ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం. ఫేస్ బుక్ మిత్రులందరికీ, విమల సాహితీ పత్రిక పాఠకులకు, నా ప్రియ సహ సంపాదకులకు నూతన సంవత్సర(2024) శుభాకాంక్షలు
విమల సాహితీ పత్రికలో సంపాదకీయం రాసే గొప్ప అవకాశం నాకు కల్పించిన డా.జెల్ది విద్యాధర రావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు
సంపాదకీయం చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి
ఆహా..! కాలం బహు చిత్రమైంది. చాల టక్కరిది. పోయిన జనవరి మొదటి తారీఖున కూడా కొత్త సంవత్సరం వచ్చింది అని సంబరపడ్డాం. వేడుకలు ఎన్నో చేసాం . కొత్త రెక్కలు కట్టుకుని, సరికొత్త ఆశలతో నింగి అంచులను తాకాలని పైపైకెగిరిపోవాలని ఎన్ని కలలు కన్నామని..! ఏది ఒక్క కల అయినా నిజం చేసుకున్నామా..? పదేళ్ల ముందు కూడా కొత్త ఏడాది వచ్చింది అని అనుకున్నాం. కానీ ఎన్నో యుగాలుగా కాలం తాను ఒక్క క్షణం కూడా ఆగకుండా నిరంతరం ముందుకు పయనిస్తూనే ఉంది అలుపెరుగని బాటసారిలా. కాలం కుందేలు పిల్లలా ముందుకు దూసుకుపోతుంటే, మనం కాలం వెంబడి పరుగులు తీయలేక, ఒక్కోసారి తాబేలు లాగా వెనుకబడిపోతున్నాం.
కొత్తసంవత్సరం ఇంకాసేపట్లో మొదలవుతుందనగా ఎంత సందడి. ఎంత సంబరం. జాతరలాగా జనాల కూడిక. ఓ పక్క ఆలయాల్లో పూజలు, చర్చిల్లో ప్రార్ధనలు, మసీదుల్లో నమాజ్లతో భక్తి పారవశ్యంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంటే, మరో పక్క పబ్బుల్లో, క్లబ్బుల్లో చిందులు, విందులతో షాంపేన్, కాక్టైల్ గ్లాసుల చీర్స్. ఎవరికిష్టమైన పద్దతిలో వారు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం తెలిసినదే. అయితే ఆ సంబరం అంతా ఆ ఒక్క రోజే. ఆ రోజున ఎన్నో కొత్త అలవాట్లను ప్రారంభించాలి అనుకోవచ్చు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు. ఎప్పటినుండో ఉండే సిగరెట్ తాగే అలవాటు మానేయాలి, ఆరోగ్యం కోసం వ్యాయామం, నడక ప్రారంభించాలి, పొదుపు తో డబ్బును మదుపు చేయాలి, జీవితం నిస్సారవంతంగా ఉంది. ఏదైనా కొత్త విద్యనో, కొత్త కళో నేర్చుకోవాలి. ఇలా ఎన్నో అనుకుంటాం. చాల ఆసక్తిగా, శ్రద్ధగా ప్రారంభించి, నాలుగు రోజులు కాగానే, ఇదంతా మనవల్ల కాదులే అని నీరుగారిపోయేవారు మనలో చాలామంది ఉన్నారు.
“ఆరంభించారు నీచ మానవులు విఘ్నా యాస సంత్రస్తులై , యారంభించి పరిత్యజించుదురు విఘ్నా యత్తులై మద్యముల్, ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై.” ఈ పద్యం సారం మనం గమనిస్తే “మన సంకల్పానికి ఏ అడ్డంకులు ఎదురవుతాయో అని భయంతో అధములు అసలు ఏ పని మొదలు పెట్టారు. కొందరు మొదలు పెట్టి, మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే, పనిని మధ్యలోనే వదిలిపెడతారు. ఇక ధీరులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, మొదలు పెట్టిన కార్యాన్ని వదలక ఉత్సాహంతో పూర్తి చేస్తారు. మరి ఇంతవరకు మనం ఎలా ఉన్నా, ఈ రోజునుంచి ధీరుల వలె అనుకున్న పనినో, లక్ష్యన్నో మొదలుపెట్టి విజయం సాధించేవరకు శ్రమిద్దాం.
“జీవితం అనేది ఒక నాటకం” అంటాడు ఓ కవి. జీవితం నాటకమైతే, మనుషులంతా అందులోని పాత్రధారులు. ఎవరి పాత్ర వచ్చినప్పుడు వారు తెర ముందుకు వచ్చి, నటించి [జీవించి], తమ పాత్ర పూర్తి కాగానే తెర వెనుకకు మరలిపోతారు. జ్ఞాపకాల పుటల్లోకి చేరిపోతారు. ఈ మధ్యలో ఎన్నో పాత్రలను కలుస్తాము. కొన్ని మధ్యలోనే వెళ్లిపోతాయి. కొన్ని బంధాలు మాత్రం జీవితం చివరివరకు మనతో కలిసి నడుస్తాయి.
“జీవితం ఓ రైలు ప్రయాణం” అని కూడా అంటారు కవులు. మజిలీ మజిలీలో కొత్త మనుషులు, కొత్త ప్రదేశాలు మనకు తారసపడతాయి. ఎవరి మజిలీ రాగానే వారు రైలు నుంచి దిగిపోయినట్లు, మనుషుల మధ్య బాంధవ్యాలు కూడా అంతే. కానీ మనిషిని, మనిషిని కలిపేది అనుబంధమే. కుటుంబసభ్యుల మధ్య అయినా, స్నేహితుల మధ్య అయినా బంధం పదికాలాల పాటు నిలిచి ఉండాలంటే, ఎప్పుడూ ఇతరులు మనల్ని అర్ధం చేసుకోవాలి, మనల్ని ప్రేమించాలి అనే కాకుండా మనం కూడా ఎదుటివారిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రేమించబడడమే కాదు, ప్రేమించడం కూడా ఒక యోగమే. అది నిస్వార్ధ ప్రేమ అయిఉండాలి.
ప్రేమ ఎప్పుడూ ఇస్తుందేకాని, ఏది ఆశించదు. ఇప్పుడు ఇక మనం అందరిని ప్రేమించడం మొదలు పెడదాం. బంధాలను సంకెళ్లులా కాకుండా,రంగురంగుల పూలతో కలిపి అల్లిన పూలచండులా సున్నితంగా కాపాడుకుందాం.
యుద్ధ భయంతో వణికే చిన్నారులకు అండగా నిలబడదాం. అన్ని మతాల సారం మానవత్వమని, మనమంతా ఒకటే అని ప్రపంచానికి చాటిచెప్పుదాం. అన్నార్తులకు, అనాధలకు, అభ్యాగ్యులకు చేయూతగా నిలుద్దాం. సాహిత్యపు పూల తోటలో ప్రేమ, కరుణ, జాలి, సేవ అనే విత్తనాలను నాటుదాం. పాదులు చేసి, కలుపుతీసి, నీరు పెట్టి, తోటను ప్రేమగా పెంచే తోటమాలిలాగా, మనం కూడా ప్రపంచమంతా ప్రేమ విత్తనాలను వెదజల్లుదాం. నెత్తుటి ఆనవాళ్లను చెరిపేసి, మృగాలు, సైతాన్లను తరిమేసి, విశ్వమంతా ప్రేమమయం అని ఎలుగెత్తి చాటుదాం. ఈ కొత్త సంవత్సరానికి “ప్రేమ సంవత్సరం” అని పేరు పెట్టాలని ఐక్యరాజ్య సమితికి విన్నవించుకుందాం.
విమల సాహితీ పాఠకులకు నూతన సంవత్సర 2024 శుభాకాంక్షలతో..
రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630