విమల సాహితి ఎడిటోరియల్ 55 – డిటాచ్మెంట్ to అటాచ్మెంట్

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “డిటాచ్మెంట్ టు అటాచ్మెంట్” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹

“అన్నదమ్ములవలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయ్. దేశ మంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” గురజాడ వారి ముత్యాలసరం నుంచి జారిపడిన మేలిమి ముత్యాలు ఈ పదాల వరుసలు. “కలసి ఉంటే కలదు సుఖము”, “ఐకమత్యమే మహాబలము” పంచతంత్రంలో విష్ణు శర్మ జంతువులతో చెప్పించిన చద్ది మూటలు ఇవి. అయితే కలిసి ఎంతకాలం ఉన్నా అభివృద్ధి ఒక్కచోటే ఉంది. ప్రాంతాలు ప్రగతి పథంలో నడవాలి అన్నా, ప్రాంతాభివృద్ధి పురోగమనంలో సాగాలన్నా ఐకమత్యం కన్నా సమాంతర దారులలో నడవడం మిన్న అని ప్రజలు అనుకున్నాక, విడిపోవడం అనేది అనివార్యమైన చర్య . అదే జరిగింది.

యావత్ భారత దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా, తెలుగుమాట్లాడే ప్రజలు ఒక్కప్పుడు కలిసే ఉండేవారు అని మనకు తెలుసు. మద్రాసు కేంద్రంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రము ఉన్నప్పుడు, తమిళం మాట్లాడే తంబీలు మన పక్క రాష్ట్రము వారు అనే ఆలోచన తెలుగు ప్రజల మనస్సులో నాటుకుపోవడంతో, అనేకానేక పోరాటాలు, సమ్మెలు, ధర్నాలు, చర్చలు, దీక్షలు, నిరసనలు సలిపిన పిమ్మట ఉమ్మడి మద్రాసు రాష్ట్రము నుంచి విడిపోయి 1953, అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్రము అవతరించగా 1956 నవంబర్ 1 న హైదరాబాద్ రాష్ట్రము విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రము కాస్తా ఆంధ్ర ప్రదేశ్ గా మారింది. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆలోచన నిజమైంది. వారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, పాలకుల మనసులను కరిగించి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధించడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరోదాత్తుడు.

అంతవరకు సంతోషం. అయితే అసంతృప్తి అక్కడితో ఆగిపోలేదు. స్వాతంత్య్రం అనంతరం ఆర్ధిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి దేశంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది. కరువు, కాటకాలు, ప్రకృతి విపత్తులు, మానవ వనరుల విదేశీ వలసలు కొన్ని ప్రాంతాల అభివృద్ధిని కృంగదీసి, ప్రాంతీయ అభివృద్ధి కోసం తెలుగు బిడ్డలు రెండు ప్రాంతాల వాసులుగా విడిపోవడం అనివార్యమైంది. అభివృద్ధి లేశం, సమస్యలు అనేవి రెండు ప్రాంతాల్లో కూడా అనేక నిరసనలకు తావునిచ్చింది. కలిసి బతకడం కంటే, అన్నదమ్ముల వలే విడిపోయి, అభివృద్ధి సాధించి ఐకమత్యంగా ఉందాము అన్న ప్రజల వజ్ర సంకల్పం దశాబ్దాలుగా అన్నదమ్ముల మధ్య చిచ్చు రేగినట్లు దినదినప్రవర్ధమానం అయింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి విడిపోయి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని దశాబ్దాలుగా [1969 నుంచి 2014 ] వరకు వివిధ దశలలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది వివిధ రకాలుగా తమ నిరసనలు తెలిపారు. కొందరు అమరవీరులు అయినారు. నాయకులు ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. ప్రజా గాయకులు కాలికి గజ్జ కట్టి “తల్లి తెలంగాణ” ప్రజల గుండె గాయాలను తలచుకుంటూ గేయాలు పాడారు. సాహితీకారులు తమ రచనల్లో ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010 లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013, జూలై ౩౦ న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబర్ ౩న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించాక, రాజ్యసభ ఆమోదం పొంది, 2014లో ఆంధ్రరాష్ట్ర విభజనను ఆదేశిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ప్రవేశపెట్టింది. రాష్ట్రపతి ఆమోదంతో 2014 జూన్ 2 వ తేదీన దేశంలో తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించింది.

ఇది తెలంగాణ ప్రజా విజయమని, ప్రాంతీయ విజయమని, పాలకుల విజయమని ఎవరికి వారు తమ దృష్టి కోణంలోకి తీసుకున్నా, ప్రాంతీయ అభివృద్ధి కోసం తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల ప్రజలుగా విడిపోవాలనే ఆకాంక్ష ముందు, ఇక కలసి ఉండడం అనేది మాత్రం అనివార్యమైంది. ఏది జరిగినా సర్వ జన సంక్షేమం కోసమే కావడం చేత, అందరూ అంగీకరించాల్సిన చేదు నిజం అయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, భాగ్య నగర ప్రభుత్వ సచివాలయ కార్యాలయం నుంచి ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు బరువెక్కిన గుండెలతో తెలంగాణ రాష్ట్ర పొలిమేరలు దాటారు. తెలంగాణ రాష్ట్రం అంతటా సభలు, సంబరాలు, ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ సమావేశాలు విరివిగా జరిగాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి అప్పుడే పది సంవత్సరాలు అయింది. ఆంధ్ర, తెలంగాణ ఇరు ప్రాంతాల్లో కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఎన్నో గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా మత ద్వేషాలు పెచ్చుమీరాయి. ఇది అభివృద్ధికి సంకటం. విద్య, వైద్య, ఉపాధి వంటి రంగాల్లో ఇంకా అభివృద్ధి సాధించాల్సిఉంది. పాలకులు ఎవరైనా, అధికార పగ్గాలు ఏ పార్టీ చేపట్టినా, ప్రజా సంక్షేమమే పాలకుల పరమావధి కావాలి. అప్పుడే ఏ ప్రాంతమైనా అభివృద్ధి పథంలో పయనిస్తుంది

జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు విమల సాహితీ పత్రిక తరపున ప్రత్యేక శుభాకాంక్షలు.

రోహిణి వంజారి

సంపాదకీయం

9000594630