మానవత్వ పరిమళాలు ప్రసరించే నల్ల సూరీడు —- సామాజిక ఆరోగ్య ప్రయోజనాలలో అల్ల నేరేడు

ప్రముఖ రచయిత్రి, కవయిత్రి శ్రీమతి రోహిణి వంజారి గారి కథా సంపుటి “నల్ల సూరీడు” పుస్తకంపై ఒక చిరు సమీక్ష

************************************************

తెలుగు సాహిత్యం అనే రైల్వే స్టేషన్ లోకి కథా రచన అనే ప్లాట్ఫారం మీదకి 2014లో ఒక బుల్లెట్ ట్రైను దూసుకు వచ్చింది. మామూలు రైళ్లు తిరిగే ఆ ఫ్లాట్ ఫామ్ ని ఒక్క కుదుపు కుదిపి బలమైన హక్కుదారుగా తన అస్తిత్వాన్ని నిరూపించుకుంది. ఆ ఫ్లాట్ ఫామ్ పై తిరిగే ప్రయాణికులు అందర్నీ ఆశ్చర్యార్థక ఆనందంతో తన వైపుకు తిప్పుకుంది. సాధారణమైన సంఘటనలను అనుభవాలను అనుభూతులను అసాధారణమైన మలుపులతో, మానవీయ కథన సామర్థ్యంతో, అభేద్యమైన మైలురాళ్లను దాటుకుంటూ మధురమైన పదాల సుమమాలల పట్టాలపై ఆ రైలు ఉన్నత శిఖరం పైకి పరుగులు తీస్తుంది. ఆ రైలుని మీరు ఈ సరికే గుర్తుబట్టి ఉంటారు. ఆ బుల్లెట్ లాంటి పదాల అశ్వ రాజాలపై కదనరంగంలో కథన రాజ్యాలను గెలుచుకునే మహారాణి పేరు రోహిణి వంజారి. ప్రత్యేకమైన ప్రమోదమైన శైలితో ప్రతిధ్వనించే కథా విషయ పరిజ్ఞానంతో ప్రసన్నమైన వస్తుపరమైన నవ్యతతో రోహిణి వంజారి తనదైన అరుదైన ముద్రను తెలుగు సాహిత్యం పై ప్రభలంగా వేసింది

పొట్లం కట్టిచ్చిన పీచు మిఠాయిని రెండు వేళ్ళతో పైకి తీసుకొని మురిపంగా నాలుక మధ్యలో పెట్టి ఆస్వాదించే ఆనందం రోహిణి గారి ఒక్కో కథను చదువుతుంటే అనుభంలోకి వస్తుంది. ఆహారం ఎంత ప్రశస్తమైనా ఘుమ ఘమల సమ్మేళితమైనా ఆహ్లాద పరిసర పరివేష్టితమైనా అరిటాకుపై దాని ఆస్వాదన మరింత మధురంగా ఉంటుందనేది చర్విత చరణం. అరిటాకు లాంటి సున్నితమైన భావ సంచయంతో ఇరువ్వైక్కటి కథా పదార్థాలతో కలగలిసిన ఈ సంపుటి మెదడుకు పదును పెడుతూ ఆవురావురుమనే మేధోపరమైన మానసిక ఆరాట ఆకలిని తీర్చే సంపూర్ణ విందు భోజనం. మరిక ఆలస్యం ఎందుకు ఆ రుచులన్నిటిని ఆస్వాదిద్దాం పదండి ఈ సంపుటిలోని 21 కథలు ఒక్కోటీ రసగులికలాంటివి. ఈ కథల సంపుటి చూస్తుంటే నాకు హల్దీరాం వాళ్ళ గులాబ్ జామ్ సీసా జ్ఞప్తికి వస్తుంది. బాటిల్లో ఒక 20 దాకా ఉండలు బంగారు రంగు పూసుకొని తీపి పాకంలో నానుతూ ఎదురుగా ఊరించినట్టు ఈ పుస్తకం చూసినప్పుడల్లా నాకు మనసు ఉవ్విళ్లూరుతుంది. ఎన్నిసార్లు చదివినా మరలా చదవాలనిపించే మహత్తర గుళికలు ఈ కథలు.

ఇన్ని రకాల ఆహార పదార్థాలతో పోల్చిన తర్వాత మిమ్మల్ని మరింత ఊరించటం సమంజసం కాదు కాబట్టి తక్షణం కథలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటి కథ “క్రూకెడ్” స్త్రీలను భోగ వస్తువులలా అశ్లీల చేష్టలతో కామ వికారంతో చూస్తూ జుగుప్సాకరమైన చేష్టలతో చెలరేగే మగ వాళ్లకు చంపపెట్టు లాంటి ఘాటు సందేశాన్ని ఇచ్చిన కథ. ఈ కథలో మెట్రో రైల్లో ప్రయాణం చేసిన మధ్య వయసు మహిళ కొందరు తోటి పురుష ప్రయాణికుల వికృతమైన ప్రవర్తనను, ప్రయాణంలో పొందిన చేదు అనుభవాలను స్త్రీల పట్ల వారి అసహ్య స్వభావాన్ని నిరసిస్తూ ఆవిడ పొందిన మనో క్లేశాన్ని ధర్మా గ్రహాన్ని రచయిత్రి ప్రతిచర్యను సున్నిత పలుకులతో కథనం అల్లడం కొండంత బాధ మనసులో పేరుకుపోయినా చెప్పిన తీరు వారి మెత్తటి మనసును తెలియజేస్తుంది.

ఈ కథల పుస్తకం పూర్తిగా చదవకముందు దీనికి సమీక్ష రాయడం ఒక వ్యక్తిగత బాధ్యతగా భావించాను ఎందుకంటే రోహిణి నాకు మంచి స్నేహితురాలు కాబట్టి. అయితే పుస్తకం పూర్తిగా ఒకటికి రెండుసార్లు చదివిన తర్వాత నేనెంత పొరపాటు ఆలోచన చేస్తున్నానో తెలియ వచ్చింది ఇది వ్యక్తిగత బాధ్యత అనేది కానే కాదు సమాజాన్ని తట్టిలేపే ఈ కథలపై సమీక్ష రాయటం సామాజిక నిబద్ధతగా భావించాల్సిన అవసరం ఉందని నా మనసాక్షి ఇందుకు పురికొల్పింది. రోహిణి గారు స్వతహాగా సున్నిత భావనలు కల స్త్రీమూర్తి. ఆవిడకు జీవకారణ్యం పట్ల అమిత ఆసక్తి . పెంపుడు జంతువులయిన పిల్లులు కుక్కలే కాకుండా విషపురుగులైన పాములన్నా ఇంకా ఏ జంతువునైనా సరే మరో మనిషిగా భావించి ప్రేమించి వాటిపై కరుణా వర్షం కురిపించే చల్లని మనసు గల వెన్నెల సోన. మానవ సంబంధాలపై ఎంతటి మమకారం ఉందో అదే మమకారాన్ని ఆవిడ ఇతర జీవులపై కూడా తన కథల ద్వారా చూపించి సమాజానికి వాటిపై సానుకూల దృక్పథం కలగటానికి దోహదం చేశారు.

ఈ అంశంతో రాసిన కథ “కుబుసం”లో పామును చంపబోతున్న సమూహాన్ని నిలువరించి, నివారించి దానిని పట్టేవారు వచ్చేవరకు కాపాడి విష జంతువైన పామును కూడా కారుణ్య దృక్పథంతో రక్షించిన తీరు ఎంతో ముదావహం. ఆ వెంటబడి తరిమి చంపబోయిన వారే మరుసటి రోజు పాముల చవితినాడు పుట్టలో పాముకు పాలు పోయడానికి వరుసలలో బుద్ధిగా నిల్చోవటాన్ని కవయిత్రి తన సునిసిత దృష్టితో ఆక్షేపించారు. మానవుల్లో దైద్వీభావ స్వభావాన్ని ఈ కథ ద్వారా ఎండగట్టారు.

ఈ కథల సంపుటిని సమీక్షించడం అంటే కత్తి మీద సవాలే 21 కథలూ దేనికి అదే ప్రత్యేక కథాంశంతో ఉండి ఒకదాని మీద మరొకటి పోటీపడుతూ కథనంలో కదా శైలిలో పద ప్రయోగ పరిధిలో పరిణితిలో పరుగులో ప్రత్యేకతను సంతరించుకున్నాయి సమీక్షకుడు ఏ కథను ఎంచుకోవాలి ఏ కథను వదిలేయాలి అనేది ఒక సంక్లిష్టమైన సమస్యగా మారింది. దేనిని వదిలేసినా ఆ కథకు ఆ కథాంశానికి కథనంలో జీవించిన పాత్రలకు తీరని అన్యాయం మిగులుతుంది అయితే 21 కథలు మీద సమీక్ష రాయడం జరిగితే పాఠక లోకానికి కూడా విలువైన సమయం కరిగిపోతుంది అనే బాధ కూడా ఉంది. అందువలన ఒక ఆరు ఏడు కథలు మాత్రం సమీక్షించి ముగిస్తాను.

మరో ముఖ్యమైన కథ మధు. ఈ కథలో కథానాయకుని పేరూ అదే. విద్యుత్ ఘాతం వలన రెండు కాళ్లు రెండు చేతులు కోల్పోయి జీవచ్ఛవంలా మంచానికి పరిమితి అయినా పట్టుదలతో చిత్రకళలో కీర్తి శిఖరానికి చేరుకున్న ఒక తొమ్మిది ఏళ్ల బాలుని స్ఫూర్తిదాయక విజయ గాధ ఈ కథ. ఇందులో మరో ముఖ్య పాత్ర హర్ష. వీరిద్దరూ ఈ కథలో హీరోలే. చిత్రలేఖనంలో శిఖరాగ్రానికి చేరుకుని కూడా ఒక అవిటి బాలుని జీవితాన్ని ఫలవంతం చేయడానికి తన సామాజిక స్థాయిని, సమయాన్ని, సంపదను త్యాగం చేసిన ధీరోదాత్తుని ప్రేరణాత్మక పాత్ర హర్షది. హర్ష ఇచ్చిన ప్రోత్సాహంతో, శిక్షణా ప్రావీణ్యంతో మధు అంగవైకల్యాన్ని అధిగమించి నోటితో చిత్రాలను వేసి ప్రపంచస్థాయి అత్యుత్తమ పురస్కారాన్ని స్వీకరించడంతో గురువు కళ్ళల్లో ఆనంద భాష్పాల పుష్పాలు పూయడంతో ఈ కథ ముగుస్తుంది. అత్యుత్తమ స్థాయిలో పాత్రల చిత్రణలో రచయిత్రి తనదైన ప్రత్యేకతను నిలుపుకుంది.

రోహిణి గారు మంచి రచయిత్రే కాకుండా కవయిత్రి కూడా కావడం మూలాన కథలలో కావ్యాత్మక రసాత్మక రమ్యమైన శైలిని అనుసరించారు. చక్కటి పద బంధాలతో సమయోచిత పద ప్రయోగాలతో కథనాన్ని రక్తి కట్టించారు. ఈ కథలో ఒకచోట రచయిత్రి ” కరతాల ధ్వనుల మధ్య ఆమె స్వరం హిందోళ రాగంలో వినపడగానే” అనే వాక్యం ఉపయోగించటాన్ని ఈ సందర్భంగా ఉదాహరించవచ్చు

నెల్లూరు ప్రాంతం నుంచి హైదరాబాదు నగరానికి ఉద్యోగరీత్యా కుటుంబంతో సహా వచ్చి స్థిరపడ్డారు. రోహిణి గారి కుటుంబం. కథల్లో నెల్లూరు మాండలికం సౌందర్య రసాత్మకమైన వన్నెలను ఎంతో అద్దింది అయితే ఆశ్చర్యకరంగా “చెల్లె ” అనే కథలో రోహిణి తెలంగాణ మాండలికం ఉపయోగించి అద్భుతమైన ప్రతిభను కనపరిచారు. అచ్చమైన తెలంగాణ రచయిత్రి రాసినట్లుగా ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి వాటికి ప్రాణ ప్రతిష్ట చేశారు రాత్రిపూట దూర ప్రయాణం చేసిన ఒక ఒంటరి స్త్రీ పడిన భయాన్ని, మానసిక ఆందోళనను ఒడిసి పట్టిన చాలా మంచి కథ ఇది. రచయితల ప్రతిభ ప్రాంతాలకు అతీతం అనే విషయం ఈ కథ రాయడం ద్వారా ఆవిడ రుజువు చేశారు

ఇక ఈ సంపుటిలో తలమానికమైన, ముఖ్యమైన కథ “ఆసరా”.. ఈ కథ రచయిత్రి గారికి అనేక అవార్డులు రివార్డులు సంపాదించి పెట్టిన గొప్ప మానవీయ విలువలను పెంపొందించే కథ. ఈ కథలో సమాజానికి దూరంగా భయంతో వైముఖ్యంతో వైరాగ్యంతో బ్రతికే తల్లి కొడుకుల దయనీయ గాధను మనకు వివరిస్తారు. వీరిద్దరూ ఉండే ఇంటి దగ్గరలో నివసించే కథానాయకురాలు అయిన మన రచయిత్రి వారితో మాట్లాడి వారిని మామూలు ప్రపంచంలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నం కథనిండా మనకి కనిపిస్తుంది. రెండు మూడుసార్లు వారి ఇంటికి వెళ్లి కలసి ఆహారాన్ని కూడా అందజేసి వారికి సన్నిహితంగా మెలగటానికి ప్రయత్నం మొదలుపెడుతుంది. ఈలోగా అకస్మాత్తుగా అత్యవసర పనిమీద ఆమె తన బంధువుల ఇంటికి వేరే ఊరు వెళ్లి వెళ్లి వచ్చేసరికి ఆ ఇరువురు ఒంటరి పక్షులు నిర్జీవులుగా పడి ఉండటం రచయిత్రిని దిగ్భ్రాంతికి గురిచేసి కన్నీళ్ళ పర్యంతం చేస్తుంది. కొంచెం ముందు వారి పరిచయమే జరిగి ఉంటే ఈ సంఘటనను నివారించి ఉండే దాన్ని కదా అనే బాధతో లుంగలు చుట్టుకుపోతుంది. ఇటువంటి కథలు చుట్టుపక్కల ఉండే వారిపై మనుషుల్లో ఉండే నిర్లక్ష్య స్వభావాన్ని నిస్తేజ గుణాన్ని నిరాశక్త నైజాన్ని ఎత్తిచూపుతుంది. అటువంటి కొందరినైనా మార్చటానికి ఈ కథ దోహదం చేస్తుందటంలో సందేహం లేదు

ఈ కథలన్నీ ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా రచయిత్రి నిజజీవితంలో జరిగిన అనేక సంఘటనల సమూహహారం. పూర్వాశ్రమంలో ఆమె ఒక సైన్స్ ఉపాధ్యాయురాలుగా ఒక కార్పొరేట్ స్కూల్లో పనిచేసారు. ఒక బాధ్యత ఎరిగిన వృత్తిపరమైన దీక్ష కలిగిన ఉపాధ్యాయురాలిగా పాఠశాలలో జరిగిన సంఘటనలను అనుభవాలను అక్కడ తటస్థపడిన అనేకం సంగ్రహించి నీతిని బోధించే కథలుగా అక్షరబద్ధం చేశారు విద్యార్థులు విద్యార్ధినులతో తను పంచుకున్న తల్లి ప్రేమను తన తోటి పనిచేసే ఉపాధ్యాయునులు ఉపాధ్యాయులతో సంబంధ బాంధవ్యాలను వారిలో కొందరిలో కనిపించిన విపరీత ధోరణులను వివరిస్తూ చక్కని కథాంశాలతో చివరి వరకు సడలని బిగువైన పట్టుతో నడిపించారు. అటువంటి కథలలో ముఖ్యమైనవి “కంచె”, “సూపర్ టీచర్ సిండ్రోమ్”.

అన్నింటికన్నా ఈ కథా సంపుటిలో ప్రాముఖ్యంగా ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే సమాజంలో అట్టడుగు వర్గాల వారైన దళితులను ప్రధాన పాత్రలుగా చేసి రాసిన “నల్ల సూరీడు”, “జాడలు” అనే కథలలో వారి జీవన పోరాటంలో ఎదుర్కొనే కష్టాల కడగండ్లను రచయిత్రి సానుభూతితో అర్థం చేసుకోని వారిపై ఆవ్యాజ ఆపేక్షను అక్షర రూపంలో చూపెట్టిన విధానం అమోఘం అపూర్వం అనంత ఆనందదాయకం. చివరకు తన కథా సంపుటికి దళితుడు కథానాయకుడుగా ఉన్న “నల్ల సూరీడు” పేరును ప్రకటించడమే తన రచనల ద్వారా సమ సమాజ నిర్మాణపు ఆకాంక్షను అసమాన ఆశయ సాధనను నిర్ద్వందంగా రచయిత్రి ఋజువు చేసిందని అర్థం చేసుకోవచ్చు.

ఇక చివరగా రెండు కథలు ఉటంకించి నా సమీక్ష ముగిస్తాను. బుజ్జమ్మ పిల్లి అనే కథలో రచయిత్రి తన పిల్లల్లో ఒక పిల్లగా పెంచుకున్న ప్రాణప్రదమైన పిల్లి తేలు కరిచి చనిపోతే ఆమె పొందిన వర్ణనాతీతమైన ఆవేదన మనకు కళ్ళ నీళ్లు తెప్పిస్తుంది. ఇంకా కుటుంబం కోసం సర్వం త్యాగం చేసిన తన తండ్రి త్యాగపూరిత అనురాగపూరిత మనస్తత్వం గురించి కూడా రచయిత్రి “కటికనిజం”, “నాన్న కోరిక” కథల ద్వారా తెలియపరచి ఘన నివాళి అర్పిస్తుంది తన బాల్య జీవితాన్ని, దిగువ మధ్యతరగతి కుటుంబ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా వారు పొందిన ఈతి బాధలను, ఎదుర్కొన్న ఇబ్బందులనూ సహజ సిద్ధంగా అభివ్యక్తీకరించారు. స్వచ్ఛ సాహిత్య ప్రేమికుల ఇండ్లల్లోనూ సమసమాజ స్వాప్నికుల కండల్లోనూ కొలువై ఉండదగిన ఉత్తమ గ్రంథం ఈ కథల సంపుటి. సమాజాన్ని సహజ రూపంలో చూడాలనుకునే ప్రతి ఒక్కరూ చదివి తీరవలసిన మహత్తర మణిపూస ఈ కథా సంపుటి. రచనను సామాజిక చైతన్యం కొరకు గురుతుర బాధ్యతగా స్వీకరించి దానికి సంపూర్ణ న్యాయం చేస్తున్నటువంటి శ్రీమతి Rohini Vanjari గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ సమీక్షకు స్వస్తి.

పుస్తకాల కొరకు: – రచయిత్రి నంబర్ – 90005 94630

సమీక్షకుడు @ డా. జెల్ది విద్యాధర్; హైదరాబాద్