మహిళా ఉద్యమ కరదీపిక ” మానవి” ద్వైమాసపత్రిక మార్చి -ఏప్రిల్ 2024 సంచికలో నా కథ “దిశ మార్చుకో” ప్రచురితం అయింది. సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. “దిశ మార్చుకో” కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి
నన్ను నేను తిట్టుకోవడం అప్పటికి వందోసారి. అమ్మ తోడుగా వస్తాను అంటే ” ఎందుకమ్మా… ఇంటర్వ్యూ ఎంతసేపు చేస్తారని, లంచ్ లోపలే అయిపోతుంది నేను వచ్చేస్తాలే… నువ్వు విశ్రాంతి తీసుకో అనడం నాది బుద్ది తక్కువ అయింది. నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ పూర్తి అయ్యేసరికి రాత్రి ఎనిమిదిన్నర అయినది. చివరికి ముగ్గురం మిగిలాం. నాతోపాటు వచ్చిన వినూత్నని వాళ్ళ అన్న వచ్చి తీసుకువెళ్లాడు. ఇంకో అబ్బాయి వెళ్ళిపోయాడు. నేనుఒక్కదాన్ని కంగారుగా బయటపడ్డాను. సెల్ ఫోన్ లో ఒక పాయింట్ మాత్రమే ఛార్జింగ్ ఉంది. ఆత్రంగా సెల్ ఆన్ చేసి చూస్తే అప్పటికే అమ్మ దగ్గర నుంచి పది కాల్స్ ఉన్నాయ్. పాపం అమ్మ ఎంత కంగారు పడుతున్నదో నేను ఇంకా ఇంటికి రాలేదని. ఆటో ఎక్కిన తర్వాత అమ్మకు ఫోన్ చేస్తామని గబా గబా నడవసాగాను. డిసెంబర్ నెల. అమావాస్య అయి రెండు రోజులే అవడంతో చుట్టూ చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. చీకటికి తోడు రివ్వున కొట్టే చలిగాలి. ఆఫీస్ ఉండే గల్లీ నుంచి మెయిన్ రోడ్ మీదకి వచ్చాను. అక్కడ నుంచి ఒక అర కిలోమీటర్ నడిస్తే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వస్తుంది. అక్కడకు వెళ్ళితే కానీ షేర్ ఆటోలు దొరకవు. యూసుఫ్ గూడలో ఉండే మా ఇంటికి వెళ్లాలంటే రెండు షేర్ ఆటోలు మారాలి.
బి. టెక్ ఆఖరి సంవత్సరం. ఇప్పటికి మూడు క్యాంపస్ ఇంటర్వ్యూలు అయినాయి. రెండింటిలో ఎంపిక కూడా అయినాను. చాలామంచి కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కి పిలుపు వచ్చింది. మరోసారి నా అదృష్టాన్ని పరీక్షించుకుందామని పొద్దున్న ఎనిమిదింటికి బయలుదేరాను. బంజారాహిల్స్ లో ఉన్న పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ అది. పదకండు గంటలకు ఇంటర్వ్యూ మొదలయ్యింది. మొత్తం పదిహేను మందిమి వచ్చాము. నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ, లంచ్ అక్కడే ఏర్పాటు చేసారు. ఆ సంగతి రెండు గంటలప్పుడు అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. డాడీ ఆఫీస్ పనిమీద బెంగళూరు వెళ్లారు. సాయంత్రం ఆలస్యం అవుతుందేమో నేను వస్తాను అంది అమ్మ. లేదులే అమ్మ…సాయంత్రానికి అయిపోతుందిలే నువ్వు రిస్క్ తీసుకుని రావద్దు అన్నాను. అమ్మకి వారము నుంచి జ్వరం.ఇపుడే కాస్త తగ్గింది. అయినా ఇంకా నీరసంగా ఉంది. నాతో వస్తే తనకి రిస్క్ అవుతుంది విశ్రాంతి తీసుకో అని అమ్మకు చెప్పడం నా పొరపాటు ఏమో అనిపించింది ఆ చీకటిని చూస్తుంటే.
చీకటిలో ఒక్కదాన్ని బిక్కు బిక్కు మంటూ నడుస్తున్నాను. త్వరగా చెక్ పోస్ట్ దగ్గరకి చేరుకోవాలి. అంతలోనే మళ్ళీ నా కోసం అమ్మ పడే కంగారు గుర్తుకు వచ్చి వచ్చేస్తున్నా అని చెపుదామని సెల్ ఆన్ చేశాను. ఎంతకీ సెల్ ఆన్ కాలేదు. ఛార్జింగ్ ఎప్పుడో అయిపోయింది. ఇంకేముంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయింది నా పరిస్థితి. అయ్యో ఇప్పుడెట్లా… ఈ దిక్కుమాలిన ఇంటర్వ్యూ కి రాకున్నా బాగుండేది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది . అమ్మ ఎంత కంగారు పడుతూవుందో నా గురించి.
సాయంత్రం ఐదు గంటలప్పుడు ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన రెండు బిస్కట్స్ తిని టీ తాగడమే. ఆకలి దంచివేస్తోంది. చీకటిలో వాహనాలన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ రేసు గుర్రాల్లా పరిగెడుతున్నాయి తప్ప నరమానవుడు అంటూ ఎవ్వరు చుట్టుపక్కల కనబడలేదు నాకు. ఉండుండి వాహనాల లైట్లు పడి రక్త వర్ణంలో మెరుస్తున్న రేడియం లైట్లను చూస్తుంటే ఎందుకో నాలో భీతి ప్రవేశించింది. దూరంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చౌరస్తా దగ్గరి లైట్లు కనిపిస్తున్నాయి. ఎంత వేగంగా నడుస్తాం అనుకుంటే అంత తడబాటుగా కాళ్ళు వణుకుతున్నాయి. ఒకపక్క ఆకలి,దాహం, మరోపక్క నీరసం అడుగు ముందుకు వేయనీయకుండా బంధనాలు అవుతున్నాయి. హ్యాండ్ బ్యాగ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసాను. బాటిల్ అడుగున ఉన్న కొద్ది నీళ్ళతో గొంతు తడుపుకుని లేని శక్తిని కూడగట్టుకుని నడుస్తున్నాను. చూడడానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్న నడిచే కొద్దీ దూరంగా జరుగుతున్నట్టు ఉంది చెక్ పోస్ట్.
కాలం చాల విచిత్రమైనది. మనకు ఇష్టమైన పని చేసేటపుడు గంటలు నిముషాల్లా గడిచిపోతాయి. అదే మనకు కష్టంగా ఉన్నపుడు అదే సమయం ఎంతకీ గడవదు. ఒక్కో నిమిషం ఒక్కో గంటల గడుస్తుంది. క్షణాలు యుగాల్లా గడవడం అంటే ఏమిటో ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. చీకట్లో ఈ ఒంటరి ప్రయాణంలో లేనిపోని ఆలోచనలు నా బుర్రని తొలిచేస్తున్నాయి… ఆడపిల్ల ఒంటరిగా రోడ్డుమీద వెళుతుంటే పట్టపగలే రక్షణ లేని రోజులు ఇవి. ఇక రాత్రిపూట ఇలా…ఒంటరిగా. నా పరిస్థితి మీద నాకు చిరాకు, దానికి తోడుగా భయం ఒకదానితో ఒకటి పోటీపడసాగాయి. మనం వేటి గురించి ఆలోచించకుండా ఉండాలి అనుకుంటామో ఆవే మన ప్రమేయం లేకుండా మన మనసులోకి చొచ్చుకుని వచ్చేస్తాయి కదా. ఆ రాత్రి, ఆ చీకట్లో నా ఒంటరి నడకలో ఆకతాయిల ఆగడాలు, “నిర్భయ”, ఈ మధ్యనే జరిగిన” దిశా” దయనీయ ఉదంతం అసంకల్పితంగా నా మనసులో మెదలగానే నా వెన్నులో ఒణుకు మొదలైంది. దెబ్బతో కాళ్ళలోకి వేయి ఏనుగుల బలం తెచ్చుకుని నడవసాగాను. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కాస్త దగ్గరకొచ్చేసినట్టు కనిపిస్తూంది. ఇక పర్వాలేదు అనుకుంటుండగానే నా పక్కన ఓ కారు ఆగడం, ఓ వ్వక్తి కారు డోర్ తీసి నా చేయి పట్టి బలంగా కారులోకి లాగడం…నా ముక్కు దగ్గర రుమాలు గట్టిగా అదమడం వరకే నాకు తెలుసు….
మగతగా కళ్ళు తెరిచాను. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. బలవంతంగా కను రెప్పలు తెరిచాను. చుట్టూ చిమ్మచీకటి. కొన్ని క్షణాలకి చీకటికి కళ్ళు అలవాటు పడ్డాయి. ఒక్కసారిగా జరిగిందేంటో గుర్తుకు వచ్చింది. . అంతే… నా శరీరం చిగురుటాకులా వణకసాగింది. గొంతులో తడి ఎప్పుడో ఆరిపోయింది. నేను ఇంటర్వ్యూ నుండి లేటుగా బయట పడడం, చీకట్లో రోడ్డు మీద నడుస్తుంటే ఎవరో ముక్కుకు రుమాలు అడ్డు పెట్టి బలవంతంగా కారులోకి లాగడం అంతా లీలగా యోచనకొచ్చింది. కారులో వెనక సీట్లో ఇద్దరు నన్ను అదిమి పెట్టి ఉన్నారు. బలవంతంగా విదిలించుకుందాం అనుకున్నాను. అంతలోనే షాక్ కొట్టినట్టు ఆగిపోయాను. ఇపుడు వీళ్ళు నేను క్లోరోఫామ్ మత్తులో ఉన్నాను అనుకుంటున్నారు. నాకు స్పృహ వచ్చింది అని తెలిస్తే అంతటితో నా పని అయిపోతుంది. నాకు ఎటువంటి అనస్తీషీయా పెద్దగా పని చేయదు. ఓ సారి నుదిటిమీద గాయమై కుట్లు వేయడానికి లోకల్ అనస్తీషీయా ఇచ్చారు. ఎంతకీ అక్కడి చర్మం మొద్దు బారదే… ఇక లాభం లేదని డాక్టర్ బలవంతంగా కుట్లు వేసినపుడు నొప్పిని పంటిబిగువున ఓర్చుకున్నాను అపుడు. అంటే… ఈ దుర్మార్గులు నా ముక్కుకు అడ్డు పెట్టిన మత్తుమందు నుంచి చాల త్వరగా నేను బయట పడ్డాను అన్నమాట… ఏం జరుగుతుందో అనే భయంతో గుండె దడ పెరిగి నా గుండె చప్పుడు నాకే వినిపిస్తూంది.
కారు శరావేగంతో పరిగెడుతోంది. కారులో ముగ్గురు మృగాళ్లు ఉన్నట్టున్నారు. కారు ఎటు పోతోందో, వీళ్ళు నన్ను ఎక్కడికి తీసుకుపోయి ఏ అఘాయిత్యానికి పాల్బడతారో తలచుకుంటేనే నా గుండెలవిసిపోతున్నాయి… కారు లోపల చిన్న లైట్ డిమ్ గా వెలుగుతోంది. ఒకడు డ్రైవింగ్ చేస్తుంటే ఇద్దరు వెధవలు నన్ను ఒడిసిపట్టుకుని ఉన్నారు. నేను కదలకుండా మత్తులోనే ఉన్నట్టు నటిస్తున్నాను. నేను మత్తులోనే ఉన్నాను అనుకుని ఒకచేత్తో నన్ను పట్టుకుని, మరో చేత్తో మద్యం సీసా ఎత్తి గటగటా తాగుతున్నారు ఆ ఇద్దరు మదాంధులు. మద్యం వాసన గుప్పుమని నా ముక్కు పుటలను తాకింది. కడుపులో తిప్పి భళ్ళున వాంతి అయింది నాకు. అంతలోనే వాళ్లలో ఒకడు ” ఒరే..దీనికి స్పృహ వచ్చేటట్టు ఉంది. వాంతి చేసుకుంది. త్వరగా పోనీరా ” అన్నాడు ఒక చేత్తో గట్టిగా నా మోకాలు పట్టుకొని. నా ఒంటిమీద తేళ్లు, జర్రులు పాకినట్టు అసహ్యం వేసింది ఆ క్షణం. కానీ ఏమి చేయలేని ఆసహాయురాలిని. ” రేయ్, ఔటర్ రింగ్ రోడ్డు దాటేశాం రా.. ఇక ఐదు నిముషాలు ఓర్చుకోరా. కారుని గండి చెఱువు దగ్గర ఆపేసి అక్కడ దీంతో మజా చేద్దాం” అన్నాడు డ్రైవింగ్ సీట్లో ఉన్న వాడు.
ఆ మాట వింటూనే నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంతేనా నా జీవితం. ఇదేనా నా జీవితానికి చివరిరోజు…నా తెలివితేటలు, చదువు, ఆశలు, ఆశయాలు ఇవన్నీ ఈ మృగాళ్ళ దాష్టికానికి బలైపోవలసిందేనా… నేను మరో ” దిశ “ను కానున్నానా… కన్నీళ్ళు వెచ్చగా నా చెంపలను తడిపేసాయి. అమ్మ,నాన్న గుర్తుకు వచ్చారు. బాగాపొద్దు పోయి రాత్రి అయినా నేను ఇంకా ఇంటికి రాలేదని అమ్మ ఎంత భయపడుతున్నదో తలుచుకోగానే దుఃఖం ముంచుకొచ్చింది నాకు. అంతలోనే ఏదో తెలియని తెగింపు వచ్చింది నాకు. నేను ఈ దుర్మార్గుల చేతిలో బలిపశువును కావడానికి వీలులేదు. ఎలాగైనా ఈ కామాంధుల నుండి తప్పించుకోవాలి. కాలేజీలో ఎవరికి అన్యాయము జరిగిందన్నా, ఎవరైనా మా ఫ్రెండ్స్ ని ర్యాగింగ్ చేసినా, చులకనగా మాట్లాడినా, వాళ్ళ చేత ఆపాలజీ చెప్పించేదాకా పోరాడేదాన్ని. కాలేజీలో అందరు నన్ను ఝాన్సీ రాణి అనేవారు. ఆ ధైర్యం, ఆ తెగువ ఇపుడు ఏమైనాయి
నాలో… పేపర్లో రోజుకో చోట ఆడదానిపై అత్యాచారం,హత్య అనే వార్తలు చదువుతుంటే నా రక్తం మరిగిపోయేది. ఆ దుర్మార్గులందరిని కట్ట కట్టి చంపేయాలి అన్నంత కోపం వచ్చేది. అలాంటిది ఆపద నాదాకా వస్తే….పెద్దగా ఏడవాలనిపించింది. ఒకరికి ముగ్గురు ఉన్నారు. ఒకవేళ తప్పించుకోలేకపోతే…ఈ నీచులు నాపై అత్యాచారానికి ఒడిగట్టి, ఆపై చంపేసి నా శవాన్ని గండిపేట చెఱువులో తోసేసి చేతులు దులుపుకుంటే..అయ్యో..ఈ చీకట్లో ఈ దుర్మార్గపు మృగాలనుంచి నన్ను రక్షించే వాళ్ళే లేరా. పెద్దగా అరచి వాళ్ళనుంచి పెనుగులాడి తప్పించుకుందాం అనుకున్నాను. ముసురుకున్న దిగులు, భయం నుంచి ఆలోచనలను మళ్లించి, తప్పించుకునే మార్గం కోసం మెరుపు వేగంతో ఆలోచిస్తున్నాను.
నా ఆలోచనలకంటే వేగంగా కారు దూసుకు పోతోంది. వాళ్ళు పెగ్గు మీద పెగ్గు తాగుతూనే ఉన్నారు. నేను మత్తులోనే ఉన్నానని కాస్త పట్టు సడలించారు వాళ్ళు. మద్యం వాసన నా కడుపులో పేగులను మెలిపెడుతోంది. గబ్బుక్కున లేచి ఇద్దరిని చెరోవైపుకు నెట్టేసాను. “ఒరే… గట్టిగా పట్టుకోరా, పిట్ట ఎగిరిపోయేట్టు ఉంది.” అంటూనే పశు బలంతో నన్ను ఒడిసి పట్టుకున్నారు ఆ వెధవలు. నా భుజాలు ఒరుసుకు పోతున్నాయి. ఇక నా వేదన అరణ్య రోదనే.. వీళ్ళ నుంచి తప్పించుకోవడం మృగ్యం. ఈ రోజుతో నాకు, ఈ లోకానికి ఋణం తీరిపోయింది…
మన కవులు వారిజాక్షులందు, వైవాహికములందు, ప్రాణ, మాన, విత్తములకు భంగం కలిగినపుడు బొంకవచ్చు అంటూ ఎన్నో ఉపాయాలు, నీతులు, సామెతలు చెప్పారే కానీ ఓ స్త్రీ తన మాన, ప్రాణాలను కామాంధులనుండి రక్షించుకోవడానికి మాత్రం ఎటువంటి ఉపాయాలు చెప్పలేదు. బహుశా వాళ్ళ కాలంలో స్త్రీలపై సామూహిక అత్యాచారాలు, యాసిడ్ దాడులు, స్త్రీల మానంలోకి ఇనుప కమ్ములు గుచ్చి చిత్రవధ చేసి చంపడాలు లాంటి నికృష్టాలు జరగలేదేమో. రావణుడు, కీచకుడు లాంటి అసురులు కూడా స్త్రీ అనుమతి లేకుండా వారిని చెరబట్టరేమో… కానీ ఇది కలికాలం, విష పురుగులు, మధ పశువులు, కామ పిశాచులు తిరుగాడే నీచపు కాలం. పగలు, రాత్రి, వావి, వరుసలు లేకుండా ఆడ శరీరం కోసం వేటాడుతూ, వారి అంగాంగాలు, రక్త మాంసాలను పీక్కు తినే మృగాల ముదనష్టపు కాలం ఇది. అసలే కోతి, ఆపై కల్లు తాగినట్టు, అగ్నికి ఆద్యం తోడైనట్టు ఈ మానవ మృగాల దాష్టికానికి మరింత ఊతం ఇచ్చేది ఈ మద్యం. మరి ఇటువంటి మృగాలనుంచి తప్పించుకోవాలంటే ఎన్ని ఉపాయాలు తెలియాలి. ముళ్ళ మీద పడిన గుడ్డను చినగకుండా ఎంత నైత్రంగా తీసుకోవాలి. బేలగా మారి వీళ్ళ చేతిలో బలి పశువుగా మారేదానికన్నా అపాయాన్ని ఉపాయంతో ఎదుర్కొని ఈ రోజు చావో, రేవో తేల్చుకోవాలనుకున్నాను. మరుక్షణం పెద్దగా నవ్వుతూ “మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం ” అన్నాను.
నేను ప్రతిఘటిస్తానని ఊహించిన వెధవలు నేను ఆలా అడిగేసరికి నివ్వెరపోయారు. పట్టు సడలించకుండానే ” చెప్తే ఏం చేస్తావ్ ” అన్నాడు ఒకడు పళ్ళు ఇకిలిస్తూ.. ” దాంతో మాటలేందిరా, తప్పించుకోవాలనిచూస్తుంది ఇది” అంటూ గట్టిగా నన్ను పట్టుకుని ” త్వరగా పోనీరా.. ఇక్కడ ఒళ్ళు పెనంలా కాలిపోతోంది. ఇది తప్పించుకుంటే నిన్ను చంపేస్తా రా” అన్నాడు రెండోవాడు. ముగ్గురు పాతికేళ్ల లోపు వాళ్ళలాగా ఉన్నారు. వెంటనే నేను ధైర్యమ్ కూడగట్టుకుని ” కారులో ఏం బాగుంటుంది. మీరు ముగ్గురు ఉన్నారు. కారు ఆపితే అట్లా చెట్లకింద అయితే మీకొక్కరికి స్వర్గం చూపిస్తాను” అన్నాను సందేహంగానే. డ్రైవింగ్ సీట్లో ఉన్నవాడు వెనక్కి తిరిగి నా వంక ఎగాదిగా చూసాడు. వాళ్ళని చూసి బెదిరి పోకుండా అలా మాట్లాడేసరికి నా మీద ఏదో నమ్మకం కలిగింది వారికి నేను తప్పించుకోననిపించింది. నేనో ప్రొఫెషనల్ వేశ్యలాగావాళ్ళకి అనిపించి ” ఏంటి స్వర్గం చూపిస్తావా..? మాటలు బాగా నేర్చావే.. తప్పించుకు పారిపోతావని భయపడ్డాం ” అన్నాడు వెకిలిగా నవ్వుతూ… వాడు తాగుతున్న సిగరెట్టు పొగ, మద్యం కంపుకు గుక్క తిప్పుకోలేనంత దగ్గు వచ్చింది. తమాయించుకున్నాను. వాడు చెట్ల పక్కన కారు ఆపాడు. డిమ్ లైట్లో నా హ్యాండ్ బ్యాగ్ నా కాళ్ళకింద పడిఉండడం గమనించాను. ” మరి నాకేం ఇస్తారు మీరు ” అన్నాను సానిదానిలాగా.. ” దీనికి పైసలు గావాలంటారా ” అంటూ వెకిలిగా నవ్వుతూ కారు డోర్ తీసి నన్ను బైటకు లాగాడు ఎర్ర టీ షర్ట్ వేసుకున్నవాడు. రెండోవాడుకూడా దిగాడు నన్ను ఒరుసుకుంటూ. డ్రైవింగ్ సీట్లో ఉన్నవాడికి మద్యం మత్తు బాగా ఎక్కినట్టు ఉంది. కారు దిగకుండా కారు స్టీరింగ్ మీద తల వాల్చేసాడు. ఒకడి బాధ తప్పింది. ఈ ఇద్దరి నుంచి ఎలా తప్పించుకోవాలి ఆనుకుంటుంటే, ఇద్దరు నన్ను గుబురు చెట్ల మధ్యకు దాదాపు ఈడ్చుకుంటూ తీసుకెళ్ళసాగారు… ఇపుడు ఏమిటి నా గతి…
అసలే డిసెంబర్ నెల. ఆపైన అమావాస్య దగ్గర పడిందేమో.. చుట్టూ చిమ్మ చీకటి. అక్కడ నేను అరిచి గీ పెట్టినా అది అరణ్యరోదనే అవుతుందని గ్రహించాను. వాళ్లలో ఒకడు సెల్ ఫోన్ లైటు వేసాడు. నేను ముందు అంటే నేను ముందు అని కాట్ల కుక్కలా నా మీద పడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. చప్పున “చాల దాహంగా ఉంది. నా బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉంది. నీళ్లు తాగి వస్తాను అన్నాను చివరి అస్త్రంగా. కారుకి, చెట్ల పొదలకి మధ్య పది అడుగుల దూరం ఉంది. నిజం గానే నాకు భయం,గుండె దడ ఓ పక్క, ఆకలి, దాహం మరోపక్క దంచేస్తున్నాయి. క్షణ క్షణానికి పోరాటం, అపజయం నాలో సంఘర్షణ పడుతున్నాయి. ఏ కళనున్నారో ” నీళ్లు కావాలా నీకు ” అంటూ విసుక్కుని ” సరే రా ” అంటూ నా చేయి పట్టుకుని కారు దగ్గరకి లాకెళ్ళాడు ఎర్ర టీ షర్ట్ వాడు. “త్వరగా తీసుకురారా వెధవ
నేను ఇక ఆగలేక ఉన్నాను ” అంటూ తొందర పెట్టాడు రెండో వాడు. కారు వెనక సీట్ లో నా హ్యాండ్ బ్యాగ్ అడుగున చేయి పెట్టి తడమసాగాను. డ్రైవింగ్ సీట్లోని వాడు శవంలా పడివున్నాడు. ఏంటే ఆలస్యం లం… త్వరగా రా అని లాగుతున్నాడు వాడు. వస్తున్నా అంటున్న క్షణము లోనే బ్యాగ్ లో నేను వెతుకుతున్నది నా చేతికి తగిలింది. తక్షణమే మెరుపు వేగంతో ఆ బాటిల్ మూత తీసి నన్ను పట్టుకుని ఉన్నవాడి కళ్ళలో స్ప్రే చేశాను.అది పెప్పర్, పచ్చిమిరపకాయల రసం కలిపి చేసిన స్ప్రే. వాడికి ఏం జరిగిందో కూడా తెలియలేదు. ఒక్కసారిగా గావు కేక పెట్టి నన్ను వదిలేసి కుప్ప కూలి కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని మంటలకు దొర్లసాగాడు నన్ను బూతులు తిడుతూ…ఆ అవకాశాన్ని నేను వదులుకోలేదు. ఏమైందో అర్ధంకానీ రెండోవాడి దగ్గరకు పరిగెత్తి రెప్పపాటులో వాడి కళ్ళలో కూడా పెప్పర్ స్ప్రే చేశాను. ” దిశా” ఘటన జరిగినప్పటినుంచి ఆడపిల్ల గల ఏ తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేదనుకుంటా. అందుకే అమ్మ నేను ఎప్పుడైనా ఒంటరిగా ప్రయాణించేటప్పుడు ఎందుకైనా మంచిదని ఈ పెప్పర్ స్ప్రే బాటిల్ కొని నేను వద్దన్నా నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టింది. ఈ రోజు అదే నన్ను ఈ మృగాళ్ల నుంచి కాపాడింది. ఇద్దరు హా హా కారాలు చేస్తూ కిందపడి దొల్లుతూ నన్ను బూతులు తిడుతున్నారు. క్షణం ఆలస్యం చేయకుండా నేను చుట్టూ పక్కల చూసాను. ఉహు.. ఏ అలికిడి లేదు. చీకటిలో ఏం కనిపించడం లేదు. గబా గబా కారు మొత్తం వెదికాను తాడులాంటిది ఏమైనా ఉందేమోనని. కారులో ముందు సీట్ కింద చుట్టలు చుట్టి ఉన్ననైలాన్ తాడు ఉంది. అంటే నా ఊహ నిజమే… ఈ వెధవలు మందు తాగి అచ్చోసిన ఆంబోతుల్లాగా ఊరిమీద పడి ఒంటరిగా దొరికిన ఆడదాని జీవితం నాశనం చేయాలనీ, ఆనక నిస్సహాయ స్థితిలో ఉన్నదాన్ని ఈ తాడుతో గొంతు బిగించి చంపివేయాలని ముందే తయారుగా ఉన్నారన్న మాట.
కారులోనుంచి నైలాన్ తాడుని తెచ్చి నా ఒంటిలోని బలమంతా ఉపయోగించి కళ్ళమంటలతో కింద పడి గింజుకుంటున్న ఇద్దరి కాళ్ళు,చేతులు కట్టేసాను. కళ్ళ మంటలు, మద్యం మత్తు ఎక్కువైనా ఇద్దరిలో కాసేపటికే కదలికలు ఆగిపోయినాయి. ఇంత శక్తి, ఇంత తెగువ నాకు ఎలా వచ్చాయో నాకే తెలియలేదు. బహుశా పిల్లినైనా గదిలో బంధిస్తే తన ఆత్మ రక్షణ కోసం పులి లా మారుతుందేమో. అటువంటిది ఒంటరి ఆడదాన్ని చెరపట్టడానికి ప్రయత్నం చేస్తే అబల కూడా ఆదిపరాశక్తిగా మారదా….
చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలి. కారు డ్రైవింగ్ సీట్లో శవంలా పడి ఉన్న వాణ్ణి కూడా కారులో నుంచి బైటకు లాగి నైలాన్ తాడుతో కట్టేసాను. తర్వాత కారులోకి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. రెండు నెలల ముందే ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా నేర్చుకున్న కారు డ్రైవింగ్ నాకు ఇప్పుడు ఉపయోగపడింది. మొదట చీకటిలో కాస్త తడబడుతూ నడిపాను. రింగ్ రోడ్ దాటి హైవేమీదకు రాగానే లైట్ల కాంతిలో దారి చూసుకుంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ ముందు కారు ఆపి గట్టిగా హారన్ కొట్టాను. అంతే గుర్తు ఉంది నాకు. నీరసంతో స్పృహ తప్పింది నాకు.
కళ్ళు తెరిచేసరికి పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్స్ నాకు సపర్యలు చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన టీ తాగి కాస్త తేరుకున్న తర్వాత అక్కడి పోలీస్ ఇన్స్పెక్టర్ కి జరిగినది అంతా పూస గుచ్చినట్టు చెప్పాను. అప్పటికి టైం ఒంటిగంట అయినది. వాళ్ళ ఫోన్ అడిగి తీసుకుని అమ్మకు ఫోన్ చేశాను. ఒక రింగ్ కే అమ్మ ఫోన్ ఎత్తి దాదాపు ఏడుస్తూ ” పాపా… ఏమైపోయావు తల్లి ఇంత రాత్రిదాకా. నీకేమైందో అని నేను విలవిలలాడుతున్నాను. నాన్నకు కూడా ఫోన్ చేసి చెప్పాను. తను కూడా కంగారుపడుతూ బయలుదేరారు. అసలు ఎక్కడున్నావు నీవు. నీకేం ప్రమాదం జరగలేదు కదా ” అంటూ ఏడుస్తోంది. అమ్మకు జరిగింది చెప్పి, కంగారు పడవద్దు, పోలీసుల రక్షణలో ఉన్నానని , ఇంటికి వస్తున్నానని చెప్పాను.
నేను అందించిన సమాచారం విని పోలీసుస్టేషన్లలో అందరు నా ధైర్యానికి, తెగువకు నన్ను మెచ్చుకున్నారు. వెంటనే షీ టీమ్స్ లీడర్ స్వాతి మేడం, మరికొందరు పోలీస్ అధికారులతో కలిసి రెండు వాహనాల్లో లో నేను చెప్పిన చోటికి వెళ్ళాం. ఆ వెధవల కారును సీజ్ చేసారు. నేను గుర్తులు చెప్తుండగా గండి పేట చెరువు సమీపంలో ఉన్న చెట్లపొదల దగ్గరకు చేరుకున్నాం. ఆ ముగ్గురు దుర్మార్గులు ఇంకా మత్తులోనే పడిఉన్నారు. పోలీసులు వారి కట్లు విప్పి వారి చేతులకు బేడీలు వేసి వారిని అరెస్ట్ చేసారు. నన్ను వారి వాహనంలోనే ఇంటిదగ్గర భద్రంగా దింపారు.
ఆ మృగాళ్లు ఇప్పుడు జైల్లో కటకటాల వెనుక ఉన్నారు. నేను చెప్పిన తిరుగులేని సాక్షం తో వారికి కారాగార శిక్ష పడింది. ఆ పక్క రోజు దినపత్రికలలో, టీవీ, యూ ట్యూబ్ చానెల్స్ లో, సోషల్ మీడియా లో నన్ను అందరు ఆకాశానికి ఎత్తేసారు. సాహసానికి మారు పేరు నేను అని అన్ని వార్త చానెల్స్ లో, నలుగురు ఓ చోట చేరి నా ధైర్యమ్, తెగువ గురించే చెప్పుకుంటున్నారు. వీరనారి, ఆదిపరాశక్తి, అపర భద్రకాళి, అబల కాదు సబల అంటూ నాకు బిరుదులు తగిలించి నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. మహిళా సంఘాలు నాకు సన్మానం చేసాయి.
ఇదిగో మీ ముందు ఇపుడు ఈ సన్మాన సభలోకూడా నన్ను మాట్లాడమన్నారు. నేను అందరికి ఒకటే విన్నపం చేసుకుంటున్నాను. ” అర్ధ రాత్రి స్త్రీలు ఏనాడైతే ఒంటరిగా, స్వేచ్ఛగా తిరగగల్గుతారో ఆనాడే మన దేశానికీ సంపూర్ణ స్వతంత్రం వచ్చినట్టు ” అని మహాత్మా గాంధీజీ అన్నారు. కానీ మన దౌర్భాగ్యం అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు కూడా మహిళలు బయట తిరగలేని నికృష్టపు కాలంలో ఉన్నాం ఇపుడు మనం. ఇంటి నుంచి తమ ఆడబిడ్డ బయటకు వెళ్లిందంటే తిరిగి ఇంటికి చేరేవరకు కన్నవారికి ఆందోళనే. దానికితోడు మన టీవీ ప్రోగ్రామ్స్, యూ ట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియాలో కూడా ఆడదంటే మగవాడు వాడుకునే విలాస వస్తువుగా చిత్రీకరిస్తున్నారు. ఆడది పక్కలోకి మాత్రమే పనికి వస్తుంది అని స్టేట్మెంట్స్, ద్వంద్వార్థపు కుళ్ళు జోకులు, టచ్ స్క్రీన్ ని కదిలిస్తే వచ్చిపడే పోర్న్ వీడియోలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. యువత అనే కాదు, వయసుతో సంబంధం లేకుండా అరవై పైబడిన వృద్దులు సైతం ఆడది కనిపిస్తే చాలు చొంగ కార్చుకుంటూ అవకాశాల కోసం అర్రులు చాస్తుంటారు.వారంతా ఎక్కడో లేరు. మన మధ్యనే పక్కింటి అంకుల్ రూపంలోనో, ఎదురింటి బాబాయ్ రూపంలోనో, స్కూల్ వాచ్ మాన్ రూపం లోనో, దారిన పోయే దానయ్య రూపంలోనో మనుషుల రూపంలోనే ఉంటారు. ఒంటరి అడ శరీరం కనపడగానే వాళ్లలోని మృగం మేల్కొంటుంది. ఇటువంటి మానవ మృగాల ఆటలు కట్టించాలంటే మన దేశ సామాజిక వ్యవస్థలో సమూలంగా మార్పులు రావాలి. మన చట్టాలు కఠినతరం కావాలి. స్త్రీల పట్ల నేరం చెయ్యాలని ఆలోచనలు వచ్చినా ఒణికిపోయేలా శిక్షలు ఉండాలి. మహిళలను గౌరవించి సమాజంలో మహిళల విద్య, సమానత్వం కోసం పాటుపడి, మూఢనమ్మకాలను ఖండించి, సతీసహగమనం, వరకట్నం లాంటి దురాచారాలను రూపుమాపి, స్త్రీల అభ్యున్నతికి పాటుపడిన వీరేశలింగం పంతులు, రాజారామ్మోహన్ రాయ్, డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ లాంటి మహనీయులు పుట్టిన ధరిత్రి మనది. ఇటువంటి పుణ్య భూమిలో మానవ మృగాలకు చోటు ఉండకూడదు. నా అదృష్టం బాగుండి, కాస్త ధైర్యం,మరికాస్త అపప్రమత్తత తో ఆ రోజు నేను ఈ మృగాలా నుంచి తప్పించుకోగలిగాను.
నా కళ్ళ నుంచి కారిన రక్త కన్నీరును తుడుచుకుంటూ ” నేను ఇంతవరకు సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలనుకున్నాను. కానీ ఈ రోజు నాకు జరిగిన ఈ సంఘటనతో నా దిశను మార్చుకున్నాను. నా పేరు ఏదైనా ఇపుడు నన్ను అందరు సబల, సాహసి అని పిలుస్తున్నారు. ఈ సందర్భంలో నేను మీ అందరి సమక్షంలో “విదిశ” ఫౌండేషన్ ని ప్రారంభిస్తున్నాను. నా లాంటి వారిని నలుగురిని కూడకట్టుకొని ఊరూరా తిరుగుతూ స్త్రీలకు ధైర్య, సాహసాలు పెంపొందేందుకు వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్పిస్తాను. ఆపద సమయంలో మాన, ప్రాణాలను కాపాడుకునే నేర్పును, కరాటే లాంటి విద్యలను నేర్పించే కేంద్రాలను స్థాపించి ప్రతి స్త్రీ స్వీయ రక్షణ చేసుకునేలా కృషి చేస్తాను.
పసినాటి నుంచే ఆడ పిల్లలకే కాదు, మొగ పిల్లలకు కూడా క్రమశిక్షణ , స్త్రీలను గౌరవించాలనే మంచి పద్దతులను నేర్పించాలని తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ పాఠాలు చెప్తాను . సోషల్ మీడియాను ఉపయోగం లేని టిక్ టాక్ వీడియోలతో, ఉబుసుపోని కబుర్లతో దుర్వినియోగం చేయకుండ స్త్రీలకు ఆత్మ రక్షణ, ధైర్య,సాహసాలు, స్వీయ రక్షణ పద్దతులను తెలియచేసే వీడియోలు లాంటివి రూపొందించి సోషల్ మీడియాను మంచికి ఉపయోగపడేలా చేస్తాను. మనదేశంలో ఉన్న మానవ మృగాలన్నంటినీ సమూలంగా అంతమొందించేవరకు నా ఈ కృషిని కొనసాగిస్తాను. నా ఈ ప్రయత్నానికి మీరు కూడా చేయి కలిపి నేను తలపెట్టిన ఈ మహా యజ్ఞం లో మీరుకూడా నాతోకలిసి మీ సహకారాన్ని అందిస్తారని ఆశగా మీ అందరిని వేడుకుంటున్నాను”. అని చేతులు జోడించాను నేను.
నా నిర్ణయానికి అంగీకారంగా సభా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది.
…….