హృదయాలయం

నమస్తే!

నేను వ్రాసిన ఈ కథ “హృదయాలయం”  ఫిబ్రవరి 2019 లో “విశాలాక్షి” మాస పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన.

——————————————————————————————————————————

స్వామియే అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప శరణం. వీనుల విందుగా అత్యంత శ్రావ్యంగా వినిపిస్తున్న అయ్యప్ప స్వామి భజన మంత్రమైన సినట్టు నిలబడిపోయింది రాగిణి. అక్కడికి దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి పూజమండపం నించి వినవచ్చే శరణు ఘోషకు వివశురాలై మండపం చెంతకు వెళ్ళి స్వామికి నమస్కరించుకుని భక్తి పారవశ్యంలో మునిగి, తేలుతూ అలలమీద తేలుతున్నట్టుగా ఇంటికొచ్చింది రాగిణి. అప్పుడే మండపంలో పూజ, భజన పూర్తయిందని గురుస్వామి చెప్పి అందరు స్వాములకీ అయ్యప్ప స్వామి ప్రసాదం పంచసాగాడు. ప్రసాదం తీసుకున్న స్వాములంతా ఇళ్ళకు మళ్ళారు.

అందరూ స్వాములతో పాటు రాగిణి వాళ్ళ నాన్న గురుమూర్తి కూడా ఇంటికి వచ్చాడు తండ్రిని చూస్తునే నాన్న పూజ అయిపోయిందా? మీరు శబరిమలై కొండకు వెళ్ళేది ఎప్పుడు నాన్న అని అడిగింది రాగిణి.

మాల వేసుకుని 30 రోజులు అయింది కదమ్మా. ఇంకా పది రోజులకి మండలం రోజులు (40 రోజులు) దీక్ష అయిపోతుంది. జనవరి 2,3 తారీఖుల్లో కొండకు వెళ్ళాల్సివస్తుందమ్మా అన్నాడు రాగిణి వాళ్ళ నాన్న గురుమూర్తి.

రాగిణికి ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం గురుమూర్తి క్రమం తప్పకుండా అయ్యప్ప స్వామి మండల దీక్ష తీసుకుని శబరిమల కొండకు వెళ్లి వచ్చేవాడు. గురుమూర్తి, పార్వతమ్మలకి ముగ్గురు ఆడపిల్లల తర్వాత నాలుగవ సంతానంగా హరిహరనాధ్ పుట్టాడు. రాగిణి రెండవ సంతానం. అచ్చం అయ్యప్ప స్వామి మహిమలు సినిమాలో ఒక పాట చేతులెత్తి చెంతనిలిచి వేడుకొందు స్వామి అయ్యప్ప స్వామి, నీవే అద్భుత స్వామి. అక్క ఉ నా, చెల్లి ఉంది ఆడిపాడగా ఒక తమ్ముని మాకు ప్రసాదించు లోకమందునా అని పాడినట్లు రాగిణీ కూడా తనకు అక్కా చెల్లి ఉన్నారు. ఒక తమ్ముడు ఉంటే బాగుండు అనుకునేది.

గురుమూర్తి శబరిమల కొండకు పోయి వచ్చిన తర్వాతి సంవత్సరం గురుమూర్తి దంవతులకు హరిహరనాథ పుట్టాడు. దాంతోటి రాగిణికి అయ్యప్ప స్వామి మీద బాగా గురి కుదిరింది. దానికి తోడు చిన్నప్పటి నుంచి స్వామివారి పూజ, భజనలు వెళ్ళడం మహిమలను కథలు కథలుగా వినడంతో భక్తి స్థిరపడి ఎలాగైనా శబరిమల కొండకు వెళ్ళి స్వామివారిని, దర్శించుకోవాలనే కోరిక రాగిణి మనస్సులో చిగురిచి, వయస్సు పెరిగే కొద్ది పెరుగుతూ మహావృక్షమై మనసునిండా పరచుకుంది. దానికి తోడు ఎప్పుడు గురుమూర్తిని కొండకు తీసుకెళ్ళమని రాగిణి అడిగినా, దీక్ష చేయటం చాలా కష్టం తల్లీ, చలిరోజుల్లో చన్నీటి స్నానం చేయ్యాలి, సాత్వికాహారం తినాలి, నేలమీద పడుకోవాలి, చెప్పులు లేకుండా నడవాలి. దీక్ష అయ్యాక క్రూరమృగాలు సంచరించే అడవిలో చాల దూరం నడవాలి. పంపానది దాటి కొండపైకి ఎక్కాలి. ఇవన్నీ చిన్న పిల్లలు నువ్వు చెయ్యలేవు తల్లీ వద్దు అనేవాడు గురుమూర్తి. వస్తానని పట్టుపడితే కాస్త పెద్దయ్యాక తీసుకుపోతాలే అని ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చెప్పి దాటవేసేవాడు గురుమూర్తి. అలా శబరిమలై కొండకు వెళ్ళి స్వామిని దర్శించుకోవాలన్న అనురక్తితోనే పెరిగి పెద్ద అయింది రాగిణి. పదవ తరగతిలో ఈడొచ్చిన తనని ఇంక గుడికి అసలు వెళ్ళకూడదు అని చెప్పేసారు. ఈడొచ్చిన ఆడపిల్లలు ముసలివాళ్ళు అయ్యేదాక అయ్యప్ప స్వామి దర్శించుకోకూడదు అని చెప్పేసరికి ఇక జీవితంలో ఆ కోరిక తీరదు అనే అసంతృప్తి నిరంతరం వెంటాడేది రాగిణిని.

తను చదివే సైన్సు పాఠాల్లో ఋతుచక్రం స్త్రీలలో జరిగే ఒక జీవ సంబంధమైన శారీరక పరిణామ ప్రక్రియ. ఇది ప్రకృతికి సంబంధమై స్త్రీ, పురుషులు కౌమార దశలో జరిగే ద్వితీయ వృద్ది. శారీరకంగా, మానసికంగా ఎదగడానికి దృడత్వాన్నీ, స్థిరత్వాన్ని పెంపొందించుకునే దశ మాత్రమే. దీనికీ దైవ దర్శనానికి ఏమి సంబంధమో ఎంత ఆలోచించినా అర్థం అయ్యేది కాదు రాగిణి అనాధిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయం, పురుషులు తప్ప స్త్రీలు ఆ ఆలయంలో ప్రవేశం లేదు అని చెప్తుంటే, స్త్రీ పురుషులిద్దరూ సమానమే స్త్రీ సగం, పురుషుడు సగం, ఇరువురూ కలిస్తేనే అర్ధనారీశ్వరత్వం అంటూ పురాణాలు చెప్పేవాళు కూడా శబరిమల ఆలయం విషయం వచ్చేసరికి నోరు మెదిపేవాళ్ళు కారు. ఎంత ఆలోచించినా ఎందుకు ఈ విషయంలో ఇంత లింగ వివక్ష, ఇన్ని పట్టింపులు ఇన్ని అడ్డంకులు, స్త్రీని దేవతగా పూజించాలి అని పవిత్ర భారత దేశంలో స్త్రీలపై ఇన్ని ఆంక్షలు ఎందుకో అని తండ్రితో ఎప్పుడూ వాదిస్తూ ఉండేది రాగిణి.నలుగురు నడిచే దారిలోనే మనం నడవాలి. లేకుంటే నగుపాటు పాలవుతాం తల్లీ అని గురుమూర్తి కూతురికి సర్దిచెప్తూ ఉండేవాడు. దాంతో చాలా కాలం ఇక ఆ సంగతే మరచిపోయి చదువులలో పడిపోయింది రాగిణి.

రాగిణి తన స్నేహితురాలు మీనాక్షి తమ ఇంటికి నాలుగిళ్ళ దూరంలో ఉండే నరసింహ శాస్త్రి కూతురు. రాగిణి, మీనాక్షి ప్రాణ స్నేహితులు, ఇద్దరూ వాళ్ళ ఊరికి కాస్త దూరంగా విసిరేసినట్టు ఉండే డిగ్రీ కాలేజీలో చేరారు. రోజు ఇద్దరు కల్సి ఆటోలో కాలేజీకి వెళ్ళి వచ్చేవాళ్ళు. మంచి మార్కులు తెచ్చుకోవాలని ఇద్దరూ పోటీలు పడి చదివేవాళ్ళు. అలా రోజులు గడిచి పోతుంటే ఓ రోజు పొద్దునే వార్తా పత్రిక సమాచారం రాగిణీని సంభమాశ్చర్యాలకు గురిచేసింది. అది కేరళ రాష్ట్రంలోని శబరిమలై కొండపై గల అయ్యప్ప స్వామి ఆలయంలోకి స్త్రీల ప్రవేశానికి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వటం. ఆ తర్వాత ఇది స్త్రీల విజయం, నారీ భేరి అంటూ కొన్ని పత్రికలు ఆ విషయం గురించి సానుకూలంగా వ్రాస్తే మరికొన్ని పత్రికలు ఇది సనాతన సాంప్రదాయాలకు కాలరాచటం సంస్కృతికి విరుద్ధం. దైవద్రోహం అని విమర్శిస్తూ తీర్పును దుమ్మెత్తి పోసాయి. టీవీలలో, వార్తలు నలుగురు మనుష్యులు ఓ చోట కూడినా ఇదే విషయం గురించి చర్చలు, మంచి పరిణామం అని కొందరు స్వాగతిస్తే. ఇదెక్కడి తీర్పు అంటూ సనాతన వాదులు ఆగ్రహం చెందారు. ఏది ఏమైతేనేం. ఒక అడుగు ముందుకు పడింది. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఎప్పటికైనా తన చిరకాల వాంఛ అయిన అయ్యప్పస్వామిని శబరిమల ఆలయంలో దర్శించుకోవచ్చు. ఎటువంటి మనో వికారాలు లేకుండా నిజమైన భక్తితో వెళ్ళేవారికి ఈ లింగ వివక్షలు, సాంప్రదాయాలు ఇవేవి అడ్డుకావు అనుకుని చాలా ఆనందపడింది రాగిణి.

జనవరి నెల సాయంత్రం నాలుగు గంటల నుంచే ఎముకలు కొరికే చలిగాలులు చిరు చీకట్లు. ఊరి చివరన కాలేజీ ఉండడంతో చుట్టూ పొలాలు , గుబురు చెట్లు ఎక్కువ ఉండటంతో చలి మరింత ఎక్కువగా ఉంది. తన క్లాసులు అన్నీ అయిపోవడంతో మీనాక్షి వాళ్ళ క్లాస్ రూమ్ దగ్గరకు వెళ్ళింది రాగిణి. మీనాక్షికి ఆ రోజు స్పెషల్ సంస్కృతం క్లాస్ ఉంది. ఎవరో పెద్ద ఆధ్యాత్మికవేత్త ద్వారా బోధన జరుగుతుంది. తను రావటానికి ఆలస్యం అవుతుందని చెప్పటంతో తను ఒక్కటే ఇంటికి వచ్చేసింది రాగిణి.

రాత్రి పదిగంటలప్పుడు మీనాక్షి వాళ్ళ నాన్న ఫోన్ చేసాడు. రాగిణికి మీనాక్షి ఏమైనా మీ ఇంటికి వచ్చిందా అని. కాలేజీలో మీనాక్షికి స్పెషల్ క్లాస్ ఉంది అని చెప్పిన సంగతి ఆయనకి చెప్పి తను ఇంకా ఇంటికి రాలేదు అనే సరికి ఆశ్చర్యపోయింది రాగిణి. ఇక తను కూడా, ఇద్దరు, ముగ్గురు మీనాక్షి ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తే క్లాస్ ఏడు గంటలకు అయిపోయింది. మీనాక్షి కూడా అప్పుడే బయలు దేరింది. అని చెప్పారు.

దాంతోటి అటు నరసింహ శాస్త్రి వాళ్ళ ఇంట్లో ఇటు రాగిణి వాళ్ళిట్లో ఆందోళన మొదలైంది. ఇక రాత్రంతా నిద్ర లేకుండా తెల్సిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తూనే ఉన్నారు మీనాక్షి ఆచూకీ గురించి. మీనాక్షి ఇంటికి చేరుకోలేదని ఆందోళన మరో ప్రక్క తనకి ఏం అయిందో అని భయంతో రాత్రంతా నిద్రలేక అలసి ఎర్రబడ్డ కళ్ళతో, కలత చెందిన మనస్సుతో ఉన్న రాగిణికి పొద్దునే ఊరి చివర పొలాల్లో ఎవరిదో యువతి శవం పడి ఉంది అని ఎవరో చెప్పిన మాట శరాఘాతంలా గుండెను తాకింది. రాగిణి, గురుమూర్తి, నరసింహశాస్త్రి విషణ్ణ వదనాలతో, అదిరే గుండెలతో, అది మీనాక్షి శవం అయి ఉండకూడదు అని కోటి దేవుళ్ళకు మొక్కుకుంటూ అక్కడికి వెళ్ళారు. కానీ ఏ దేవుడూ వాళ్ళ మొర ఆలకించలేదు. ఒళ్ళంతా గోళ్ళ రక్కులు. నెత్తుటి గాయాలు తలమీద బలమైన దెబ్బ తగిలి అత్యంత దయనీయ స్థితిలో ఇప్పుడు, మరుక్షణమా అన్నట్లు కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న మీనాక్షిని చూచి ఆమె తండ్రి నరసింహశాస్త్రి కుప్పకూలిపోయారు. తన ప్రాణ స్నేహితురాలు మీనాక్షిని ఆస్థితిలో చూసిన రాగిణికి మెదడు మొద్దుబారిపోయింది.

తను జీవచ్చవం అయింది. నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో సుదీర్ఘ పోరాటం చేసి తాను ఓడి మృత్యువుని గెలిపించింది. మీనాక్షి, చనిపోయే ముందు స్పృహలోకి వచ్చిన మీనాక్షి రాగిణిని చూచి ఏడ్చే ఓపిక కూడా లేక నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తూ. తనపై జరిగిన మృగాళ్ళ దుర్మార్గపు దాడి గురించి సైగలతో వివరించింది. ఆ తర్వాత ఇక ఈ పాడులోకంతో తనకు పని లేదు అని పైలోకానికి వెళ్ళిపోయింది.

ప్రాణ స్నేహితురాలి మరణం అదీ అత్యంత దారుణంగా జరగటం తట్టుకోలేకపోయింది రాగిణి. అయ్యప్ప స్వామికి సేవ చేయటమే తన జీవిత పరమావధిగా చేసుకున్న నరసింహశాస్త్రి బిడ్డ మీనాక్షికి ఇంతటి కఠిన శిక్ష్యా, తను ఏం పాపం చేసింది. తనపై అత్యాచారం జరిపిన కొందరు నిందితులు దొరికినా బెయిల్ మీద విడుదలై హాయిగా తిరుగుతున్నారట. ప్రాణ స్నేహితురాలు పోయాక ఇక నిందుతులకి శిక్ష, బెయిల్ ఇవన్నీ తనకి ఎందుకు, పగలు, రాత్రి తేడా లేకుండా మీనాక్షి గురించి ఆలోచిస్తూ దాదాపు పిచ్చిపట్టినట్లు అయింది రాగిణికి.

గురుమూర్తి ఎంతో అనునయంగా గాయానికి నవనీతం పూస్తున్నట్లు తల్లీ విధి రాతను తప్పించుకోలేము. మీనాక్షికి జరిగిన ద్రోహం అమానుషం, మృగచర్య చట్టం, కోర్టు వాళ్ళను శిక్షంచకపోయినా భగవంతుడు వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాడు. నువ్వు ఎక్కువ ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా మనష్యుల్లో పడు తల్లీ అంటు రాగిణికి ఎంతో అనునయించేవాడు. కూతురు చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న నరసింహశాస్త్రి దంపతులు కూడా ఒక బిడ్డను పోగొట్టుకున్నాం. నువ్వు మా బిడ్డ లాంటి దానివి. నువ్వు ఎక్కువ బాధపడకమ్మా అంటూ రాగిణిని ఓదార్చారు. మీనాక్షి పోయిందని రాగిణి దిగులుగా ఉంటే దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు ఒక ప్రక్క మీనాక్షి అత్యాచారం, హత్య మరపుకు రాక ముందే మరలా వరుస సంఘటనలు తమకు కాస్త దగ్గరలోనే ఉ న్న ఊరిలో ఎవరో కిరాతకులు ఆరేళ్ళ పాపను గుడిలో బంధించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడి ఆ పసిదాన్ని నిర్దయగా చంపేసారట.

మరెక్కడో దైవ సేవకురాలు నన్ మీద మంచిని ప్రవచించవలసిన చర్చి ఫాదర్ అత్యాచారానికి పాల్పడటం వంటి సంఘటనలు రాగిణిని మరింత క్రుంగదీసాయి. ఏ మానవ మృగానికి ఎప్పుడు కామం కళ్ళకెక్కుతుందో, ఏ దుర్మార్గపు మృగాళు అబలపై విషపు పంజా విసురుతారో, ఏ నిస్సహాయురాలి జీవితం ఎంత దయనీయంగా ముగుస్తుందో, దేశం అన్ని రంగాలలో పురోగతి సాధించింది. అభివృద్ధి చెందింది అని నాయకులు చంకలు గుద్దుకుంటూ చెప్తారే .పై జరిగే ఈ దారుణాలతో దేశం పురోగమిస్తుందా ! తిరోగమిస్తోందో జవాబు లేని ప్రశ్న అయిపోయింది. ఎంతో భక్తితో కొలిచే దేవుని గుడిలో చిన్న పాప మీద అత్యాచారం జరుగుతుంటే ఆ దేవుడు చూస్తూ ఎలా ఊరుకున్నాడు. నన్ మీదనే లైంగిక దాడి అదీ చర్చిఫాదరే జరిపితే ప్రభువు ఇంకా శాంతంగా ఎలా ఉ న్నాడు ? ఎంతో దైవ భక్తురాలైన రాగిణికి క్రమంగా దైవం పట్ల నమ్మకం పోయింది. రోజు తన తండ్రి గురుమూర్తితో వాదనకు దిగేది. నాన్న దేవుని ముందే అమయిత్యాలు, జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నాడు నాన్న ఆ దేవుడు. మానవ మృగాలు అబలలపై దాడి చేస్తుంటే ఏమి చేయలేని చేతగానివాడు అయ్యాడా ఆ దేవుడు. దోపిడీ దారులు, దొంగ వ్యాపారస్తులు, లంచగొండి కారులు వీళ్ళంతా మనసులోర్థాన్ని, విషాన్ని నింపుకుని దుర్మార్గపు పనులు చేస్తూ అమాయకులు, నిస్సహాయులు అయిన దీనుల ఆత్మహత్యలకు, హత్యలకు కారణభూతులౌతూ వారు మాత్రం నేరంరుజువైనా డబ్బులు వెదజల్లి తిమ్మిని బమ్మిని చేసి సాక్షాలు తారుమారు చేసి బెయిల్ మీద తిరుగుతూ దర్జాగా ఉంటారు. జీవితాన్ని కోల్పోయేది మాత్రం అబాగ్యులు కదా, ఆ దేవుడనే వాడు నిజంగా ఉటే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాడు నాన్న నిజంగానే దేవుడు లేడు, గుడిలో ఉండేది రాతి బొమ్మ అంతే నాన్న ఎంత ఆవేదనగా అంది రాగిణి.

తప్పమ్మా దేవుడు పాపాలను లెక్కగడతాడు. లోకంలో శాంతి స్థాపన కోసం యేసుప్రభువు తప్పకుండా సైతాన్నిపారద్రోలుతాడు. భగవంతునికి భూమాతకున్నంత సహనం ఉంటుంది. శ్రీకృష్ణుడు కూడా శిశుపాలుడు వంద తప్పులు చేసే వరకు సహనంతో ఎదురు చూసింది పశ్చాతాపంతో శిశుపాలుని మార్పు ఏమైనా వస్తుందేమొ అని. కానీ వందో తప్పు చేసాక, ఇక దుర్మార్గులను ఉపేక్షించి లాభం లేదని తన సుదర్శన చక్రంతో అంతం చేసాడు. భూ భారాన్ని సహనంతో మోస్తున్న భూమాత అయినా, ప్రకృతి అయినా మానవులు మంచి తనానికీ, పచ్చదనానికి సమాధికట్టి పాపాలను చేస్తూ కాలుష్యాలను విడుదల చేస్తుంటే సహనం కోల్పోయిన ప్రకృతి, భూమాతలు ఉగ్రరూపం దాల్చి వరదలు, సునామీలు, భూకంపాలు రూపంలో మానవులపై తన ప్రతాపాన్ని చూపినపుడు ఎంతో తెలివిగల వాణ్ణి అని విర్రవీగే మానవుడు ప్రకృతి ముందు ఓడిపోయి నిస్సహాయుడిగా నిలబడవలసిందే. అలాగే దుర్మార్గుల పాపం పండిననాడు దైవం తప్పక వాళ్ళను శిక్షిస్తుంది. తల్లీ అన్నాడు గురుమూర్తి. నిందితులకు ఎన్ని శిక్షలు పడ్డ అన్యాయంగా చనిపోయిన వారు తిరిగి రాలేరుగా నాన్న అంటూ విరక్తిగా నవ్వుకుంది రాగిణి.

తండ్రిమాటలతో కాస్త స్థిమితిపడ్డ రాగిణిలో ఇపుడు చాల మార్పు వచ్చింది. అంతకు ముందు శబరిమలై వెళ్ళి ఆలయంలోని స్వామిని దర్శించాలని కోరిక ఇప్పుడు లేదు. కానీ ఆ కోరిక స్థానే మనుష్యుల మనసులలోనే ఆలయాన్ని నిర్మించే పనిలో పడింది. ప్రతి మనిషి కామ, క్రోధ, లోభ, మధ, మోహ, మాత్సర్యాలు అయిన అరిషడ్వర్గాలను, స్వార్ధాన్ని, అసూయ, ఆహాన్ని వీడి కష్టంలో ఉన్న ఎదుటి మనిషికి సహాయపడితే ఆ మానవుని హృదయమే ఓ దేవాలయం అవుతుంది. ఆ హృదయంలో ఉండే మంచి తనమే దైవం అవుతుంది. అప్పుడు మరో దైవాన్ని ప్రార్థిం చాల్సిన అవసరం లేదు.

ఇకనించి మనుష్యులలో ప్రేమ, జాలి, దయ, కరణ, సేవ, సహాయం చేసే గుణాలను పెంపొందించాలని, తనలాగే ఆలోచించి ప్రతిస్పందించే మరి కొందరిని కూడగట్టుకుని ప్రతి మనిషి హృదయాన్ని ఆలయంగా మలచి, అందులో మంచితనం అనే దైవాన్ని ప్రతిష్టించాలని రాగిణి దృఢ నిర్ణయం తీసుకుంది.