విమల సాహితి ఎడిటోరియల్ 20 – భరత్ అనే నేను

ఈవారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నేను వ్రాసిన “భరత్ అనే నేను”, సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.

చెడుపైన విజయం, రజో, తమో గుణాలతో యుద్ధముచేసి సత్వగుణ సంపన్నులై జీవితాన్ని తీర్చి దిద్దుకోమని చెప్తూ వచ్చిన నవరాత్రుల దసరా పండుగ ఎన్నెన్నో సందేశాల తాయిలాలను ఇచ్చి, మళ్ళీ ఏడాది తర్వాతే కనిపిస్తాను అంటూ మొన్ననే వెళ్ళిపోయింది.

మరోపక్క గాజా గడ్డమీద యుద్ధ కాండ, అమాయక పౌరులపై దమనకాండ, మతపిశాచాల మారణకాండ కొనసాగుతూనే ఉంది. నెత్తుటి మరకలు ఇంకా పచ్చి వాసనకొడుతూనే ఉన్నాయి. పసి పాపల బుగ్గలమీద కన్నీటి చారికలు, గూడు చెదిరిపోయి, ఆకలి మంటలతో అన్నార్తుల పేగులు పెట్టే ఆర్తనాదాలు ఇంకా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. మతం రక్కసి కోరలు చాచి మనిషితనాన్ని కబళిస్తూనే ఉంది. అంతం లేని దుర్మార్గం కొనసాగుతూనే ఉంది.

ఇంకోపక్క ప్రపంచ కప్ ఫీవర్ మొదలై, ఎప్పుడూ టీవీలో సీరియల్స్ కూడా చూడని వారు సైతం ధైర్యే-సాహసే-రిమోట్ అంటూ భార్య చేతినుంచి రిమోట్ ని లాక్కుని మరి క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు. అమ్మాయిలకు కూడా క్రికెట్ ఆట అంటే క్రేజీనే. ఇతర దేశాల్లో ఏమో కానీ మనదేశంలో క్రికెట్ ఆటకు ఉన్న క్రేజి ఇంక ఏ ఆటకు లేదు. అందునా మన భారత జట్టు ఇప్పటివరకు రెండు సార్లు ప్రపంచ కప్పుని గెలుచుకుంది. ఈ సారి కప్ గెలిస్తే మన జట్టు ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ ని కైవసం చేసుకున్నట్లే. పైగా కప్ గెలవడం మన దేశ ఆత్మగౌరవాన్ని నిలపడం అన్నంత అంకిత భావంతో అటు జట్టు సభ్యులు, ఇటు వాళ్ళను దేవుళ్లుగా ఆరాధించే ప్రజలు ఇప్పుడు అత్యంత అతృతతో ఎదురుచూస్తున్నారు గెలుపు క్షణాలకోసం.ఇక అసలైన పండుగ సీజన్ మొదలైంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండగ మన ముందరకు దూసుకొని వస్తోంది. అదేనండి ఎన్నికల పండగ. నవంబర్, డిసెంబర్ నెలల్లో జరగబోయే ఎలక్షన్లు ఇప్పటికే నేతలకు నిద్రను దూరం చేస్తున్నాయి.

దేశంలోని కొన్ని రాష్ట్రాలతో పాటు, తెలంగాణలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దేశ, రాష్ట్ర రాజకీయ చదరంగంలో పావులు చక చకా కదులుతున్నాయి. అసలు రాజకీయం అంటే ఏమిటి? రాజకీయం అనే మాటను నెగెటివ్ అర్థంలో చూస్తాం మనం. అధికార కాంక్షతో కదిపే పావులు, వేసే ఎత్తుగడలను పక్కన పెడితే అసలు రాజకీయం అంటే స్ధూలంగా అదొక పరిపాలనా ప్రక్రియ. ఒక సమాజాన్ని పాలించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనే వాటి గురించి తెలిపేదే రాజకీయం.

రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం కానీ, శాశ్వత మిత్రుత్వం కానీ ఉండదన్నది జగమెరిగిన సత్యం. ఇక చూడండి. నేతలకు ఊపిరి పీల్చడానికి కూడా తీరికలేని వ్యాపకాలు. బహిరంగ సభలు, సమావేశాలు, ప్రచార సాధనాల హోరు, ప్రతిపక్షాల మీద నూరే కారాలు, మిరియాలు. చెప్పులరిగిపోయేలా పాదయాత్రలు, రథయాత్రలు, ఆశను పెంచే తాయిలాలు, జనాలకి ఇచ్చే హామీలు, చేసే వాగ్దానాలు. అబ్బో.. ! ఎన్ని పనులని. అటు పార్టీల నాయకులకి, ఇటు ప్రజలకి గుక్కతిప్పుకోనీయకుండా చేస్తాయి ఎన్నికలు. ఇక రాజకీయ విశ్లేషకులకు, పత్రిక, మీడియా రంగాలకు చేతినిండా పని. ఫలితాల గురించి, ప్రజల నాడి గురించి విశ్లేషకుల వాడివేడి చర్చలు, రచ్చకెక్కపోతున్న రచ్చబండలు. పార్టీ జండాల మోతలు, కార్యకర్తల నినాదాలు పల్లెలు, పట్టణాలు ఎన్నికల పండగతో రచ్చ రంబోలా ఆడబోతున్నాయి. మరి ఈ పండుగలో సామాన్య ప్రజలు ఏమి చేయాలి..? ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడానికి తమకున్న ఏకైక ఆయుధం ఓటు హక్కు. రంగులుమార్చే ఊసరవెల్లుల్లా రాజకీయ ఎత్తుగడలను మార్చే నేతలు ఉండచ్చు. అధికారం దక్కితే చాలు, ఏ పార్టీలోకి అయినా మారిపోతాం. ఏ రంగు కండువానైనా ధరిస్తాం అనే కుటిల రాజకీయ నాయకులు ఉండవచ్చు. గెలుపు కోసం ప్రజలను హామీల పేరుతో ప్రలోభ పెట్టే వాళ్ళు ఉంటారు. నోట్ల ఆశ చూపి ఓట్లు దండుకునే మహానుభావులు కూడా ఉంటారు. ఇక ఇప్పుడే మద్యం ఏరులై పారే తరుణం. పార్టీల అభిమానం ఘర్షణలకు దారితీసి, ఒక్కోసారి అమాయకుల ప్రాణాలు కూడా హరించే ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

ఈ ఎన్నికల యజ్ఞంలో కవులు, కళాకారులు, రచయితలు, సాహితీకారులు, సాహితీ ప్రేమికులు కూడా వారి కర్తవ్యదీక్ష సమున్నతంగా చేయాలి. ప్రజలకు వారిపై ఉన్న ఆచంచల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, గౌరవాన్ని చేజారినీయకుండా అప్రమత్తతతో మెలగాలి. ప్రజల సమస్యల వైపు వారు ఏకపక్షంగా నిలవాలి. ఎటువంటి ప్రలోభాలకు, ఎంత గొప్ప పురస్కారాలకునూ, నగదు బహుమతులకు లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి కంకణ బద్ధులై కదలాలి. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం తప్ప ఆత్మవంచనకు తమ జీవిత నిఘంటువులో స్థానం ఇవ్వని ఏకైక సమూహం కవులు రచయితలు మాత్రమేనని మరోసారి నిర్ద్వందంగా నిరాపేక్షణీయంగా నిరూపించాలి. క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం లో గ్రీకు, రోమన్ నగర రాజ్యాలలో నుండి, 17వ శతాబ్దము ఫ్రెంచి విప్లవ కాలము నుంచి ఈ మధ్యకాలంలో ఉత్తుంగ తరంగంగా పైకెగిసిన తెలంగాణ ఉద్యమం వరకు కూడా కవులు కళాకారుల పాత్ర ప్రజాస్వామ్య బద్దంగా నడిచిన మహోద్యమాలలో ప్రజాహక్కుల పరిరక్షణలో ఎంతో ప్రసిద్ధమైనవని ఈ సందర్భంగా మనం గుర్తుచేసుకోవాలి. ఆ అకుంఠిత స్ఫూర్తి మరింత మూర్తిమత్వం సాధించి సామాన్య ప్రజల నిరంతర, నిర్విరామ ప్రజాస్వామ్య పోరాటంలో పాలుపంచుకొని, వారి పోరాటాలకు తమ కవితలు రచనల ద్వారా అపార బలాన్ని అందించి సంధించిన బాణాలుగా ప్రజాక్షేత్రంలో దూసుకు పోవాలి. కళంకిత, కుల మత బంధుప్రీతి చూపిస్తూ దోపిడి చేసే నాయకులను గురి చూడాలి. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ బోధించిన, ప్రతిపాదించిన రాజ్యాంగ విలువలను, ఔన్నత్యాన్ని కాపలాదారుల్లా కాపాడే నాయకులను మాత్రమే ఎన్నిక అయ్యేందుకు సహకరించాలి.

గెలుపొంది ఐదేళ్లపాటు పాలనా చేస్తే చాలు. తమ ఐదు తరాలవరకు దిగులు లేకుండా సంపాదించవచ్చు అనే వాళ్ళని కాకుండా ఐదేళ్ల పాటు ప్రజల అవసరాలు తీరుస్తూ, విద్య, వైద్యం, ఉపాధి, ఆర్ధిక, పలు రంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తే, శాశ్వతంగా ప్రజలకు మంచి చేసినవారు అవుతారు. ప్రజల హృదయాలను గెలిచిన మహారాజులవుతారు. అటువంటి పాలకులను ఎన్నుకునే విచక్షణ ప్రజలు కలిగి ఉంటే చాలు. డబ్బు, మద్యం, కానుకలు వంటి ప్రలోభాలకు లొంగిపోవాల్సిన అవసరంలేదు. అలా చేస్తే మన ఐదేళ్ల బంగారు భవిష్యత్ ని మనం వేసే ఒక్క ఓటు హరించివేస్తుంది. మన కన్నును మన చూపుడు వేలితోనే మనమే పొడుచుకున్నట్లవుతుంది. ఎవరు నచ్చకుంటే ‘నోటా ‘ ఎలాగూ ఉంది. కానీ చూస్తూ చూస్తూ అవినీతిపరులను అందలం ఎక్కిస్తే మాత్రం ప్రజల జీవనం పాతాళంలోకి పడిపోవడం ఖాయం. ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్న ఎన్నికలు ఇవి. నిజాయితీపరులైన, నచ్చిన నాయకులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంది. అందుకనే “భరత్ అనే నేను- హామీ ఇస్తున్నాను – భాధ్యుడనై ఉంటాను – ఆఫ్ ది పీపుల్ ఫర్ ది పీపుల్ బై ది పీపుల్ ప్రతినిధిగా” అనే పాటలో లాగా నీజాయితీ గల నాయకులను ఎన్నుకునే అనితర భాద్యత ఇక ప్రజలదే.

రోహిణి వంజారి

సంపాదికీయం

9000594630