విమల సాహితి ఎడిటోరియల్ 72 – సంతులనం – సంతుష్టి

“తల్లిగర్భమునుండి – ధనము తేడెవ్వడు
వెళ్లిపోయేనాడు – వెంట రాదు
లక్షాధికారైనా – లవణమన్నమె కానీ
మెరుగు బంగారము – మ్రింగబోడు”

ప్రాచీన కవి శేషప్ప చెప్పినట్లు పై పద్యం అర్ధాన్ని అవగాహన చేసుకుంటే, పొద్దున లేచింది మొదలు ఊరుకుల పరుగుల జీవితం. సంపాదించినది చాలదు. ఇంకా ఇంకా సంపాదించాలి. ఓవర్ డ్యూటీలు చేయాలి. పెద్ద భవంతి కట్టించుకోవాలి. పడవ లాంటి కారులో తిరగాలి. పదిమందిలో గొప్ప అనిపించుకోవాలి. నేడు చాల మంది ఆలోచన ఇదే.

పోనీ అన్నీ సంపాదించిన వాళ్ళకి సంతృప్తి ఉందా అంటే, దానికి అర్ధం కూడా తెలియనివారు ఉంటారు. లక్షలు సంపాదించినా ఆకలి వేస్తే తినాల్సింది అన్నమే. నోట్ల కట్టలు కాదు, బంగారం అంతకంటే కాదు. కానీ ఆ అన్నాన్ని కూడా సంతృప్తిగా తినలేని రోజులు ఇవి. ఉప్పు తినాలంటే బి.పి., కారం తినాలంటే కడుపులో అల్సర్, పోనీ ఓ గులాబ్ జామ్ ఇష్టంగా తిందామంటే బాబోయ్ ఇంకేమైనా ఉందా..! ఒంట్లో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోవూ. చప్పిడి మెతుకులు నాలుగు తిన్నామనిపించుకోవాల్సిందే.

చేయాల్సిన పని పక్కనపెట్టి, అక్కరకు రాని వ్యవహారాలపైన మక్కువ చూపడం. ఈ ఆసక్తికి ఆజ్యం పోస్తూ సోషల్ మీడియా. పనికిమాలిన రీల్స్, చెత్త వీడియోలు. కులాల కుంపట్లు రగిలించేవాళ్ళు. మతోన్మాద అరాచకాలు సృష్టించే వాళ్ళు. రీల్స్ లో, సోషల్ మీడియా పోస్టులలో దేవుళ్లను అపహాస్యం చేసే రాతలు. జెండర్ తేడా లేకుండా అన్నింట్లో మేము ఉన్నాం అని చెప్పుకునే గొప్పలు. పిల్లల మంచిచెడ్డలు గాలికి, ఇంట్లో ఉన్న వృద్దుల ఆలనా పాలన ధూళికి వదిలేసి, వీలైతే పిల్లలను హాస్టలో, వృద్దులను అనాధ శరణాలయాల్లో వదిలేస్తే సరి. ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు ఎవరికి వారు తక్కువ కాదు. ఒకరికోసం ఒకరు ఎందుకు వంట చేయాలి. బోలెడు డబ్బు సంపాదిస్తున్నాం. స్విగ్గి లో ఆర్డర్ పెట్టుకుంటే సరి. ఇంటినిండా పనులు చేసి పెట్టే మిషన్స్ ఉన్నాయి. కాలు కదపకుండా కాళ్ళ ముందరకు కోరుకున్నవి వచ్చిపడే ఆధునిక సాంకేతిక సదుపాయం ఉంది. ఇంకెందుకు పనులు చేయాలి. ఇంటి పనులు చేయడం బందీఖానా. లాప్టాప్ ముందు కూర్చుంటే చాలు. టచ్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. గంటలు, రోజులు నిమిషాల్లా గడిచిపోతాయి. ఇంతవరకు బాగుంది. దానితో పాటే సాధించాలనుకున్న లక్ష్యాలు అటకెక్కి పోతాయి. ఇంట్లో, ఒంట్లో, బుర్రలో కూడా చెత్త పేరుకుపోతుంది. ఫలితం ఇంట్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన బట్టలు, చెల్లాచెదురైన పుస్తకాలు, దుమ్ము పట్టిన సామాన్లు, బొద్దింకలు తిరుగుతున్న వంట ఇళ్ళు. ఒంట్లో పేరుకున్న చెత్తవల్ల స్థూలకాయం, డయాబెటీస్, స్పాండిలైటిస్, సయాటికా లాంటి సమస్త రోగాలకు నిలయం మనం ఇష్టంగా చూసుకునే మన దేహం.

బుర్రలో పేరుకున్న చెత్త వల్ల మానసిక ఆందోళన, స్కిజోఫ్రీనియా, చిన్న వయసు, మధ్య వయస్సులోనే నేనున్నానంటూ వచ్చే మతిమరపు జబ్బు అల్జిమర్స్. ఎందుకు ఇదంతా? నిండునూరేళ్ళ జీవితం కలతలు, కన్నీళ్లు, ఆందోళనలు, అవహేళనలు, అసూయా ద్వేషాలు, ప్రేమ రాహిత్యం, బాధ్యతా రాహిత్యం తోనే గడిపేయాలా? ఇంట్లో మరొక మనిషి పొడ గిట్టక, తాము సంతోషంగా ఉండలేక..ఏదో సాధించాలనుకొని ఏమి సాధించలేక అసంతృప్తి జీవితం ఎందరు అనుభవిస్తున్నారో ఎవరికి మనసుకు వారికి తెలుసు.

భూమిపైనా బత్రికే సమస్త జీవరాసుల్లో లేని తెలివితేటలు మనుషులకు ఉన్నాయి. నవ్వడం, ఏడవడం, ఎదుటి వారికోసం బాధ పడడం, సాయపడడం లాంటి సంవేదనలు అధికంగా అభివృద్ధి చెందింది కూడా మనుషులకే. అయితే మనుషులు మాత్రం జంతువుల కంటే హీనంగా, క్రూరంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అని ఆలోచిస్తే, పరిష్కారాలు దొరుకుతాయేమో. ఉండే కాస్త చిన్న జీవితంలో చింతలు లేకుండా చేసుకోవడం మనకి చేతకాని పని కాదు కదా? కుటుంబాన్ని, కుటుంబంలోని వ్యక్తులను ఆదరించేవారు, ప్రేమించేవారే తప్పకుండా సమాజాన్ని, సమాజంలోని వ్యక్తులని కూడా ఆదరించగలుగుతారు. ఇతరులు మనకు ఏమి చేస్తే బాధ కలుగుతుందో, ఆ పని మనము ఇతరుల పట్ల చేయకుంటే చాలు కదా. అందరినీ ఆదరించడానికి మనమేమి మహాత్ములం కావల్సిన అవసరం లేదు. సాటి మనిషి బాధని అర్ధం చేసుకుంటే చాలు. కాసింత ఆదరణ చూపితే చాలు. కాస్త ఆసరా అందిస్తే చాలు. కొండంత సాయం చేసినట్లు అవుతుంది. ఈ శీతాకాలపు చలిగాలుల్లో కుటుంబంలోని పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలి. సంతులనమైన ఆహారం, సంతుష్టికరమైన జీవితం వారికి అందించాలి. పరిపూర్ణ మానవులుగా మనం పరిఢవిల్లాలి.

ఈ ఏడాది చివరి నెల ఇది. ఈ సంవత్సర మలి అర్ధభాగ కాలం గొప్ప సాహితీ వేత్తలను, సేవా తత్పరత గల వ్యక్తులను కొందరిని తనలో కలిపేసుకుంది. కామ్రేడ్ ప్రొఫెసర్ సాయిబాబా, తోపుడు బండి సాధిక్ భాయ్, సినీ గేయ రచయిత కుల శేఖర్ గారు, లయన్ అరిగపూడి విజయ్ కుమార్ గారు వంటి సామాజికవేత్తలను, సాంస్కృతిక మూర్తులను సాహితీవేత్తలను మనం కోల్పోయాం. విమల సాహితీ పత్రిక వారందరికీ జోహార్లు. అశ్రు నివాళులు తెలుపుతుంది.

రోహిణి వంజారి
సంపాదకీయం