మోడువారిన హృదయాలను చిరునవ్వుతో చిగురింపచేసే కవిత్వం

చిరునవ్వై చిగురించు…. Shaik Naseema Begam కవిత్వ సంపుటి గురించి సమీక్ష. సాహితీ ప్రస్థానం లో ప్రచురితం అయ్యింది. చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి

మూర్తీభవించిన మానవత్వం, ప్రత్యేకమైన పిల్లలే నా ప్రాణం. వారి సంక్షేమమే నా ఆనందం, వారి ఆలనా పాలనే నా జీవితానికి ఆలంబన, నా సర్వస్వము అంటూ ప్రత్యేక అవసరాల పిల్లలను తన సొంత బిడ్డలుగా చూసుకునే మాతృమూర్త్తి షేక్. నసీమా బేగం గారు. తానూ ఓ ప్రత్యేక అవసరాలు గల బిడ్డకు జన్మనిచ్చారు. అందువల్లే అలాంటి బిడ్డల అవసరాలు, ఆవేదన, ఎదుగుదల అన్ని తనకు తెలుసు కాబట్టి, అలాంటి ఎందరో బిడ్డలకు ఆమె అమ్మ అయినారు. తన చిన్ననాటినుంచి ఎన్నో కష్టనష్టాలు ఎదురైనా చలించక మొక్కవోని దీక్షతో, ధీశాలి అయి గృహిణిగా, తల్లిగా తన బ్యాధ్యతలను నిర్వహించారు. అంతటితో ఆగిపోతే ఈరోజు మనకు ఈ సభ జరపాల్సిన అవసరంలేదు. చిన్నప్పుడు ఎప్పుడో ఆగిపోయిన చదువును మళ్ళీ మొదలు పెట్టి, అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించి, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయినిగా తమ సేవలు అందించడం మొదలుపెట్టారు. అక్కడితో కూడా వారు ఊరుకోలేదు. ఒకపక్క తన కర్తవ్యాలను అనితరసాధ్యంగా నిర్వహిస్తూనే, సమాజం వైపు కూడా తన దృష్టిని సారించారు. సమాజంలో జరుగుతున్న అనేకానేక సంఘటనలకు సంతోషించారు, దుఃఖించారు, ఆవేదన చెందారు, సంవేదనలను అక్షరాలుగా మార్చి, తనవైన భావాలను సాహితీ పల్లకి ఎక్కించి కవితా స్వరాల మాలికలను అల్లి సాహితీ వినువీధిలో ఊరేగిస్తున్నారు. .మానవత్వపు పల్లకి బోయిగా మారి మంచి గంధంలాంటి కవితా సుమాలను మనిషి మనిషికీ పంచిపెడుతున్నారు షేక్. నసీమా బేగం గారు.
ఇక వారు అల్లిన కవితా సుమ మాలికల దొంతరలు “చిరునవ్వై చిగురించు” పేరులోనే కొండంత ఆశాభావం. కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, రోదనలు ఏవైనా సరే జీవితాన్ని పాతాళంలోకి నెట్టివేసినా, బతుకును అస్తవ్యస్తం చేసినా, అంతటా సూన్యం, అంతా చీకటి, జీవితం ఎండిపోయిన మోడులా మారినా సరే, చిరు ఆశను కల కనండి. జీవితం అంటేనే చీకటి వెలుగులు, మంచి చెడుల సమ్మేళనం. రెండింటిని సమంగా స్వీకరించడంలోనే జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది అంటూ చిరునవ్వై చిగురిస్తూ, చిరు ప్రయత్నం అయినా సాగిస్తూ ఉంటే మళ్ళీ జీవితం మొగ్గతొడిగిన వసంతం అవుతుంది. ఆమని కోకిలల అమృత గానం అవుతుంది అంటున్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు విజయం కోసం నువ్వు ప్రయత్నించు. నీ పయనం కొనసాగించు, ముందుకు దూకు, దూకలేకపోతే పరిగెత్తు, పరిగెత్తలేక పొతే నడువు, నడవలేక పొతే కనీసం కూర్చుని దేకుతూ అయినా ముందుకు పో. నీ గమ్యాన్ని చేరుకో. విజయతీరాలని అధిరోహించు. ప్రయత్నం మాత్రం ఆపవద్దు అంటారు. ఇక్కడ నసీమా మేడం కూడా మనిషి ఎప్పుడూ జీవితేచ్ఛను కోల్పోకూడదు అంటారు తన చిరునవ్వులతో.
‘చిరునవ్వై చిగురించు’ కవితా సంపుటిలో మొత్తం 116 కవితలు ఉన్నాయ్. కరోనా మహమ్మారి కాలంలో రాసినవి మరో 5 కవితలు ఉన్నాయ్. వీరు తమ కవితల్లో స్పృశించని అంశమే లేదు.సమాజాన్ని తన నిశితమైన దృష్టితో పరికిస్తూ, పాలు, నీళ్లనువేరుచేసే హంసలా సమాజంలోని మంచిచెడులను చూపించే దర్పణం లాంటి కవితలు రాసారు. మచ్చుకి కొన్ని కవితా మాలికల గురించి ప్రస్తావిస్తాను.
“ఇంటి ముందు ముస్తాబై కూర్చునే సిమెంట్ అరుగుమీద- మా కంటే ముందు నాన్న పెరుగన్నం కోసం కాచుకు కూర్చునే పిల్లిమీద- ఎండాకాలం వెన్నెల వెలుతురులో డాబామీద -కూర్చుని తిన్న అమ్మ గోరుముద్దలు మీద – నాతో పాటె పెరిగిన జాజిపందిరి మీద – నన్ను గెలిపించిన మమతల మీదా ఎందుకో అంత ప్రేమ – పుట్టింటి మట్టిపై నాకెందుకో అంత ప్రేమ” అంటూ పుట్టింటి మీద, జన్మనిచ్చిన నేల మీదా మాతృ ప్రేమను కురిపించారు పుట్టింటి నేల అనే తన మొదటికవితలో. కన్న తల్లి, పుట్టినఊరు, పురిటి గడ్డ మీద అభిమానాన్ని తన ఇంటిని, ఇంటిలోని చెట్లు, పూలు, మనుషులు, వారి మధ్య అల్లుకున్న మమతల బంధాలను అందంగా మనకి విసిదపరచారు.
కనీస అవసరాలు కనుమరుగై- అడవి బిడ్డలు అలమటిస్తున్నారు- రోగాల రొంపిలో కూరుకుపోయి బతుకు అవస్థను చవి చూస్తున్నారు- ప్రకృతి ఒడిలో అడవితల్లి ఆశ్రయంలో చల్లగా సాగాల్సిన వీరిబతుకుల్లో అడ్డంకులు తొలగాలి- భారతీయ సంస్కృతికి మూలాలుగా-నిలిచిన తండాల్లోని తట్లాటలు తెలుసుకుని పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అంటూ అడవిబిడ్డలపై అపారమైన అభిమానం చూపించడమే కాక వారి సంక్షేమానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అంటూ పాలకులకు చేసే హేచ్చరిక కూడా కనబడుతుంది “అడవి బిడ్డలు” అనే ఈ కవితలో.
వడదెబ్బకు వాడిన కాడల్లా మారిన -నాగలి పట్టే చేతులు దృఢంగా ఉండాలి – అందరి ఆకలి తీర్చే రైతన్న ఇంట్లో ఉపవాసం ఉండని రోజు రావాలి- పంట చేను కిలకిలా నవ్వాలి – రైతు రాజులా బతకాలి అంటూ రైతుల కష్టాన్ని, ప్రకృతి విపత్తులను, దళారీల మోసాలను ఎండ గడుతూ చేలు పచ్చగా కళకళ లాడినప్పుడే, రైతు కళ్ళల్లో వెలుగులు చూస్తాము. రైతుల బతుకులు బాగుపడినపుడే దేశ ప్రగతి పురోగమనం చెందుతుంది అంటూ జై జవాన్, జై కిసాన్ అన్న మన మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నినాదానికి అందరం న్యాయం చేకుర్చాలి అని ఆశగా వేడుకుంటున్నారు “విడతల్లో విపత్తులు” అనే కవితలో.
జీవితం అశాశ్వతం అని తెలుసుకుని- బాధలను పంచుకుని, ప్రేమను పెంచుకుని- శాశ్విత సరంజామాను సర్దుకునే వైఖరిలో ఉంది సౌందర్యం – సౌందర్యం శరీరానికి సంబంధించింది కాదు- ఆత్మ సౌందర్యమే జీవన సౌందర్యం. అంటూ అసలైన సౌందర్యం ఎదుటి వారికి సాయపడడంలో, బాధలను పంచుకోవడంలో, ప్రేమను పెంచుకోవడంలోనే అసలైన సౌందర్యం దాగి ఉంది అనే నవ జీవన ఆనంద రహస్యాన్ని తమ “ఆత్మ సౌందర్యం” అనే కవితలో వెల్లడించారు.
దిక్కులు చూసిన జీవితం – చుక్కలు చూపిన రాక్షసం – ముక్కలుగా జారిన హృదయం – తక్కెడలో తూగని సమానత్వం- వేషభాషల్లోనే మిగిలిన ఆధునికత్వం- దేశమాతకు ఇంకా దొరకని స్వాతంత్రం – నేటికీ గింజుకుంటున్న అస్తిత్వం- ఇదే కదా ఆమె అసలు బతుకు చిత్రం అంటూ ఎంతో ఆవేదనతో రాసిన కవిత “గింజుకుంటున్న అస్తిత్వం”. మనకు తెలుసు అర్ధనారీశ్వరం, ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం సగం అంటూనే, అస్తిత్వంలో మాత్రం కాస్త తక్కువ సమానత్వం అంటూ ఇంకా మహిళల పట్ల సమాజంలో చూపుతున్న వివక్ష, స్త్రీల పట్ల జరుగుతున్న లైంగిక నేరాలు, ఆర్ధిక అసమానత్వం, పితృస్వామ్య అనాచారాలు వీటన్నింటిని ఈ ఒక్క కవితలో ఎండగట్టారు నసీమా గారు.
ఆమెకు జరిగిన దారుణం చూసి – నేల తల్లి హృదయం తునాతునకలైంది- ఆకాశం కన్నీటి ధారలతో తన వేదన వెళ్లగక్కింది – ప్రతీకారాలు తీర్చుకునేందుకు ఆమెను అస్త్రం చేసి దుర్మార్గం కూడా ఉలిక్కిపడేలా చేసినందుకు నేడు మనిషి తత్వం వివస్త్రగా మారింది. మణిపూర్ దుర్ఘటనలో మహిళల పట్ల యెంత అమానుష దుశ్చర్లలు జరిగాయో తలచుకుంటే దేశ ప్రజలు యావత్తు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అది. ఎక్కడ స్త్రీలు దేవతలుగా పూజించబడతారో, అక్కడ దేవతలు సంచరిస్తారు అంటారు. ఇప్పుడు దేశంలో స్త్రీలకు జరిగిన అన్యాయం తలచుకుంటే దేవతలు కాదు కదా ఇది దెయ్యాలు, పిశాచాలు సంచరించే నేల అయింది. “వివస్త్రగా మారిన మనిషితనం” కవితలో తన ఆవేదననంతా వెళ్లగక్కారు కవయిత్రి.
స్త్రీల అస్తిత్వం కోసం, యుద్ధ శకలాలు మిగిల్చే వేదన కోసం, రైతన్నల సంక్షేమం కోసం, కులమతాల మధ్య సామరస్యం కోసం, పసిపాపల చిరునవ్వు కోసం, ప్రత్యేక బిడ్డలా ఆలన కోసం, సైనికుల త్యాగాలకు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని స్పృశిస్తూ ఆలోచింపచేసే, కర్తవ్యాన్ని భోదింపచేసే ఎన్నో కవితలు ఈ చిరునవ్వై చిగురించు సంపుటిలో పొందుపరచారు నసీమా గారు. చివరగా సంపుటి కి శీర్షిక, కవితాలన్నిటికీ శిఖర సమానమైన కవిత “చిరునవ్వై చిగురించు”.
మూసిన రెప్పలు లేచేదెప్పుడో-తెలియని జీవితం- మనసు లోతుల్లోనించి నిత్యం – మమకారపు జల్లులు కురిపించు. లాభనష్టాల బేరీజు వేసుకోక బంధాల్లో ఎప్పుడూ ఆత్మీయుల గుండెల్లో అనురాగ నావను నడిపించు.- గతమై మిగిలే జ్ఞాపకానివి- భ్రమల్లో నిత్యం పరిభ్రమించక వాస్తవాల వీధుల్లో నువ్వు నిరంతర నడకను కొనసాగించు – చెరిగిపోని చరితగా మనస్సులో మిగిలిపోయేలా ప్రతిమోముపై నువ్వు చిరునవ్వై చిగురించు. ఆహా అశాశ్వతమైన ఈ జీవన పయనంలో మన ప్రయాణం ఎక్కడో ఓ చోట ఆగిపోవచ్చు. కానీ ఎరుకతో ఉండి నిరంతరం నిస్వార్ధంగా ప్రేమను పంచుతూ పొతే మన పేరు తలచుకున్నప్రతి మోముమీదా చిరునవ్వు కదలాడుతుంది. ఆ చిరునవ్వే నీ చిరునామాని మనుషుల మనస్సులో శాశ్వతం చేస్తుంది ఈ అద్భుతమైన కవితను మనకు కానుకగా ఇచ్చారు కవయిత్రి నసీమా బేగం
కవిత్వమంటే తీరని దాహం. ఎడారి లాంటి జీవితంలో ఒయాసిస్. వేడి సెగలలాంటి సుఖదుఃఖాల్లో కవిత్వం ఒక చల్లని పిల్ల తెమ్మెర. నడి సముద్రంలో దారితెలియక ఎటుపోవాలో తెలియని నావకు దిక్షుచి. ఓదార్పు నిచ్చే నేస్తం. అటువంటి ఎన్నో కవితా మాలికలను మనకి కానుకగా అందించిన నసీమా బేగం గారి కలం నుంచి మరిన్ని గొప్ప కవితా సుమాలు రాలాలి అని కోరుకుంటున్నాను. వారు గొప్ప పేరు తెచ్చుకోవాలని, గొప్ప సత్కారాలు పొందాలని, మరీ ముఖ్యంగా వారు తమ సేవాతత్పరతను నిరంతరం కొనసాగిస్తూ చిరునవ్వు వీడని మొముతో, మనందరికీ నవ్వులు, ప్రేమను పంచాలని మనఃతృప్తిగా కోరుకుంటున్నాను.
కవిత్వం రాయడం వరకే కవి వంతు. ఆ కవిత్వాన్ని సాహితీ శిఖరాగ్రం మీద నిలబెట్టే భాద్యత మాత్రం సహృదయ పాఠకులదే. తప్పకుండా మీరు అందరు చిరునవ్వై చిగురించు కవితా సంపుటిని కొనండి. కవితలను చదవండి. కనీసం మీరు చదివిన ఒక్క కవిత, మీకు నచ్చిన ఒక్క కవిత గురించి అయినా మేడం గారికి ఫోన్ చేసి ఎందుకు నచ్చింది చెప్పండి. రచయితకు అంతకు మించిన ఆనందం, సత్కారం ఇంకొకటి ఉండదు. కవితలు చదవండి. సమీక్షలు రాయండి. కవిత్వాన్ని, కవులను, మన తెలుగు భాషను ప్రోత్సాహించింది. తెలుగు సాహిత్యం ఏ ఇతర బాషా సాహిత్యాలకంటే తీసిపోదు అని అందరం నిరూపిద్దాం.
చిరునవ్వై చిగురించు కవిత్వ సంపుటి కొరకు సంప్రదించాల్సిన రచయిత్రి ఫోన్ నెంబర్ :+91 9490440865
ముఖ్యమైన పుస్తక కేంద్రాలు అన్నింటిలో కూడా ఈ కవితా సంపుటి లభిస్తుంది.

సమీక్షకురాలు
రోహిణి వంజారి, 9000594630