ఓ కవి లేదా కథకుని అంతరంగ క్షేత్రంలో అనేకానేక సంఘర్షణలు జరిగి, ఆ అంతర్మథనం ఫలితంగా ఓ రచనకు బీజంపడితే, ఆ కవి లేదా కథకుడు తనలోని శక్తియుక్తులన్నింటినీ క్రోడీకరించి ఓ రచనకు అంకురార్పణ చేస్తాడు. ఓ తల్లి ప్రసవవేదన అనుభవించి, ఓ బిడ్డను కన్నప్పుడు ఎంత ఆనందం అనుభవిస్తుందో అంతకంటే ఎక్కువ ఆనందం అనుభవిస్తాడు ఓ కవి లేదా కథకుడు తన రచన పదిమందిలోకి వెళ్ళినప్పుడు. అక్షరానికి ఉన్న గొప్ప విలువ అది.
అయితే ఆ రచన ఉత్తమమైనదేనా అనేది ఎవరు చెప్పాలి..? సామాన్య పాఠకులా..? పెద్ద తరం మేధావి సాహిత్యకారుల..? అసలు ఉత్తమమైన కవిత, లేదా కథకు ఎలాంటి ప్రమాణాలు ఉండాలి..? ఎటువంటి రచనలు పురస్కారానికి అర్హమైనవి? సాహితీ లోకంనుంచి సామాన్య పాఠకుల వరకు ఇటీవల కుదిపేసిన ప్రశ్నలు ఇవి.ఏదైనా ఒక సాహితీ సంస్థ కవితలు, కథల పోటీలు పెట్టినప్పుడు ఆయా విభాగాల్లో కొన్ని నిబంధనలను బట్టి రచనలను బహుమతిలకు ఎన్నుకుంటారు.ఇక రచన ఎలావుండాలి అనే విషయానికి వస్తే ” పలానా రకంగా రాస్తేనే అది ఉత్తమ రచన అనేదానికి ప్రమాణాలు ఏవి లేవు. రచన ఎలాగైనా చేయవచ్చు. కానీ మంచి థీమ్, రచన నిష్పత్తి, ఎంచుకున్న కంటెంట్, ప్రెసిస్ ఆఫ్ స్పీచ్ అంటే రచన ద్వారా మనం ఏ ఆలోచనలను పంచుకోవాలనుకుంటున్నాం అనే దాని మీద ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండడం, టెలిగ్రాఫీస్ అంటే రచన యొక్క శైలి, సారాంశం, సరైన దృక్పథం చివరగా సమాజానికి తన రచన ద్వారా అందించే సందేశం. ఇవన్నీ సరైన క్రమంలో ఉన్నాయా లేవా అని రచనలు చేసేవారు, విమర్శనా వ్యాసాలు రాసేవారు గమనించుకోవాల్సిన అంశాలు. అదే విధంగా సమాజాన్ని తప్పు దోవ పట్టించడం, వక్ర సందేశాలు అందించడం, కులమత విద్వేషాలు రెచ్చగొట్టడం, హార్మోనుల అసమతుల్యానికి కారణభూతమైన రచనలు ఎంత మాత్రం పురస్కారాలకు ఆమోదయోగ్యం కాదు.
ఇక ఒక సాధారణ పోటీలలోనే న్యాయనిర్ణేతలుగా ఉన్నవారు రచనలను ఎన్నకోవడానికి చాల జాగ్రత్తలు పాటిస్తారు. అనేక వడపోతల తర్వాతనే న్యాయనిర్ణేతల కమిటీ విజేతలను ఎన్నుకుంటారు. అటువంటిది గొప్ప గొప్ప పురస్కారాలు అందించే సాహితీ సంస్థలు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి అనేది ఊహించుకోవచ్చు. అయితే ఒక్కోసారి ఉత్తమ రచనలను జల్లెడలో వడపోత పొసే క్రమంలో కొన్ని విలువైన వజ్రాలు అడుగునపడి మరుగవచ్చు. కొన్ని విలువలేని రంగు రాళ్ళు పైకి తేలి ఆకర్షించవచ్చు.
అలాగే పురస్కారాల తక్కెడలో కొన్నిసార్లు విలువైన సాహిత్యపు బరువుతో ఉన్న కొన్ని రచనలు కిందికి తూగి, గాలికి తేలిపోయే ఊకపొట్టు లాంటి రచనలు శిఖరాగ్రం చేరవచ్చు. అంత మాత్రాన పురస్కారం పొందినవాళ్లు, పురస్కారం వస్తుందని ఆశించినవాళ్ళు ఇద్దరు కూడా పొగడ్తలకి పొంగక, తెగడ్తలకి క్రుంగక, నిరాశను వీడి సంయమనం పాటించి, తమని తాము ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన తరుణమిది. అయినా కూడా పాఠకుల మనస్సులో పదికాలాలు తమ రచనలు పదిలంగా ఉండడమే కదా అసలు సిసలైన ప్రతిభా పురస్కారం.
రోహిణి వంజారి
సంపాదకీయం