విమల సాహితి ఎడిటోరియల్ 36 – ఆవశ్యకమైన – విశ్వసనీయమైన ఎఫెక్ట్

ఈ నెల 28న జరుపుకోబోతున్న NATIONAL SCIENCE DAY సందర్భంగా ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నేను రాసిన సంపాదకీయ వ్యాసం “ఆవశ్యకమైన -విశ్వసనీయమైన ఎఫెక్ట్” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కావాల్సింది శాంతి. రాజులు, చక్రవర్తులు, నియంతలు ఏలిన రాజ్యాలు పోయాయి. రాజులు, నియంతలు చరిత్రలో కలిసిపోయారు. కానీ ఆ నియంతృత్వ రక్తపాతాలు, యుద్ధ శకలాలు మాత్రం ఇంకా పచ్చిగా నెత్తుటి గాయాలను సలుపుతున్నాయి.

మతోన్మాదం, విశ్వాధినేతలు కావాలన్న కోరిక, రాజ్య కాంక్ష, అహంభావం ప్రబలంగా ఉన్న ఈ ఆధునిక శతాబ్దంలో మనుషులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకమైన విషయాలు చాల ఉన్నాయి.

మత విశ్వాసాలను కాసేపు పక్కన పెట్టి మనిషిగా ఆలోచిస్తే, ఈ విశ్వం ఏర్పడి ఎన్నో లక్షల సంవత్సరాలు అయింది. జీవనానికి అనుకూలమైన వాతావరణం, పంచభూతాలైన భూమి, ఆకాశం, నీరు, నిప్పు, వాయువు ఏర్పడిన తర్వాతనే ఆకుపచ్చటి వృక్ష జాతులు, ఆ పై అకశేరుక [ invertebrates ], సకశేరుక [vertebrates] వెన్నుముక గల జీవులు ఏర్పడ్డాయి. ప్రకృతిలో ఎన్నో అవాంతరాలు జరిగి, అధిక ఉష్ణోగ్రత, విపరీతమైన చలిగాలులు, మంచు గడ్డలు ఏర్పడి ఎన్నో రకాల వృక్ష, జంతు జాతులు నశించిపోయాయి. ఆకస్మిక పరిణామాలు అయిన ఉత్త్పరివర్తనలు జరిగి ఎన్నో కొత్త జాతులు ఏర్పడ్డాయి. జీవనానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డ కొన్ని వేల సంవత్సరాలకు నాలుగు కాళ్ళమీద నడిచే ఏప్ [చింపాంజీ] ల నుంచి వెన్నుముక నిటారుగా గల రెండు కాళ్ళ మీద నడిచే ఆది మానవుని దాకా ఎన్నో జీవ పరిణామాలు జరిగాయి.

ఆదిమ మానవుడు కనిపెట్టిన నిప్పు, చక్రం, వ్యవసాయం మనిషి జీవన విధానంలో అద్భుతమైన అనుకూలమైన మార్పులు తీసుకువచ్చాయి. ఇవన్నీ మనకు ప్రత్యక్షంగా కంటికి కనపడే నిదర్శనాలు. మన ప్రాచీన యుగాల మానవులు ఎందరో గుహల్లో వేసిన చిత్రాలు, తాళపత్ర గ్రంధాల్లో రాసి భద్ర పరచిన లిపులు మానవుడు జంతువులాంటి మృగ దశ నుండి అత్యున్నత స్థాయిలో వికాసం చెందిన మెదడు తో మొత్తం విశ్వమంతటికీ విజేతగా నిలిచాడు. కానీ అదే మనిషిలో స్వార్ధం, ఆహం ప్రబలమై ఇప్పుడు మానవ జాతి వినాశనానికి కారణభూతుడవుతున్నాడు. ఇటువంటి వినాశ కాలంలో మానవులను అంధ విశ్వాసాలనుంచి పరిరక్షించి, శాస్త్రీయ విజ్ఞానం వైపుకు, నిజాల వైపుకు, ప్రత్యక్ష నిదర్శనాలవైపుకు మళ్ళించేది ఒక్క శాస్త్రవేత్తలు మాత్రమే.

ఎందరో విదేశీ శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన శాస్త్రీయ వైజ్ఞానిక సిద్ధాంతాలను రూపొందించారు. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ న్యూటన్, డార్విన్ లాంటి గొప్ప శాస్త్రవేత్తలు ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేసి ప్రపంచప్రఖ్యాతి గడించారు. అదే సమయంలో ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు అంధ మత విశ్వాసుల బారిన పడి ప్రాణాలను కోల్పోయినవారు ఉన్నారు. శాస్త్రవేత్తలు మరణించవచ్చు కానీ విజ్ఞాన శాస్త్రానికి మరణం లేదు. ఈనాటి ఆధునిక మానవుడు ఫలవంతమైన, సౌకర్యవంతమైన జీవనం గడుపుతున్నాడంటే, దానికి కారణం ఖచ్చితంగా ఎందరో గొప్ప శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితమే. శాస్త్రీయ పరిశోధనల కోసం జీవితాలను ఫణంగా పెట్టిన వారి త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న విజ్ఞాన శాస్త్ర సంపద.

ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలతో పాటు మన భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్న వైజ్ఞానిక ఆవిష్కరణలు ఎన్నో మానవులను ప్రగతి పథంలోకి నడిపించాయి. ఆర్యభట్ట, రామానుజాచార్య వంటి గొప్ప శాస్త్రవేత్తల సరసన నిలిచి, ప్రపంచదేశాల ముందు మన భారత దేశాన్ని అత్యున్నత శిఖరం మీద నిలబెట్టిన మహనీయుడు సీవీ రామన్ అనబడే ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త (చంద్రశేఖర వెంకటరామన్) భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి, ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా నిలిచాడు.

ఆయన నిరంతర పరిశోధనల ఫలితం “రామన్ ఎఫెక్ట్ ” 1928 ఫిబ్రవరి 28 న కనుగొన్నారు. ఆయన కనుగొన్న ఆ అద్భుతమైన “రామన్ ఎఫెక్ట్” కు బ్రిటిష్ ప్రభుత్వం 1929 లో నైట్ హుడ్ బిరుదుతో సత్కరించింది.

“రామన్ ఎఫెక్ట్ ” అంటే పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు మాధ్యమాల గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో నిరూపించి చూపించారు. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం నైట్ హుడ్ బిరుదుతో గౌరవించింది. ఈ రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధర చేయని పరికరాలతో ఆ పరిశోధన నిరూపించబడడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రవేత్తలందరూ రామన్ గారిని అభినందించారు. వారి పరిశోధనలను గుర్తించి 1930 లో నోబెల్ బహుమతి ప్రధానం చేసారు.

ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954 లో ‘భారత రత్న’ అవార్టు బహుకరించారు. ఈ సమయంలో ఆయన సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ “విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలలు పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృతి ఇవే విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి” అన్న వారి సందేశం నేటి యువత స్ఫూర్తివంతంగా నిలుస్తుంది.

అదే విధంగా వారు మరో ఇచ్చిన మరో సందేశంలో ‘నా మతం సైన్స్. .దానినే జీవితాంతం ఆరాధిస్తా” అని చెప్పారు. తుదిశ్వాస వరకు వారు చెప్పిన మాట నిలబెట్టుకుని శాస్త్రాన్వేషణలోనే జీవితాన్ని గడిపిన దార్శనికుడు ఆయన. ఇది నేటి యువతరానికి సర్వత్రా అనుసరణీయం, ఆచరణీయం. అంతటి గొప్ప మహనీయుని గుర్తుగా వారి పరిశోధనల ఫలితం అయిన ‘రామన్ ఎఫెక్ట్ ‘ ను 1928 ఫిబ్రవరి 28 న కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆ తారీఖుని ‘జాతీయ విజ్ఞాన దినోత్సవంగా [ National Science Day ] జరుపుతారు. ఈ రోజును ‘రామన్ డే’ అని కూడా అంటారు. ఈ రామన్ ఎఫెక్ట్ వల్ల అనునిర్మాణం, రేడియోధార్మికత, పరమాణువులు లాంటి విషయాలతో పాటు మానవ శరీరంలోని D.N.A, R.N.A వంటి ప్రోటీన్ నిర్మాణాల పరిశీలన ఇంకా ఎన్నో విధాలుగా మానవాళికి ఉపయోగకరమైనదిగా ప్రఖ్యాతిగాంచింది.

దేనినైనా సృష్టించడం చాలా కష్టం. కూలగొట్టడం, నాశనం చేయడం చాల తేలిక. మానవాళి ప్రగతికి, సుఖసంతోషాలకు కొందరు మహనీయులు పాటు పడుతుంటే కొందరు మతమౌఢ్యం తో, మనిషి పట్ల మనిషికి ద్వేషాల్ని రగిలించి మనుషుల మధ్య అడ్డుగోడలు కడుతున్నారు. విశ్వ ప్రపంచాన్ని యుద్ధ క్షేత్రాలుగా, నెత్తుటి సాగరాలుగా మారుస్తున్నారు. మారణహోమం సృష్టిస్తున్నారు.

మతం, సైన్స్ రెండు రైలు పట్టాలవంటివి. ఎప్పడూ పక్క పక్కనే సమాంతరంగా పోతుంటాయి. కానీ మానవాళి మనుగడకు, సుఖశాంతులకు శాస్త్రీయ విజ్ఞానం ఎనలేని మేలు చేస్తుందనేది మాత్రం నిర్వివాదాంశం.

అటువంటి విద్వేష కారులను విజ్ఞాన శాస్త్రవేత్తలు, సాహితీ కారులు తమ సృజనాత్మక పరిశోధనలు, రచనలతో అడ్డుకుని సమసమాజ, సస్యశ్యామల విశ్వమానవ ప్రగతికి, అభ్యుదయానికి తోడ్పాటు అందించాలి. అప్పుడే విజ్ఞాన శాస్త్ర ఫలితాలు మానవాళి మనుగడకు నిలువెత్తు నిదర్శనాలు అవుతాయి.

ఈ నెల అనగా ఫిబ్రవరి 28 న జరుపుకునే ‘నేషనల్ సైన్స్ డే’ సందర్భంగా విమల సాహితీ పాఠకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

రోహిణి వంజారి

సంపాదకీయం

9000594630