కుబుసం

నమస్తే. ఈ రోజు [31-10-2021] ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం “స్నేహ “లో నా కథ “కుబుసం ” ప్రచురితం అయింది. ప్రజాశక్తి సంపాదకులకు ధన్యవాదాలతో. కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయం కోరుతూ..

“వెతకండి..వెతికి పట్టుకోండి.. కొట్టండి..కొట్టి చంపేయండి” అరుపులకు మెలకువ వొచ్చేసింది నాకు.
” అబ్బా..సెలవు రోజు నిద్రపోనీకుండా పొద్దునే ఈ వెర్రి అరుపులు ఏంటి” కళ్ళు నులుముకుంటూ లేచాను. “ఈయన లేచి ఉదయపు నడక కోసం వెళ్లినట్లు ఉన్నాడు ” బ్రష్ మీద పేస్ట్ వేసుకుని కుడి చేత్తో పళ్ళు తోముకుంటూ, ఎడం చేత్తో గిన్నెలో నీళ్ళు పట్టి స్టవ్ మీద పెట్టి గ్యాస్ స్టవ్ వెలిగించాను. నిద్ర లేవగానే కాఫీ, టీ కాకుండా వేడి నీళ్ళు తాగడం నాకు అలవాటు. బ్రష్ చేసుకుని పళ్ళు పుక్కిలించుకుంటుంటే మళ్ళీ
” అంతా జల్లెడేసి పట్టండి. ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టి చంపండి” పెద్ద గొంతుకలతో అరుపులు, ఆ వెను వెంటనే కర్రలతో నలుగురైదుగురు ఎదురింటి వైపు దూసుకుపోయారు.
” ఏం ఘోరం జరిగిందో ఏమిటో..ఎవరికి ఏ ఆపద వొచ్చిందో..కాస్త కంగారు వేసింది నాకు.
నిరుపమ్ ఇంకా పడుకునే ఉన్నాడు. వాడు యూనిట్ టెస్ట్ పరీక్షలని రాత్రి చాల సేపు చదువుతూ ఆలస్యంగా నిద్రపోయాడు. గాఢనిద్రలో ఉన్న వాడిని లేపడానికి మనసొప్పలేదు నాకు. గబగబా ఒంటింట్లోకి వెళ్లి గ్యాస్ స్టవ్ కట్టేసి, మొబైల్ తీసుకుని, వాకిలి తలుపుకు గొళ్ళెం పెట్టి ఎదురింటి వైపుకు వెళ్ళడానికి రోడ్డు దాటాను.
ఏమిటో ఈ మధ్య ఏ ఘోరం జరిగినా విచారణ జరిగి దోషికి చట్టపరంగా శిక్ష పడేలోగానే ప్రజాగ్రహాన్ని గౌరవించాలి అంటూ అనుమానితుడిని ఏదోఒక రూపంలో చంపేస్తున్నారు. చేసింది తప్పే, ఘోరమే కావచ్చు, కానీ పశ్చాత్తాపం పడే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు.
ఆలోచిస్తూ ఎదురింటిలోకి అడుగు పెట్టాను. హాల్లో ఓ మూల ఉన్న మంచమ్మీద ఆంజనేయులు , ఆయన భార్య నర్సమ్మ గడగడా ఒణుకుతూ కనిపించారు. మరో పక్క ఎత్తుగా ఉన్న కుర్చీమీద వాళ్ళ కూతురు మౌనిక బిత్తరగా దిక్కులు చూస్తూ ఉంది. కర్రలతో ఒచ్చిన నలుగురు ఇల్లంతా కలయదిరుగుతూ దేనికోసమో వెదుకుతున్నారు.
” ఆంటీ ఏమైంది ! ఎందుకు మీరు అలా భయపడుతున్నారు. వీళ్ళు ఏం వెతుకుతున్నారు “
నా ప్రశ్నతో కొరకొరా చూసాడు ఆ ఇంటి యజమాని ఆంజనేయులు. మరి వారం క్రితం నాకు ఆయనకు పడిన గొడవ ఇంకా మర్చిపోయినట్లు లేదు ఆయన.
దీపావళి రోజు సాయంత్రం మన సంసృతి, సంప్రదాయాలను పిల్లలు మర్చిపోకూడదు, అదే సమయంలో మన చర్యలు సమాజానికి హాని చేయకూడదు అని ఇంటి ముందు వరండాలో ప్రమిదలలో నూనె దీపాలు వెలిగించి చాల కొద్దిగా ఎక్కువ పొగ రాని చిన్నచిన్న టపాకాయలను మా చిట్టి తండ్రి నిరుపమ్ తో కాల్పిస్తున్నాను.
ఎదురింటినుంచి చెవులు చిల్లులు పడేలా శబ్దాలు, విపరీతమైన పొగ వీధి అంతా వ్యాపిస్తోంటే ఓర్చుకోలేక వాళ్ళ ఇంటిముందుకు వెళ్లి
” అన్ని టపాకాయలు కాలుస్తున్నారు మీరు. విపరీతమైన శబ్ద కాలుష్యం, గాలి కాలుష్యం అవుతోంది. పండుగ సరదాకి కొన్ని కాల్చవచ్చు కానీ అన్ని కాల్చి డబ్బు దండగ మరోపక్క ఇతరులకు ఇబ్బందికదా ” అంటే
” మా ఇంటి ముందు మా ఇష్టం వొచ్చినట్లు కాలుస్తాం. అడగడానికి నువ్వెవరు. పెద్ద సంఘ సంస్కర్త బయలుదేరింది” అంటూ గొడవ పడ్డారు వాళ్ళు.
నేనెప్పుడో అది మర్చిపోయాను. ఆయన ఇంకా మరువనట్లుఉంది.
” శారదక్కా..మరి..మరి ఇంట్లోకి పాము దూరింది . నువ్వు జాగ్రత్త అక్క ” భయపడుతూ కుర్చీలో మరింత ముడుచుకుని కూర్చుంది మౌనిక.
” అయ్యో. ఇంట్లోకి పాము ఒచ్చిందా. మీరు భయపడకండి. మనకి పాము అంటే ఎంత భయమో, పాముకు కూడా మనుషులంటే అంటే భయం. ఇక్కడే ఎక్కడో దాగి ఉంటుంది అరుపులకు. నేను ఇప్పుడే స్నేక్ స్నాచర్ వాళ్ళకి ఫోన్ చేస్తాను. వాళ్ళు ఒచ్చి పాముని పట్టుకుని తమతో పాటు తీసుకువెళతారు” అంటూనే సిటీలో ప్రముఖ సినీ నటులు సాయి కిరణ్ వాళ్ళు నడుపుతున్న స్నేక్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళ నెంబర్ కి ఫోన్ చేసి విషయం చెప్పి అడ్రస్ చెప్పాను.
ఆంజనేయులు నా వైపు చీదరింపుగా చూస్తూ ” ఆ నువ్వు ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చేస్తారా! వాళ్ళు వచ్చే లోపల ఆ పాము బయటికి ఒచ్చి ఎవరినో ఒకరిని కాటు వేస్తుంది. దాన్ని పట్టి చంపేస్తే కానీ నాకు మనఃశాంతి ఉండదు. ” ఇంకా ఒణుకుతూనే మంచం కోడు మరింత గట్టిగా పట్టుకున్నాడు.
“అంకుల్..ఒక్క పది నిముషాలు ఓర్చుకోండి” అంటూ పాముని వెదుకుతున్న నలుగురితో పాటు ఇల్లంతా కలయతిరుగుతున్నాను నేను. స్నేక్ స్నాచర్లు వొచ్చేవరకు ఆ పాము కనపడకూడదని. లేకుంటే అది విషరహిత పాము అయితే అనవసరంగా ఓ ప్రాణిని చంపినట్లు అవుతుందని ఆందోళనతో.
అంతలోనే వంటింటి అటక మీద నుంచి ఇస్తరాకుల కట్ట కింద పడింది. అందరం అటక మీదకి చూసాం. నల్లగా, అక్కడక్కడా గోధుమరంగు మచ్చలతో ఇంత పొడుగు పాము మెలికలు తిరుగుతూ రెండుగా చీలినట్లున్న పొడవైన నాలుకను బయట పెడుతూ హిస్ హిస్ మంటూ బుస కొడుతోంది. ఒక్క క్షణం అందరిని భయం ఆవరించింది.
” పా..పా… పాము..అదిగో అటక మీద..కింద పడుతుంది..కొట్టండి..చంపండి ” అరుస్తున్నారు అందరు గోల గోలగా.
స్నేక్ స్నాచర్లు త్వరగా వస్తే బాగుండు. అది విష సర్పం అయితే ఎవరికైనా ప్రమాదం జరుగుతుంది . నాలో కూడా ఆందోళన మొదలైంది.
అది అటక మీదే మెలికలు తిరుగుతోంది. ” ఇంకా ఆలోచిస్తారేంది..పాము కనిపించింది కదా కొట్టండి..చంపేయండి ” హాల్లోనించి అరుస్తున్నాడు ఆంజనేయులు.
పాము అటకమీద నుంచి కిందపడి చూస్తుండగానే క్షణాల్లో మెలికలు తిరుగుతూ హాల్లోకి వెళ్ళింది. పాముని చూడగానే నర్సమ్మ, ఆంజనేయులు వాళ్ళ పైప్రాణాలు పైనే పోయాయి. ఒచ్చిన వాళ్ళు హాల్లోకి పరుగెత్తి కర్రలతో పాముని కొట్టబోయే క్షణంలో
“ఆగండి..” అని అరుస్తూనే సరిగ్గా ఇంటి ద్వారం ముందు పడగ విప్పి ఉన్న మూడు అడుగుల పాముని పడగ కింద ఓ చేత్తో, మరో చేత్తో తోకని గట్టిగా పట్టుకుని ఒడుపుగా నల్లటి పెద్ద ప్లాస్టిక్ కవర్లో వేసి క్షణాల్లో కవర్ ని గట్టిగా పురికోస తాడుతో బిగించి కట్టేసి వాళ్ళు ఒచ్చిన వాహనం డిక్కీలో పెట్టి డిక్కీ మూసేసారు స్నేక్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నుంచి ఒచ్చిన ఇద్దరు మనుషులు.
అదంతా అవాక్కై చూస్తున్న ఆంజనేయులు దంపతులు అప్పటికి తేరుకున్నారు. అతనికి ఇంకా గుండె దడ తగ్గలేదు.
” సమయానికి మాకు ఫోన్ చేసి మంచిపని చేసారు మేడం. లేకుంటే ఆ పాము ప్రాణాలు తీసేవాళ్ళు. అసలు పాము కాటు వేసి చనిపోయినవారికంటే, పాము అంటే భయంతో గుండె ఆగిచనిపోయినవారి సంఖ్య ఎక్కువ. ఎప్పుడు పాములు కనిపించిన కాస్త దైర్యంగా, మరికాస్త సంయమనంతో మాకు ఫోన్ చేస్తే మేము చాల త్వరగా స్పందించి వచ్చేస్తాం”అన్నారు వాళ్ళు నా వంక అభినందనపూర్వకంగా చూస్తూ.
ఇక తప్పదన్నట్లు ఆంజనేయులు కూడా వారికి కృతఙ్ఞతలు తెలిపాడు. వాళ్ళు స్నేక్ ఫ్రెండ్స్ విజిటింగ్ కార్డు ఆంజనేయులుకి ఇచ్చి వాళ్ళ వాహనంలో వెళ్లిపోయారు. ఆ పాముని దూరంగా అడవుల్లో వొదిలేస్తారని వాళ్ళ మాటల్లో తెలిసి సంతోషం కలిగింది నాకు.
ఆంజనేయులు నా వంక అభావంగా చూస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన భార్య నర్సమ్మ మాత్రం ” వాళ్ళకి ఫోన్ చేసి మంచిపని చేసావు తల్లీ ” అంటూ ఓ కృతజ్ఞతా చూపు నా వైపు విసిరి వెళ్ళింది.
వాళ్ళ చూపులను పట్టించుకోకుండా ఇంటికి వొచ్చేసాను నేను. ఎందుకో ఈ రోజు ఓ ప్రాణిని కొట్టి చంపకుండా కాపాడాను అనే తృప్తి కలిగింది నాకు. నాకెవరితో పనిలేదు అంటూ కాలం ముందుకు పోయి వారం రోజులను గతంలోకి నెట్టేసింది.
పొద్దునే లేచి స్నానాదులు కానిచ్చి దేవుడి గదిలో దీపం, అగరవొత్తులు వెలిగించాను. పటాలకి పూలు పెట్టి దణ్ణం పెట్టుకున్నాను. ఆయన హాల్లో నిరుపమ్ కి త్రికోణమితి లెక్కలు చెప్తూ ఉన్నాడు. నిరుపమ్ కి బూస్ట్, ఆయనకి కాఫీ ఇచ్చి, నేను కాఫీ తెచ్చుకుని దినపత్రిక చూస్తూ నింపాదిగా కాఫీ తాగాను.
తలస్నానం చేసిన చుట్టూ తడి ఆర్పుకొని దువ్వి రబ్బర్ బ్యాండ్ వేసుకుని, ఫ్రిడ్జ్ లో నుంచి రెండు పాల పాకెట్స్ తీసి కవర్లో వేసి, కత్తెర, టెంకాయ, కొన్ని పూలు కూడా కవర్లో వేసుకుని ఆయనకి చెప్పి ఇంటి నుండి బయట పడ్డాను.
నేను వెళ్ళేటప్పటికే గుడి బైట వరకు పెద్ద క్యూ కట్టి ఉన్నారు అందరు చేతిలో పాల పాకెట్స్ తో. నాలుగు చాంతాళ్ళంతా పొడవున్న క్యూ ని చూడగానే నీరసం ఆవరించింది నన్ను. కానీ తప్పదు. వరుసలో నిలబడ్డాను.
చిన్నప్పుడు అమ్మ నాగులచవితి రోజు ఉపవాసం ఉండి పుట్టకు వచ్చి పాలు పోసి నాగేంద్రస్వామికి మొక్కేది. అమ్మతో పాటు నేను పుట్ట దగ్గరకు వెళ్ళేదాన్ని.
అప్పుడే నేను “పుట్టలో ఇంత మంది పొసే పాలు పాము తాగుతుందా అమ్మ. పాము అక్కడ ఉంటే నాగులచవితి రోజే ఎందుకు పోస్తారు. మిగతా రోజుల్లో కూడా దానికి ఆకలి కదా. రోజు ఎందుకు పాలు పోయారు” ఇలా అడిగేతే అమ్మ కోప్పడేది.
” భక్తితో ఈ రోజు పుట్టలో పాలు పోస్తే నాగేంద్ర స్వామి పసిబిడ్డలను కాపాడతాడట. నువ్వు నాతో వితండ వాదం చేయకుండా నాగులచవితి రోజు పుట్ట దగ్గరకు వచ్చి పాలు పొయి. ఇది నువ్వు చేసే ఇష్టమైన పని నాకు. నువ్వు ప్రతి నాగులచవితికి పుట్టకు వచ్చి పాలు పోస్తానని నాకు మాట ఇవ్వు. ” అని అమ్మ నా దగ్గర మాట తీసుకోవడం, అమ్మ మనసు నొప్పించలేక నేను మాట ఇవ్వడం వల్ల ఈ రోజు నేను ఈ వరుసలో నిలబడాల్సి వచ్చింది.
క్యూ లైన్ ఏమాత్రం తరగడం లేదు. వెనక్కి వెళ్ళలేను. ముందుకి పోలేను. ఇంతలో పెద్దగా “కాస్త త్వరగా ముందుకు పోండి. పాలు పోసేసినోళ్లు పుట్ట దగ్గరే నిలబడకుండా కదలండి” అని వినపడడం, సరిగ్గా అదే సమయానికి అతను వెనక్కి తిరిగి నన్ను చూడడం జరిగింది.
అతన్ని చూడగానే నాకెందుకో నవ్వు వచ్చింది. వారం క్రితం పామును ఒక మాములు జంతువుల తలచి దాన్ని చంపవద్దు. స్నేక్ స్నాచర్లు చంపకుండా పట్టుకుపోతారు అన్న నేను, పాము కాటుకు భయపడి పామును కర్రలతో కొట్టండి, చంపేయండి అన్న మా ఎదురింటి ఆంజనేయులు ఇద్దరం ఒకే వరుసలో ఉన్నాం మరి.
అతను కోర కోర చూస్తున్నాడు నా వంక. నేను పుట్ట దగ్గరకు రావడం చాల ఆశ్చర్యాన్ని కలిగించింది అతనికి ఆయన భార్య నర్సమ్మకి. వాళ్ళ దృష్టిలో నేను దేవుడిని నమ్మని హేతువాదిని మరి.
పాల పాకెట్స్ అక్కడే కత్తిరించడం పుట్ట మీద పాలు కుమ్మరించడం, నేల పాలైన పాలతో పుట్ట చుట్టూరు మట్టి నెల చిత్తడి చిత్తడిగా తయారైంది. పాలతో పాటు పసుపు, కుంకుమ పాకెట్స్ కత్తిరించి పుట్టమీద వేసేస్తున్నారు. ఖాళీ పాల కవర్లు, పసుపు, కుంకుమ కవర్లు , టెంకాయ పీసు, గుట్టలు గుట్టలుగా కొన్ని, చెల్లాచెదరుగా మరికొన్నిటితో పుట్ట చుట్టూ ఉన్న ప్రాంతమంతా నిండి పోయింది. సాంబ్రాణికడ్డీల పొగ దట్టంగా అములుకుంటోంది.
ఊపిరాడక నాకు దగ్గు వచ్చింది. త్వరగా పాలు పుట్టదగ్గర పోసేసి పోదామనుకుని ఇద్దరు, ముగ్గురిని దాటుకుని ముందుకు వెళ్లబోయాను.
ఎదురింటాయన ఆమాంతం నన్ను వెనక్కి తోసేసాడు. చిత్తడి నేలలో కాలు జారీ పడబోయి అతికష్టం మీద నిలదొక్కుకున్నాను.
” ఏమమ్మా..నీకు భక్తి లేదు, ముక్తి లేదు. పుట్టలో పాలు పోసేదానికి వచ్చావా. మేము గంట నుంచి వరుసలో నిలబడి ఉన్నాం. మాకంటే ముందు పోవాలంటే యెట్లా నువ్వు ” ముఖానికి గంటు పెట్టుకున్నాడు ఆయన.
ఇక ఓర్చుకోలేక ” ఆ రోజు పాము కనిపిస్తే కొట్టండి, చంపండి అన్నది మీరు కదా.. మీరు మహా భక్తులా” అన్నాను
” మరి పాము కనిపిస్తే చంపకుండా ఉంటామా. పాము పామే. భక్తి భక్తే ” అతని మాటలకి కొందరు వంతపాడారు.
వాళ్ళ విచిత్ర ధోరణికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు నాకు. మాట మాట పెరిగింది.
మరి వాళ్ళని అని నేను చేస్తున్నది ఏమిటి. ఏదో తెలియని విరక్తి కలిగి గిరుక్కున వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేసాను. పాము తన పాత చర్మం కుబుసాన్ని వదిలి వేసినట్లు ఆ రోజుతో నాలో ఉన్న కొన్ని భ్రమలను వదిలి వేసాను.
పాల పాకెట్స్ తో ఒచ్చిన నన్ను చూసి ఆయన ” ఏంటి శారద..! పుట్టలో పాలు పోయలేదా..? ఇంటికి తెచ్చేసావు ” పేపర్ లో నుంచి ఒకసారి తల బైటపెట్టి మళ్ళీ తాబేలులా పేపర్లో తల దూర్చేసాడు.
నేను ఏం జవాబు చెప్పకుండా ఫ్రిడ్జ్ తీసి ఇంకో రెండు పాల పాకెట్స్ తీసాను. మొత్తం ఓ పెద్ద గిన్నెలో పోసి పాలు కాచి, మరోపక్క స్టవ్ మీద మూడు కేజీల బియ్యం కుక్కర్లో పెట్టి అన్నం వండాను. సగం అన్నంలో పాలు పోసి బెల్లం, ఏలకులపొడి, పచ్చ కర్పూరం , ముంతమామిడి పప్పు, కిస్మిస్లు వేసి పొంగలి చేశాను. మిగతా అన్నంలో పెరుగు వేసి కలిపి ఆవాలు,ఇంగువ, మినపప్పు, మిర్చి, కరివేపాకు తిరగమోత వేసి దద్దోజనం చేశాను.
ఇంట్లో ఉన్న పార్సెల్ కవర్లలో పొంగలి, దద్దోజనం పెట్టి దారాలు కట్టాను. పది పాకెట్స్ అయినాయి అవి. కొంచం పొంగలి, దద్దోజనం ప్లేట్లో పెట్టి నాగేంద్రస్వామి పటం ముందు పెట్టి నైవేద్యం ఇచ్చాను.
పది పాకెట్స్ ఓ సంచిలో వేసుకుని, ఆయనకి చెప్పి నిరుపమ్ తో సహా బయట పడ్డాం.
వీధులన్నీ తిరుగుతూ, అక్కడక్కడా ఏ దిక్కు లేక రెక్కలు తెగిన ఒంటరి పక్షుల్లా, అభిమానం చంపుకుని ఆకలితో చేయి చెపుతున్న ముసలివారి చెంతకు వెళ్ళి పొంగలి, దద్దోజనం పాకెట్స్, కొంత డబ్బులు వారిచేతికి నిరుపమ్ చేత ఇప్పించాను. వాళ్ళ కళ్ళల్లో కనపడిన తృప్తిలో నాకు చల్లగా దీవించే దేవుడు కనపడినాడు.

6 thoughts on “కుబుసం”

  1. మంచి కాన్సెప్ట్ అక్క. మూఢ భక్తి పెరుగుతున్న దశలో చక్కని కతాంశాన్ని పట్టుకొని కథ చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అనే అంతరార్థాన్ని చెప్పకనే చెప్పారు. అభినందనలు అక్క.

  2. Ch శివ సుబ్రహ్మణ్యం

    కథ చాలా బాగున్నది. కళ్ళకు కట్టినట్టున్న ఈ కథలో శీర్షిక ను వెతకటం కష్టమే.

Comments are closed.