ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం ” కదలి వస్తున్న సాహితీ పండుగ” చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి
మనకు సంక్రాంతి, దసరా రంజాన్ ,క్రిస్మస్, లాంటి పండుగలు ఎన్నో ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే లాంటి జాతీయ పండుగలూ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటితో పాటు మరొక కొత్త పండుగ కొత్త సంవత్సరం మొదట్లోనే మన ముందుకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లా దూసుకుని వచ్చేస్తోంది.
భాగ్యనగరంలో ప్రతి రోజు పండుగే. హైదరాబాద్ కళలకు కాణాచి. ఎన్నో రాచరిక వేడుకలు, సంస్కృతులకు పుట్టినిల్లు. ఎందరో కళాకారులు వివిధ వేడుకల్లో పాల్గొని ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. నాంపల్లిలో జరిగే నుమాయిష్ లాంటి ప్రదర్శనల్లో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి తమ వ్యాపారాలను,కళలను ప్రదర్శించి తమ పొట్ట పోసుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు భాగ్యనగరంలోకి రాబోతున్న పండుగ సాహితీ పండుగ బుక్ ఫెయిర్. ఇది నగరానికి, నగర ప్రజలకు కొత్త కాదు. ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతున్నదే. ఇప్పటికే విజయవాడలో, తిరుపతిలో జరిగి ఇంకో వారంలో అంటే సరిగ్గా ఈ ఫిబ్రవరి 9 వ తేదీన భాగ్యనగరానికి రాబోతున్న వేడుక. కవులు, కథకులు, ప్రచురణ కర్తలు , సాహితీ కారులు, పాఠకులు ఎంతగానో ఎదురు చూస్తున్న అతి పెద్ద పుస్తక ప్రదర్శనా పండుగ.
దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు కూడా ఆసక్తిగా పుస్తకాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఎన్నో భాషలు. ఎందరో రచయితలు. ఎన్నో వేల పుస్తకాలు. దాదాపు 500 పైన స్టాల్ల్స్ లో పుస్తకాలన్నీ కొలువు తీరుతాయి. కరోనా సమయంలో సాహితీ లోకం నిస్తేజమైపోయింది. నవ్య, తెలుగు వెలుగు, విపుల లాంటి ఎన్నో ప్రముఖ పత్రికలు, ముద్రణాలయాలు మూతపడ్డాయి. అటువంటి సమయంలో రచయితలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది సోషల్ మీడియా. తాము చేసిన రచనలను పత్రికలకి పంపకుండా ఫేస్బుక్, వాట్సాప్ సమూహాలు వంటి సాంఘిక మాధ్యమాల్లో తమ రచనలను పోస్ట్ చేసుకుని, వాటిని పుస్తక రూపంలోకి తెచ్చుకునే రచయితలు ఎందరో ఉన్నారు ఇప్పుడు. కరోనా తర్వాతి ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో చాల మంది కవులు, రచయితలు తమ పుస్తకాలను విరివిగా ముద్రించుకున్నారు.
ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను తట్టుకుని ముద్రించుకున్న తమ పుస్తకాలను పాఠకులకు చేరువ చేసే తరుణం ఈ పుస్తక ప్రదర్శన. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. మన పొరుగు రాష్ట్ర భాషలు తమిళం, మళయాలం రచయితలను , వారి రచనలను ఆ రాష్ట్రాల్లో ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. రచయితలకు అద్భుతమైన ప్రోత్సాహం ఇస్తారు. వారి పత్రికలు కూడా ఆయా రచయితల పుస్తకాల సమీక్షలు ప్రచురించి గొప్ప ప్రోత్సాహం అందిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో రచయితలకు పెద్దగా ప్రోత్సాహం లేదు. ఓ.టి. టి. సినిమాలు, వెబ్ సిరీస్, యూ-ట్యూబ్ లాంటి పట్ల ఉన్న ఆసక్తి సమాజానికి దివిటీల వంటి రచయితలకు, రచనలకు లేదు. ఇటువంటి సమయంలో రచయితలు బుక్ ఫెయిర్ లో తమ పుస్తకాలను ప్రదర్శించి పాఠకులకు అమ్మకం చేయాలనుకోవడం చాల సహజమైన ఆశ. మంచి సాహిత్యం, ప్రతిభావంతమైన రచయితలు ఎక్కడ ఉన్నా ప్రోత్సహించవలసిన గురుతర బాధ్యత తెలుగువారందరి పైనా ఉంది.
ఇటు వంటి సమయంలో రచయితల పుస్తకాల అమ్మకం పైన ఫేస్బుక్ లాంటి మాధ్యమాల్లో కొందరు వ్యంగ్యంగా పోస్టులు పెట్టడం చాల విచారకరం. ‘రచయితలు పుస్తకాలు అమ్ముకోవడాని పుస్తక ప్రదర్శన గేటు దగ్గర నిలబడి పుస్తకాలు కొనమని అడుక్కుంటారు, కొందరు ఉచితంగా పంచి పెడతారు. కొందరు వెంటబడి, వేధించి పుస్తకాలు అంటగడతారు’ అంటూ రచయితలుగా ఉన్నవారే సాటి రచయితలగురించి వ్యంగ్యంగా మాట్లాడడం అనుచితమైన చర్య. ఇంకా దిగజారిన మనఃతత్వం ఏమిటంటే ‘కొందరు మహిళా రచయితలు పుస్తకాల అమ్మకం కోసం తమ అందాలను ఆరబోసి యువకులను, మధ్యవయస్కులను ఆకర్షించి పుస్తకాలను అంటగడతారు’ అనే మాటలు మాట్లాడడం అతి నీచమైన బుద్ధి, కుసంస్కారం, మహిళల పట్ల చులకన భావన. ఇటువంటి నీచ భావనలు సాహితీ లోకంలో అసలు సమర్ధనీయం కాదు. అటువంటి పెడ ధోరణులు మానుకోకుంటే రచయితలు అని చెప్పుకునే అర్హత వాళ్ళు కోల్పోయినట్లే.
ఎంతో కష్టపడి, నైపుణ్యాన్ని అంతా కలగలిపి తాము చేసిన రచనలు పుస్తకం రూపంలోకి తెచ్చుకోవడానికి రచయితలు ఎన్నో అగచాట్లు ఎదుర్కుంటారు. అటువంటి రచయితలను, వారి రచనలను ప్రోత్సహించాల్సిన మన తెలుగు పాఠకులు అందరిమీదా ఉంది. ఎంత సేపు ఆ భాషలో కథలు బాగుంటాయి, ఈ అనువాద కథలు బాగున్నాయి అనుకోకుండా మన తెలుగు భాష కథలను, కవితలను, సమీక్షా వ్యాసాల సంపుటాలను ఆదరిద్దాం. తెలుగు నెల పైన పుట్టిన మనం మన భాష రచయితలకు తగినంత ప్రోత్సాహం ఇద్దాం. దాంతో పాటు మనం కూడా ఎంతో జ్ఞానాన్ని, వినోదాన్ని సొంతం చేసుకుందాం.
‘పుస్తకం హస్త భూషణం’ అన్నారు పెద్దలు. ‘చిరిగిపోయిన చొక్కా అయినా వేసుకో కానీ ఓ మంచి పుస్తకాన్ని కొనడం మాత్రం మరచిపోకు. పుస్తకాలు జీవితాన్ని చూపించే దారి దీపాల వంటివి’ ‘పుస్తకం నిద్రిస్తున్న మస్తకాన్ని తట్టి లేపుతుంది’, ‘చీకటి లోనించి వెలుతురులోకి తీసుకువెళ్ళే దీపధారి పుస్తకం.ఇలా పుస్తకాల గురించి, వాటి గొప్పతనాన్ని గురించి తెలిపే నానుడులు మనకు వందల సంఖ్యలో ఉన్నాయి. అటువంటి పుస్తకాలను ప్రదర్శించే బుక్ ఫెయిర్ కి ప్రతి ఒక్కరం హాజరవుదాం. నచ్చిన పుస్తకాలను కొనాలి. చదవాలి. మన తరువాతి తరాలకు మన తెలుగు భాషను అందించే వారధులు అవుదాం. తెలుగు భాషను బతికించుకుందాం.
తెలుగు సాహిత్యం అన్ని భాషల సాహిత్యం కన్నా విభిన్నమైనదని, విలక్షణమైనదని సగర్వంగా చాటుదాం
రోహిణి వంజారి
సంపాదకులు
9000594630.