పిల్లలు దేవుడు చల్లని వారే. కల్ల కపటమెరుగని కరుణామయులే. కానీ ఆ కరుణామయ పిల్లలు ఎందరికి బంగారు బాల్యం ఉంది. ఎందరు పంట పొలాల్లో, పశువులు మేపడంలో, పరిశ్రమల్లో, ధనవంతుల ఇంట పాచి పనుల్లో, జమిందార్ల కాళ్ళు ఒత్తుతూ బానిసలుగా ఉన్నారో తెలుసా.
జూన్ 12 బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం ” కొందరికి ఇంకా అందని చందమామ” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి
“చందమామ రావే..జాబిల్లి రావే..కొండెక్కి రావే..గోగుపూలు తేవే” అమ్మ సంకనెక్కి, వెన్నెల్లో చందమామని చూస్తూ, అమ్మ పెట్టే గోరుముద్దలు తింటూ ఈ పాటను వినే పిల్లలను చూసారా? అమ్మ కూలి పనికి పోయినా ఇంట్లో చిట్టి చేతులు, చిన్ని వేళ్ళతో తమ్ముడికి అన్నం తినిపించే పసిపాపను కూడా చూసారా? ధనవంతుల మేడలో అయినా, పేదవారి పూరి గుడిసె మీద అయినా ఎటువంటి విచక్షణ లేకుండా వెన్నెలను కురిపిస్తాడు చందమామ. ఇక్కడ మాత్రం ఈ అంతరాలు ఎక్కడివి అనేది జవాబు లేని ప్రశ్న.
పలకా, బలపం పట్టుకుని అక్షరాలు దిద్దాల్సిన చేతులు, ధనవంతుల ఇండ్లలో అంట్లు తోముతున్నాయి. బడిబాట పట్టాల్సిన పాదాలు పశువులు మేపేందుకు అడుగులు వేస్తున్నాయి. ఎక్కాలు పలకాల్సిన నోళ్ళు, ఖాళీ సీసాల సంఖ్యను లెక్కిస్తున్నాయి. ధనవంతుల లోగిళ్ళలో సకల సౌకర్యాలు అనుభవిస్తున్న బాల్యం ఒక పక్కనుంటే, ఆటపాటలు, చదువులతో సాగాల్సిన బాల్య దశ ఒకటుందని కూడా తెలియకుండానే బాల్యాన్ని దాటేసిన జీవితాలు ఎన్నో మన సమాజంలో కనపడతాయి.
మనిషి జీవితంలో ఉండే నాలుగు ముఖ్యమైన దశల్లో మొదటిది అతి ప్రధానమైనది బాల్య దశ. బాల్యం తదుపరి జీవిత దశలకు పునాదిలాంటిది. చిరుప్రాయంలో నేర్చిన విద్యలు, ఆటలు, చదువు ,సంస్కారం, కళలు మనిషి శారీరక, మానసిక శక్తులను సమీకరించుకోవడానికి తోడ్పాటును అందిస్తాయి. కానీ ఎంత మంది చిన్నారులు తమ బాల్యాన్ని సంపూర్ణంగా అనుభవించారు అనేది జవాబులేని ప్రశ్న. ఒక్క మనదేశమనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో పిల్లల బాల్యం చిదిమివేయబడింది. పంట పొలాల్లో బురద మట్టి కింద బాల్యం తొక్కివేయబడింది. కర్మాగారపు పొగ గొట్టాల్లో మసిబారిపోయింది. జమీందార్లు, కామందుల గొడ్ల సావిడుల్లో పెండనెత్తి పోస్తోంది బాల్యం.
రాజ్యాంగం బాలబాలికలకు ఎన్నో హక్కులు కల్పించింది. ఆ దిశగా ఎన్నో సవరణలు కూడా జరిగాయి. అయితే అదంతా పుస్తకపు రాతల్లోనే. ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం ఒకటి ఉందని కూడా తెలియదు కొందరు పిల్లలకు. మనదేశంలో 1986 లో బాలకార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం ప్రకారం ప్రమాదకర పనులు, వృత్తుల్లో పిల్లలను కార్మికులుగా చేర్చుకోవడం నేరంగా పరిగణించారు. భవన నిర్మాణం, ఇటుక బట్టీలు, క్వారీలు, టపాకాయల తయారీ వంటి పనుల్లో బాల కార్మిక వ్యవస్థను నిషేదించారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ [ILO] ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికులు అంతరించిపోవడం, దాని నిర్ములనకు అవసరమైన చర్యలపై దృష్టి నిలిపేందుకు ఈ దినోత్సవం జరపడం ప్రారంభమైంది. 2015లో ప్రపంచనాయకులు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ను అమలుపరచి, తద్వారా బాల కార్మికులను అంతం చేయడానికి నియమావళిని ఏర్పరచారు.
బాలలు కార్మికులుగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పేదరికం, తల్లిదండ్రుల నిరక్షరాస్యత వంటివి చూసినప్పుడు, పల్లెల్లో బాలలు తల్లిదండ్రులకు ఆదాయ వనరులుగా మారుతున్నారు. కూలికి పంపిస్తే తమతో పాటు పిల్లలు నాలుగు రూపాయలు తెస్తారు. కుటుంబానికి ఆసరాగా ఉంటారు. బడికి పొతే ఏమొస్తుంది అని బడి ఈడు పిల్లలను మధ్యలోనే బడి మాన్పించి, కూలికి పంపే తల్లిదండ్రులు ఉన్నారు. పశువుల కాపరులుగా, బీడీలు చుట్టే కార్మికులుగా, చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో దిన కూలీలుగా పనిచేసే ఎందరో బాల బాలికలు ఉన్నారు. జమీందార్ల దగ్గర తల్లిదండ్రులు చేసిన అప్పు తీర్చే మానవ వనరులుగా, వారి ఇంట సేవలు చేస్తూ, జీతం భత్యం లేని బానిసలుగా జీవితం గడిపేసే పసివాళ్లు కూడా ఉన్నారు. నగరాల్లో అయితే భవన నిర్మాణ కార్మికులుగా, ధనవంతుల ఇళ్లల్లో పాచి పని, వంట పని చేస్తూ, ఆ ఇంటివారు పడవేసే పాత దుస్తులు, విసిరేసే నాలుగు ముద్దలకు మురిసిపోతూ ‘నీ బాంచన్ మేడం’ అనే పిల్లలు ఉన్నారు. 12,13 ఏళ్ళ ప్రాయంలో బడి సంచిని తీసుకుపోవాల్సిన చేతుల్లో జాతి కుక్కలను వాకింగ్ కి తిప్పుకుంటూ పోయే బాలబాలికలు ఉన్నారు. తమ బిడ్డలు మాత్రం విదేశాల్లో చదవాలి. డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి. తమ దగ్గర పనిచేసే పసివాళ్లు మాత్రం కనీస అక్షరాస్యతకు కూడా నోచుకోకుండా తమ ఇంట చాకిరీ చెయ్యాలి. ఇది కొందరు సంకుచిత ధనవంతుల ఉవాచ.
ఇక అతి ప్రధాన కారణమైన పేదరికం వల్ల, తల్లిదండ్రుల బలవంతం, అవకాశవాదుల దురాగతం వల్ల పరిశ్రమల్లో పనిచేసే బాలబాలికలు ఎందరో ఉన్నారు. టపాకాయలు తయారీ, తివాసీల తయారీ, మందుల పరిశ్రమలు వంటి చోట్ల భద్రతా లోపాల వల్ల ప్రమాదాలకు గురై, ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం, ఒక్కసారి ప్రాణాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. భారీ పారిశ్రామికీకరణ, బాల కార్మిక చట్టాల అమలులో చిత్తశుద్ధి లోపించడం, సాంఘిక భద్రతా పధకాలలేమి, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులలేమి, నిర్బంధ ప్రాధమిక విద్యావిధానాన్ని అమలుపరచడంలో పాలకుల నిర్లక్ష్యం లాంటివి బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడానికి ఆటంకాలుగా మారాయి. ఇంకా బాలబాలికలు పనిచేసే చోట యజమానుల లైంగిక వేధింపులకు గురికావడం అనేది అత్యంత విచారకరం . యాజమానుల నీచ బుద్దికి పరాకాష్ట ఇటువంటి హేయమైన చర్యలు.బాలల హక్కుల పరిరక్షణ, నిర్బంధ ప్రాధమిక విద్య, పేద తల్లిదండ్రులకు తమ పిల్లల అక్షరాస్యత గురించి సరైన అవగాహన కల్పించడం, బాలబాలికల పట్ల క్రూరంగా ప్రవర్తించే వారికి చట్టపరంగా కఠిన శిక్షలు అమలుపరచడం వంటి చర్యలు చేపట్టడం ద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చు.
కానీ అది రాతల్లో చెప్పుకున్నంత తేలికకాదు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో అతిముఖ్యమైన పథకం ‘జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు’. భారత ప్రభుత్వం 1988లో మొదటగా 12 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలుపరచింది. ఇది దేశం మొత్తం ఇంకా విస్తృతం కావాల్సిఉంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఒక్క పాలకులే కాదు, స్వచ్చంధ సంస్థలు, సేవా సంస్థలు, బాలబాలికల శరణాలయాలు, తల్లిదండ్రులు, సమాజంపట్ల బాధ్యత గల ప్రతి వ్యక్తి పూనుకుంటే కానీ బాల కార్మిక వ్యవస్థ అంతం కాదు. ఎందుకంటే ప్రతి మనిషి బాల్యపు దశ దాటి వచ్చినవారే. ప్రతి ఇంట్లోనూ బాలలు ఉంటారు. కుల, మత, పేద, ధనిక తేడాలు లేకుండా ప్రతి బిడ్డా తన బాల్యాన్ని ఆటపాటలు, చదువులతో సాగించాలి. బిడ్డల బాల్యం కొన్ని నిరంకుశ, కర్కశ పాదాల కింద నలిగిపోకూడదు. మొగ్గ తొడిగిన శైశవ దశ నుంచి బాల్యం పువ్వులా వికసించాలి. ఆటపాటలు నేర్వాలి. పాఠాలెన్నో సాధన చేయాలి. జీవితపు పరీక్షలో విజయపు శిఖరాగ్రాన్ని చేరుకోవాలి.
జూన్ 12 న ప్రపంచ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈ సంపాదకీయం. బాల్యమొకటి ఉందని, ఆటపాటలు, చదువులు ఉంటాయని తెలియకుండానే కార్మికులుగా భవన నిర్మాణంలో కాంక్రీట్ మిషన్లో కంకర రాళ్లుగా, గొడ్ల సావిడుల్లో పశువుల పెంట జవిరిపోసే చేతులు, దేవిడీల్లో యజమాని పాదాలొత్తే చేతులు, కుక్క మెడకు తాడుకట్టి తిప్పుతూ, తాము కూడా ధనవంతుల ఇంటిలో బానిసనే అనే ఎరుకలేని బాలబాలికలకు ఇది అంకితం.
రోహిణి వంజారి
సంపాదకీయం