“షడ్రుచుల ఈద్ ముబారక్” ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి
వసంతం – శరత్తు – హేమంతం, ఈ ఆమనీ బ్రతుకులో ఈ మూడే ఋతువులు. ప్రకృతిలో ఉన్నవి ఆరు ఋతువులు అయినా మనిషి జీవితంలో ఈ మూడే ఋతువులు ఉండాలి అని కవి ఎంత చమత్కారంగా అన్నాడో. ఎండలు మండే గ్రీష్మం, చిరుజల్లులను తుఫానులుగా కూడా మార్చేసే వర్ష ఋతువు, ఆకులు రాల్చే శిశిర ఋతువులను వదిలెయ్యమన్నాడు అంటే మనిషి జీవితం ప్రకృతి ఆధారంగానే సాగుతుంది. మండించే, ముంచేసే విపత్తులు ప్రకృతిలోనే కాదు. మనిషి జీవితంలోను అడుగడుగునా వస్తాయి. కష్టాలు, సమస్యల రూపంలో. అయితే ఈ బాధలు, వేదనలు శాశ్వతం కానే కాదు. ఎండలు మండించినా, ఆ తర్వాత వచ్చే చిరుజల్లుల కోసం వానకారు కోకిలల్లా ఎదురుచూస్తాం. అవే చిరుజల్లులు సునామీలై ముంచెత్తవచ్చు, కాంక్షలన్నీ శిశిరపు ఆకుల్లా రాలిపోయి బతుకు మోడుబారవచ్చు. ఆ తర్వాత ప్రకృతి తనని తాను సరిదిద్దుకుంటూ మోడువారిన కొమ్మల్లోనే కొత్త చిగుర్లు తొడిగిస్తుంది. అట్లే మనిషి జీవితంలో కూడా దారులన్నీ మూసుకుపోయి, ఆశలన్నీ ఉడిగిపోయిన చోట కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. చిగురించిన మోవి మీది పచ్చదనంలా, బతుకులో కూడా మళ్ళీ కొత్త ఆశలు మొలకెత్తుతాయి. బతుకు మీద భరోసా కలిగిస్తుంది.
ఇది ప్రకృతిలో మరియు మనిషి జీవితంలో నిరంతరం కదలాడే చైతన్య వలయం. బతుకు చక్రం. మరి మనిషి ఏం చేయాలి? పగలు రాత్రిలా, వెలుగు చీకటిలా, కష్ట సుఖాలు కూడా మనిషి జీవితంలో అతి సాధారణం అని తెలుసుకుని, సుఖాలకి పొంగక, కష్టాలకి కృంగక తామరాకు మీది నీటి బొట్టులా, నిమిత్తమాత్రంగా ఉండాలి. జీవితంలోని రుచులన్నిటినీ చవిచూడాలి అని ప్రకృతి మనిషికి పాఠం నేర్పుతోంది తన షడ్రుచుల సమ్మేళనంతో, వసంత కాల చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వచ్చే ఉగాది పండుగలా. అందుకే ఇది ప్రకృతి పండుగ. మనిషి ప్రవృత్తిని దృఢతరం చేసే పండుగ.
వేప పూత చేదు, మామిడి కాయ వగరు, బెల్లం తీపి, చింత పండు పులుపు, పచ్చి మిరప కారం రుచులను ఉప్పుతో కలిపితే తినడానికి అనుకూలమైన కమ్మటి ఉగాది పచ్చడి తయారైనట్లు, జీవితంలోని సుఖం, దుఃఖం, వేదన, భయం, సంతోషం లాంటి సంవేదనలు అన్నిటినీ ఏక భావంతో స్వీకరించినప్పుడు మనిషి జీవితం మకరందం అవుతుంది అని చెప్తూ యుగాల నుంచి మనిషికి ఆదిగా వస్తున్న పండుగ ఉగాది. పండుగ అంటేనే పంచడం. ఆనందాన్ని పంచడం. తనకున్న సంపదలో పేదలకు కాస్త పంచడం. ఆత్మీయుల కష్టసుఖాల్లో మనం పాలు పంచుకోవడం. అందరు కలిసి తినడం. పండుగ పరమార్ధాలు ఎన్నని. దైవ ప్రార్ధనలు, పూజలు చేస్తారు. పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ ఉగాది పండుగ నాడు హిందూ సోదరులు తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటారు. మమతలను పెంచుకుంటారు.
ప్రకృతికి, పండుగలకు అవినాభావసంబంధం ఉందని రుజువు చేసే మరో ముఖ్యమైన పండుగ మన ముస్లిం సోదర,సోదరీమణులు జరుపుకునే రంజాన్ పండుగ. ప్రకృతి, పంచ భూతాలే కాదు. విశ్వంలోని గ్రహాలు, ఉపగ్రహాలు, ముఖ్యంగా సూర్య, చంద్రుల గమనం కూడా మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. చంద్రుని గమనంవల్ల సముద్రపు ఆటుపోట్లలో తేడాలు గుర్తించవచ్చు. శుక్లపక్షం, కృష్ణపక్షంలో కనిపించే పున్నమి నిండు చంద్రుడు, అమావాస్య తర్వాత కనిపించే నెలవంకని అనుసరించి కూడా మనిషి జీవిత గమనంలో మార్పులు జరుగుతుంటాయి. ముస్లిం సోదరులు చాంద్రమాన కేలండరుని అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల “రంజాన్”. ఈ నెలను ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ‘దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలోనే ఆవిర్భవించడమే ఈ పవిత్రతకు ప్రధాన కారణంగా ముస్లింలు భావిస్తారు.
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనలు కలయికే రంజాన్ మాసం. ఈ నెలంతా ఉమ్మిని కూడా మింగకుండా అత్యంత కఠినంగా ఉపవాస దీక్షలు [రోజాలు] పాటిస్తారు. పేదలకు బట్టలు, తిండి, డబ్బు సాయం అందచేస్తారు. నెలంతా ప్రత్యేక ప్రార్ధనలు ఐదు సార్లు నమాజ్‌లు చేసి సహర్ తో ఉపవాసం మొదలు పెట్టి ఇఫ్తార్ తో ముగిస్తారు. ఖర్చూరం, బాదాం పప్పు లాంటి బలమైన ఆహారంతో పాటు హలీం లాంటి రుచికరమైన భోజనాలు చేస్తారు.
రంజాన్ పండుగ రోజు కులమత బేధాలు, ధనిక, పేద అంతరాలు చూడకుండా అందరిని కలుపుకుంటూ అలయ్ బలయ్ అంటూ ఆలింగనాలు చేస్తూ, షీర్ కుర్మా లాంటి కమ్మని విందును అందరికీ పంచుతారు. జకాత్ శుద్ధి చేసుకుని తమ ఆదాయంలో కొంత పేదలకి పంచుతారు. పండుగ నాడు పేదలు కూడా కొత్త బట్టలు ధరించాలి, మంచి భోజనం చేయాలి అనే సత్సంకల్పంతోను మరియు అల్లా ప్రేమకు ప్రీతి పాత్రులు కావాలని ప్రతి ముసల్మాన్ కోరుకుంటారు.మత సామరస్యాన్ని అనుసరించమని ప్రకృతి మనల్ని అదేశిస్తోంది. అందుకే ఉగాది, రంజాన్ పండుగలు ఒక్క రోజు తేడాతో పక్కపక్కనే మనకోసం వస్తున్నాయి. అందరం కలిసికట్టుగా ఆనందించడమే, అందరి ప్రేమలో తరించడమే మన ముందు ఉన్న కర్తవ్యమ్.
ఈ నెల 9 న వచ్చే ఉగాది పండుగ, 11 న వచ్చే రంజాన్ పండుగకు విమల సాహితి పాఠకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఉగాది మరియు రంజాన్ ప్రత్యేక శుభాకాంక్షలు.
రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630