స్త్రీ కి మాతృత్వం ఓ వరం… నిజమేనా? వరమో, శాపమో ఎవరికి తెలుసు! మాతృత్వం పేరుతో ఎన్ని వేదనలు, ఎంత భానిసత్వం భరించాలో! మాతృమూర్తుల అంతరంగాన్ని ఆవిష్కరించే ” యోధ” మాతృత్వం: భిన్న వ్యక్తీకరణలు. కథా సంకలనంలో చోటు చేసుకున్న నా కథ “కన్నా నీ చేతి గీత” కథ చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.
“ఆటోని కాస్త త్వరగా పోనీ” చేతిలో ఉన్న కవర్ నలిగిపోతుందేమో అని అతిజాగ్రత్తగా పట్టుకుని చెప్పిందామె. వెనుదిరిగి ఓ సారి ఆమెను ఆశ్చర్యంగా చూసి,
“రోడ్డు అంతా గతుకులు, వంకర టింకరగా ఉంది మేడం” అంటూ ఆటో వేగాన్ని పెంచాడు డ్రైవర్.
‘వంకర టింకర..! అవును రోడ్డు వంకర టింకరగా ఉంది. అదొక్కటే కాదు కొందరి రాతలు, మరికొందరి మాటలు కూడా వంకర టింకరనే. అయినా ఇప్పుడు అదంతా తనకి అనవసరం’ కళ్ళు మూసుకుని వెనక్కి వాలి గులాబీ రంగు కవర్ ని గుండెలకు ఆనించి అపురూపంగా పట్టుకుంది.
ఈ కవర్ చూసి సుధీర్ ఏమంటాడో..! కళ్ళ నిండా మెరుపు నక్షత్రాలను తనమీద కురిపిస్తాడా..? ‘ఇన్ని రోజులు నేను ఎదురు చూసింది ఇందుకే కదా’ అని గట్టిగా నన్ను హత్తుకుని ముద్దులు కురిపిస్తాడా..?
అప్పుడే సుధీర్ ముద్దులు పెట్టేసినట్లు బుగ్గలు తడుముకుంది మురిపెంగా. గతుకుల వంకర టింకర రోడ్లు. ఎప్పుడో వేసిన తారు రోడ్డు చెదిరిపోయి కంకరరాళ్ళు చెల్లాచెదరుగా బయటకు వచ్చి గుంటలు, మిట్టలుగా ఉంది.
పదినిముషాల ప్రయాణం అనంతరం ఆటోని స్కూల్ ముందు ఆపాడు డ్రైవర్. డబ్బులు ఇచ్చేసి చిల్లర తీసుకోమని “మేడం చిల్లర ” అంటూ పిలుస్తున్నా వినిపించుకునే స్థితిలో లేదు ఆమె. వెంటనే “సుధీర్ ని చూడాలి. వాడి కళ్ళల్లో వెలుగు పూలు చూడాలి. ఆ పూల సుగంధాన్ని హృదయం నిండా నింపుకోవాలి.” అనుకుంటూ ఆఫీసుగదివైపు వడివడిగా వెళ్ళింది. అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ అనుమతి తీసుకుని సుధీర్ ఉన్న తరగతి వైపుకు ఆతృతగా వెళ్ళింది .
తరగతి గదులన్నీ పిల్లల్ని వెతుక్కుంటున్నట్లున్నాయి ఆమె లాగే. బెంచీలన్నీ ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులు చేసే రకరకాల రొదలతో ఎప్పుడూ ప్రతిధ్వనించే స్కూలు ప్రాంగణం నిశ్శబ్ద గానాన్ని మరింత మౌనంగా ఆలపిస్తోంది. తరగతి గదిలో ఎవరు లేకపోవడం ఆమెకి విస్మయం కలిగించింది. ఇద్దరు పిల్లలు మాత్రం ఏదో రాసుకుంటూ కనిపించారు. వాళ్ళని అడిగితే మూడవ అంతస్తులో “వేదిక్ మ్యాథ్స్” స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి. అందరు అక్కడికి వెళ్లారన్నారు.
ఆయాసంతో వగరుస్తూనే మూడు అంతస్తులు అతికష్టం మీద ఎక్కింది. అసెంబ్లీ హాల్ మొత్తం పిల్లలతో నిండి ఉంది. స్కూల్ కి వచ్చిన ప్రత్యేక టీచర్ క్లాస్ తీసుకుంటున్నాడు. సుధీర్ కోసం ఆమె కళ్ళు జల్లెడ పట్టి వెతికాయి. ఎక్కడా వాడి జాడ కనపడలేదు. కాస్త నిరాశ, మరికాస్త కంగారుతో మెట్లు దిగి ఉసూరుమంటూ మళ్ళీ ఏడవ తరగతి గదిలోకి వచ్చి ఆయాసంతో బెంచీ మీద కూలబడింది.
అటుగా వెళ్ళుతున్న ఆయా చూసింది. “అరే శ్రావణి మేడం..! ఎప్పుడు వచ్చారు..? అయ్యో..! ఏంటి అంత ఆయాసపడుతున్నారు. కాస్త ఈ నీళ్లు తాగండి అంటూ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ అందించింది. బాటిల్ అందుకుని గటగటా సగం నీళ్ళు తాగేసింది.
“థాంక్స్ మేరీ. సుధీర్ కోసం వచ్చాను. వాడు ఎక్కడా కనపడలేదు” ఇంకా వగర్పు తగ్గలేదామెలో.
“అవునా..! మధ్యాన్నం ఇంగ్లీష్ టీచర్ కొట్టిందని ఏడుస్తూ కనిపించాడు క్లాసులో. తర్వాత ప్లేగ్రౌండ్ తట్టుకు పోతుంటే చూసాను. నేను పిలుస్తున్నా ఆగకుండా పరిగిస్తూ వెళ్ళాడు. బెల్లు కొట్టే టైం అయింది మేడం. నేను మళ్ళీ వస్తాను” అంటూ వెళ్ళిపోయింది మేరీ ఆయమ్మ.
ఇక చేసేదేం లేక గంపెడంత ఆశ నిరాశ అయి ఆఫీస్ రూమ్ కి వెళ్లి ‘సుధీర్ తరగతి గదిలో, పైన అసెంబ్లీ హాల్లో కూడా కనపడలేదని’ చెప్పింది. రెసెప్షనిస్ట్ మేడం సుధీర్ గురించి వాళ్ళ క్లాస్ టీచర్ ని అడగడానికి వెళుతుంటే వాళ్ళ క్లాస్ టీచరే ఎదురొచ్చింది. మధ్యాహ్నం నుంచి క్లాసులో లేడని చెప్పింది. సుధీర్ ని వెతికి, కనిపిస్తే ఫోన్ చేస్తాం అనింది రెసెప్షనిస్ట్.
స్కూల్ సమయంలో ఎక్కడకి వెళ్లి ఉంటాడు వీడు. బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లాడా..? లేదు అలా చేయడు వాడు. మరి ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు. టీచర్ కొట్టిందని భయపడి ఇంటికి ఏమైనా వెళ్లాడా? ఒంట్లో ఏమైనా బాగలేదా..?, పరిపరి విధాలుగా మనసు కలవరపడుతుంటే, ప్రశ్నలు, సమాధానాలు తానే చెప్పుకుంటూ ఆటస్థలం వైపు వచ్చింది ఆమె. అక్కడ ఆడుకునే పిల్లల్లో సుధీర్ కనపడతాడేమో అని ఆశ పడింది. ఎక్కడా వాడి జాడ కనపడలేదు. ఆలోచిస్తూనే గేటు దగ్గరకి వచ్చి వాచ్మాన్ సాయిలు ని అడిగింది. సుధీర్ అటువైపే రాలేదన్నాడతను.
ప్రహరీ గోడ ని ఓసారి పరికించి చూసింది. స్కూల్ కాంపౌండ్ వాల్ చాల తక్కువ ఎత్తులో ఉంది. స్కూల్ బయటకు వచ్చేసింది శ్రావణి.
మూడు గంటలప్పుడు కూడా ఎండ సెగ నిప్పులు చెరుగుతోంది. వీధిలో కాస్త దూరంగా చెత్త కుండీ ఉంది. ఎంత ఆకలి మీద ఉన్నాయో రెండు కుక్కలు చెత్త కుండీ చుట్టూ పడి ఉన్న చెత్తని అదేపనిగా కెలుకుతున్నాయి. స్కూలు గేటు పక్కనే ఇద్దరు ఐస్ క్రీం బండి వాళ్ళు దేనికోసమో గొడవ పడుతున్నారు. వాళ్ళ గొడవ తప్ప మిగతా వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది. స్కూలు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిలిపి ఉన్న ఆటోని పిలిచింది. ఆటోలో కాళ్ళు జాపి పడుకుని అరమోడ్పు కళ్ళతో బీడీ తాగుతు అలౌకిక ఆనందంలో ఉన్న ఆటో డ్రైవర్ ఆమెను చూస్తూనే చట్టుక్కున బీడీ పారేసాడు.
ఆటో ఎక్కి ఇంటి అడ్రస్ చెప్పింది. వంకర టింకర గతుకుల రోడ్డు మీద ఆటో ఎగిరెగిరి పడుతోంది నిలకడలేని తన ఆలోచనల్లాగే. మూడ్నెల్ల ముందర తనకి, సుధీర్ కి జరిగిన సంభాషణ గుర్తుకు తెచ్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేసింది.
సన్నగా ఎక్కిళ్ళు, మరింత సన్నగా ఏడుపు. ఉలిక్కి పడి లేచి పక్కకు తిరిగి చూసింది . ధారాపాతంగా కన్నీళ్ళతో సుధీర్. ఎప్పటి నుండి ఏడుస్తున్నాడో బిడ్డ, ఎర్రగా ఉబ్బి ఉన్నాయి వాడి కళ్ళు. నీలం రంగు బెడ్ లైట్ వెలుగు గదంతా పరుచుకొని ఉంది. మంచం ఎదురుగా ఉన్న గోడ గడియారంలో చిన్న, పెద్ద ముళ్ళు పన్నెండు దగ్గర కలుసుకొని అరగంట అయినట్లు ఉంది. తన మొద్దు నిద్రని నిందించుకుంటూ,
“నాన్న..సుధీర్..! ఏంటి రా..!ఈ సమయంలో.. ఏమైందిరా..? ఎందుకు రా ఏడుపు..? మళ్ళీ మీ టీచర్ కొట్టిందా.. ?” ఒడిలోకి తీసుకుని బుజ్జగిస్తూ అడిగింది.
తల్లిని మరింత హత్తుకుని బావురుమన్నాడు వెక్కుతూనే …
“నేనింక ఆ స్కూల్‌కి పొనమ్మా… మ్యాథ్స్ సారు రోజు అరుస్తాడు. థర్డ్ టేబుల్ కూడా సరిగా రాని మొద్దునట. ఎందుకు పనికి రానట. మా ఫ్రెండ్స్ కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాకు పరీక్షల్లో చాల తక్కువ మార్కులు వచ్చాయని ‘చదువు రాని మొద్దు, కదల్లేని ఎద్దు’ అని ఏడిపిస్తారమ్మా.” అంటూ వీపు తడుముకున్నాడు బాధగా.
చొక్కా విప్పి చూసింది. ఇనుప స్కేల్ తో కొట్టిన దెబ్బలతో వీపు అంతా కందిపోయి ఎర్రగా వాతలు తేలి ఉంది. బిడ్డ పరిస్థితికి తల్లడిల్లింది ఆమె. కంటి కొలనుల్లో గట్టు తెగిన నీటి ప్రవాహం ఆమె చెంపల నుంచి కారుతూ సుధీర్ వీపుని తడిపేస్తోంది.
“ఎంత ప్రయత్నించినా నాకు ఇంగ్లీష్, మ్యాథ్స్ రావడం లేదమ్మా.! నా చేతిరాత కూడా బాగాలేదని రోజు కొడుతోంది ఇంగ్లీష్ టీచర్.
“నీకు సున్నా రాయడం కూడా సరిగా రాదు రా, ‘ ఒంకర టింకర ఓ’ అని నిక్ నేమ్ తో పిలుస్తుంది. క్లాస్ లో అందరు నన్ను ‘ఒంకర టింకర ఓ’ అని ఎగతాళి చేస్తూ నవ్వుతున్నారమ్మా” తల్లి గడ్డం పట్టుకుని దీనంగా చూస్తూ సుధీర్”
“సుధీర్.. బాధ పడకురా….నేను వచ్చి స్కూలు లో మాట్లాడుతానులే ” ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్యూబ్స్ తీసి కర్చీఫ్ లో వేసి చుట్టి నెమ్మదిగా వాతలు తేలిన వీపుపైన అద్దసాగింది.
“అమ్మా” ఆర్తిగా పిలిచాడు సుధీర్. వాడిని ఒడిలో పడుకోబెట్టుకుంది.
“నీకు తెలుసు కదా అమ్మా. నాకు చదువు కంటే బొమ్మలు వేయడం ఎక్కువ ఇష్టమని. ముంబైలో అదేదో పెద్ద స్కూల్ లో డ్రాయింగ్ నేర్పిస్తారట కదమ్మా..! నేను అక్కడకు వెళ్ళి బొమ్మలు గీయడం నేర్చుకుంటాను. నాన్నకి నువ్వు చెప్పమ్మా” అతి దీనంగా అడిగాడు.
వీళ్ళ మాటల అలికిడికి, పక్క మంచం మీద పడుకున్న కరుణాకర్ లేచి “ఇంత రాత్రివేళ ఆ ముచ్చట్లు ఏంటి అమ్మా కొడుక్కి. నేను అంతా వింటూనే ఉన్నాను. సరిగా చదవకపోతే టీచర్ ఒక దెబ్బ వేస్తే తప్పు ఏంటట..?” బిక్క ముఖం వేసుకుని తల్లిని గట్టిగా హత్తుకున్నాడు సుధీర్ భయంగా తండ్రిని చూస్తూ.
“ఇంత దానికే వీడు నానా హంగామా చేస్తున్నాడు. మంచి స్కూల్ అని ఎక్కువ ఫీజు కట్టి చదివించేది స్కూల్ మానేయడానికా. ఇక మాటలు, ఏడుపులు చాలు. ఆ వంకర టింకర పిచ్చి గీతలు రేపు మన కడుపులు నింపవు. బొమ్మలు, గిమ్మలు అనడం మానేసి బుద్దిగా చదువుకో. ఇక పడుకోండి అమ్మా, కొడుకూ. ఏమైనా ఉంటే రేపు చూసుకోవచ్చు”.
నాన్న కూడా తనను ఒంకర టింకర అంటున్నాడు. శబ్దం రాని ఎక్కిళ్ళకు అంతు లేకుండా పోయింది వాడికి.
భర్త కరుణాకర్ మాటలకి దుఃఖంతో గొంతు పూడుకుపోయి మాట రాలేదు శ్రావణికి. కొడుకుని పొదివిపట్టుకుని, తన పక్కన పడుకోబెట్టుకుంది . ఇద్దరి కళ్ళు నిశ్శబ్దంగా వర్షిస్తున్నాయి ఆ నిశిరాత్రి.
స్పీడ్ బ్రేకర్ కనపడలేదేమో డ్రైవరుకి. ఆటో ఒక్కఎగురు ఎరిగి పెద్ద కుదుపుతో కింద పడింది. ఆ కుదుపుకి అదిరిపడి ఆలోచనల లోకం నుంచి వాస్తవలోకంలోకి వచ్చింది శ్రావణి.
సుధీర్ కి చదువు సరిగా అబ్బలేదని తనకి తెలుసు. అట్లని సరిగా చదవడని స్కూల్లో టీచర్లు బిడ్డని రోజూ కొడుతుంటే ఏ కన్న తల్లి ఊరుకుంటుంది. వాడి సంతోషం కోసం ఏదైనా చేయాలనుకుంది. తీరా తను వాడిని సర్ప్రైజ్ చేద్దామనుకుంటే వాడే తనకి సర్ప్రైజ్ ఇచ్చాడే కనపడకుండా. ఆలోచిస్తూనే ఆటో దిగి గేటు తీసుకుని గబగబా పక్క వాటాలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లి తాళం అడిగింది.
” గంట ముందే సుధీర్ వచ్చి తాళం తీసుకున్నాడు” అని చెప్పింది పక్కింటామె.
పెద్ద గుండె బరువు తీరినట్లు ‘హమ్మయ్య..వీడు ఇంటికి వచ్చేసాడన్నమాట’ అనుకుని “నాన్నా సుధీర్” అంటూ తలుపు నెట్టింది. రాలేదు. కాలింగ్ బెల్ కొట్టింది. తీలేదు. “మొద్దు నిద్ర పోయినట్లు ఉన్నాడు” కొడుకుని మురిపెంగా విసుక్కుంటూనే తలుపు కొట్టింది. సుధీర్ తలుపు తీలేదు. తలుపు కొట్టి కొట్టి ఆమె చేతులు ఎర్రబడాయి. ఏదో తెలియని భయం ఆమెని వెంటాడింది. ఇంతింతై వటువింతై చందంగా అనుమానం, కంగారు కొండంత పెరిగిపోయాయి. గబా గబా వెనుక పక్కకు వెళ్ళింది. పడక గది కిటికీ తలుపులు మూసి ఉన్నాయి.
పగటిపూట ఎప్పుడూ ఆ తలుపులు తెరిచే ఉంచుతుంది తను. మరి ఇప్పుడు కిటికీ తలుపులు ఎవరు వేశారు..? కిటికీ తలుపు వేసే అవసరం ఏముంది..? జవాబు దొరకని ప్రశ్నలు ఆమె మనసుని చెదపురుగుల్లా తొలిచేస్తున్నాయి. మళ్ళీ ముందుకు వచ్చి
“సుధీర్..నాన్నా సుధీర్..తలుపు తీరా” పెద్దగా అరుస్తూ తలుపుని బాదుతోంది పిచ్చి పట్టినదానిలా.
ఆమె అరుపులకు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన కరుణాకర్ కూడా ఇంటి ముందు జనాన్ని చూసి కంగారు పడుతూ శ్రావణితో కలిసి తలుపులు కొట్టసాగాడు. చేతులు నొప్పి పుట్టడం తప్ప ప్రయోజనం లేకపోయింది.
ఎదురింటి ఆయన పొడుగాటి చెక్కను తెచ్చి తలుపుమీద బలంగా కొట్టాడు. ఓ ఐదు నిముషాలు కొట్టగా కొట్టగా తలుపు ఊడి కింద పడింది.
ఇంట్లోకి పరుగుతీసారు అందరు. అక్కడ పడక గదిలో, ఎవరు తనని ఒంకర టింకర వాడు అని గేలి చేయని, దెబ్బలు కొట్టని తనదైన ఆనందలోకంలోకి తనంత తాను ఇష్టంగా ఫ్యానుకు కట్టిన అమ్మ చీరను మెడకు బిగించుకుని స్వేచ్ఛగా వేలాడుతూ..
” సుధీర్..ర్..ర్…బాబు..” కుప్ప కూలిపోయింది ఆమె. చెట్టంత ఎదిగి నీడనిస్తాడనుకున్న కొడుకు తుఫాను ధాటికి తట్టుకోలేక కొమ్మను వీడిన పిందెలాగా రాలిపోవడం చూసి కరుణాకర్ మొదులు నరికిన చెట్టులా కుప్ప కూలిపోయాడు.
ఎవరో కిందకు దించారు సుధీర్ నిర్జీవ దేహాన్ని. మంచం మీద మడిచి పెట్టిన కాగితం రెపరెపలాడుతోంది. సుధీర్ అమ్మ, నాన్నలకి రాసుకున్న సూసైడ్ నోట్.
“అమ్మా..నాన్నకి ఎంతప్రేమో నామీద. నాన్న.. నేను బాగా చదువుకోవాలని, డాక్టరో,ఇంజనీరో అయిపోవాలని ఎంత తాపత్రయ పడుతుంటావు. నేను గొప్పవాడినైపోవాలని నీ కల నాన్నా. ఎంత పెద్ద స్కూల్లో చేర్పించావు నన్ను..నీ కలను నిజం చేసుకోవడానికి! అసలు ఎంత మంది నాన్నాలు కలగనగలరు? ఎంత మంది ఇంతపెద్ద స్కూళ్ళల్లో తమ పిల్లల్ని చేర్పించగలరు? కానీ నాన్నా ..నాక్కూడా ఒక కల ఉంది కదా..! గొప్ప ఆర్టిస్టు అయిపోవాలని! నా బొమ్మల్ని పిచ్చి గీతలంటావు నువ్వు. నా హ్యాండ్ రైటింగ్ ని వంకరటింకర ఏడుపంటుంది ఇంగ్లీష్ టీచర్. అలసిపోతున్నాను నాన్నా.. నీ మాటల్తో, ఆమె దెబ్బలతో!
హ్యాండ్ రైటింగ్ బాగోలేదని టీచర్ దెబ్బలేసి ఉంటే..బాపు చేతిరాతో, తలరాతో ఎలా ఉండేది నాన్నా ..? మ్యాథ్స్ లో మార్కులు రావు, వచ్చిన బొమ్మలకు మార్కులు లేవు..
ప్రోగ్రెస్ రిపోర్ట్ పెద్ద జోకులాగా ఉంటుంది. ఇంటి నుంచి బడికి వెళ్లాలంటేనే భయం. బడి నుంచి ఇంటికి రావాలంటే భయం. ఎక్కడికెళ్లను? ఎంత దూరం వెళ్ళను? అలసిపోయాను నాన్న పూర్తిగా. అమ్మా..నా కోసం దిగులు పెట్టుకోవద్దు నువ్వు.”
కరుణాకర్ చేతిలో ఆ కాగితం నలిగిపోతోంది. అతను వెక్కుతున్నాడు. ఆమె, గుండె బద్ధలై, బోరుమంది!
****
ఒక్క గంట ముందుగా నేను స్కూల్‌కి వెళ్లి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు ఎంత ఏడ్చి మొత్తుకున్నా బిడ్డ ప్రాణాలు తిరిగి తేలేదు. తన ఫోన్ కి వచ్చిన మెసేజ్ ప్రింటౌట్ తీసుకుని స్కూల్ కి వెళ్ళేలోగా.వాడు తమకు అందనంతా దూరానికి ప్రయాణం కట్టాడు.
సుధీర్ కడయాత్ర మొదలైంది. కడుపుతీపితో ఆ వ్యానులో వాడి పక్కనే కూర్చుంది శ్రావణి. ‘ఆడవాళ్లు అక్కడకు రావడం ఏంటి?’ అని ఎవరు వారించలేదు. ఆమె కన్నీళ్లు అలా అనగల వారెవ్వరినీ నోరెత్తనివ్వలేదు.
చేరవలసిన చోటుకు చేరారు. పూలపాన్పు మీద పడుకోబెట్టినట్టుగా కట్టెలపై పడుకోబెట్టారు. కాలుతున్న కట్టె పట్టుకుని కరుణాకర్ బిడ్డ చుట్టూ తిరుగుతున్నాడు. జీవం, చైతన్యం మొత్తం హరించుకుపోయింది కట్టెలా..ఎడంగా, కుప్పగా పడి ఉంది శ్రావణి.
అంతలో ఆమెకు ఏదో గుర్తుకు వచ్చింది. ఒక్కసారిగా దెయ్యం పట్టిన దానిలా లేచింది. జుట్టు పిచ్చిగా రేగుతుండగా, పట్టుకుని ఆపుతున్న వారిని విదిలించి కొట్టింది. పరుగున వెళ్ళింది.
నాన్న నిప్పు పెడుతున్న క్షణాన..అమ్మ, అప్పటిదాకా తన చేతిలో నలుగుతున్న దానిని, చక్కదీసి, సుధీర్ తలదగ్గర పెట్టింది. వాడి ప్రవేశానికి అనుమతిస్తూ వచ్చిన లెటర్. గులాబీ రంగు కవరు .. ఫ్రొం ..జె జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, ముంబాయి!