నమస్తే!
నేను వ్రాసిన ఈ కథ “బుజ్జమ్మ పిల్లి” “సాహిత్య ప్రస్థానం” మాస పత్రికలో 2020 ఏప్రిల్ నెలలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన.
—————————————————————————————————————————-
సాయంత్రం నాలుగైంది. సురేంద్ర టీ బంకు దగ్గర సందడి మొదలైంది. తెల్ల చొక్కా, తెల్ల పంచె కట్టుకుని రామశేషయ్య చీరల బాకీ డబ్బులు దండుకునేదానికి అమ్మలక్కల ఇళ్లకు సైకిలు మీద బయలుదేరాడు. వాళ్ళ నాయన దగ్గరినుంచి వారసత్వంగా వచ్చిన పాత మోపేడు బండిని వదులుకోలేక, దానికి రిపేరులు చేయించలేక సతమతమౌతున్న చిట్టిబాబు యధావిధిగా సైకిలు షాపు జాన్ దగ్గర బండికి ఫంక్చర్ వేయిస్తున్నాడు.
పొద్దునంతా కాచిన ఎండ తగ్గుదామా, వద్దా అన్నట్టు ఉడకాడిస్తున్నాది. టీ బంకు ముందర బల్ల మీద కూర్చున్న నర్సిరెడ్డి, అంకయ్య గాజు గలాసులో ఊదుకుంటూ టీ తాగతా వచ్చే, పోయే జనాలను చూస్తా ఉన్నారు. రేషన్ షాపు రాంబాబుని బతిమాలి రెండు లీటర్లు ఎక్కువ కిరసనాయిలు పోయించుకున్న బుజ్జమ్మ రెండు చేతుల్లో కిరసనాయిలు డబ్బాలను మోస్తూ ఆపసోపాలు పడతా రావడం చూసి నర్సిరెడ్డి ” బుజ్జమ్మా… ఎందుకట్ట అవస్థ పడతావు. మీ ఆయన కిస్టయ్య కి చెప్తే తెస్తాడు కదా ” అన్నాడు బుజ్జమ్మని ఎకసెక్యం గా చూస్తూ… ” నర్శిరెడ్డన్నా, నీ పని చూసుకో, మా ఆయన మనిషి ఒకడు. పనులు వంద. ఎన్నని చేస్తాడు ” అంటా బుజ్జమ్మ రోడ్డు దాటి ఒక డబ్బాని కింద పెట్టి, ఇంటి ముందరి ఇనప గేటుని తీసి, డబ్బాలను పట్టుకొని మిద్దె మెట్లు ఎక్కుతోంది.
” బుజ్జమ్మ చెప్పింది నిజమే నర్శిరెడ్డా…. పాపం కిష్టయ్య ఒకపక్క ప్రింటింగ్ ప్రెస్ నడపతానే మరోపక్క బిల్డరుగా ఇళ్ళు కట్టిస్తా, అదే చేత్తో హోటల్ నడపతా ఉళ్ళే. అప్పటికి బుజ్జమ్మ హోటల్ చూసుకుంటావుంది. ఇద్దరు కష్ట పడతా ఉన్నారు కాబట్టే మూడంతస్తుల మిద్దె కట్టగలిగారు.” అన్నాడు అంకయ్య. ” ఏం లేదులే అంకయ్య…. ఈ మధ్యన కిష్టయ్య ఎక్కువ అప్పులు చేస్తా ఉన్నాడని ఊరంతా పుకారు పుడతా ఉంది. అంత కష్టపడడం ఎందుకు, అన్ని అప్పులు చేయడం ఎందుకు అని ” అన్నాడు నర్సి రెడ్డి. ” నువ్వు ఎవురినీ వదలవు నర్శిరెడ్డా…. టైం అవతావుండాది. నర్సింగరావు పేటలో శేషారెడ్డి పేకాటకి పిలిచినాడు కానీ పోదాం పా ” అంటానే ఇద్దరూ లేచిపోయినారు.
బుజ్జమ్మ రెండో అంతస్తు మెట్లు ఎక్కతా ఉంటే ఎక్కడ నుంచో చిన్నగా” మిఅవ్ మిఅవ్” అని అరుపు వినపడింది. ఒక క్షణం ఆగి ఎందోలే అనుకుని మళ్ళా మెట్లు ఎక్కసాగింది. ఈ సారి మళ్ళా కాస్త పెద్దగా “మ్యావు మ్యావు ” అని పిల్లి అరుపు వినబడింది. ఇక ఉండబట్టలేక కిరసనాయిలు డబ్బాలు మెట్ల మీద పెట్టి, మెట్లు దిగి మెట్ల కింద ఉన్న సందులోకి తొంగి చూసింది బుజ్జమ్మ. అక్కడ చిన్న పిల్లి కూన భయంగా వణుకుతూ,అరుస్తూ ఉంది. దాని చిన్ని చెవులు,తోక కి మెట్ల కింద ఉన్న బూజు అంటుకుని ఉంది. బిత్తరగా బుజ్జమ్మని చూస్తూ మెట్ల కింది తావులోకి ఎనక్కి, ఎనక్కి జరగతా ఉంది. బుజ్జమ్మ చుట్టూతా చూసింది. ఆ పిల్లి కూన తల్లి పిల్లి ఎక్కడైనా ఉందేమో అని. ఎక్కడ దాని జాడ ఔపడాలా . ” ఒరే అబ్బయ్య……శీనా ఇటు రారా ” అని ఒక అరుపు అరిచి పిల్లి కూనని చేతిలోకి తీసుకుంది బుజ్జమ్మ. ఒళ్ళంతా తెలుపు, అక్కడక్కడా నలుపు మచ్చలతో మహా ముద్దుగా ఉన్న ఆ పిల్లి కూనని తీసుకుని మూడో అంతస్తులో ఉండే తన ఇంటిలోకి వెళ్ళింది. దాని ఒంటిమీది బూజు దులిపి హాల్లో సోఫాలో కూర్చుని పిల్లి కూనని ఒళ్ళోకి తీసుకుని దాని ఒంటిని నిమరసాగింది. శీనయ్యని కిరసనాయిలు డబ్బాలను పైకి తెమ్మని పంపి, కూతురు అనిత ని పళ్లెం లో పాలు పోసుకు రమ్మంది బుజ్జమ్మ.
అంచులు ఉన్న పళ్లెంలో పాలు తెచ్చింది అనిత. ఆ పాలను సోఫాలో పిల్లికూన ముందు పెట్టింది బుజ్జమ్మ తాగమని. కాసేపు అది బిత్తర బిత్తరగా చూసి పాల వాసనా ముక్కుకి తగలడంతో మెల్లగా పళ్ళెంలోని పాలను నాలికతో తాకి చూసి, బుజ్జమ్మ ముఖంలోకి ఒకసారి చూసి పాలను తాగసాగింది. బుజ్జమ్మకు తనకి పెళ్లి కాకముందు నెల్లూరు లో తమ ఇంట్లో తాను, మోహన్ అన్న కలసి అమ్మ వద్దు అంటున్నా పిల్లికూనలను ఇంటికి తెచ్చి సాకడం గుర్తుకు వచ్చింది. బడికి పోయినపుడు తప్ప పొద్దస్తమానం ఆ పిల్లికూనలను పైన, పక్కల వేసుకొని ఉంటే అమ్మ తిట్టేది. వాటివల్ల ఏమి రోగాలు వస్తాయో, పొద్దుననే వాటిమొహం చూస్తే మంచిది కాదు అని. తాను,అన్న మాత్రం అమ్మ మాటలను పట్టించుకొనేవారు కాదు. వాటి వల్ల ఎప్పుడు ఏ అపకారం జరగలేదు తమకు. పాపం కాస్త పెద్ద అయినాక అవి రోడ్డు మీదకు పోయి ఆటోల కింద పడి చనిపోయాయి. ఇక పిల్లులను పెంచవద్దు అనుకుంది బుజ్జమ్మ. ఇదిగో ఇన్ని రోజులకు పిల్లికూన తనంతట తానుగా ఇంటి మెట్ల కింద కనపడే సరికి పాత రోజులు గుర్తుకు వచ్చాయి బుజ్జమ్మకు.
శీనయ్యను కిందికి పంపించింది పిల్లికూన తల్లి ఎక్కడైనా ఉందేమో చూడమని. వాడు అంతా తిరుక్కోని వచ్చి పెద్ద పిల్లి ఏడ ఔపడలేదని చెప్పాడు. బడి నుంచి వచ్చిన బుజ్జమ్మ కొడుకు చైతన్య కూడా పిల్లి కూనని చూసి ముచ్చటపడి ఎత్తుకున్నాడు. బుజ్జమ్మ మొగుడు కిష్టయ్యకు తప్ప ఇంట్లో అందరికి ఆ పిల్లి కూన ప్రీతి పాత్రురాలైనది. ఇక కిష్టయ్య గమ్ముగుండక తప్పలా. అది మొదులుకోని ఆ ఇంట్లో ఆ పిల్లి కూన మహా రాణి అయింది. దానికి చిన్నా అని పేరు కూడా పెట్టింది బుజ్జమ్మ. ఎవరైనా ఇంటి కొచ్చినోళ్ళు దాన్ని పిల్లి అంటే బుజ్జమ్మకు కోపం వచ్చేది. ” అది మా చిన్నా. నా బిడ్డ తో సమానం. దాన్ని పిల్లి, గిల్లి అనకండి పేరు పెట్టి చిన్నా అని పిలవండి ” అని ఉడుక్కునేది. వచ్చిన వాళ్ళు ముక్కున వేలేసుకుని ” ఈ విడ్డూరం ఏడా చూడలేదమ్మా. పిల్లిని బట్టుకొని పిల్ల అంటుంది ఈ బుజ్జమ్మ అనుకునేవారు.
బుజ్జమ్మ ఇంట్లో ఏం జరిగినా ఆ వీధిలో వింతే. ప్రింటింగ్ ప్రెస్ దగ్గరకి, హోటల్ దగ్గరకి వచ్చినోళ్ళకి బుజ్జమ్మ పిల్లి గురించి గొప్పలు చెప్పేది.
హోటల్ దగ్గర బల్ల మీద కూర్చుని భోజనాలకి టోకెన్ ఇచ్చేటప్పుడు కూడా చిన్నా ని ఒడిలో కూర్చోబెట్టుకునేది బుజ్జమ్మ. చిన్నా కూడా ముద్దుగా ఉండి ఎవరు ఎత్తుకున్న కొత్త లేకుండా వాళ్ళ చేతులు నాకేది. అట్టా బుజ్జమ్మ ఇంట్లో చిన్నా [పిల్లి పిల్ల] ఉందని ఆ చుట్టు పక్కల అందరికి తెలిసిపోయింది. ఓ రోజు ఇంట్లో ఎవరు లేరు. బుజ్జమ్మ కి పక్క ఊరు “చినమానుచేను ” లో చీటీపాట కి పోయి రావలసిన పని పడింది. తన చుట్టూతా తిరుగుతున్నా చిన్నాని తమ ఇంటి కింద రెండో అంతస్తులో బాడుగకు ఉండే ఉల్లి పాయల శంకరయ్య భార్య పద్మమ్మ దగ్గర చిన్నాని వదిలి, తాను వచ్చేవరకు జాగ్రత్తగా చూసుకోమంది. అప్పటికి చిన్నా ఆ చుట్టుపక్కల వాళ్ళకి బాగా మాలిమి అయింది.పద్మమ్మ చిన్నాని తీసుకుని తలుపేసుకుంది.
సాయంత్రం ఊరినుంచి వస్తూనే చిన్నా కోసం పద్మమ్మ ఇంటి తలుపు కొట్టింది బుజ్జమ్మ. పద్మమ్మ తలుపు తీసింది. లోపల కి వెళ్లిన బుజ్జమ్మకి పళ్లెంలో కోడికూర ముక్కలను ఆత్రంగా తింటున్న చిన్నా కనిపించింది. అయినా బుజ్జమ్మ గొంతు వినగానే పళ్లెంని వదిలేసి బుజ్జమ్మ దగ్గరికి వచ్చి చుట్టూ తిరుగుతూ బుజ్జమ్మ కాళ్ళు నాకసాగింది.” అయ్యో…. చిన్నాకి కోడి కూర అంటే ఇష్టమా… తాము బాపనోల్లం అయిపోతిమి. ఇంట్లో ఎప్పుడు గుడ్డు కూడా వండింది లేకపాయ. ఇక చిన్నా ఎక్కడ తనను వదిలి పద్మమ్మ ఇంటికి పోతుందో అని బెంగతో బుజ్జమ్మ అది మొదలు శీనయ్య చేత సాయంత్రాలు చిన్నా కోసం సెంటర్లో ఉన్న అరవ పాటి వాళ్ళ బండి దగ్గరనుంచి చికెన్ కూర తెప్పించేది. కోడి కూర కాగితం పొట్లంలో కట్టించుకొని వచ్చిన శీనయ్య మిద్దె మెట్లు ఎక్కి చిన్నా అనిఅన్నాడంటే చాలు బుజ్జమ్మ ఒళ్ళో ఉన్న చిన్నా ఒక్క దూకు దూకి మెట్ల మీదకు పోయి శీనయ్య కాళ్ళను చుట్టేసేది. మెట్లను పూర్తిగా ఎక్కనీకుండానే పొట్లంని కాళ్ళతో లాగి పెరికేసేది. మెట్ల మీద పడ్డ ముక్కలను ఏరి వరండా లో వేసేవాడు శీనయ్య.ఇక ఒక్కో ముక్కను పైకి ఎగరేసి ఆడుకుంటూ, తోక ఊపుకుంటూ తినేది చిన్నా. అది తింటూ ఉండే సంతోషంగా చూస్తూ ఉండిపోయేది బుజ్జమ్మ.
మూడు నెలలకు చిన్నా బాగా పుష్టిగా ఎదిగింది. ఓ రోజు బుజ్జమ్మ ఇంట్లో వంట చేస్తా ఉంటే చిన్నా ఎక్కడ నుంచో ఓ ఎలుకను నోట కరుచుకుని పెద్ద ఘనకార్యం చేసినట్టు బుజ్జమ్మ ముందర తెచ్చి పడేసింది. అప్పటికే ఆ ఎలుక చచ్చి ఉంది. బుజ్జమ్మ పట్టరాని కోపంతో ” ఏంది చిన్నా…ఏం పని చేసావ్ నువ్వు. ఎలుకని చంపుతావా… మానవత్వం లేకుండా.. ఇందుకేనా నేను నిన్ను ఇంత ప్రేమగా చూసుకుంది. ఎదుటి జీవుల పట్ల జాలి, కరుణ చూపించాలి. అప్పటికి నీ కోసం రోజు కోడి కూర తెప్పిస్తున్న కదా. ఇంట్లో పాలు, పెరుగు ఉన్నాయి. ఇంకా ఎందుకు నీకు ఈ పాడు బుద్దులు అంటూ అరిచింది. బుజ్జమ్మ అరుపులకు భయపడిన చిన్నా మూలగా నక్కి బుజ్జమ్మ వంక జాలిగా చూస్తోంది.అక్కడే ఉన్న బుజ్జమ్మ మొగుడు కిష్టయ్య నవ్వతా ” ఏంది బుజ్జమ్మ, మానవత్వం అంటా దాన్ని తిడతా ఉండావు. అది ఏమైనా మనిషా… ఎలుకలను పట్టడం పిల్లి జాతి సహజ లక్షణం. మనుషులే మానవత్వాన్ని మరచి దారుణమైన పనులు చేస్తా ఉన్నారు. ” అన్నాడు. నిజమే కదా అనుకుని ఎలుకను వరండాలో వేసి తినమంది బుజ్జమ్మ. అది మొదలు చిన్నా ఎలుకలను తెచ్చిన రోజు ఇంట్లోకి రానిచ్చేది కాదు బుజ్జమ్మ. ఆ రోజుకి దాని మకాం వరండాలోనే.
పక్క రోజు పనిమనిషి జయమ్మ విసుక్కుంటూ చిన్నా ఎలుకని తిన్న తావున ఉన్న రక్తం మరకలను ఫినాయిలు వేసి కడిగేది. ఇక అప్పటి నుంచి మొదలయ్యింది చిన్నాకు డిమాండు. వీధి చివర దర్జీ కొట్టు చిరంజీవి తన అంగడిలో కొత్త గుడ్డలను ఎలుకలు కొట్టేస్తున్నాయి అంటా బుజ్జమ్మని బతిమాలి చిన్నాని రెండు రోజులు రాత్రి పూట వాళ్ళ అంగడిలో ఉంచాడు. మొదటి రోజు అది బుజ్జమ్మ లేదని బిక్కుబిక్కు మంటా ఉండింది. రెండో రోజు రాత్రి మాత్రం ఒకే తూరి మూడు ఎలుకలను పట్టేసింది. సంతోష పడతా దర్జీ చిరంజీవి ఆ విషయం బుజ్జమ్మకి చెప్పి చిన్నాని ఇచ్చివెళ్ళాడు. ఇక చుట్టు పక్కల ఏ అంగడిలో ఎలుకలున్నా చిన్నాని పంపేవారు. అది హీరోలాగా వెళ్ళి రాత్రి కాపు కాసి పోలీసులు దొంగలను పట్టినట్టు ఎలుకలను పట్టేసి ఎలుకల పాలిటి సింహస్వప్నం అయింది. ఆ రోజు బుజ్జమ్మ ఇంటి పక్కన ఉన్న గుర్రం శెట్టి నారాయణ భార్య అరుణమ్మ వాళ్ళ చిల్లర అంగడిలో ఎలుకలు ఉన్నాయని చిన్నాని తీసుకుపోయింది.
మధ్యాన్నం మూడు గంటలప్పుడు హోటల్ కాడ పని ముగించుకొని ఇంటికొచ్చిన బుజ్జమ్మ సన్నగా కునుకు తీస్తా ఉంది. అంతలోనే అరుణమ్మ అరుపులు విని దిగ్గున లేచింది బుజ్జమ్మ. ” చూడు బుజ్జమ్మా… మీ చిన్నా ఎంత పని చేసిందో, ఎలుకలు పట్టమని సామాన్ల గదిలోకి పంపితే పది కిలోల నూనె డబ్బాని దొల్లించేసింది. నూనె మొత్తం నేలపాలైయింది. డబ్బు కట్టు నువ్వు” అంది అరుణమ్మ చిన్నాని చూపిస్తా. ఒళ్ళంతా నూనెలో ముంచినట్టు చిన్నా ఒంటి బొచ్చు అంతా ముడుచుకు పోయి తోక నీలుక్కు పోయి చెవులు, ముఖం నుంచి నూనె కారత దీనంగా బుజ్జమ్మ ముందు నిలబడింది చిన్నా. దాంతో బుజ్జమ్మ నిద్ర మత్తంతా వదిలిపోయి అరుణమ్మ మీద తాడెత్తున లేచింది బుజ్జమ్మ. ” ఏం మాట్లాడతా ఉన్నావు అరుణమ్మ నువ్వు… పనిమాల ఉన్నదాన్ని అడిగి అంగట్లోకి తీసుకుపోయింది నువ్వు. ఎలుకలు పట్టాలని కొట్టులో వదిలింది నువ్వు. చిన్నా ఎలుకలను పడతా నూనె డబ్బా మీద పడి ఉంటుంది. అయినా డబ్బాకి సరిగా మూత బిగించక పోవడం మీది తప్పు. పాపం చిన్నా నూనెలో పడి ఎలా అయిందో చూడు…. నేను ఎందుకు కట్టాలి డబ్బు. నా చిన్నాకి ఇలా అయినందుకు నువ్వే కట్టాలి డబ్బు” అంటా అరుణమ్మ మీద విరుచుకుపడింది బుజ్జమ్మ.
ఇక బుజ్జమ్మ నోటికి తాళలేము అని అని తేలు కుట్టిన దొంగలా జారుకుంది అరుణమ్మ. నెత్తి, నోరు బాదుకుంటా బుజ్జమ్మ చిన్నాని స్నానాల గదిలోకి తీసుకపోయి పియర్స్ సబ్బుతో దాని వొళ్ళంతా రుద్ది, రుద్ది నాలుగు బొక్కెనల నీళ్లతో కడిగినా దాని ఒంటిమీద నూనె జిడ్డు పోలేదు కానీ బొచ్చు రాలతా ఉంది. అంత సేపు నీళ్లలో నానడంతో చిన్నా చలికి ఒణికి పోసాగింది. గబా గబా చిన్నాని తీసుకుని హాల్లో సోఫా మీద కూర్చుని గంట సేపు తుండు గుడ్డ తో దాని ఒంటిని తుడిచింది బుజ్జమ్మ. తుడుస్తున్నంత సేపు అరుణమ్మని శాపనార్ధాలు పెడతానే ఉంది. కూలి డబ్బుల కోసం వచ్చిన మేస్త్రిలు సుబ్బయ్య, రఫీ లు బుజ్జమ్మని, ఆమె ఒడిలో ఉన్న చిన్నాని చూసి వచ్చే నవ్వుని మీసాలచాటున దాచేసుకున్నారు. లేకుంటే నవ్వినందుకు బుజ్జమ్మ తమ మీద కూడా తిట్ల దండకం ఎత్తుకుంటుందని. ఆ తర్వాత నుంచి బుజ్జమ్మ చిన్నాని ఎవరి ఇళ్లకు పంపలేదు. ఓ సారి బయటకు వెళ్లిన చిన్నాని వీధి కుక్క ఒకటి తరమాత బుజ్జమ్మ ఇంటి ఇనప గేటు దాక వచ్చింది. చిన్నా గేటు సందులోనుంచి దూరి మెట్లు ఎక్కి తుకు జీవుడా అంటా బుజ్జమ్మ వొళ్ళో వాలిపోయింది. అప్పటినుంచి అది ఇల్లు వదిలి బయటకి పోలా.
నెల రోజుల తర్వాత సైదాపురంలో ఉన్న బుజ్జమ్మ తోడికోడలు సరోజమ్మ మనవడి బారసాల కి రమ్మని పిలిచారు. కిష్టయ్య హోటల్ సామాను తేవడానికి మద్రాసుకి పోయినాడు. ఇంటి దగ్గర బుజ్జమ్మ కొడుకు చైతన్య కి తోడుగా శీనయ్యని ఉండమని, కూతురు అనితని తీసుకుని సైదాపురం బయలుదేరింది బుజ్జమ్మ. వెళ్ళే ముందు చిన్నా గురించి కొడుక్కి, శీనయ్యకి మరి మరి జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది బుజ్జమ్మ. సైదాపురం లో సరోజనమ్మ ఇంట్లో బారసాల వేడుక ముగిసింది. అంతా భోజనాలకు కూర్చున్నారు. బుజ్జమ్మ , అనిత కూడా మొదటి బంతిలోనే తినేసి గూడూరుకు పోవాలని అనుకున్నారు. బుజ్జమ్మ సెల్ ఫోన్ మోగింది “పెదవే పలికిన మాటలలోని తియ్యని పాటే అమ్మ ” అనే రింగ్ టోన్ తో. “
అబ్బయ్య…చైతన్య చెప్పారా ఏంది మందల ?మద్రాస్ నుంచి మీ నాయన వచ్చేసాడా” అంది బుజ్జమ్మ. ” అది కాదే అమ్మ…మరేమో,మరేమో మన చిన్నా అంటా నీళ్లు నమిలాడు చైతన్య. ” అరే చిన్నాకి ఏమైంది చెప్పారా ” అంది బుజ్జమ్మ. ” ఏమైందో తెలీదే, మన చిన్నా నోటినుంచి నురుగు కక్కి హాల్లో పడి చచ్చిపోయిందే ” అని ఏడుస్తా చెప్పాడు చైతన్య. ఆ మాటకి పిడుగు మీద పడ్డట్టు కూలిపోయి బుజ్జమ్మ ….ఇక “సిరికిన్ చెప్పక ” పద్యంలో మాదిరి ఎవరు పిలుస్తున్న ఆగక కూతురు అనితని తీసుకుని ఆఘమేఘాల మీద గూడూరుకి వచ్చేసి ఆటో దిగి మెట్ల మీద పడతా,లేస్త వచ్చి హాల్లో కూలబడింది. అప్పటికే చిన్నా చుట్టూతా చుట్టు,పక్కల వాళ్ళంతా చేరి ఆ పిల్లి ఎన్ని ఎలుకలను పట్టింది, బుజ్జమ్మ దాన్ని ఎంత బాగా చూసింది అని చెప్పుకుంటున్నారు. ఇక ఆగలేక బుజ్జమ్మ కంటికి, మింటికి ఏకధారగా ఏడవసాగింది చిన్నాని పట్టుకుని. అన్ని రోజులు తన పిల్లి చేష్టలతో అందరిని మురిపించిన చిన్నా మాత్రం చేష్టలుడిగి తనకిక సెలవు అంటూ నిర్జీవులలో కలిసి పోయింది.
మెట్ల కింద విషపు తేలు కనపడడంతో చిన్నాని ఆ తేలు కరిచి ఉంటుందని అందుకే చిన్నా నురగలు కక్కతా చనిపోయిందని అనుకున్నారు అంతా. రోకలి బండతో కొట్టి తేలుని చెంపేసాడు శీనయ్య. మద్రాసుకి పోయిన కిష్టయ్య కూడా ఇంటికి వచ్చి చిన్నా చచ్చిపోయింది అని బాధ పడ్డాడు. పిల్లకాయలు అనిత,చైతన్యలు కూడా చిన్నాని చూసి ఏడస్తా ఉన్నారు. కిష్టయ్య, శీనయ్య చిన్నా ని గుడ్డలో చుట్టి ఇంటి వెనక ఉన్న రైలు కట్ట దగ్గరకు పోయి గుంత తవ్వి చిన్నాని ఆ గుంటలో వేసి పాలు పోసి దానికి దణ్ణం పెట్టుకుంటా మన్ను వేసి పూడ్చి పెట్టారు.
మూడు రోజులు బుజ్జమ్మ అన్నం,నీళ్లు ముట్టలా. చిన్నాని తలచుకొని తలుచుకొని ఏడుస్తా ఉంది. సూళ్లూరుపేట నుంచి వచ్చిన బుజ్జమ్మ వదిన సుందరమ్మ ” ఊరుకోవే బుజ్జి… పిల్లి కోసం అంత బాధ, ఏడుపు ఎందుకు ఎవరో మనిషి పోయినట్టు ” అంది. అంత దుఃఖంలోనూ చిన్నాని పిల్లి అన్నందుకు సుందరమ్మ మీద కోపం వచ్చింది బుజ్జమ్మకు.
” హు… పిల్లి అని చిన్నాని తీసిపారేయకు వదినా…మన మనుషులకంటే అవి ఎంతో మేలు. మనుషులకు ఎంత సాయం చేసిన, ఎంత ప్రేమ చూపినా తృప్తి ఉండదు. ఎంత సాయం చేసిన ఇంకా ఇంకా చేయలేదు అని నిష్ఠూరపడేవాళ్ళు , స్వార్ధ పరులు మనుషులు. కానీ పిల్లి, కుక్క లాంటి నోరు లేని మూగ జీవులు మనుషులకంటే ఎంతో నయం. వాటికి ఇంత తిండి పెడితే చాలు. కడదాకా మన మీద ప్రేమతో, విశ్వాసం తో మనలను అంటిపెట్టుకుని ఉంటాయి. వాటిని పెంచిన వాళ్ళకు తెలుస్తుంది అవి చనిపోయిన బాధ” అంది బుజ్జమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ..
బుజ్జమ్మ బాధ గమనిస్తానే ఉంది పనిమనిషి జయమ్మ. వారం తర్వాత ఓ రోజు పొద్దున్నే దిగాలుగా కూర్చుని ఉన్న బుజ్జమ్మ చేతికి ఓ సంచి తెచ్చి ఇచ్చింది పనికి వస్తానే జయమ్మ. ఆమె అప్పుడప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అమ్మకానికొచ్చాయని రాతిముగ్గు, ముగ్గు రాళ్ళూ, నేరేడు పళ్ళు, గోరింటాకు లాంటివి కొని బుజ్జమ్మకి తెచ్చి ఇచ్చేది. బుజ్జమ్మ నిరాసక్తంగా ఆ గుడ్డ సంచిని పక్కన పెట్టేసింది. ” బుజ్జమ్మ సంచిలో చేయిపెట్టి చూడు” అంది జయమ్మ. సంచి లో చేయి పెట్టిన బుజ్జమ్మకి మెత్తగా ఏదో తగిలింది చేతికి. బుజ్జమ్మ ఆశ్చర్యంగా సంచిలో ఉన్న దాన్ని బయటకు తీసింది. అది ముద్దు ముద్దుగా ఉన్న బుజ్జి పిల్లి పిల్ల. ” చిన్నా పోయిన కాడినుంచి నీ బాధ చూడలేక పోయిన బుజ్జక్క..కొండా గుంటలో మా చెల్లెలు నాగమ్మ ఇంటి దగ్గర పదిరోజుల ముందు పిల్లి ఈనింది అని చెప్తే నీ కోసరమని నిన్న పని అయినంక కొండా గుంటకు పోయి దీన్ని నీ కోసం తెచ్చా…” చెప్పుకుంటా పోతోంది పనిమనిషి జయమ్మ. బుజ్జమ్మ మాత్రం బుజ్జి పిల్లి ని చూసిన ఆనందంలో మైమరచి ఆ పిల్లి కూన లో తన చిన్నాని చూసుకుంటా ఉంది. ఆమె ఆనందం అవర్ణమై అంబరాన్నంటింది.