ఆభరణం

నమస్తే. తెలుగు సొగసు ఆన్లైన్ పత్రిక “ప్రేమికుల దినోత్సవ ప్రత్యేక సంచిక” లో నా కథ “ఆభరణం”. మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపాలని..

 ప్రార్ధన అయి పిల్లలంతా తరగతి గదిలోకి వచ్చేసారు.  పిల్లలతో పాటే   సులోచన టీచర్ కూడా  తరగతిలోకి వచ్చారు.  అది ఐదవ తరగతి. పిల్లలంతా  లేచి నిలబడి టీచర్ కి నమస్కారాలు చెప్పి కూర్చున్నారు. 
"లావణ్య.. వచ్చి  డస్టర్తో బోర్డు  తుడువు" టీచర్ మాట పూర్తి కాకముందే  లావణ్య  బల్ల మీది డస్టర్ తీసుకుని బ్లాక్ బోర్డు ని  తుడవసాగింది చక చకా రోజు అలవాటుగా చేసేపని  అది అయినట్లు.. 
  ఇక హాజరు వేయడానికి సులోచన టీచర్   పుస్తకం తెరవగానే   తరగతి గది వాకిలి దగ్గర ఘల్లు ఘల్లు మని చప్పుడు వినపడి టీచర్ తో సహా పిల్లలంతా వాకిలి వైపు తలలు తిప్పారు.  అరిటాకు పచ్చ రంగు పట్టుపావడ, గులాబీ రంగు అంచు, అదే రంగు బుంగల  జాకెట్ వేసుకుని  ఒక  చేతిలో చాకోలెట్ల డబ్బా పట్టుకుని, మరో చేత్తో పట్టుపావడ కాస్త  సుతారంగా పైకి పట్టుకుని  ..కొత్త వెండి పట్టీలు కనపడేలా  ఘల్లు ఘల్లు మని పట్టీలు చప్పుడు చేస్తుంటే తరగతి  గదిలోకి  వచ్చింది అన్విత.  
 ఆ పట్టీల ఘల్లు ఘల్లు చప్పుడు మృదు సంగీతనాదంలా  వినపడి పరవశించిపోయింది లావణ్య.  అన్విత  తన పుట్టిన రోజు అని చెప్పింది.  ఇక టీచర్ పిల్లలందరి చేత అన్వితకి పాట ద్వారా పుట్టిన రోజు  శుభాకాంక్షలు చెప్పించింది.  అనంతరం అన్విత టీచర్ కి ప్రత్యేకంగా స్వీట్స్  ఇచ్చి, పిల్లలందరికీ చాకోలెట్స్ పంచి లావణ్య పక్కన కూర్చుంది.  
 అన్విత వేసుకున్న  డ్రెస్ కంటే  ఆమె  కాలి పట్టీలు  ఎక్కువ ఆకర్షించాయి లావణ్య ని.  అన్విత నడిచినప్పుడల్లా  కదిలే పట్టీల శబ్దము  లావణ్య మనసు లో అలజడి రేపింది.  ఇక టీచర్ చెప్పే పాఠాలు లావణ్య చెవికి సోకలేదు.  కిందకి కళ్ళు తిప్పి తన కాళ్ళ వంక చూసుకుంది. పట్టీలు లేక బోసిగా ఉన్న కాళ్ళు ఆమెని వెక్కిరించాయి.  ఇక  టీచర్ చెప్పే పాఠం మీద దృష్టి  పెట్టలేక పోయింది లావణ్య. మాటిమాటికీ పక్కకు తిరిగి అన్విత కాళ్ళ వంక చూడడం, వెండిమబ్బు తునకలన్నీ ఒకదానితోఒకటి చుట్టుకుని మెరుపుతీగలుగా అల్లుకుని పట్టీలుగా మారి అన్విత తెల్లటి కాళ్ళను మరింత మెరిపిస్తుంటే, ఆ మెరుపులను  తన కళ్ళలో నింపుకోసాగింది లావణ్య.
 ఊహ తెలిసినప్పటినుంచి లావణ్య కాళ్ళు పట్టీల కోసం ఎదురు చూస్తున్నాయి.  లావణ్య అమ్మ, నాన్నవి దిగువ మధ్య తరగతికి చెందిన  జీవితాలు. చాలీచాలని జీతాలు, తీరీతీరని అవసరాలు. .  లావణ్య నాన్న 'మహేశ్వర్'  ది చాల చిన్న ఉద్యోగం. అమ్మ 'ఝాన్సీ' గృహిణి.  మహేశ్వర్ కి వచ్చే జీతం వాళ్ళకు చాలీచాలనట్లు ఉండేది.  లావణ్య ని కాస్త మంచి స్కూల్ లో చేర్పించి ఫీజులు కట్టి చదివించడమే వారికి  కనా కష్టంగా ఉండేది.  నెల మధ్యలోనే జీతం మొత్తం అయిపోగా  నెలాఖరులో చేతిలో డబ్బులేక, రోజువారీ అవసరాలకు కూడా అప్పు కోసం చేయి చాచాల్సివచ్చేది వారికీ.  ఇక లావణ్యకు వెండి పట్టీలు కొనాలంటే అది అదనపు భారం అవుతుంది వాళ్ళకి.   
  చిన్నారి లావణ్య కి  అవేం తెలియదు కదా.  తన  నాలుగవ ఏట ఊహ తెలిసాక లావణ్య అత్తా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు  మొదటిసారి  ఆమె అత్తకూతురు  రమ్య కాళ్ళకి ఉన్న పట్టీలు చూసింది లావణ్య.  రమ్య నడుస్తున్నప్పుడంతా ఘల్లు ఘల్లు మని శబ్దం చేసే ఆ మువ్వల పట్టీల సోయగం ఆ చిన్నారి  మనసుని లాగేసుకుంది. అప్పటి నుంచి తనకు పట్టీలు కావాలని ఒకటే మారం చేయసాగింది లావణ్య .ఆ తర్వాత స్కూల్ లో తన స్నేహితురాళ్ళు పట్టీలు వేసుకోవడం చూసాక తనకి పట్టీలు కావాలనే కోరిక మరింత బలపడసాగింది లావణ్యలో.   వెన్నెల వర్ణంలో  మామిడి పిందెలు, నక్షత్రాలు, పువ్వులు, ఆకులు ఎన్ని రకాల డిజైన్ లలో  మురిపిస్తూ  తన స్నేహితురాళ్ళు పెట్టుకు వచ్చే పట్టీల వంక ఆశగా, ఆరాధనగా, కాస్తంత అసూయగా  చూసేది.  కొత్తగా ఎవరైనా పట్టీలు పెట్టుకు వచ్చిన రోజు  ఇక ఇంటికెళ్ళగానే తనకి పట్టీలు కావాలని గోల చేసేది.  బిడ్డ అడిగిన  కోరిక తీర్చలేక నిస్సహాయంగా వాళ్ళ అమ్మ 'ఝాన్సీ' ఎంతో బాధ పడి  ఎప్పటికప్పుడు లావణ్యని బుజ్జగించి   "నువ్వు  కాస్త పెద్ద  అయినాక పట్టీలు కొంటాను, ఇప్పుడు వేసుకుంటే నువ్వు చిన్న పిల్లవని నీ దగ్గర నుంచి  దొంగలు కాజేస్తారు" అంటూ ఏవో కల్లబొల్లి కబుర్లు చెప్పి మరపించేది.
 ఇక పట్టీల  మీద ఆశ పడడమే తప్ప వాటిని కొనుక్కొనడం, వేసుకోవడం అనేది గగన సాదృశ్యమే అయింది లావణ్యకు.  ఇప్పుడు  కూడా అన్విత కొత్త  పట్టీలు వేసుకుకొని రావడం, ఏదో తెలియని బాధ చిన్నారి లావణ్య గుండెని మెలిపెట్టింది. 
 విరామ గంట లో తరగతిలోని  ఆడ పిల్లలంతా  'అన్విత'   వేసుకున్న  తళతళ లాడే కొత్త  మామిడి పిందెల పట్టీలను పట్టి పట్టి చూడసాగారు.  తమ కాళ్ళకి ఉన్న పట్టీలతో పోల్చుకుని చూసుకుంటున్నారు.  లావణ్య మాత్రం ఎవరితో మాట్లాడకుండా మూతి ముడుచుకుని కూర్చుంది. లావణ్య ఎందుకలా ఉందో వాళ్ళందరికీ తెలుసు. 
  "మన అందరికి పట్టీలు ఉన్నాయి, తనకి లేవు అని లావణ్యకి  మన మీద  కోపం. వాళ్ళ అమ్మ కొనీకపోతే మనమేం చేస్తాం " అనుకున్నారు ఆమె  స్నేహితురాళ్ళు. కానీ అది వారి మీద  కోపం కాదు. తనకి పట్టీలు లేవని బాధ. ఎన్ని సార్లు అడిగినా కొనివ్వని అమ్మ, నాన్నల మీద  అసహనం. తన కోరిక ఎప్పటికి తీరుతుందో తెలియని పసి మనసు వేదన.
 సాయంత్రం స్కూలు అయినాక రోజులాగా ఆడుకోలేకపోయింది  లావణ్య.  ఎంతో తెలివిగా చదువులో, ఆటపాటల్లో   అందరికంటే  ముందుండే  లావణ్య తనకి  పట్టీలు లేవనే సంగతి  గుర్తుకు వస్తే మాత్రం  నిరాశగా ముడుచుకుపోయేది.    ఇంట్లోకి వస్తునే  పుస్తకాల సంచిని పక్కన పడవేసి మంచం మీద ముడుచుకుపోయి పడుకుంది లావణ్య.     రోజు  స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే గల గల మాట్లాడే పిల్ల అలా ఉలుకు, పలుకు లేకుండా పడుకునేసరికి  ఝాన్సీ  కలవరపడి 
  "లావణ్య.. ముఖం, కాళ్ళుచేతులు కడుక్కొని రా..పాలు తాగుదువుకానీ" అన్నా కూడా లావణ్యనుంచి  స్పందన రాకపోవడంతో   "లావణ్య.. ఏంటే అలా పడుకున్నావ్..?  ఒంట్లో బాగాలేదా" అంటూ లావణ్య నుదుటిని చేత్తో తాకి చూసింది.  వెచ్చగా ఏం లేదు. " ఏమైంది రా కన్నా..? స్కూల్ లో కానీ పడ్డావా..? దెబ్బలు ఏం తగలలేదు కదా "ఝాన్సీ  తల్లి మనసు తల్లడిల్లింది.
 లావణ్య  ఏం  జవాబు ఇవ్వకుండా  అటు పక్కకు తిరిగి పడుకుంది. 
   " సరే కాసేపు పడుకో. తర్వాత లేచి పాలు తాగు. మనం పెద్ద బజారుకి  కు వెళదాం అనుకున్నాను " అంది లావణ్యను నిశితంగా  చూస్తూ .   పెద్ద బజారుకి  అనగానే ఒక్క క్షణం ఉత్సహం వచ్చింది లావణ్యకి. 
  అయినా బింకంగా "నేను రాను " అంది. 
   " సరే అయితే   నువ్వు పడుకో, నేను ఒక్కదాన్నే వెళ్ళి నీకు పట్టీలు కొనుక్కుని వస్తాను " అంది ఝాన్సీ  ఓరకంటితో లావణ్యని చూస్తూ.     అంతే.. ఆమె అన్న ఆ మాటతో దిగ్గున లేచి కూర్చుంది లావణ్య.  " అమ్మా.. నువ్వు చెప్పేది నిజమా" నమ్మలేనట్లు తల్లిని  చూస్తూ అడిగింది లావణ్య. 
   " నిజంగా నిజం" నాటకీయంగా తలతిప్పుతూ లావణ్య వంక నవ్వుతూ చూసింది  ఝాన్సీ.
 " మరి అమ్మా.. నేను  ఎప్పుడు పట్టీలు కావాలని అడిగినా  నాన్న దగ్గర అంత డబ్బు లేదని, దొంగలు కాజేస్తారని ఏదో ఒకటి చెప్పేదానివి కదా..? మరి ఇప్పుడు పట్టీలు కొనడానికి సరిపడినంత డబ్బు ఉందా నాన్న దగ్గర..? కాస్త అమాయకం మరి కాస్త ఆరిందతనం కలబోసి కళ్ళు చిత్ర విచిత్రంగా తిప్పుతూ తల్లిని అడిగింది లావణ్య.
 ఝాన్సీ నవ్వుతూ " నీకు పట్టీలు అంటే ఎంత ఇష్టమో నాన్నకు, నాకు తెలుసుకదా బుజ్జి .. నువ్వు అడిగిన ప్రతిసారి ఏదో ఒక ఖర్చు తగిలి డబ్బు దాచలేకపోయేవాళ్ళం. ఈసారి అలా కాదు నీకు పట్టీలు ఎలాగైనా కొనాలని మీ నాన్న  మూడు నెలల నుంచి   ఆఫీసుకి మోపెడ్ బండిలో వెళ్లకుండా  నడిచి వెళుతూ పెట్రోల్ ఆదా చేసి డబ్బు దాచారు.  ఈ రోజు పొద్దున నువ్వు స్కూల్ కి వెళ్ళాక ఆ సంగతి నాకు చెప్పి "సాయంత్రం లావణ్య ని బజారుకి తీసుకెళ్లి పట్టీలు కొనిపెట్టు. సాయంత్రం  స్కూల్ నుంచి రాగానే ఈ విషయం  దానికి చెప్పి సర్ప్రైజ్ చేద్దాం"  అన్నాడు. నువ్వేమో ఇలా మూతి ముడుచుకున్నావు అంది ఝాన్సీ.
 తల్లి మాటలు విన్న లావణ్య ఆనందం అంబరాన్నంటింది.  తన చిరకాల స్వప్నం ఇన్ని రోజులకు నెరవేరబోతోంది.  తల్లిని గట్టిగా హత్తుకుని " మా మంచి అమ్మనాన్న" అంటూ ఝాన్సీకి ముద్దులు ఇచ్చి గదిలోకి తుర్రుమంది యూనిఫామ్ తీసి గౌను వేసుకోవడానికి.
 తల్లి చేయి పట్టుకుని బజారుకి వెళుతుంటే స్వర్గానికి వెళుతున్నట్లు ఉంది  లావణ్యకి.  తనకి ఇష్టమైన పాలరోజా రంగు గౌను వేసుకుంది.' పట్టీలు వేసుకుని రేపు స్కూలుకి వెళ్ళి అందరికి చూపించాలి. తాము పెద్ద  బజార్ కి ఎలా వెళ్ళింది, ఏ షాప్ లో పట్టీలు కొనింది, ఎన్ని కొత్త డిజైన్లు చూసింది  అన్ని విషయాలు ఫ్రెండ్స్ కి వర్ణించి చెప్పాలి '  ఊహాలోకంలో తేలిపోతోంది లావణ్య.
 నాలుగు వీధులు దాటారు ఝాన్సీ, లావణ్యలు.  " ఏ షాప్ లో అమ్మా మనం పట్టీలు కొనేది..? ఇంకెంత దూరం " ఓ పక్క ఊహలు, మరో పక్క పట్టీలు త్వరగా  కొనుక్కోవాలని ఆరాటం తో అడిగింది లావణ్య.
 "పాపా.. ఇంకో రెండు వీధులు దాటితే  'జిలాని బాషా ' బాబాయ్ వాళ్ళ వెండి  అంగడి వస్తుంది.  అక్కడ నీకు పట్టీలు  కొనేది" అంది  ఝాన్సీ. " సరే " అంటూ  బజార్ వీధి లోని  బట్టల అంగళ్ళు, అంగళ్ళ ముందు వేలాడదీసిన గౌనులు అన్ని చూస్తూ తల్లితో ముందుకు నడుస్తోంది లావణ్య.
 ఇంకో పదడుగులు వేస్తే  'జిలాని బాషా '  జెవెల్లెర్స్  వెండి  ఆభరణాల అంగడి వచ్చేస్తుంది.   హఠాత్తుగా నిలబడిపోయింది లావణ్య.  తనతో రాకుండా  ఆగిపోయిందేమని  లావణ్యని చూసింది  ఆమె తల్లి ఝాన్సీ.  అక్కడ  రోడ్డుకి వారగా మురికి కాలువ ముందు ఓ అమ్మా, కొడుకు కూర్చుని ఉన్నారు. ఆ పిల్లవాడి ఒంటిమీద చిన్న చిరుగుల చెడ్డి తప్ప ఇంకేం లేదు.  ఆమె కూడా చిరుగుల చీర, చింపిరి  జుట్టుతో  ముఖాల్లో దైన్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నారు.  
   " అమ్మా. దయ చూపండి. నా బిడ్డ అన్నం తిని నాలుగు రోజులైంది. పెద్దమనసు చేసుకుని పట్టెడన్నం పెట్టించండమ్మా" దీనంగా  వీధిలో వచ్చే పోయే వారిని అడుగుతోంది ఆమె.
  ఆ స్థితి లో వారిని చూసిన చిన్నారి  లావణ్య మనసు చలించిపోయింది. పాపం ఆ అబ్బాయికి ఎంత ఆకలిగా ఉందో మరి. అమ్మకి చెప్పి వాళ్ళకి డబ్బులు ఇప్పించాలి మనసులో అనుకుంది  లావణ్య. మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇస్తే తనకి పట్టీలకు చాలుతాయో లేదో. ఆ చిన్నారి మనసు కాసేపు సంఘర్షణలో ఊగిసలాడింది.   చివరకు  ఓ దృఢ నిశ్చయానికి  వచ్చిన దానిలా  తల్లి  ముఖంలోకి చూస్తూ 
  " అమ్మా..  వాళ్ళకి అన్నం పెట్టిద్దాం " అంది.  హఠాత్తుగా లావణ్య అలా అనడంతో ఝాన్సీ విస్మయంగా 
    " పాపా వాళ్ళకి ఇప్పుడు అన్నం పెట్టిస్తే నీకు పట్టీలు కొనడానికి డబ్బులు చాలవు " అంది ఝాన్సీ కంగారుగా. 
 ఎన్నో రోజులుగా కూతురు పట్టీలు అడుగుతుంటే ఇన్ని రోజులకు కొనడానికి కుదిరింది తమకు.  ఇప్పుడు కొనలేకపోతే ఇక మళ్ళీ ఎప్పటికి కొనగలమో..!ఆలోచిస్తూఉంది ఝాన్సీ.
 లావణ్య ఆమె తల్లి చేయి పట్టుకుని  " పర్వాలేదు అమ్మా.. నేను పట్టీలు మళ్ళీ ఎప్పుడైనా కొనుక్కుంటాను.  ముందు వాళ్ళకి హోటల్ లో అన్నం పెట్టిద్దాం. పాపం వాళ్ళు అన్నం తిని ఎన్ని రోజులో అయిందట" జాలిగా వారివంక చూస్తూ అంది లావణ్య. 
  కూతురి  వంక ప్రేమగా చూసింది ఝాన్సీ.  ఆభరణాలు  మనిషికి  బాహ్య అలంకారాలు మాత్రమే. వాటికంటే మానవత్వం, ఎదుటివారికోసం సాయపడాలి అనే గొప్ప మనసు కలిగి ఉండడమే మనిషికి అసలైన  ఆభరణం.  కష్టంలో ఉన్న వారి కోసం తన కోరికను కూడా కాదని  వారికి సాయపడాలనుకున్న తన కూతురికి  ఇంత చిన్న వయసులోనే గొప్ప మనసుని ఇచ్చిన ఆ భగవంతునికి మనసులోనే నమస్కారం చేసుకుంది ఝాన్సీ. పట్టీలు మళ్ళీ  అయినా కొనుక్కోవచ్చు. కానీ ఆకలితో ఉన్న వారికి  అన్నం పెట్టి వాళ్ళ ఆకలి కడుపులు నింపడంలో ఉండే తృప్తి ఎప్పటికీ  నిలిచి ఉంటుంది. ఇది తన బిడ్డ మానవత్వపు పరిమళాలను వెదజల్లడానికి నాంది అవుతుంది. 
తనకు పట్టీలు కొనుక్కోవడంలో ఉన్న ఆనందంకన్నా ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టడంలోనే  ఆనందాన్ని వెతుక్కున్న  తన కూతురు లావణ్యను  అమితమైన ప్రేమతో గుండెలకు హత్తుకుని  నుదుటన ముద్దు పెట్టుకుంది ఝాన్సీ.
   అమ్మా, కూతురు ఇద్దరు కలిసి కాలవ దగ్గర కూర్చునిఉన్న  తల్లీకొడుకుల దగ్గరకు వెళ్లారు వారికి అన్నం పెట్టించడానికి.. 

2 thoughts on “ఆభరణం”

  1. విస్సా రామచంద్రరావు

    కధ, కథనం బాగున్నాయి. చిన్నపిల్లల మనస్తత్వం బాగా వ్రాశారు.
    అభినందనలు.

Comments are closed.