“హేమంత సీమంతోత్సవం” ఈనాటి విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి.
మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు
హేమంత మాసం. చిరు చీకట్లు, సోమరిగా వీచే చల్ల గాలులు, చలిమంటలు, ఉషోదయ తుషార జల్లులు, ఇరానీ చాయ్ పొగలు, కంబళ్ళు, శాలువాలు కప్పుకుని ఉదయపు నడకలు, సుదీర్ఘమైన చీకటి రాత్రులు. “హేమంతం కృషీవలుల సీమంతం” అంటాడు ఓ కవి. “ప్రియురాలి కౌగిలిలో నెగళ్లు రగిలించి వెచ్చగా చలి కాచుకునే కాలం” అంటాడు మరో భావ కవి. అంతేనా శారీరక శక్తులు సన్నగిల్లి, జీవన క్రియలు మందగిచే ఈ సమయంలో నియమాలు, దీక్షలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రార్ధనలు జరుపుతూ, శారీరక, మానసిక బలాన్ని పెంపొందించుకునే తరుణం కూడా ఈ హేమంతమే.
అంతేనా..! హేమంతం అంటే ఇంకా విరగపూసే బంతులు, చామంతులు, గులాబీ పూలు, డిసెంబర్ మాసంలోనే విరగపూసే రంగు రంగుల డిసెంబర్ పూలు, నేల తల్లి ఇంద్రధనస్సు వర్ణాల చీరను సింగారించినట్లు, కన్నె పిల్ల వన్నెచిన్నెలన్ని ప్రకృతిలోనే మమేకమైనట్లు మనోవీధిని రంజింపచేసేకాలం. సీతాఫలాలు, జామ ఫలాలు, నారింజ ఫలాలు, రేగిపళ్ళు కూడా విరగకాచి, వీధుల్లో కుప్పలు కుప్పలుగా పోసి, అమ్ముకునే చిరు వ్యాపారుల పాలిటి కల్పతరువు కూడా ఈ హేమంత మాసమే.
కృషీవలులు అంటే రైతులు అని మనకు తెలుసు. మనఅందరి ఆకలి తీర్చడానికి, నాగలి భుజాన వేసుకుని, ఆరుగాలాలు కష్టించి పనిచేస్తూ, ఆహర్నిశలు పంటపొలాలను అంటిపెట్టుకుని, పంట దిగుబడి కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని కాపుకాచే రైతులు. ఇతరుల సౌఖ్యం కోసమే తమ బతుకులు అంకితం అన్నట్లు పంటపొలాల్లో వెన్నుదన్నుగా సాయం అందించే పశువులు. పాడి పరిశ్రమలో సింహభాగం తమచుట్టూనే తిప్పుకునే ఆవులు, బర్రెలు. ఎన్ని రకాల జీవులు . మానవుల ఆనందం కోసం సాయమందించేవి. ఏడాదికి ఒక్క సారైనా ఆ రైతులకు, పశువులకు కృతఙ్ఞతలు తెలపాలి కదా మనం. వ్యవసాయం చేసే రైతు కష్టాన్ని ఎవరు గుర్తిస్తున్నారు? అధికారం, ఓట్లకోసం కంటితుడుపు బంధులు, రాయితీలు జమీందారీ రైతులకు ఇవ్వడం కాదు. రైతు శ్రమకు తగిన ఫలం అందిననాడే సర్వత్రా సస్యశామలం అవుతుంది ఈ ధరణి.
“మంచు కింద ఉక్కపోత” అంటారు జడా సుబ్బారావు మంచి కథకులు. దేహం మంచు గడ్డలా మారే ఈ కాలంలో ఉక్కపోత ఎక్కడ ఉంటుంది అని ఆశ్చర్యంగా ఉంది కదా..! చలి రాత్రులు మనమంతా వెచ్చని దుప్పట్లు కప్పుకుని ఇళ్లల్లో సుఖంగా నిద్రిస్తుంటే, అక్కడ మన దేశ సరిహద్దుల్లో రాత్రి, పగలు తేడా లేకుండా అనుక్షణం అప్రమత్తంగా, రెప్ప వేయకుండా పహారా కాస్తూ, శత్రు సేనలను తుదముట్టించి, దేశాన్ని, మనలను సంరక్షిస్తున్న సైనికులకు, మంచులో కూడా ఉక్కపోతగానే ఉంటుంది. అందుకే కదా రైతు, సైనికుడు మనదేశానికి రెండు కళ్ళలాంటి వారు. ఆ సైనికుల త్యాగాలను ఎప్పుడైనా స్మరించుకున్నారా మీరు..?
సంక్రాతి పండుగ మాసం అంటే సూర్యుని గమనం మారడం. ఉత్తరాయణ కాలంలోకి సూర్యుని సంక్రమణం జరగడం. సంక్రమణం అంటే మార్పు అని అర్ధం. ఈ మార్పు ఎటువంటిది. ప్రకృతిలోనే కాదు, మనిషి మనస్సులో కూడా ఒక ఆనందకరమైన మార్పు, ఒక సాయమందించే మార్పు, ఒక త్యాగం చూసే మార్పు, ఒక సహనశీల మార్పు. ఇలా మానవుని సౌశీల్యం కొరకు ప్రతిఒక్కరు మార్పుదిశగా పయనిస్తే ఎంత బాగుంటుందో కదా. ఇతరులకు సాయం చేయడం, పలువురి సౌఖ్యం కోరుకోవడం, పదుగురిని ఆనందింపచేయడమే కదా పండుగ అంటే. ఇక పెద్ద పండుగ అంటే మహదానందమే కదా. హేమంతపు పండుగ నెల అంటేనే సాయంచేసే సమయం. ముగ్గులు, రంగులు, పతంగులు, గొబ్బెమ్మలు, పువ్వుల వ్యాపారులకు నాలుగు రాళ్ళు కళ్ళ చూసే సమయం. హరిదాసులు, గొబ్బి బాలికలు, బుడబుక్కల వాళ్ళు, గంగిరెద్దులవాళ్ళు, తోలుబొమ్మలాటగాళ్ళు, వీధి నాటకాల వాళ్ళు, పగటేషగాళ్ళు, పండరి భజన బృందాలు, జంగమ దేవరలు, దొమ్మరి ఆటగాళ్లు ఒక్కరు, ఇద్దరిని కాదు. ఇంతమంది బతుకుబండిని లాగే క్రమంలో ఈ పండుగ నెలలో గృహస్తుల ఇళ్ళు తిరిగి బియ్యం, పిండి వంటలు, ధాన్యం, డబ్బులు దానంగా పొంది, గృహస్తులను చల్లగా ఉండమని దీవిస్తారు. పదుగురు ఇలా ఒకరికొకరు సాయం చేసుకోవడమే కదా అసలుసిసలైన సిరుల పండగ. ఈ సంక్రాతి పండుగ అందరి జీవితాల్లో సంతోషపు కాంతులను నింపాలని కోరుకుంటూ. విమల సాహితీ పాఠకులకు సంతోష సంక్రాతి పండుగ శుభాకాంక్షలు.
రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630