
“ఆమె మూగది బాబు. గుడిసె ముందర పిలగాడు ఏడస్తా ఉంటే ఇంట్లోకి తీసుకొచ్చి అన్నం పెట్టింది. మేము పక్క గుడిసెలో ఉంటాం. గోడ మీద అతికించిన కాయితంలో పిలగాడి ఫోటో , మీ ఇంటి అడ్రస్ చూసి నేను మీ ఇంటికాడికి వచ్చినా” అన్నాడు ఆ పెద్దాయన.సునీలు ఏడుస్తా పద్మక్క ఒళ్లోనే నిద్ర పోయాడు. వాడి చెవి పోగులు, ఉంగరం లేవు. ఎవరో పోగులు, ఉంగరం కోసం వాడిని ఎత్తుకువెళ్లారని తెలుస్తోంది.
ఆ పెద్దాయనకి డబ్బులు ఇచ్చాడు శ్రీనివాసులు బావ. అవ్వకి కూడా ఇవ్వబోతే ఆమె తీసుకోలేదు. సునీలు తల మీద చెయి పెట్టి దీవించింది. ఆమె పెద్ద మనసుకు అందరం చేతులెత్తి దణ్ణం పెట్టాం. కానీ వాడు ఆ అవ్వ గుడిసె ముందుకు ఎలా వచ్చాడో చెప్పడానికి ఆ అవ్వకు నోరు లేదు. ఏం జరిగిందో చెప్పేంత వయసు లేని మాటలు ఇంకా రాని పసివాడు సునీలు. బంగారు చెవి పోగులు, ఉంగరం పొతే పోయాయి. బిడ్డ దక్కాడని అందరం సంతోషించాం ఆ రోజు.

16 thoughts on “సునీలు ఏమయ్యాడో”

  1. కాత్యాయని గరిమెళ్ల

    కథ బాగుంది రోహిణి. నాకు నెల్లూరు లో ఉన్ననేమో అనిపించింది. మన పక్కనే జరిగినట్టు అనిపించింది.❤️❤️

  2. కథ బాగుంది మేడం. అనుభవంతో, వాస్తవంగా రాసినది ఏదైనా అది బాగానే ఉంటుంది. చక్కని మాండలికంలో సాగిన చిక్కని కథ. మాండలికాలను బతికించడంలో కథలు ఒక సాధనం.

  3. Rachapalem Raghu

    ప్రియమైన రోహిణి మిత్రమా శుభోదయం
    Excellent Writup
    Wonderful Narrative
    సరళమైన అలతి అలతి పదాలతో కథా కధనం తీరు అమోఘం Wonderful
    కథ చదవడం మొదలుపెట్టితే చివరి వరకు ఉత్కంఠ భరితంగా చదవించడం మీకే చెల్లింది డియర్ ఫ్రెండ్
    Hats off to you dear friend

  4. కథాశం ఏదైనా కథన విధానాన్ని ఓ దృశ్యకావ్యంలా రచించటం ఓ పార్శ్వమైతే అతి సామాన్యవిషయాన్ని కూడ మనస్సును తాకేలా అందించటంలో ఈ రచయిత్రి సిద్ధహస్తురాలనుట అతిశయోక్తి కాదు.

Comments are closed.