హస్త భూషణం అర్థం మారనీకుమా..! ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి
పుస్తకమంటే జ్ఞానం
పుస్తకమంటే మానసిక ఆరోగ్యం
పుస్తకమంటే చీకటిలో దారి దీపం గూగుల్ మ్యాప్ మనం వెళ్లాల్సిన
దారిని మాత్రమే తెలుపవచ్చు. కానీ పుస్తకం మనం వెళ్ళే దారి ఎటువంటిదో కూడా తెలుపుతుంది పుస్తకాన్ని చేతిలో ధరించడం
అంటే జ్ఞాన మార్గపు ద్వారాలను తెరుచుకుంటూ
జ్ఞానం లోతైన మహా సాగరం ఈదుకుంటూ వెళ్ళేకొద్దీ కొత్తమార్గాలు. కనబడుతాయి.
ఆ మార్గంలో మేలిమి ముత్యాలు
పగడపు రాసుల లాంటి అపారమైన జ్ఞాననిధిని సొంతం చేసుకోవచ్చు
మహా సముద్రాలకైనా ఎక్కడో ఓ చోట పరిధులు ఉండవచ్చు
కానీ అపారమైన జ్ఞాన సాగరానికి పరిధులులేవు. జ్ఞానం అనంతం, జ్ఞానం అచింత్యం జ్ఞానం అమోఘం,
జ్ఞానం అపూర్వం. జ్ఞానం అమేయం.
నిత్య నూతనమైనది జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని అనునిత్యం
సాధన చేసి మరీ. నేర్చుకోవాలి.
“వెలుగుతున్న జ్ఞానదీపము ఇతర
దీపాలను వెలిగించగలదు” అని
మన గౌరవ మాజీ రాష్ట్రపతి,
గురువులు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు.అటువంటి అనంతమైన జ్ఞానానికి మహత్తరమైన
కొలమానాలు మస్తకాన్ని
పదునెక్కించే మంచి పుస్తకాలు.
చేతిలో పుస్తకం ఉన్నవారెవరూ ఒంటరివారు కాదు. ఓ మంచి పుస్తకం మన దగ్గర ఉంటే ఓ గొప్ప సమూహం మన చెంత ఉన్నట్లే. వంద మంది స్నేహితులు పంచలేని జ్ఞానం ఓ మంచి పుస్తకం పంచుతుంది. మనిషి వేదనలో ఉంటే ఓదార్పు అవుతుంది. ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. వెళ్ళే మార్గంలోని మంచి, చెడులను విశ్లేషించి చూపుతుంది. పాలలో చేరిన నీళ్ళను వేరు చేసే హంసలాగా నిజాల నిగ్గు తేల్చేస్తుంది మంచి పుస్తకం.అటువంటి మహా జ్ఞాన సంపద ఇప్పుడు భాగ్య నగరంలో కొలువై ఉంది. హైదరాబాద్ ఎన్.టి.ఆర్. స్టేడియం లో ఈ నెల 9 వ తేదీ నుంచి ప్రారంభమైన పుస్తక ప్రదర్శన ఇంకో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ పుస్తక ప్రదర్శనలో దాదాపు 350 స్టాల్స్ లో పుస్తకాలు కొలువుదీరి ఉన్నాయి. మన రెండు తెలుగు రాష్ట్రాలవాళ్ళే కాకుండా, దేశంలోనే ప్రముఖమైన ప్రచురణ కర్తలు తమ పుస్తకాలను ప్రదర్శనకు పెట్టారు. దేశ, విదేశీ రచయితల అద్భుతమైన పుస్తకాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ పుస్తకాల్లో ఆథ్యాత్మికం , మనో విశ్లేషణం, విజ్ఞానం, వినోదం, నాటకం, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోని మాండలికాల పరిచయ పుస్తకాలు, సాంఘిక, రాజకీయ, సామాజిక నేపద్యాల్లో గొప్ప రచయితలు రాసిన పుస్తకాలు వందల వేల సంఖ్యలో ఇక్కడ లభిస్తున్నాయి. అద్భుతమైన పుస్తక ప్రదర్శనలు, సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొత్తగా కవిత, కథా సంపుటాలను ఆవిష్కరించుకునేందుకు “రవ్వ శ్రీహరి ప్రాంగణం” వేదిక అయింది. అదే వేదిక మీద సాహితీ చర్చలు, కథా చర్చలు, విశ్లేషణలు తెలంగాణ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు శ్రీ జూలూరి గౌరీ శంకర్, శ్రీ కోయి చంద్రమోహన్ బృందం ఆద్వర్యంలో జరుగుతున్నాయి.
మనకు బాల సాహిత్యం అద్భుతంగా రాసే ఎందరో గొప్ప సాహితీవేత్తలు ఉన్నారు. లేనిదల్లా ఒకటే. జ్ఞానాన్ని సముపార్జించాలనే తపన, ఆసక్తి. సోషల్ మీడియా విస్తృతంగా శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న ఈ తరుణంలో, ఇటీవలి కాలంలో చేతిలో పుస్తకం కంటే సెల్ ఫోన్ హస్తభూషణంగా మారింది. ఓ స్టాల్ దగ్గరకు తల్లిదండ్రులతో వచ్చిన ఓ పాపని వాళ్ళ అమ్మ తెలుగు పుస్తకాలు చూపించింది. ఆ పాప “మమ్మీ..తెలుగు బ్యాడ్” అనడం నేను ప్రత్యక్షంగా విన్నాను. హృదయంలో చాలా వేదన కలిగింది. మమ్మీ-డాడీ సంస్కృతిని పెంచి పోషిస్తున్నది ఎవరు..? తెలుగు భాష పట్ల చులకన భావం ఏర్పడడానికి కారణం ఏమిటి..? పిల్లలకు సెల్ ఫోన్ గేమ్స్, కథల వీడియో క్యాసెట్స్, ట్యాబ్ లాంటివి ఇవ్వకుండా, పుస్తకాలను చదివించే అలవాటు చేయాలి పెద్దలు. లేకుంటే పేదరాశి పెద్దమ్మ, ముల్లా నసీరుద్దీన్, పంచతంత్రం లాంటి అద్భుతమైన బాలల కథలు అవశేష శకలాలుగా మారిపోతాయి.
పెద్దలు మాత్రం ఏం ఏం చేస్తున్నారు..? యూ ట్యూబ్, వెబ్ సిరీస్, సీరియల్స్ లో చూపించే కొన్ని చెత్త, పనికి రాని సమాచారాలను బుర్రలోకి ఎక్కించుకొని అదే తమకు లభించిన గొప్ప జ్ఞాన సంపద అని భీకరాలు పోతున్నారు. మల్టిఫ్లెక్ సినిమా హాల్లో కొనే పాపకార్న్ కంటే తక్కువ రేటుకే పుస్తకాలు లభిస్తాయి. అయినా డబ్బు పెట్టి పుస్తకాలు కొనాలంటే చేయి జోబి లేదా పర్సులోకి వెళ్ళదు. కానీ ఇలాంటి వారు పుస్తక ప్రదర్శనకి వచ్చి కనీసం పుస్తకాలను చూస్తున్నందుకు సంతోషపడాలి.ఏడాదికి ఒకసారి జరిగే ఈ పుస్తక ప్రదర్శనకు సందర్శకులు పెరగాలి. పుస్తకాలు చదివేవాళ్ళు, కొనే వాళ్ళు కూడా పెరగాలి. ఇక మిగిలిఉన్న చివరి రెండు రోజుల్లో విరివిగా సందర్శకులు పుస్తక ప్రదర్శనను వీక్షించాలి.
పర బాషా జ్ఞానాన్ని తప్పకుండా సంపాదించాలి. కానీ మన మాతృ భాషను మృత భాష కాకుండా పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత ప్రతిఒక్క తెలుగు బిడ్డ మీద ఉంది. “దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నారు శ్రీకృష్ణ దేవ రాయలవారు, మధుర, తంజావూరు నాయక రాజులు విశ్వనాథ నాయకుడు రంగనాథ నాయకుడు చెవ్వప్ప నాయకుడు తదితరులు ఎందరో ప్రాచీన, అభ్యుదయ సాహితీకారులు తెలుగు భాషలో ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రచనలు చేసి తెలుగు భాషను శిఖరాగ్రం మీద నిలబెట్టారు. ఆ స్థానాన్ని తెలుగు భాష కోల్పోకుండా నేటి ఆధునిక, నవీన కవులు, కథకులు, సాహితీవేత్తలు తమ నైపుణ్య కౌశలాలను రచనల్లో ప్రదర్శించి, రాశిలో కాకుండా వాసిలో అత్యుత్తమమైన సాహిత్యాన్ని అందించాలి.
సెల్ ఫోన్ హస్తభూషణంగా విరాజిల్లుతున్న ఈ నవీన కాలంలో సెల్ ఫోన్ ని అవసరానికి మించి వాడకుండా పెద్దలు, పిల్లలు అదుపు చేసుకుని, హస్త భూషణంగా పుస్తకానికే నీరాజనం పట్టాలి. పుస్తకాన్నే మస్తకానికి నేస్తం చేసుకోవాలి. పుస్తకానికి అత్యున్నత స్థానాన్ని కల్పించాలి. తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి తెలుగు బిడ్డ మాతృభాషను పరిరక్షించుకుంటానని ప్రమాణం చేయాలి. తెలుగు భాష పరిరక్షణ కంకణాన్ని కట్టుకోవాలి.
రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630