యువ కథా రచయిత చరణ్ పరిమి Charan Parimi గారి “కేరాఫ్ బావర్చీ కథలు” సంపుటి కోసం రాసిన నా సమీక్ష.ఈ నెల “సాహిత్య ప్రస్థానం” లో. శ్రీ సత్యాజీ గారికి ధన్యవాదాలతో. చరణ్ పరిమి గారికి హృదయపూర్వక అభినందనలు. సమీక్ష చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపకోరుతూ 🌹🙏
మీరెప్పుడైనా ఇంట్లోకూర్చుని ఇరానీ హోటల్లో ఉండే మసాలా టీ రుచిని ఆస్వాదించారా..? సినిమా యాక్టర్, డైరెక్టర్ అయిపోదామని కలలుకంటూ మీ పక్కింటి కుర్రాడో, ఎదురింటి పోరి ఎవరో ఒకరు హైదరాబాద్ రైలు ఎక్కడం చూసారా..? వాళ్ళకి ఏమైనా జాగ్రత్తలు చెప్పారా..?
హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో రంగురంగుల గాజులు చేసే గలగలలు విన్నారా..? గణపతి కాంప్లెక్స్ దగ్గర, కృష్ణానగర్ ఇరుకు గల్లీల్లో పోగేసుకున్న ఆశయాలు, పోగొట్టుకున్న కళలను, కలలను చూసారా..?
ఆగండాగండి..! ఏమిటీ ప్రశ్నల వర్షం అని అసహనం ఫీలౌతున్నారు కదా.. వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే మనం హైదరాబాద్ నగరంలో పురాతన, పేరుమోసిన “బావర్చి” హోటల్ కి పోవలసిందే. ఇప్పటికిప్పుడు ఎలా పోగలం అనుకుంటున్నారా.. అద్భుతదీపాన్ని పట్టుకుని జిన్నీ భూతాన్ని అడగపల్లేదు. మాయ తివాచి ఎక్కి మంత్రనగరికి పోబల్లేదు. అంతకంటే చిత్రమైనా, విచిత్రమైన “కేరాఫ్ బావర్చి ” కథలు చదివితే చాలు.
పట్టుమని ముప్పై మూడు నాలుగు కూడా ఉండవేమో ఈ యువ కథకుడు “చరణ్ పరిమి ” కి. పత్రికల్లో చిత్రకారునిగా చిరపరిచయస్తుడు అందరికి. తను గీచే ప్రతి చిత్రం తనకి ఓ కథ చెపుతుందేమో..! అందుకే వారు కథలు రాయకుండా ఉండలేకపోయారు.మరి వీరి కథలు మనకి వినపడతాయి. కనపడతాయి. కథలోని ప్రతి సంభాషణ, ప్రతి సన్నివేశం మన కళ్ళ ముందు ఓ విజువల్ ఎఫెక్ట్ ని ఇస్తుంది.
కృష్ణానగర్, అన్నపూర్ణ,పద్మాలయా, సారథి లాంటి స్టూడియోల చుట్టూ తిరిగే ఆత్మల జీవితానుభవాలను కాచివడబోసినట్లు కనబడతాయి కొన్ని కథలు. సినీ స్క్రీన్ ప్లే కి దగ్గరగా ఉన్నట్లు కాసేపు భ్రమింపచేస్తుంది వీరి శైలి. అలాగని ఇవి అన్ని సినిమా కథలు కావు. చిన్న చిన్న సంభాషణలతో, లోతైన భావాలతో, ముఖ్యంగా అద్భుతమైన టైమింగ్‌తో రాశారు. మొత్తం పన్నెండు కథలు ఉన్నాయి ఈ సంపుటిలో.. దేనికదే ప్రత్యేకం. చరణ్ చిత్రకారుడు కావడంతో ప్రతి కథకి అతను అద్దిన రంగులు మనకి సప్తవర్ణాల్లో కనిపిస్తాయి. ఇది మొదటి కథల సంపుటి అయినా రచనా శైలి లో ఏ సీనియర్ రైటర్‌కి తీసిపోని గొప్ప పరిపక్వత ఈ కథల్లో కనిపిస్తుంది.
తను రాసిన కథకి స్పందన కోసం ఎదురు చూస్తున్న విశ్వక్ అనే యువ రచయితకి ఓ పాఠకురాలి నుంచి ఫోన్ రావడం, తర్వాత వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల్లో భర్తను కోల్పోయి, చీకటి అలముకున్న ఆమె జీవితంలో తిరిగి రంగులు ఎలా నింపాడో ఆ రచయిత “కాలింగ్… సప్తవర్ణం” కథ మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. ప్రేమ గొప్పదే. కానీ దానికంటే జీవితం గొప్పది. దూరమైన ప్రేమ తాలుకు జ్ఞాపకాలను మనసుపొరల్లో దమనంలో ఉంచి, తనని తాను ప్రేమించుకుంటూ, జీవితాన్ని ఎలా వర్ణమయం చేసుకోవచ్చో, విశ్వక్ పాత్ర మాట్లాడే నాలుగు మాటలు ఓ ఒంటరిమనసును ఎలా సేదదీర్చాయో..బతుకు అంటే బహుమానం అని తెలుసుకుని, ఈ కథలో మనం కూడా జీవితంలోని సప్తవర్ణాలను వీక్షించవచ్చు.
“డబ్బు సృష్టించేదే ఆర్ట్. సృష్టించేందుకే ఆర్ట్ “, “పరిస్థితులు జ్ఞానానికి పరిమితులు విధిస్తాయి” కంపెనీ లో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడంకోసం నిద్రలేని రాత్రులు గడిపి, తను గీసిన పోస్టర్ ని కాదని, మరోబ్రాండెడ్ కంపెనీ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ తో పనిచేయించుకోవడంతో, నిరాశకు గురైన ఓ ఆర్టిస్ట్ కథ “అన్ ఆర్టిస్ట్ బయోగ్రఫీ”. జ్ఞానం ఎంత గొప్పదైనా కమర్షియల్ వాల్యూస్ కే నేటి పోటీ ప్రపంచంలో విలువ, కాపీ బ్రాండ్స్ కే నేడు డిమాండ్, ఆర్టిస్టుగా తన జ్ఞానం, సృజన తనకు బతుకుతెరువుని చూపించలేకపోయాయి అని కృంగిపోయిన చెర్రీ అనే ఆర్టిస్ట్ స్వగతం ఈ కథ.
కృష్ణానగర్‌లో ఆర్టిస్టుల కామన్ అడ్డా ఆ ఇరానీ కేఫ్. అక్కడ ఆశయాలు, ఆశలు, గతం తాలూకు అనుభవాలు, భవిష్యత్ ప్రణాళికలు అన్నీ సినిమాల గురించే. డైరెక్టర్ కావాలని కలలు కనే యువకుడు , హీరోయిన్ కావాలని ఆశపడే అమ్మాయి, రచయితగా తన సత్తా నిరూపించుకోవాలని కోరికతో వచ్చిన స్క్రీన్ ప్లే రైటర్. ఒకరేమిటి,పొద్దునంతా సినిమా ఆఫీసుల చుట్టూ అవకాశాలకోసం తిరిగి, అలసి సొలసి సాయంత్రానికి ఆశనో, నిరాశానో, భరోసానో, చీదరింపునో నెత్తికెత్తుకుని, బావర్చి కేఫ్ కి వచ్చి నాలుగు చుక్కల మసాలా టీ ని నాలుకమీద చల్లుకుని కాసింత విశ్రాంతి, ఓదార్పు కోరుకుంటూ హోటల్ బల్లల మీద కూర్చుంటారు. అయితే అక్కడే ఓ మూల ఉన్న బల్ల మీద ఓ నజీర్ లాంటి తోడేళ్ళు, నక్కలు వలవేసి కాచుకొని ఉంటాయి. వెండి తెర మీద వెలుగులు చిమ్మాలని ఆశతో వచ్చిన తారకలు వెండితెర మీద కనిపించక, అర్ధరాత్రి కృష్ణానగర్‌లో షాపుల మెట్ల మీద తళుక్కు మంటారు.వాళ్లకు రోడ్డే పానుపు అవుతుంది. వారి వెనుక నజీర్ లాంటి తోడేళ్ళు ఉంటాయి. అలా మిగిలిపోయే అనేకానేక బతుకులలోని విషాదం గురించి దృశ్యమానం చేసాడు రచయిత “కేరాఫ్ బావర్చి” కథలో.
“డిజైన్డ్ ఫేట్ ” తన తండ్రిని హీరోగా భావించి, తన తండ్రి చేసే పని మీద విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్న ఓ బుడ్డోడు. కొడుకు తను గీసే బొమ్మల పట్ల ఆసక్తి పెంచుకుంటుంటే, తనకి అచ్చిరాని, అన్నం పెట్టని కళని కొడుకు అనుసరించడం ఇష్టం లేక, వాడి మేడలో టాయ్ స్టెతస్కోప్ వేసి, తన పెయింటింగ్ షాప్ ని తీసేసి , ఆ బుడ్డోడి కళలను, కలను మొగ్గలోనే తుంచేస్తాడు ఆ తండ్రి “A Day Dream ” కథలో. కొన్నేళ్ళ తర్వాత ఆ ఇంట్లో కార్పొరేట్ జీతగాడు పుట్టాడు. కాబోయే రవివర్మ అంతరించాడు అంటూ కథని ముగిస్తూ చిత్రకారుల జీవితాల్లోని చీకటి రంగులని మన మనసులమీద కుమ్మరించేస్తాడు రచయిత.
రీతూ..ఓ కళాకారిణి. ఫోటోగ్రఫీలో అత్యున్నతశిఖరాలు అందుకోవాలని ఆమె ఆశయం, ఆరాటం, కల, జీవిత లక్ష్యం. ఆమె ఆశయపు పాలపొంగు మీద అడుగడుగునా నీళ్ళు చిలకరించే భర్త. దాంతో తన ప్రతిభ మీద తనకే అపనమ్మకం. ముందుకు సాగలేని బేలతనం. పుట్టుకతో అంథుడైనా, తన మనోనేత్రాలతో రంగుల ప్రపంచాన్ని చూడగలిగే వారి మిత్రుడు అవినాష్ ఇచ్చిన ప్రోత్సాహం ఆమెలోని బేలతనాన్ని పోగొడుతుంది. “లోగో థెరపీ” మనకి చేతకావడంలేదు అన్న పనినే కొంతకాలానికి పూర్తి చేసేలా ప్రేరేపిస్తుంది” అంతవరకూ మోసిన భయాన్ని దూరంగా విసిరేసి లక్ష్యంవైపు ఆమె అడుగులు వేస్తుంది. విజయం సాధిస్తుంది. ఆమె తీసిన అవినాష్ దంపతుల ఫోటో ఆమె కీర్తికి ప్రతీకలా చాలా చోట్ల కనబడుతుంది. భయం,బేలతనం మీద ఉన్న అపోహలు, రకరకాల షేడ్స్ ని ” ఛాయా చిత్రం ” కథలో మనం తెలుసుకోవచ్చు. మన:తత్వ శాస్త్రంలో ప్రావీణ్యత పొందిన ఓ ధన్వంతరిలా కథని నడిపించాడు ఇక్కడ.
దెయ్యం లాంటి ఒంటరితనం నుంచి బైట పడడానికి సుశీలమ్మ తనలో శక్తులు ఉన్నాయి,మీ సమస్యలకు పరిష్కారం నా దగ్గర ఉంది అంటూ ఊర్లో అందరిని నమ్మించి, తన చుట్టూ తిరిగేలా చేసుకోవడం. ఆ లోగుట్టు తెలుసుకున్న శాంత ఆమెని అనుసరించడం, అది చూసి సుశీలమ్మ “తను నన్ను అడిగిన ప్రశ్నకి తనే సమాధానంగా మారానని తెలుసుకోవడం, తను చేసే పనిని శాంత అనుసరించడం..ఒంటరి మహిళల దీన గాధని “వెదుకులాట” కథని చదువుతున్న మనకి కూడా అచ్చెరువు అయ్యే మంత్రం వేసాడు తన శైలితో రచయిత.
ప్రేమించబడడం తన హక్కు అనుకున్న ఓ యువకుడు, తనను ప్రేమించే అమ్మాయి పట్ల నిర్లక్ష్యం వహించడం, అతని ప్రేమ కోసం ఎదురు చూసి చూసి చివరకు ఇంట్లో వాళ్ళు, చర్చ్ లో ఫాదర్ చేసిన బలవంతపు బోధనలు, అతని ప్రేమ రాహిత్యం ఆమెని నన్ గా మారిస్తే, చివరాకరకు ప్రేమ విలువ తెలుసుకున్న అతను ఆమె కోసం రావడం ఒక జీవితకాలపు ఆలస్యం అయింది అతనికి. ఒకప్పటి బ్యూలా కాదు ఆమె ఇప్పుడు. ఏ భావం పలికించలేని కళ్ళు ఆమెవి ఇప్పుడు. ప్రేమ, జాలి, భక్తి అన్నింటికీ అతనిదగ్గర ఒకటే అర్ధం. అది మనసు పాడే విరహగీతం. అది అతను చేజేతులా చేసుకున్నది. “మనో గీతం – కొన్ని అధ్యాయాలు” కథలో ప్రేమ, విరహం, భక్తి, సేవ, త్యాగం, నిర్లక్ష్యం, పశ్చాతాపం..మరి కొన్ని సంవేదనలు కలగలిసిన పెద్ద కథ ఇది.
దిశా సంఘటన నేపథ్యంలో రాసిన కథ “మాయాపులి”. దిశ ఘటనపై దేశంలో అందరు స్పందించారు. ఆ తర్వాత అటువంటి సంఘటనలే చాల జరిగాయి.అప్పుడు అంతగా స్పందన రాలేదు. బాధితులకు న్యాయం జరగడంలోని లోటుపాట్లను విమర్శనాత్మక దృష్టితో, సెలెక్టివ్ జస్టిస్ ఇచ్చే చట్టం పులిగా మారడం..ఊహాత్మకంగా సరికొత్త పంథాలో సాగిన కథ “మాయాపులి”.
ఇంకా ఇందులో “బహు ముఖాలు”లో బిడ్డ ప్రేమకు, భవిష్యత్ కోసం తన ప్రేమను త్యాగం చేసుకునే ఓ తల్లి, “వింగ్స్ అండ్ షాడోస్” లో తనలో ఉన్న గొప్ప డాన్సర్ ని తన నిర్లక్ష్యం, చెడు అలవాట్లు, సరైన లక్ష్యం లేకుండా జీవితాన్ని తెగిన గాలిపటంలా చేసుకున్న జాక్సన్, తనను ప్రేమించిన అమ్మాయిని కూడా పోగొట్టుకుని, తన పతనానికి తనే కారణం” అని తెలుసుకోవడంతో కథ ముగుస్తుంది.
మొత్తానికి ఈ కథల్లో పాత్రలు అంటే రచయితకు చాల ప్రేమ. అందుకే చాలావరకు ప్రతి కథలో పాత్రల జీవితాల్లోని ఆటుపోట్లను చూపిస్తూ చివరకు ఆశాభావ ముగింపు ఇచ్చాడు. కొన్ని కథల్లో మాత్రం పాత్రల పట్ల కాస్త కఠినంగా ఉండడం తప్పలేదు. కథలు చదువుతుంటే, పాత్రలు మన కాళ్ళ ముందే తిరుగాడుతున్నట్లు ఉంటుంది. ఇక వాఖ్య నిర్మాణంలో, సంభాషణల్లో అతి వేగం కనిపించడం లోపం కాదు కానీ, సన్నివేశాలవెంట పాఠకులు పరిగెత్తుకుంటూ వేగాన్ని అందుకోవాల్సివస్తుంది.
హైదరాబాద్ నగర జీవితాలకు నిలువెత్తు దర్పణం ఈ “కేరాఫ్ బావర్చి” కథల సంపుటి. సర్రియలిజం, ఇంప్రెషనిజం, రియలిజం తెలిసిన బహుచాతుర్య చిత్రకారుడు ఈ కథకుడు. ఆ సృజన అంతగా మనకు ఈ కథల్లో కనిపిస్తుంది. చరణ్ పరిమి రంగుల కలం నుంచి మరిన్ని చిత్ర కథలు రావాలని మన:స్ఫూర్తిగా కోరుకుంటూ…
పుస్తక ప్రతులకు: అన్వీక్షికి పబ్లిషర్స్
Azra house, 5/C/D,
MLA Colony, Banjarahills, Hyderabad.
Ph. 9705972222, 9849888773