నాటిన విత్తులు

ఈ రోజు ప్రజాశక్తి “స్నేహ” పత్రికలో నా బాలల కథ “నాటిన విత్తులు”. స్నేహ సంపాదకులకు ధన్యవాదాలతో..చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కోరుతూ..

బడి వదిలి గంట అయినా ఇంకా ఇంటికి రాని కొడుకు కోసం వాకిట్లో నిలబడి చూస్తోంది కీర్తన.
ఆమె కొడుకు సుధీర్ మూడోవ తరగతి చదువుతున్నాడు. స్కూల్ ఇంటికి మూడు వీధుల అవతల ఉంది. రోజు బడి గంట కొట్టాక ఓ గంట స్కూల్ దగ్గర మిత్రులతో ఆడుకుని ఒక్కడే ఇంటికి వచ్చేసేవాడు. ఆ రోజు ఒకటిన్నర గంట అయినా రాలేదని అప్పటిదాకా ఎదురు చూసి ఇక లాభం లేదని స్కూల్ కి బయలుదేరింది కాస్త ఆందోళనగా.
రెండు అడుగులు వేసిందో లేదో కాస్త దూరం నుంచి సుధీర్ వస్తూకనిపించాడు. “అమ్మయ్య ” అని స్థిమితపడింది కీర్తన . కానీ సుధీర్ కుంటుతూ రావడంతో ” అయ్యో.. సుధీర్ ఏంటి కుంటుతూ ఉన్నావు. కాళ్ళకి చెప్పులు ఏవి. ఈ రోజు బూట్లు వద్దని కొత్త చెప్పులు వేసుకుని వెళ్లావుగా స్కూలుకి. అప్పుడే పోగొట్టేశావా? అంటూ సుధీర్ ని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చింది ఆమె.
” అమ్మా.. మరేమో నేను స్కూల్ అవగానే ఆడుకుని ఇంటికి వస్తూఉంటే దారిలో ఒక అబ్బాయి ఏడుస్తూ కనిపించాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగేతే ‘వాళ్ళ అమ్మ తనను అక్కడ కూర్చోబెట్టి ఎక్కడోకో వెళ్ళిందని, ఆకలిగా ఉంది అని చెప్పాడు అమ్మా…అందుకని ” అని చెప్పడం ఆపాడు సుధీర్.
” అందుకని నువ్వు ఏం చేసావు ” ఆసక్తిగా అడిగింది కీర్తన.
నువ్వు నాకు సాయంత్రం తినడానికి ఏమైనా కొనుక్కో అని ఇచ్చిన పది రూపాయలు ఆ అబ్బాయికి ఇచ్చాను అమ్మా. అక్కడే ఉన్న ఓ అంగడిలో బిస్కెట్స్ కొనుక్కుని తిన్నాడు ఆ అబ్బాయి” అన్నాడు సుధీర్.
“మంచి పని చేసావు. కానీ ఇంత ఆలస్యంగా ఇంటికి వచ్చావు ఎందుకు. నేను చాల కంగారు పడ్డాను. ఎందుకు కుంటుతున్నావు కాలు చూపించు. చెప్పులు ఎందుకు వదిలేసావు” అంది కీర్తన
” మరే..అమ్మా… ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా వచ్చేవరకు అబ్బాయి తో కలిసి నేను ఆడుకున్నాను. వాళ్ళు వేరే ఊరికి వెళ్ళాలట. పాపం ఆ అబ్బాయికి చెప్పులు లేవట. ఎండలో చాల దూరం తిరిగి కాళ్ళు మంట అని చెప్పాడు. అందుకని నా చెప్పులు ఆ అబ్బాయికి ఇచ్చేసాను. వాళ్ళ అమ్మా నన్ను చాల మెచ్చుకుంది. వాళ్ళు చాల బీదవాళ్ళట. “దేవుడు నిన్ను చల్లగా చూడాలి “అన్నాది ఆ అబ్బాయి అమ్మ. అమ్మా నేను చేసింది తప్పా” చిన్నారి సుధీర్ అడిగిన తీరుకి మనసులొనే పొంగిపోతూ ” లేదు సుధీర్ నువ్వు చేసింది చాల మంచి పని ” అంది.
ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు అది మొలకెత్తడానికి గాలి, నీరు, సూర్యరశ్మి ఎంత అవసరమో , అలాగే ఒక మనిషి లో మానత్వం పరిమళించడానికి జాలి, దయ, కరుణ అనే విత్తనాలు ఆ మనిషి పసివాడుగా ఉన్నపుడే వారి మనసులో నాటుకుంటే అవి పెరిగి పెద్ద అయ్యే కొద్దీ పలువురికీ మానవత్వపు పరిమళాలను పంచిపెడతాయి.
తాను సుధీర్ లో నాటిన ఈ జాలి,దయ, కరుణ అనే విత్తనాలు మొలకెత్తి వికసించి మానవత్వపు పరిమళాలను వెదజల్లడం చూసి కీర్తన తల్లిగా పొంగిపోయింది.
” అమ్మా… కష్టాలలో ఉన్న వారికి సాయం చేస్తే మనకు మంచి జరుగుతుంది అన్నావుగా నువ్వు మరి నేను ఆ అబ్బాయి కి సాయం చేస్తే నాకెందుకమ్మా మంచి జరగకుండా ముల్లు గుచ్చుకుంది ” అమాయకంగా అడిగాడు సుధీర్ కీర్తన అతని అరికాలిలో ఉన్న చిన్న ముల్లుని తీయడానికి ప్రయత్నిస్తుండగా.
” అదే నాన్న, మనం సాయం చేసేటప్పుడు మనకి కొన్ని కష్టాలు, నష్టాలు రావచ్చు. లేదా ఎవరైనా మనలను తప్పు పట్టవచ్చు. సాయం చేయనీకుండా అడ్డుకోవచ్చు. అవన్నిటినీ పట్టించుకోకుండా ఉన్నపుడే మనం సాయం చేయగలుగుతాం అని నీకు తెలియడానికే ఆ ముల్లు గుచ్చుకుంది. ఇప్పుడు కష్టం వచ్చింది అని సాయం చేయడం మనం ఆపకూడదు. అర్ధం అయిందా ” అంది కీర్తన చిన్న ముల్లు ను సుధీర్ కాలి నుంచి నేర్పుగా బయటకు తీసి.
అర్ధం అయింది అమ్మా అంటూ తృప్తిగా తల ఊపాడు సుధీర్.