విద్యయా అమృతమశ్నుతే

ఈ రోజు నవ తెలంగాణ “సోపతి”లో ప్రచురితమైన నా కథ “విద్యయా అమృతమశ్నుతే” తో ఈ సంవత్సరం 2024 నా సాహితీ పయనానికి శ్రీకారం చుట్టబడింది. నవ తెలంగాణ సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹

దిగ్గున లేచికూర్చున్నాడు ప్రణీత్. చుట్టూ చిమ్మ చీకటి. గదిలో సన్నటి బెడ్ లాంప్ వెలుతురుకు అలవాటుపడ్డాయి ప్రణీత్ కళ్ళు. పక్క మంచాలమీద పడుకున్న అతని రూంమేట్స్ దుప్పటి ముసుగేసి గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. అతన్ని మాత్రం నిద్రాదేవి కరుణించలేదు. కారణం పక్క రోజు పరీక్షల ఫలితాలు వెలువడతాయి.
ప్రణీత్ ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు రాసి ఉన్నాడు. సెలవల్లో కూడా ఎంసెట్ కోచింగ్ కోసం ఇంటర్ చదివిన కాలేజీ హాస్టల్ లోనే ఉండి, అక్కడే ఎంసెట్ క్లాసులకు వెళుతున్నాడు. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది ప్రణీత్ కి. భయంతో సన్నగా వణుకు మొదలయింది. రేపు ఖచ్చితంగా పాస్ లిస్టులో తన నెంబర్ ఉండదు. వెనువెంటనే కాలేజీ నుంచి రిపోర్ట్ కూడా అమ్మ,నాన్నల మొబైల్ ఫోన్లకు మెసేజ్ లు వెళతాయి . వెల్లికిలా పడుకుని సీలింగ్ ఫ్యాన్ కేసి చూసాడు. అది చప్పుడు చేస్తూ గిరగిరా తిరుగుతోంది. ప్రణీత్ ఆలోచనలు కూడా ఫ్యాన్ కంటే వేగంగా తిరగసాగాయి. రేపు పరీక్ష ఫలితాలు వచ్చేలోగా తాను చనిపోవాలి. పరీక్షలో తప్పిన తనకు ఇక కాలేజీలో, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు. ఎలా …. ఏం చెయ్యాలి. అందరు నిద్ర పోతున్నారు. కంపాస్ బాక్స్ లో ఉండే బ్లేడు తో మణికట్టు మీద కోసుకుంటే… లేదా సీలింగ్ ఫ్యాన్ కు దుప్పటి తో ఊరివేసుకుంటే… ఆమ్మో..ఇక్కడ ఏం చేసిన అందరికి తెలిసి పోతుంది. ముందు ఇక్కడ నుంచి బయట పడాలి.
మెల్లగా లేచి చప్పుడు చేయకుండా తన పుస్తకాల అల్మరా తెరిచాడు. పుస్తకాలను, వాటి ముందు పెట్టి ఉన్న అమ్మ, నాన్న ఫోటోను చివరిసారిగా చూసాడు.” నన్ను క్షమించండి అమ్మ,నాన్న… మీ ఆశలను తీర్చలేని ఆశక్తుడను, పనికిమాలినవాడిని” మూగగా అతని మనసు రోదించింది. మంచం పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసి గొంతు తడుపుకున్నాడు. రూంమేట్స్ అంతా గాఢ నిద్రలో ఉన్నారు. రూమ్ తలుపు తీసి వరండాలోకి వచ్చాడు. చివరి గది తలుపు తీసి ఉంది. హాస్టల్ వార్డెన్ గది అది. మెల్లగా తొంగి చూసాడు. లైటు వేసుకునే నిద్రపోతున్నాడు వార్డెన్ పరమేశ్వర్. వరండా దాటి మెయిన్ గేట్ దగ్గరకి పిల్లిలాగా నడుచుకుంటూ వచ్చి, నైట్ వాచ్ మన్ కూడా నిద్రలోనే ఉన్నాడు అని రూఢి అయినాక మెల్లగా గేట్ తెరచి హాస్టల్ నుంచి బయట పడ్డాడు.
వీధి లైటు వెలుగుతూ, ఆరిపోతూ ఉంది తన ఆశలలాగే. దూరంగా రెండు కుక్కలు ప్రణీత్ ని చూసి మొరగడం మొదలు పెట్టాయి. ఇక ప్రణీత్ వెనుదిరగకుండా శక్తి కొద్దీ పరుగెత్తాడు. చీకట్లో ఎటువైపుకు వెళ్ళుతున్నాడో తెలియలేదు. కాస్తదూరంలో రైలు కూత వినపడింది. అంతే…ప్రణీత్ మనసులో ఓ స్థిరమైన ఆలోచన రూపుదిద్దుకుంది.
రైలు పట్టా మీద తలపెట్టి అడ్డంగా పడుకుని కళ్ళు మూసుకున్నాడు ప్రణీత్. కన్నీళ్ళుకారి అతని చొక్కాని తడిపేస్తున్నాయి. పక్క పట్టాల మీద నుంచి గూడ్స్ రైలు ముందుకు వెళుతోంది. గబ్బుక్కున ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా లేచి మెల్లగా కదిలే గూడ్స్ బండి ఎక్కేసాడు. ఆమ్మో, ఇక్కడ చనిపోతే ఇంట్లో వాళ్ళకి తొందరగా తెలిసిపోతుంది. ఈ గూడ్స్ రైలులో ఎక్కడైనా దిగేసి అక్కడ చనిపోతాను అనుకున్నాడు. ఆ గూడ్స్ బండి ముందుకు పోతుంటే ప్రణీత్ ఆలోచనలు వెనుకకు వెళుతున్నాయి.
పదవ తరగతి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అయినాడు ప్రణీత్. గణితం, సైన్స్ సబ్జెక్టు లలో తక్కువ మార్కులు వచ్చాయి. సోషల్ స్టడీస్, తెలుగులలో మాత్రం తొంభై మార్కుల పైనే వచ్చాయి. అయినా ప్రణీత్ వాళ్ళ అమ్మ, నాన్న తృప్తి పడలేదు. పైగా గణితం లో తక్కువ వచ్చాయి అని పక్కవాళ్ళతో పోల్చి చాల సేపు అతన్ని తిట్టారు. ఇంటర్ లో తనకు సోషల్ ఇష్టం సి.ఈ.సి గ్రూప్ తీసుకుందాం అనుకున్నాడు. కానీ వాళ్ళ అమ్మ, నాన్న మాత్రం అతన్ని ఎం.పి. సి. గ్రూపు తీసుకోవలసిందే అని పట్టు పట్టారు.
ప్రణీత్ అమ్మ సుధా అయితే ” ఆ సి.ఈ.సి. గ్రూపు తీసుకుని సోషల్ చదువుతావా ప్రణీత్ నువ్వు. ఛీ, ఛీ నలుగురిలో ఎంత చీప్ గా ఉంటుంది. అందరు మెడిసిన్, ఇంజనీరింగ్ చదివి డాక్టర్, ఇంజనీర్ లు కావాలనుకుంటుంటే నువ్వు ఇంత చీప్ గా ఆలోచిస్తావా. నోరుమూసుకుని మేము చెప్పినట్టు విని ఎం.పి.సి. గ్రూపు తీసుకో..కష్టపడి చదివితే అందరిలాగే నీకు మంచి ర్యాంక్ వస్తుంది” అంటూ ప్రణీత్ ఇక నోరెత్తకుండా శాసించింది. వాళ్ళ నాన్న దయాకర్ కూడా ఆమెకు వంత పాడాడు. అంతటితో ప్రణీత్ ఇష్టం అతని మనసులోనే సమాధి అయింది. హాస్టల్ లో ఉండడం కూడా అతనికి ఇష్టం లేదు. ఇంటి దగ్గరే అమ్మ, నాన్నలతో కలసి ఉండి చదువుకోవాలనుకున్నాడు. అతని ఏ ఆశ నెరవేరలేదు.
ఇంటర్లో అధ్యాపకులు ఎంత బాగా చెప్పినా గణితం తన బుర్రకి ఎక్కేది కాదు. తాను ఎంత కష్టపడినా వారాంతపు పరీక్షలలో అయిదారు మార్కుల కంటే ఎక్కువ వచ్చేవి కాదు. ఇటు కాలేజీలో, అటు ఇంట్లో అక్షింతలు, అష్టోత్తర శతనామాలు. మార్కులు తక్కువ వచ్చాయి అని స్నేహితుల వెక్కిరింతలు. మొదటి సంవత్సరం గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్టులలో తప్పాడు తాను. ఇక అమ్మ అయితే ” ఇన్నిన్ని వేలు ఫీజులు కట్టి నిన్ను కాలేజీలో చేర్పించింది నీవు ఫెయిల్ అవడానికా. ఎలా తింటున్నావు రా అన్నం నువ్వు. నలుగురిలో మా పరువు తీసావు. ఎలా సయిస్తుందిరా నీకు తిండి…..అన్నం నోట్లో పెట్టుకుంటుండగా అమ్మ అన్న మాటలకు గొంతులో అన్నం ముద్ద అడ్డం తిరిగి కంచంలోనే ఊచేసాడు. కన్నీళ్ళు అన్నాన్ని తడిపేశాయి.
గూడ్స్ రైలు ఆగడంతో ఆలోచనల నుంచి బయటికి వచ్చాడు ప్రణీత్. మెల్లగా రైలు దిగాడు. అంతా చిమ్మ చీకటి. అది ఏ ఊరో తెలియలేదు అతనికి. “హు… ఏ ఊరు అయితే తనకేంటి ఇంకాసేపట్లో చనిపోయేదానికి” అనుకుంటూ పక్కన ఉన్న రైలు పట్టా మీద తలపెట్టి అడ్డంగా పడుకున్నాడు.
తన బాధ, తన ఇష్టం, తన కష్టం, తన గోడు వినేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో లేరు. ఇక ఇప్పుడు ఈ రైలు తన తలమీద నుంచి వెళ్ళి తన బాధలకు విముక్తి కలిగిస్తుంది. ఇక నన్ను ఎవరు ప్రశ్నించలేరు. తిట్టేవారు లేరు. అరకిలోమీటర్ దూరంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మృత్యు శకటంలా దూసుకు వస్తోంది. రైలు పట్టాలు అదురుతున్నాయి. ప్రణీత్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అతని గుండెలలో కూడా రైళ్ళు పరుగెడుతున్నాయి. రైలు చాల సమీపానికి వచ్చేసింది. అయిపోయింది. తన జీవితానికి ఆఖరి క్షణం ఇది.
విసురుగా వెళ్ళి చెట్ల తుప్పల్లో పడ్డాడు ప్రణీత్. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నాయి. చర్మం చీరుకు పోయింది . ఒక్క క్షణం ఏం జరిగిందో తెలియలేదు ప్రణీత్ కి. రైలు తన గొంతు మీద నుంచి వెళ్ళి తనకు విముక్తి కలిగిస్తుంది అనుకున్న ఆఖరి క్షణంలో ఎవరో తన చేయి పట్టి విసురుగా లాగి చెట్ల తుప్పల్లోకి తోసినట్టు గుర్తుకు వచ్చింది.
వేకువ జామున నాలుగు అయింది అప్పుడు. చీకటి దుప్పటి లోకాన్ని కప్పేసి ఉంది. దూరంగా ఎక్కడో తూర్పు దిక్కు అరుణ వర్ణం పులుముకుంటోంది. దివాకరుని ఆగమనానికి స్వాగత చిహ్నంగా. “ఎవరు మీరు నన్నెందుకు చావనీయకుండా రక్షించారు”. ఏడుస్తూ అన్నాడు ప్రణీత్.
అతని ఎదురుగా ఓ పెద్దాయన ప్రశాంత వదనంతో ప్రణీత్ వంక చూసాడు. అతనికి అరవై ఏళ్ళ పైబడే ఉంటుంది. జీవిత సారాన్ని కాచి వడపోసిన అనుభవం అతని ముఖంలో కనబడుతోంది.
అతను ప్రశాంతంగా నవ్వుతూ “నాయన..నా పేరు నీలకంఠ. మనస్తత్య శాస్త్ర కళాశాలలో ప్రొఫెసర్ ని. నువ్వు ఎందుకు చావాలనుకున్నావో కారణం నాకు తెలియదు కానీ నీ లాంటి లేత ప్రాయం బిడ్డలు ఎందుకు చావాలనుకుంటున్నారో నేను చెప్పగలను. ప్రేమ విఫలం అయితేనో, పరీక్ష ఫెయిల్ అయితేనో, ఇంట్లోవాళ్ళు సెల్ ఫోన్ కొని ఇవ్వలేదనో ఏదో చాల చిన్న కారణం తో తనువు చాలించాలనుకుంటారు. మరి వీటిలో నువ్వు ఏ కారణంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు బాబు . నీ పేరు ఏమిటి ” అన్నాడు ప్రొఫెసర్ నీలకంఠ.
” ఒక్క క్షణం ప్రణీత్ అతన్ని తేరిపారా చూసాడు. చీకట్లో కూడా అతని కన్నుల్లో కనపడిన తేజస్సు కి ప్రణీత్ విస్మయం చెంది “నా పేరు ప్రణీత్ . చదువు రాని మొద్దుని. ఎంత కష్టపడి చదివినా పరీక్షలో సరిగా రాయలేక పోయాను. పరీక్ష ఫెయిల్ అయితే కాలేజీలో, ఇంట్లో అమ్మ, నాన్న తిట్టే తిట్లు భరించడం కన్నా చనిపోతే ఏ బాధ ఉండదు కదా ” ఆవేదనగా అన్నాడు ప్రణీత్.
“బాబు నువ్వు ఇప్పుడు నాతోపాటు వస్తే నువ్వు అడిగినదానికి జవాబు చెప్తాను” అంటూ ప్రణీత్ ని చేయి పట్టి లేవదీసి ముందుకు నడిచాడు ప్రొఫెషర్ నీలకంఠ. అతని వెనుకే మంత్రముగ్ధుడిలా నడిచాడు ప్రణీత్. చీకట్లు మెల్లమెల్లగా తొలిగిపోయి వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి. రైలు పట్టాల నుంచి కాస్త దూరంగా నడిచాక ఓ ఆశ్రమం లాంటి ప్రాంగణం లోకి తీసుకువెళ్లాడు ప్రొఫెసర్ నీలకంఠ, ప్రణీత్ ని.
ఆ ప్రదేశమంతా రకరకాల చెట్లతో, చిన్న చిన్న కుటీరాలతో ప్రశాంతంగా ఉంది. అక్కడ చాల మంది యువకులు వ్యాయామం చేస్తున్నారు. ప్రొఫెసర్ నీలకంఠని చూడగానే వారు చిరునవ్వుతో, వినయంగా నీలకంఠ గారికి నమస్కారం చేసి వాళ్ళ పనిలో పడ్డారు. ప్రణీత్ తన గత పరిస్థితి, బాధ మరచిపోయి వాళ్ళని కుతూహలంగా చూస్తూ
” వీళ్ళు అంతా ఎవరు అండీ. ఇక్కడ ఎందుకు ఉన్నారు. మీరు అంత చీకట్లో రైలుపట్టాల దగ్గరికి ఎందుకు వచ్చారు…ప్రశ్నల వర్షం కురిపించాడు ప్రణీత్.
” బాబు ప్రణీత్ …వీళ్ళు అంతా ఒకప్పుడు నీలాగే చనిపోవాలని ఆ రైలు పట్టాల మీద పడుకున్నవాళ్ళే” అన్నాడు ప్రొఫెసర్ నీలకంఠ. అమితాశ్చర్యంగా అతని వంక చూసాడు ప్రణీత్. అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చోమని ప్రణీత్ ని తాను కూర్చుని ” బాబు ప్రణీత్ నేను చెప్పింది నీకు వింతగా ఉన్నాఇది నిజం. ఇక్కడ ఉన్నా ఆ యువకులు కూడా నీలాగే చదువు సరిగా రాలేదని, పరీక్షలో ఫెయిల్ అవుతాం అనే భయంతో చనిపోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు. చదువు మొదట జ్ఞాన సముపార్జనకోసం. ఆ తర్వాత బ్రతుకు తెరువుకు ఉపాధి కోసం. కానీ నేటి విద్యా సంస్థలు విద్యను వ్యాపారం చేసి, మార్కులు, ర్యాంకులు అంటూ విద్యార్థులను మభ్య పెట్టి విద్యా వ్యాపారం చేస్తున్నారు. అగ్నికి ఆద్యం పోసినట్టు తల్లిదండ్రుల కోరికలు కూడా తోడై బిడ్డల శారీరక, మానసిక సామర్ధ్యం ఎంత ఉందో, వాళ్ళకి ఏమి నేర్చుకోవాలని ఇష్టం ఉందో తెలుసుకోకుండా తమ కోరికలను పిల్లలమీద రుద్దుతున్నారు . కష్టంతో కాకుండా ఇష్టంతో సాధన చేసినపుడే మనం నేర్చుకున్నది మనకు అవగాహనకు వస్తుంది.
విస్తుపోయి చూస్తున్నాడు ప్రణీత్ ప్రొఫెసర్ నీలకంఠ మాటలు వింటూ రెప్పవేయడం మరచి .
“విద్యయా అమృత మశ్నుతే” అన్నారు. అంటే విద్య మనిషికి అమృతత్వాన్ని కలిగించాలి. కానీ నేటి విద్య పిల్లలకు మృతత్వాన్ని కలిగిస్తోంది. ఇది చాల బాధకరం. ఇప్పుడు వీళ్ళు అంతా ఇక్కడ వాళ్లకిష్టమైన విద్యను నేర్చుకుంటున్నారు. వాళ్ళు మంచి ప్రయోజకులై, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు సగర్వంగా పంపిస్తాను లేదా వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టు ఎక్కడైనా కొత్త జీవితం ప్రారంభిస్తారు బాబు నేను. నా చిన్నపుడు నా తమ్ముడు చదువు పట్ల,జీవితం పట్ల సరైన అవగాహనా లేకుండా ఈ రైలు పట్టాల మీదే తాను మాకు దూరం అయినాడు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నా తమ్ముడిలా ఎవరు చనిపోకూడదని.
అందుకే ఇక్కడ నీలాంటి వాళ్ళకోసం ఆశ్రమం పెట్టి, ఈ రైలు పట్టాల మీద నా తమ్ముడు లాంటి మరో తమ్ముడు ఆత్మహత్య చేసుకోకూడదని రాత్రి పూట ఇక్కడ తిరుగుతుంటాను. ప్రణీత్ నువ్వు కూడా వీళ్ళతో కలసి నీకు ఆసక్తి ఉన్నచదువును ఇష్టంగా చదువుకో. నువ్వు ఇక్కడ ఎన్నిరోజులు ఉన్న అందరితోపాటు నిన్నుపోషిస్తాను నేను. మన సొంత పొలం, కూరగాయల తోట కూడా ఉంది ఇక్కడ. పనులు చేసుకుంటూ, ఇష్టమైన విద్యను నేర్చుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు వీళ్ళు. “క్షణికావేశం లో చనిపోవాలని ఎంత పొరపాటుగా అనుకున్నాం , మీరు రక్షించకుంటే ఏం అయిపోయేవాళ్ళమో ” అంటారు వీళ్ళు. ఇపుడు వీళ్ళలో సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నవాళ్ళు, డాక్టర్, లాయర్, చార్టెడ్ అకౌంటెంట్ ఇలా తమకి నచ్చిన చదువు నేర్చుకుంటున్నవాళ్ళు ఉన్నారు . ఇప్పుడు చెప్పు ప్రణీత్ నీకు ఏం ఇష్టమో. ఏం చేయదలుచుకున్నావో ” అభిమానంగా ప్రణీత్ భుజం తట్టి అడిగాడు ప్రొఫెసర్ నీలకంఠ.
అతని చేయి తన భుజం మీద పడగానే తనకి వేయి ఏనుగుల బలం వచ్చినట్టు, మనసంతా ఆహ్లాదం నిండగా ప్రొఫెసర్ నీలకంఠ వైపు ఆరాధనగా చూసాడు ప్రణీత్ తన బంగారు భవిష్యత్తు హరివిల్లులోని సప్త వర్ణాలతో పోటీపడుతూ కనిపిస్తుండడంతో..
ఏమో. ఎవరికి తెలుసు. రేపు ఒకనాటికి ప్రణీత్ ఎంతగొప్పవాడు అవుతాడో. కాలం..గొప్ప ఇంద్రజాలం. ఏమైనా జరగవచ్చు కదా.