మిత్రులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
ఆదివారం కన్నా రెండు రోజుల ముందే విమల సాహితీ వారపత్రిక మీ ముందుకు వచ్చేసింది. మహిళా దినోత్సవం రోజున అందరికి అందించే అపురూపమైన కానుక ఇది. ప్రతి మగవాడి జీవితంలోను మహిళలు అనేక రూపాల్లో ఉంటారు. అందుకే ఇది అందరి పత్రిక. ప్రతి ఒక్కరు దాచుకుని చదువుకోవాల్సిన సంచిక ఇది. అద్భుతమైన ముఖ చిత్రంతో వెలువడిన ఈ పత్రికలోని విశేషాలు:
1. మహిళలు అయితే దేవతలు కావాలి,లేదంటే దెయ్యాలు కావాలి. ఎందుకు? నిజాల నిగ్గు తేల్చిన రోహిణి వంజారి. Rohini Vanjari సంపాదకీయం “దేవతలు – దెయ్యాలు” చదివి తీరాలి.
2. తెలుగు సాహిత్యంలో శాశ్వతముద్ర వేసిన విదుషీమణి “మాలతీ చందూర్” గారి గురించి సహా సంపాదకులు శ్రీమతి మంజుల సూర్య గారు Manjula Surya రాసిన వ్యాసం మనల్ని నిన్నటి తరానికి తీసుకువెళ్లి స్త్రీల అస్తిత్వాలకు నీరాజనం పడుతుంది.
3. “యంత్ర నార్యంటు పూజ్యతే తంత్ర దేవత:” మహిళలు ఇప్పుడు దేవతలుగా పూజించబడుతున్నారా..? పురుషులను సూటిగా ప్రశ్నిస్తూ, మహిళలు ఏమి కోరుకుంటున్నారో తెలుపుతున్నారు సహా సంపాదకులు కృష్ణవేణి పరాంకుశం Krishnaveni Paramkusam గారు.
4.స్త్రీ వాదం, స్త్రీ వడ సాహిత్యం-ఎదుర్కుంటున్న సమస్యలు – కొన్ని పరిస్కారాలు – పరిశోధన. ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి “ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం” గురించి అద్భుతమైన విశ్లేషణాత్మక వ్యాసం.
5.” స్త్రీ సమస్యలు సార్వజనీనం – స్త్రీ సాహిత్యం సర్వజనహితం” అంటూ విమల సాహితీ అధినేత డాక్టర్ జెల్ది విద్యాధర్ రావు Vidyadhar Jeldi గారి ప్రత్యేకమైన వ్యాసం.
6. “తనది కానీ తన దేహం” స్త్రీల దేహాలు దేవాలయాలు- గర్భగుడిలాంటి దేహం గర్భాదానాలకే పరిమితం చేయకండి అంటూ హితవు చెప్పే, గౌరవ సంపాదకులు శ్రీమతి శైలజామిత్ర Sailaja Mithra గారి కలం నుంచి వెలువడిన అద్భుతమైన కవిత చదివి తీరాల్సిందే.
7. గౌరవ సంపాదకురాలు డాక్టర్ మల్లెపోగు వెంకట లక్ష్మమ్మ గారు Mallepogu Venkatalakshmamma రాసిన “తరం మారింది ” కథ. ఖచ్చితంగా ఆధునిక తరాల్లో మార్పు రావాలని గొప్ప సందేశాత్మక కానుక ఇది అందరికి.
ఇంకా విశ్వ పుత్రిక శ్రీమతి విజయలక్ష్మి పండిట్, Palavali Vijayalakshmipandit శ్రీమతి జంగం స్వయం ప్రభ, శ్రీమతి అరుణసందడి Raga A S శ్రీమతి వసంత పెనుమాక , శ్రీమతి రావుల కిరణ్మయి శ్రీమతి లక్ష్మికందిమల్ల Lakshmi Kandimalla, సుజాత నాంపల్లి sujata Sujatha Nampally, శ్రీమతి Mallika Gv , శ్రీమతి జ్యోతి సుంకర, శ్రీమతి జ్యోతి మువ్వల Jyothi Muvvala , సుధా కోసూరి వంటి లబ్ద ప్రతిష్టులైన రచయితల కవితలు, కథలతో పాటు, నూతనంగా కలం చేపట్టి అద్భుతమైన శైలిలో తమ కథలు, కవితలు మీ సంచిక కోసం అందించిన మహిళా మూర్తులు చాలామంది ఉన్నారు. అందరికీ కృతఙ్ఞతలు. పత్రిక ఇంత అద్భుతంగా, సకాలంలో వెలువడడానికి అనితర సాధ్యమైన శ్రమ చేసిన డాక్టర్ జెల్ది విద్యాధర్ రావు గారికి, సహా సంపాదక మిత్రులకు, డీటీపీ చేసిన మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ మరొక సారి “అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజల కొంగు బంగారాలు సమ్మక్క, సారక్క దేవతలు. మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర ఎంత వైభవంగా జరుగుతుందో మనకి తెలుసు. అక్కడ కొలిచే వనదేవతలు స్త్రీ మూర్తులు. తెలంగాణ అంతటా కొలిచే దేవతలు పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ దేవతలు.
అటు ఆంధ్ర రాష్ట్రంలో పోలేరమ్మ, మాలక్షమ్మ, గంగమ్మ, ముత్యాలమ్మ, ఇరగాలమ్మ, చెంగాళమ్మ దేవతలు కొనియాడబడతారు. సరిహద్దు కాశ్మీర్ లో వైష్ణోదేవి ఆలయంలో పూజలు అందుకుంటుంది . మన విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ కటాక్షం కోసం ప్రతి సంవత్సరం ఎందరో పురుషులు భవాని మాలా వేసుకుంటారు. భారత దేశవ్యాప్తంగా అనేక శక్తి పీఠాలలో అమ్మవార్లు పూజలు అందుకుంటారు. పరిశుద్దాత్మ వలన వరపుత్రుడైన యేసుని కన్న మేరీ మాతను దయతో చూడమని ప్రార్దించే పురుషులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఇక్కడ వరకు దేవతల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు దెయ్యాల వంతు కూడా తెలుసుకుందాం. అర్ధరాత్రి అమావాస్య రోజు ఎక్కడికైనా వెళుతుంటే తెల్లని చీరలో, జుట్టు విరబోసుకుని ఓ స్త్రీ మన దారికి అడ్డంగా వచ్చి నిలబడిందనుకోండి. ఏం చేస్తారు మీరు? భయంతో వణికిపోతూ ఆంజనేయస్వామి దండకం చదవడమో, సిలువ గుర్తు చూపించడమే చేసి, వెనకకు తిరిగి చూడకుండా పరుగెత్తుతారు. ఎవరికి కనపడినా ఎక్కువ ఆడ దెయ్యాలే కనిపిస్తాయి కానీ మగ దెయ్యాల గురించి ఎవరూ మాట్లాడరు. అంటే ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది. స్త్రీలు దేవత రూపంలో గుడిలో ఉంటే పూజింపబడతారు. గుహల్లోనో, చీకట్లోనో దెయ్యం రూపంలో ఉంటే భయపడతారు. అంటే మహిళలు అయితే దేవతలు అయినా కావాలి. లేకుంటే దెయ్యాలు అయినా కావాలి. అప్పుడే మహిళలను చూసి మగవారు గౌరవం అయినా ఇస్తారు లేదంటే భయపడతారు.
సామాన్య మహిళగా మనుగడ సాగించాలంటే మాత్రం ఈ దేశంలో మనదేశంలో బహుకష్టతరం అవుతోంది.అనాది కాలం నుంచి పురుషుడికి సేవలు చేయడానికి, ఆనందం అందించడానికి ఒక విలాస వస్తువుగా చూడబడుతోంది స్త్రీ. పురుషుడి పక్కటెముక నుంచి స్త్రీ ఏర్పడిందని తప్ప స్త్రీకి ప్రత్యేక అస్తిత్వం ఉంది అని చెప్పలేదు. పరదాలు, బురఖాల మాటున మహిళల తెలివి తేటలు మరుగునపడాలి అంటారు మరోచోట. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, ముసలితనంలో కొడుకు మీద ఆధారపడి ఉండాలి స్త్రీ. మహిళలకు స్వతంత్రంగా ఆలోచించే శక్తియుక్తులు ఉండకూడదు. “న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి ” అని స్త్రీ లను ఎందుకు పనికి రానివారి కింద జమ కట్టాడు మనువు. అనాది కాలం నుంచి ఎన్నో తరాల మహిళలు సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులు, దేవదాసీలు, వంటింటి కుందేళ్ళు, బానిసలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కుటుంబంలోనే ఉన్న మగవాళ్ళ కామదాహానికి బలై, పైకి చెప్పుకోలేక మనసులోనే రోదించే అబలలు కూడా ఎందరో ఇప్పటికీ ఉన్నారు. ఇక సమాజంలో పురుషుల మృగ దాష్టికానికి బలైన నిర్భయలు, దిశలు కోకొల్లలుగా ఉన్నారు.
కాలక్రమేణా సమాజంలో కొంత మార్పు వచ్చింది. స్త్రీల సమస్యలను సానుభూతితో అర్ధం చేసుకున్న మహానుభావులు ఎందరో ఉన్నారు. వీరేశలింగం పంతులు, రాజారామ్ మోహన్రాయ్, గురజాడ వంటి సంఘసంకర్తలు మహిళల పట్ల జరిగే మూఢాచారాలను నిరసిస్తూ, వారి జీవన విధానంలో సానుకూల మార్పులు తేవడానికి ఎంతో కృషి చేసారు. బ్రిటిష్ పాలకులు మనదేశాన్ని అనేకవిధాలుగా దోచుకొని ఉండవచ్చు కాక, వారు చేసిన గొప్ప పనులు కొన్ని ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు సతి సహగమనాన్ని నిరోదించారు. ఆ క్రమంలోనే బాల్యవివాహ నిరోధక చట్టం, వితంతు వివాహలు వంటి మహిళలకు అనుకూలమైన సంస్కరణలు చేపట్టారు. దేవదాసి దురాచారం కూడా నిర్ములించబడింది. ఆధునిక శతాబ్దిలో స్త్రీ విద్య, సమాన హక్కుల కోసం మహాత్మా గాంధీ, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ వంటి వారు పోరాడి రాజ్యాంగంలోనే ఎన్నో సవరణలు జరిపి మహిళలకు సమాజంలో గౌరవనీయ స్థానం కల్పించేందుకు కృషి చేసారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ అల్ట్రా మోడరన్ యుగంలో మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించారు. స్త్రీ, పురుష అనే లింగ బేధం లేకుండా ఇద్దరూ సమాన స్థాయి కి ఎదగడం చాల పురోగమన దిశలో సమాజం పయనించడం హర్షణీయం.
నాణానికి ఉన్న రెండు వైపుల చూడాలి కదా. ఓ వైపు సమాన స్థాయిలో అభివృద్ధి జరిగినా ఇంకా స్త్రీ ల పట్ల లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. పని చేసేచోటనో, ప్రేమ పేరుతోనో, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఇప్పిస్తాం అనో, మహిళలను మభ్య పెట్టి, లైంగిక దాడులు జరపడం సర్వ సాధారణం అయిపోయింది. చట్టాలు, శిక్షలు ఇంకా కఠిన తరం కావాల్సివుంది. మహిళల గురించి చెడు ఆలోచన రావాలంటేనే భయపడే విధంగా శిక్షలు అమలుజరపాల్సి ఉంది.
అయితే మహిళలు చట్టం నుంచి పుచ్చుకున్న అనేక వెసులుబాటులను దుర్వినియోగం చేస్తున్నారు అనే అపవాదు కూడా ఉంది. కొన్ని చోట్ల ఇది నిజం కూడా కావచ్చు. గృహ హింసల నుంచి విముక్తికోసం ఏర్పరచిన చట్టాన్ని అమాయక పురుషుల మీద అస్త్రంలా ఉపయోగించి భరణం కోరుతున్నారు అనేది కూడా అక్కడక్కడా కనబడుతోంది. తాము కోరుకున్న జీవితం కోసం భర్తని, సంతానాన్ని కూడా కడతేర్చేందుకు కూడా వెనుకాడని కొందరు మహిళలను చూస్తున్నాం. అయితే ఎక్కువ శాతం శారీరక, మానసిక హింసను ఎదుర్కొంటున్నది మాత్రం మహిళలే అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక రాజకీయ, మతపరమైన ఘర్షణల్లోకి ఏమాత్రం సంబంధం లేని మహిళలను రచ్చకీడ్చి, వారిని నగ్నంగా ఊరేగించడం, వివస్త్రలను చేసి పైశాచిక ఆనందాన్ని పొందడం, ఇద్దరు మగవాళ్ళు తిట్టుకునే బూతుల్లో కూడా మహిళల అవయవాల ప్రసక్తి తెచ్చి, తిట్టుకోవడం…ఏమి ఆధునిక నాగరికత ఇది? ఏమి అభివృద్ధి ఇది? ఏమి ప్రగతి ఇది?
స్త్రీ, పురుషుడు ఎవరికైనా సరే స్వేఛ్చ అంటే చట్టాన్ని అతిక్రమించడం కాదు. కుటుంబాన్నీ, భాద్యతలను గాలికొదిలి “నేను సింగిల్” అంటూ బలాదూర్ తిరగడం కాదు. పబ్బుల్లో గుడ్డలిప్పుకుని తాగితందానాలు ఆడడం కాదు. ఇక ఫెమినిజం అర్ధం కూడా మార్చేస్తున్నారు కొందరు. స్త్రీ, పురుషులు సమాన స్థాయిలో ఉండాలి, సమాన గౌరవం పొందాలి అనే మౌలికమైన సూత్రంను మార్చేసి, కేవలం ఫెమినిజం అంటే పురుష ద్వేషం గా మార్చి, మగవారిని పగవారుగా [మళ్ళీ వాళ్ళ చేత సహాయాలు పొందుతూ], దోషులుగా పరిగణిస్తూ, ఫెమినిజం అంటే పురుష ద్వేషం అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెడుతున్నారు కొందరు తమ రచనల్లో. ఇది చాల విచారించవలసిన విషయం. పాల సముద్రంలో విషపు చుక్కలు కలిసినట్లు, సమాజంలో కొందరు నేరాలు చేసిన, శాడిస్టు పురుషులను దృష్టిలో పెట్టుకుని మొత్తం పురుష సమాజాన్ని అందుకు భాద్యులను చేయడం సరికాదు. స్త్రీ, పురుషులు ఇద్దరిలోను మంచి, చెడు రెండు రకాల వారు ఉన్నారు. కుటుంబం అంటేనే కలిసి ఉండడం. సమాజం అంటేనే సర్దుకుపోవడం. ఒక్కరికోసం పది మంది నిలవడం. పదిమంది క్షేమం కోసం ఒక్కరు నిలవడం.
మనకు ఎందరో స్ఫూర్తివంతమైన మహిళలు ఉన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి జగతికి మంచిని చేసిన ఎందరో మహిళా మణులు, మణిపూసలు ఉన్నారు. అనిబిసెంట్, సిస్టర్ నివేదితా, శారదా దేవి, మదర్ థెరిసా, డొక్కా సీతమ్మ లాంటి త్యాగధనులు, మేడం క్యూరీ, టెస్సి థామస్ లాంటి శాస్త్రవేత్తలు, ఆర్ధికంగా ఎదిగిన ఎందరో మహిళా వ్యాపారవేత్తలు, రాజకీయంగా ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించిన నాయకురాళ్లు, ఇంటిని, కుటుంబ సభ్యులను ప్రేమించి, సమాజాన్ని ఒక పూజా మందిరంగా మార్చే మహిళామణులకు నీరాజనాలు. వారందరి స్పూర్తితో మహిళా అంటేనే చేతులెత్తి నమస్కరించేంత సంస్కారంతో ప్రతి ఒక్క మహిళా ప్రగతిశీలం కావాలి. అప్పుడు మహిళల కోసం ఏవిధమైన ప్రత్యేకమైన దినోత్సవాలు జరపాల్సిన అవసరం లేదు.
ఈ నెల మార్చి8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘విమల సాహితీ పత్రిక’ రచయితలకు, పాఠకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630