ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం ” న్యాయ దేవత కళ్ళు తెరిచింది” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.
“న్యాయదేవతకు కన్నులు తెరచే ధర్మ దేవతను నేనేరా- పేద కడుపులా ఆకలిమంటకు అన్నదాతనై వస్తారా – దోపిడి రాజ్యం..దొంగ ప్రభత్వం నేల కూల్చకా తప్పదురా” ఆహా..ఎంత అద్భుతమైన చరణాలు. ఈ పాట విన్నవారి హృదయం పులకరించిపోతుంది. దేశం మీద, దేశ ప్రజల మీదా అమాంతం భక్తి పెరిగిపోతుంది. దేశ న్యాయ వ్యవస్థ పైన, చట్టం పైనా దృఢమైన నమ్మకం కలుగుతుంది. ఇలాంటి భావనలు ఎంత వినసొంపుగా ఉన్నాయో కదా ..!
వంద మంది నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకున్నా పర్వాలేదు. కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. ఈ విషయంలో చట్టం, న్యాయస్థానాలు తమ గురుతర భాద్యతను ఎప్పుడూ విస్మరించకూడదు అనుకుంటాం కదా. అయితే ఇక్కడ దోషులందరికీ శిక్ష పడుతోందా? చేయని నేరానికి ఎంత మంది నిర్దోషులు కటకటాల వెనుక మ్రగ్గిపోతున్నారు ?
న్యాయస్థానాల్లో వెలువడే తీర్పుల్లో పారదర్శకత ఎంత? సామాన్యమైన మనుషులకు న్యాయస్థానాల్లో జరిగేది సరైన న్యాయమేనా? ఈ ప్రశ్నలు ఇప్పటివి కావు. ఎన్నో తరాలుగా మనసులను కుమ్మరి పురుగుల్లా తొలిచివేస్తున్న సందేహాలు. సంశయాలు. ఆవేదనలు. అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చింది అంటే ఇటీవలే భారత దేశ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తీసుకున్న నిర్ణయంతో ఒక్క సారిగా న్యాయస్థానాలమీద, చట్టాల మీద, న్యాయ దేవత పైన ప్రజల దృష్టి పడింది. మరి ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నారు? ఆ నిర్ణయం ఎంతవరకు సబబు. దానివల్ల నిజంగా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందా అనేదే ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ.
సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ మరికొద్ది నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ తరుణంలో వారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. వారం క్రితం ఈ నిర్ణయాన్ని అమలు పరిచారు. ఏమిటి ఆ నిర్ణయం అంటే ‘న్యాయదేవత కళ్ళకు కట్టిన గంతలు విప్పడం’. ఇదేమిటీ అని ఆశర్య చకితులం అవుతున్నారు కదా. ఇంతవరకు న్యాయస్థానాల్లో న్యాయదేవత విగ్రహం కళ్ళకు గంతలు కట్టి ఉంటుంది. ఒక చేతిలో తక్కెడ, మరొక చేతిలో కరవాలం ఉంటుంది. దీని ప్రకారం న్యాయదేవత పాలను- నీళ్లను వేరుచేసే హంసలాగా మంచి చెడులను తక్కెడలో బేరీజు వేసి న్యాయం వైపుకు మొగ్గి, కరవాలం లాంటి తీర్పులతో ఎటువంటి పక్షపాతం లేకుండా అమలు పరుస్తుందని, న్యాయస్థానాలు, న్యాయ చట్టాలు సామాన్యునికి చుట్టాలని ఇందాకా తెలిసిన విషయం.
ఇంతవరకు న్యాయదేవత విగ్రహం కళ్ళకి గంతలు కట్టి ఉండడంవల్ల, కొన్ని సార్లు న్యాయస్థానాల్లో నిర్దోషులకు అన్యాయంగా శిక్ష పడినప్పుడు ‘న్యాయ దేవత అంధురాలు, చట్టానికి కళ్ళు లేవు, న్యాయానికి ఇల్లు లేదు అనే నిస్సహాయ నిరసన వెల్లడయ్యేది. అది చాలా సందర్భాల్లో నిజం కూడా అనవచ్చు. అధికారం, అంగబలం, ధన బలం ఉన్నవారు యెంత పెద్ద నేరం చేసినా, న్యాయస్థానాల్లో విచారణ జరగడం, శిక్ష పడడం అమలు కావడానికి ఒక జీవిత కాలపు జాప్యం జరుగుతుంది. అంతే కాదు పలుకుబడి గలవారు నేరాలు చేసినా తమ అంగ, అర్ధ బలగాలతో తిమ్మిని బమ్మిని చేసి, సాక్షాలను తారుమారు చేసి, తాము తప్పించుకుని, నిర్దోషులను దోషులుగా ఇరికించడం అనేది కూడా ఒక్కోసారి జరగవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కులమతాల ప్రాబల్యం, అధికార దర్పం అనేవి కూడా ఒక్కోసారి నేరస్తులు తప్పించుకోవడానికి, అమాయకులు అన్యాయంగా బలైపోవడానికి దోహదం చేయవచ్చు.
ఇప్పటివరకు న్యాయస్థానాల్లో ఉన్న న్యాయ దేవత విగ్రహం కళ్ళకి ఉన్న గంతలు తొలగించి, చేతిలో కరవాలం బదులు రాజ్యాంగ పుస్తకం ఉన్నట్లు మార్పులు చేయడం. ఇది ఈ శతాబ్దం లోనే సంచలనాత్మక నిర్ణయం న్యాయ దేవత కళ్ళకు గంతలు తొలగి, చేతిలో రాజ్యాంగ గ్రంథం ఉండడం చాలా ఆనందదాయకమైన పురోగమనదాయకమైన పరిణామమే. కానీ ఈ మార్పు కేవలం న్యాయదేవత విగ్రహంలో మార్పులు, చేర్పులు చేసినంతలోనే అందరికీ సమ న్యాయం జరుగుతుందని భరోసా లేదు. మరీ ముఖ్యంగా లైంగిక దాడులకు గురైన స్త్రీలకు, ఆకలిమంటలు తీర్చే రైతన్నలకు, అణగారిన సోదర వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగినప్పుడే, ఇటువంటి భౌతికమైన మార్పులకు ఓ అర్ధం ఉంటుంది. లేకుంటే కేవలం మార్పు విగ్రహాల అలంకరణలకు మాత్రమే పరిమితం అవుతుంది. అయినప్పటికీ ఈ మార్పు ఆహ్వానించదగినది. పాలకులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, దేశ ప్రజలు ఈ మార్పును హర్షించాలి. సమ న్యాయం అమలు జరగడం కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలి. ఇదే ఒరవడిలో న్యాయస్థానాల్లో తారతమ్యాలు లేకుండా దేశ ప్రజలందరికీ సమన్యాయం జరగాలని ఆశిద్దాం.
రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630