విమల సాహితి ఎడిటోరియల్ 71 – నిత్యకళ్యాణం – పచ్చ తోరణం

“నిత్య కళ్యాణం- పచ్చ తోరణం” ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి🪔🌹

ఇంట్లో ఓ వేడుక జరపాలి. పండగో, పూజో, ప్రార్ధనో లేక బిడ్డల పెళ్ళి. వేడుక ఏదైతే ఏమి అంతా ఆనందంగా ఉండాలనుకుంటాము. ఇంటికి సున్నాలు వేసి శుభ్రం చేయించుకుంటాము. ఇల్లు, వాకిలి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించుకుంటాము. మిఠాయిలు చేసుకుంటాము. ఇంటితోబాటు ఒంటిని కూడా శుభ్రపరచుకుంటాము. కొత్తబట్టలు వేసుకుంటాము. అడుగడుగునా పండుగలు ఎందుకు? వేడుకలు ఎందుకు ? తాహతుకు మించి ఖర్చు ఎందుకు అనే ప్రశ్నలు రాక మానవు.

మూడు కాలాలు, ఆరు రుతువులు. విశ్రాంతి కోరని, అలుపెరుగని కాల చక్రం నిరంతరం తిరుగుతూ ఉంటుంది. కాలం మారినప్పుడల్లా ప్రకృతిలో మార్పులు. ఋతువు మారినప్పుడల్లా వాతావరణంలో మార్పులు. ఈ మార్పులకు అనుగుణంగా మనిషి జీవన చక్రంలో కూడా మార్పులు. ఓ కవి అంటాడు “సృష్టి కర్తకి మనసులేదు. శరత్ కాల వెన్నెల రోజుల్లో కదా మల్లెలు విరబూయాల్సింది” అని. కాని మండే ఎండల్లో మల్లెల పరిమళం అయినా లేకుంటే మనిషికి మనుగడెట్లా? బంగినపల్లి, మలుగూబా, నీలాలు, రసాలు, అంటుమామిడి తియ్యదనం లేకుంటే అగ్గిరవ్వల వేసవి అక్కడే ఆగిపోదూ? చీకట్లు ముసురుకునే కార్తీకం వేళ దీప తోరణాల వెలుగు లేకుంటే అంధకారం చుట్టు ముట్టదూ! ఊదా, మెజంతా, పాలవంటి తెల్లటి తెలుపు, నీలిరంగు నామాల డిసెంబరం పూలు, రోజా, బంతి, చామంతుల పరిమళాల దుప్పట్లు కప్పుకోకుంటే ఎముకలు కొరికే చలిగాలుల ఒణుకు తట్టుకునేదెలా! ప్రకృతి అంతా మనిషి కోసం ఎన్ని కానుకలు ఇచ్చిందని! వాటిని అన్నింటినీ వదిలేసి, ధన కాంక్ష, యుద్ధ విహ్వలత, అసూయ, కామ క్రోధ వికారం, మృగాలు సైతం సిగ్గుపడే మనిషి క్రూరత్వం. పండుగ పరమార్ధం ఏమిటని?విద్యుత్ దీపాలతో, ప్రమిదలో ఒత్తి వేసి వెలిగించిన చమురు దీపాలతో ఇంట్లోని చీకట్లు తొలగించవచ్చు. హృదయంలోని చీకట్లు తొలగిపోవాలంటే మనిషి తన లోపల తాను లక్ష వోల్టుల దీపాలు వెలిగించుకోవాలేమో.

ఈ కార్తీక మాస శోభలో అడుగడునునా వేడుకలు. ధన త్రయోదశి, భగినీ హస్త భోజనం, నాగుల చవితి, వన భోజనాలు, సత్సంగాలు. వీటన్నిటినీ కలుపుతున్న దారం ఆధ్యాత్మికం . ధన త్రయోదశి రోజు బంగారం కొని, దైవానికి పూజ చేయాలి. బంగారు వర్తకుల వ్యాపార కిటుకు అనుకునేకన్నా, ఏడాది అంతా కష్టపడి సంపాదించిన డబ్బులో ఎంతో కొంత పొదుపు చేసి, పండుగ పేరుతో అంతో ఇంతో బంగారం కొంటే, రేపటి ఆర్ధిక అవసరానికి ఊతం కావచ్చు. అదీ కాదనుకుంటే బంగారం అంటే లోహపు కాసులే కాదు. బంగారం వంటి మనసున్న విలువైన వ్యక్తిత్వం గల నలుగురు మనుషులను సంపాదించుకున్నా కూడా మనకు మనం సంపన్నులమే కదా. భగినీ హస్త భోజనం. ఒక్క తల్లికి పుట్టిన బిడ్డలు అయినా అడా,మొగ అనే లింగ వివక్ష, ఆస్తి కోసం అన్నా, చెల్లలు తోబుట్టువుల రగడలు, ఇవన్నీ విడిచి ఒక్కసారి ప్రేమగా సోదర, సోదరీమణులు కలిసి భోజనం చేసి, ప్రేమను పంచుకుంటే, అంతకంటే ఆనందం ఏముంది. అమ్మ, నాన్నా ఇచ్చినదేదో అందరు సమంగా పంచుకుంటే సరిపోదా! లేదు పెద్ద అక్కకో, చిన్న తమ్ముడికో జరుగుబాటు లేకుంటే నీకున్నదాంట్లో పంచి, ఆసరాగా నిలిస్తే అదే అసలైన పండుగ కదా. నాగుల చవితి పండుగ నాడు మాత్రమే పుట్టల నిండుగా పాలు పోస్తే నిజంగా ఆ పుట్టల్లో పాములు ఉంటే, వాటికి ఊపిరి ఆడుతుందా? బయట ఎక్కడైనా పాములు కనిపిస్తే కర్రలతో కొట్టి అవి చచ్చేదాకా చూడడం, విగ్రహాల రూపంలో మాత్రం పూజలు చేయడం, మనుషులం కదా. పాములు అలా కాదు. అసలు జంతువులు ఏవి మనిషి జోలికి రావు. ఆత్మరక్షణ కోసమో, తమ నివాసాలు అడవులను కూలగొడుతున్నందుకో మాత్రమే అవి మనుషుల మధ్యకు వస్తాయి. మనిషి స్వార్ధానికి క్రూరత్వానికి బలి అవుతాయి. జంతువులను దేవుళ్ళు చేయవలసిన అవసరం లేదు. వాటి మానాన అవి స్వేచ్ఛగా బతికేటట్లు చూస్తే చాలు. నిజమైన భక్తి అదే.

మొన్న ఓ పండుగ రోజు అపార్ట్మెంట్స్ లో జరిగే పూజ చూడడానికి మండపానికి వెళుతుంటే ఒకామె దగ్గరకు వచ్చి ‘మీరు పలానా కులం వాళ్లేనా? ‘ అని అడిగింది. ఎందుకు అంటే, ఆ కులం వాళ్ళు అయితే తాంబూలం ఇస్తాను తీసుకోమంది. ‘నాది మనిషి కులం’ అని చెప్పి వెనుదిరిగాను. రెండువేల ఇరవైవ శతాబ్దిలో కూడా మనిషి ఇంత చీకట్లో ఉండడం తల్చుకుంటే చాలా దిగులు, విచారం కలుగుతోంది. ఇక వనభోజనాలు కుల భోజనాలు కాకూడదు. తరతమ బేధాలు అన్నీ మరచి ‘నువ్వు- నేను ఒక్కటే’ అని తెలుసుకుంటే తినే భోజనం మరింత పుష్టిని అందించి హృదయం నిండా జ్ఞాన జ్యోతులను వెలిగిస్తుంది.

ఫిలడెల్పియా గ్రీకు దేవాలయం గోపురం పైన రాసిన ‘నిన్ను నీవు తెలుసుకో’ అనే మాటను గుర్తుపెట్టుకోవాలి. రమణ మహర్షి అనుక్షణం చెప్పే ‘నేనెవరు? నేనెవరు?’ అనే ప్రశ్నను అనునిత్యం వేసుకోవాలి. కులం, మతం, లింగం, ఆస్తి, అంతస్తు, అసూయ, కామం,ద్వేషం, కుట్ర, మోసం….ఈ చిమ్మ చీకట్లు అన్ని మనసు నుంచి తొలగిననాడు నువ్వు మనిషివి కాదు. విశ్వమంతటినీ నిండి ఉండే విరాట్ స్వరూపుని అంశం. నీ హృదయంలో వెలిగే కోటి కాంతుల జ్ఞానదీపం ముందు సూర్యుడు కూడా వెలవెలా పోతాడు.

“తమసోమా జ్యోతిర్గమయా”

విమల సాహితీ పాఠకులకు దీపావళి, కార్తీక మాస ఆకాశ దీపోత్సవ శుభాకాంక్షలు.

రోహిణి వంజారి

సంపాదకీయం

3-11-2024.