విమల సాహితి ఎడిటోరియల్ 18 – యుద్ధం – ఓ అంతర్గత గాయం – ఓ నెత్తుటి శకలం

సామ్రాట్ అశోకుడు ధర్మ ప్రభువు ఎప్పుడు అయినాడు?

ప్రపంచ చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన ధర్మచక్రాన్ని ఎప్పుడు నిర్మించాడు?

తనని నమ్ముకున్న ప్రజలకు సుభిక్షమైన సలక్షణమైన పాలనను ఎప్పుడు అందించాడు?

ఒక్కసారి చరిత్రపుటల్లో తిప్పి చూస్తే 261 బి.సి. కాలంలో ఇప్పటి భారతదేశానికి చెందిన ఒడిషా రాష్ట్రము అప్పటి కళింగ ప్రాంతం. సకల కళా నైపుణ్యాలతో, విశాలమైన సంస్కృతి, ఆర్ధిక వనరులతో అలరారే “ఉత్కళ” ప్రాంతాన్నిఅశోకుని ముత్తాత చంద్ర గుప్త మౌర్యుడు దాడి చేసి ఆక్రమించడానికి విఫల ప్రయత్నం చేసాడు. తాత సాధించని విజయాన్ని తానైనా అందుకోవటానికి తపించిన అశోకుడు ఆహారహం ఆరాటపడ్డాడు. అందుకే ఆ తర్వాతి కాలంలో అశోకుడు, కొత్తగా స్వాతంత్రం పొందిన కళింగ రాజ్యం మీదకు దండెత్తాడు. సింహాసనం కోసం జరిగిన రక్తసిక్తమైన యుద్ధంలో అశోకుడు విజయం సాధించాడు.

ఈ యుద్ధంలో కొన్ని వేలమంది అమాయకులైన స్త్రీ, పురుషులు మరణించారు అన్నది మాత్రం చరిత్ర చెప్పిన సత్యం.అయితే ఇక్కడ అతను విజయం సాధించింది రాజ్యం మీద. కానీ అంతర్గతంగా తనని తాను కోల్పోయాడు. ఘోరంగా ఓడిపోయాడు. యుద్ధ విజయం అశోకుడికి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు. తెగిపడిన తలలు, చిత్రమైన దేహాలు, విరిగిపడిన రథచక్రాలు, నెత్తురోడుతున్న అవయవాలు, గాయపడ్డ వారి ఆర్తనాదాలు, ఏరులై పారిన రక్తపు మడుగులు అతనికి నిద్ర లేకుండా చేసాయి. మనసు వికలమైంది. ఇక జీవితంలో యుద్ధం జోలికి పోను, అంటూ కత్తిని జారవిడిచి, కైవల్యం కోసం బుద్ధుడిని శరణువేడాడు. ధర్మ పాలన చేసి ధర్మ ప్రభువు అయినాడు.

“ఏతాన్న హన్తుమిచ్చామి ఘ్నతో పి మధుసూదన|

అపి త్రైలోక్యరాజ్యస్య హేతో: కిం ను మహీకృతే |”

భగవద్గీత అర్జునవిషాద యోగంలో “ఓ మధుసూదనా!

ముల్లోకాధిపత్యము కొరకైనను
నేను ఎవ్వరినీ చంపను

ఇక ఈ భూమండలవిషయమై చెప్పనేల? అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనిననూ

నేను మాత్రం వీరిని చంపనే చంపను” అంటాడు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో.

తాను తలపడవలసింది, యుద్ధంలో చంపవలసింది, తన శత్రువులుగా భావించి సంహరించవలసింది తన తాతలు, తండ్రులు, మామలు, దాయాదుల అన్నదమ్ముళ్ళను అని తెలుసుకున్న అర్జునుడు విషాదంతో కుమిలిపోయి, రణభూమిలో తానిక నిలబడలేను అని ఆయుధాలు విడిచి శ్రీ కృష్ణుడిని శరణువేడుతాడు. అయితే నూరుగురు కౌరవులు, అక్షౌహిణి సైన్యం తనవెంట ఉన్నా, కౌరవుల వద్ద ధర్మం ఒక్కటి లేకపోవడం వల్ల శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలిచి, అర్జునుని రధసారథి అయి, రణరంగంలో పాండవుల గెలుపుకు సాయపడతాడు.

ఎందుకంటే పాండవులు ధర్మాన్ని, నిజాయితీని విడిచిపెట్టలేదు కనుక.
అసలు యుద్ధం ఎందుకు?దురాక్రమణలు ఎందుకు? సింహాసనం కోసం, కీర్తి కండూతి కోసం, అధికారం కోసం యుద్దాలు చేసి, ప్రాంతాలను కబ్జా చేసి గెలిచామని విర్రవీగే వాళ్ళకు తెలియదు తాము గెలిచి సాధించింది ఏమిలేదని. యుద్ధ రంగ మారణహోమంలో బలిపశువులుగా మారేది అమాయకమైన ప్రజలు. రక్తపాతం. ప్రాణానికి విలువలేని చోట, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, ఎవరో తమని రక్షించడానికి వస్తారని ఎదురుచూసే అమాయకులు. నాగరిక యుగం, ఆధునిక యుగం అనుకుంటున్న ఇప్పుడు సరిగ్గా ఇప్పుడే ఇజ్రాయేల్ లో జరిగేదేమిటి? హమాస్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి దాడులు చేస్తుందని, ఇజ్రాయేల్ సరిహద్దుల్లోకి ప్రవేశించి మరీ పౌరులను చంపుతుందని అక్కడి ప్రజలు సహా ఎవరూ ఊహించలేదు. వారి ఊహలకు అందని విధంగా..ముష్కరులు మెరుపు దాడులకు తెగబడి యుద్ధ రాకెట్లను ప్రయోగిస్తున్నారు. ఇజ్రాయేల్ ఎదురుదాడులు చేస్తోంది.

పదులనుంచి వందలు, వేల సంఖ్యలో సైనికులు, సామాన్య ప్రజలు అమాయక పసికందులు అసహాయంగా ఆక్రందనలు చేసే అబలలు ఈ యుద్ధకాండలో బలిపశువులుగా మారుతున్నారు. అక్కడ ఎటు చూసినా ద్వంసమైన ఇళ్ళు, రోడ్లపై పడిఉన్న శవాలు, తలలు తెగిన మొండేలు, నెత్తురోడుతున్న అవయవాలు, చల్లాచెదురైన మృతదేహాలు. మత, కుల ప్రాంత సరిహద్దులు చెరిపి ప్రపంచమంతా నూతన కుగ్రామములా మారినప్పుడు ఈ విపరీత పరిణామాలతో ప్రపంచం ఎటుపోతోంది. ఎంత ఘోరం ఇది. దురాక్రమణలు చేసి ప్రాంతాలను వశపరచుకుని చేసేది ఏమిటి..? మతం కుళ్ళుని ప్రపంచమంతా వెదజల్లాలని, మనుషులమని మరచి మారణకాండకు తలపడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా, ప్రపంచశాంతికి, మానవత్వానికి ప్రతి ఒక్క మనిషి కట్టుబడి ఉండాల్సిన సమయం ఇది.

మతోన్మాద ముష్కర మూకల మీద, మానవహక్కుల ఉల్లంఘనల మీద, స్త్రీలపై శిశువులపై ఆకృత్యాల మీద మాట్లాడలేక గొంతులు మూగబోయాయా. కాషాయ మూక ఆగడాల మీద కదం తొక్కిన వీర సింహాలై విరుచుకుపడుతున్న కవుల కలాల్లో ఇప్పుడు ఇంకు చుక్కలు ఎండిపోయాయా? ఒక్క కలం కూడా కదలడంలేదు. మేధావుల మస్తిష్కాలు మొద్దుబారి పోయాయా. ఒకవేళ యుద్ధమే జరిగితే మనం ఏ పక్షం..? పాము, కప్పల మధ్య పోరాటం జరిగితే కప్పల పక్షం వహించాలి. జింక, పులి మధ్య పోరాటం జరిగితే జింకకి సాయం చేయగలగాలి. అంటే మన మద్దత్తు ఎప్పుడూ బలహీనుల పక్షంవైపు ఉండాలని. ఇప్పుడు కవులు కలాల్లో ఇంకును కాదు, యుద్ధంలో మరణించిన మనుషుల రక్తాన్ని, సర్వం సకలం కోల్పోయిన స్త్రీల కన్నీటి చుక్కలను నింపుకుని మరీ శాంతి సందేశాలను లిఖంచాలి. అన్యాయం ఎటువైపు ఉన్నా ఖండించి మతాలకు అతీతంగా న్యాయం వైపు నిలబడాలి.

“పగ అన్నదెపుడూ ఏమిచ్చె నేస్తం నష్టాన్నే మిగిలించురా
క్షణకాలమైన మనఃశాంతి లేని బతుకెంత బరువవ్వురా
బతికేందుకే ఈ బతుకుందని చచ్చాక తెలిసేమిరా”

బుద్ధం శరణం గచ్చామి..
ధర్మం శరణం గచ్చామి..
సంఘం శరణం గచ్చామి.
ఓం శాంతి శాంతి శాంతి

రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630