ఈ సోమవారం సూర్య పత్రిక సాహిత్య పేజీ “అక్షరం” లో “విజయ మహల్ సెంటర్ కథలు” సంపుటి గురించి డా. జెల్ది విద్యాధర్ రావు గారు రాసిన సమీక్ష మరోసారి మీ కోసం..
బుక్ ఫెయిర్ కి వచ్చి పుస్తకం కొనడమే కాదు. కొన్న పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివి వారం రోజుల్లోనే సమీక్ష రాయటం చాలా గొప్ప విషయం. మన అక్షరాలకు ఇంతకు మించిన పట్టాభిషేకం ఏముంటుందని.
క్షణం తీరిక లేని బిజీ IRS ఆఫీసర్ డా. జెల్ది విద్యాధర్ రావు గారు.. వారు “విజయ మహల్ సెంటర్ కథలు” గురించి సమీక్ష రాయటం మహదానందం. హృదయపూర్వక ధన్యవాదాలు సర్
సమాజాభ్యుదయం, మానవతావాదం రెండూ సమంగా కలబోసిన కథల కదంబం “విజయ మహల్ సెంటర్” కథలు
“రోహిణి వంజారి”.. ఈ పేరు ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా కథా జగతిలో హృద్యమంగా వినిపిస్తున్న పేరు, ఉదృతంగా పారుతున్న స్వచ్ఛ సెలయేరు. నెల్లూరు పెన్నా నది తీయదనాన్ని అక్కడ ప్రత్యేక తీపి వంటకం రవ్వలడ్డు లోని మాధుర్యాన్ని రెండిటినీ సరి సమానంగా తన కథలలో కలబోసి నెల్లూరు మాండలిక సొబగులను జీడిపప్పు పలుకులుగా అద్ది తెలుగు పాఠకులకు అందమైన తాజా తాజా మిఠాయి పొట్లం లాంటి పుస్తకాలలో పాఠకులకు సిద్ధం చేసి ఉంచారు. గత సంవత్సరం వెలువరించిన “నల్ల సూరీడు” కథలు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. విమర్శకుల మన్ననలను, పాఠకుల అనితర ప్రోత్సాహాన్ని సాంతం సొంతం చేసుకున్న కథా సంపుటి అది..
రోహిణి Rohini Vanjari గారు విరచించిన నూతన కథా సంపుటి “విజయ మహల్ సెంటర్ కథలు” కేవలం పది రోజుల క్రితం హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతున్న సమయంలోనే విడుదలై సాహితీ లోకంలో ఒక సంచలనాన్ని సృష్టించగలిగిన సామర్థ్యం పొందింన నేటి మేటి సుగంధ సాంబ్రాణి, పుస్తక సామ్రాజ్ని ఈ కథా సంపుటి. పుస్తక ప్రేమికులు. ముఖ్యంగా కథా ఇష్ఠాగరిస్టులు కళ్ళు తిప్పుకొనియకుండా క్షణం వదలకుండా చదివించగలిగే మానవీయ సంబంధాలను మహోన్నత శిఖరాల పైన నిలిపి ఉంచిన కథలు అనేకం ఈ సంపుటిలో ఉన్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అమాయక అందమైన ఆడపిల్ల బాల్యంలోని అమలిన అనంత హృదయ వైశాల్యం నుండి జాలువారిన అరమరికలు లేని జీవితానుభవాల బొట్లను ప్రమిదలో జాగ్రత్తగా ఒడిసి పట్టి వెలిగించిన,, ప్రపంచానికి అందించిన అక్షర జ్ఞానజ్యోతి ఈ పుస్తకం..
ఈ పుస్తకాన్ని మొదలుపెట్టిన తర్వాత ఎవరికివారు ఆ పాత్రలను దగ్గరగా చూసిన వారితో మాట్లాడిన కలిసి తిరిగిన అనుభూతి పొందుతారు. అటువంటి సజీవ పాత్రలకు రూపకల్పన చేసిన రోహిణి గారు ఈ పుస్తకాన్ని అంతా వివిధ సందర్భాలలోని తమ జీవితానుభవాలను సౌందర్యమానంగా తీర్చిదిద్ది ఎటువంటి విసుగు విరామం తెలియకుండా ఏకబిగిన చదివించే మహాద్భుత కథలుగా రూపకల్పన చేశారు.
రచయిత్రి ఈ పుస్తకానికి తను పుట్టిన ఊరిలోని కొండగుర్తు లాంటి ఒక ప్రాంతం లేక ప్రదేశం పేరు పెట్టి చాలా చాకచక్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే ప్రయత్నం చేశారు. పుస్తకం సజ్జన సాఫల్యత పొందిందని చెప్పడానికి అందమైన కవర్ పేజీ, ఆకర్షణీయమైన పుస్తక శీర్షికే సగం నిర్ణయిస్తుందని చెప్పవచ్చు. ఒక నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రాసిన మిట్టూరోడి కథలు, ఒక ఖదీర్ బాబు రాసిన దర్గామిట్ట కథలు, ఒక శంకరమంచి సత్యం గారి అమరావతి కథలు, ఈ మధ్య వచ్చిన నవ యువ కధా రచయతలు హుమయూన్ సంఘీర్ రాసిన కాముని కంత కథలు, కె.వి మేఘనాధ రెడ్డి రచించిన కలంగూర గుట్ట కథలు లాగా ఇది ఒక ప్రాంతాన్ని సూచిస్తూ పాఠకుల మనసుల్లోకి శాశ్వతంగా చొచ్చుకుని పోయే ఒక మంచి ఆలోచనా రూపం ఈ పేరు.
నవలలు, కథానికలు, కథలంటేనే సజీవ సంఘర్షణలు, జీవన శకలాలు, జీవిత దృశ్యాలు. కథలన్నీ రచయిత్రి అనుభవాల్లోంచి, సామాజిక స్పృహలోంచి, అసమానతలపై ధిక్కార స్వరం లో నుంచి, తాత్విక దృక్పథంలోంచి, తను నమ్మిన ఆదర్శాల్లోంచి పుట్టుకొచ్చినవే. కథలు చాలామంది రాస్తారు. కానీ కొంతమంది మాత్రమే కథను అందంగా చెప్పగలరు. హృదయానికి హత్తుకునేలా చెప్పగలరు. కళ్ళు చెమ్మగిల్లేలా చెప్పగలరు. కళ్ళు తెరిపించేలా కూడా చెప్పగలరు. రోహిణి వంజారి గారు నిస్సందేహంగా అటువంటి కథకులే. అటువంటి అపురూపమైన కథ “కర్పూర దీపం” రూపంలో కనిపిస్తుంది. సెప్టిక్ టాయిలెట్స్ లేని రోజుల్లో మనుషుల మలమూత్రాలను చేత్తో ఎత్తిపోసే వృత్తిలోని “దొడ్డెత్తే నరసమ్మ” పాత్రను చాలా గొప్పగా చిత్రీకరించారు. ఆ కథలోని ప్రధాన పాత్ర విషాదాంత సందర్భం కఠిన పాషాణంకైనా కళ్ళు చెమ్మగిల్లేటట్లు చేస్తుంది.
రచయిత్రి గారికి తల్లిదండ్రుల పైన తోబుట్టువుల పైన అచంచల ప్రేమ, కుటుంబ వ్యవస్థ పైన విశ్వాసం, స్నేహితుల, బంధువులు వీరని వారని ఏముంది… వారి జీవిత గమనంలో ఎదురైన ప్రతి వ్యక్తి పై అల్లుకున్న అనుబంధాలు, ఆత్మీయతలు, ఇష్టంతో పాటు అమితమైన గౌరవం అని ఇందులోని కథలు “సునీలు ఏమయ్యాడో”” “రూపాయి దేవుడు” “గంగరాయి చెట్టు కింద ఇరగాలమ్మో” చదివితే తెలుస్తుంది.
“రూపాయి దేవుడు” కథలో కేవలం ఒక రోగికి ఒక రూపాయి మాత్రమే తీసుకొని వైద్యం చేసే అరుదైన డాక్టర్ గురించి, అతడు రోగులు గురించి చూపించే వ్యక్తిగత శ్రద్ధను రోగులు డాక్టర్ మీద చూపించే ప్రేమను వివరించే కథ ఇది. చివర్లో డాక్టర్ గారికి యాక్సిడెంట్ అయిందని పుకారు విని ప్రజలంతా తండోపతండాలుగా డాక్టర్ గారి ఇంటికి చేరుకొని ఆయన నిర్జీవ శరీరం కోసం ఎదురుచూస్తూ ఉన్నప్పుడు వ్యాన్ లో నుంచి క్షేమంగా ఆయన దిగినప్పుడు ప్రజలు పొందిన వర్ణనాతీత ఆనందం చదువుతున్న పాఠకులను భావోద్వేగపు అంచులు తాకి కళ్ళను చెమ్మగిల్లేటట్టు చేస్తుంది. ఈ కథలో ముఖ్య పాత్రులైన పుల్లయ్య డాక్టర్, సత్యం పంతులు, బుజ్జమ్మ, బుజ్జమ్మ అక్కకొడుకు విసిగాడు అనబడే విశ్వనాథ్, మోహనన్న చుట్టూ కథ తిరుగుతుంది. కథలో అతిథులుగా కనిపించే కృపావతమ్మ, కరీముల్లా, రిక్షా సుధాకరు చీటీల అరుణమ్మ నేతాజీ స్కూల్ సుబ్బారెడ్డి, టెంకాయలు అమ్మే సుజాతమ్మ వీరంతా ఉంటారు.
రచయిత్రి నిజాయతీ ఎన్నుకున్న వస్తువులోనూ, కథ చెప్పే తీరులోనూ అంతర్లీనంగా కన్పిస్తూనే ఉంటుంది. మన సంస్కృతీ సాంప్రదాయాల మీద రచయిత్రికి గౌరవం ఉన్నా మూఢ నమ్మకాల్ని, దురాచారాల్ని మనుషుల మధ్య అంతరాలను, భేదాలను ఖండించడంలో వెనకాడని బలమైన వ్యక్తిత్వం, ధీరత్వం మనకు ప్రతి కథలోనూ ప్రబలంగా కనిపిస్తాయి. ఈ పుస్తకంలో ముఖ్యంగా ప్రస్తావించాల్సిన అంశం ఏమిటంటే ఇందులోని పాత్రలన్నీ రోడ్డుమీద నడిచేటప్పుడు మనకు ఎదురయ్యే సామాన్య పాత్రలు. రచయిత్రి సమాజంలోని అన్ని వర్గాలను ముఖ్యంగా బహుజన, దళిత, ముస్లిం, క్రైస్తవ మైనారిటీలను ఇందులో భాగం గావించి వారి సమానత్వ భావనల పరిమళాలను ప్రపంచానికి పంచారు.
సమాజ పోకడలను నిశితంగా గమనించే పరిశీలనా దృష్టి ఏ రచయితకైనా చాలా అవసరం. సమాజాన్ని పట్టి పీడిస్తోన్న రుగ్మతల్ని, మనుషుల మానసిక ఉద్వేగాలని, ఘర్షణ వాతావరణాన్ని కలిగిస్తున్న పరిస్థితుల్ని, ప్రాపంచిక సమస్యల్ని, ఆధునిక పోకడల్ని, కులమత సమస్యలను వాటి వల్ల కలిగే అనర్థాలను, వాటికి సరియైన సమాధానాలను వెతికి, సునిశిత దృష్టితో పరిశీలించి, అర్థం చేసుకుంటేనే మంచి సాహిత్యాన్ని సృష్టించగలరు. రోహిణి గారిలో ఈ లక్షణం పుష్కలంగా ఉందనడానికి ఈ సంపుటిలోని కొన్ని కథలు ముఖ్యంగా “బాపనోళ్ల పిల్ల ముతరాసి యానాది పిల్లగాడు”, షీర్ కుర్మా” తార్కాణంగా నిలుస్తాయి. బాపనోళ్ళ పిల్ల… కథలో పద్మ అనే ఒక బ్రాహ్మణ అమ్మాయి శ్రీనివాసులు అనే యానాది కుర్రవాడిని ప్రేమించి ఇద్దరూ కలిసి పారిపోయి పెళ్లి చేసుకున్న సందర్భంలో కథ చివర్లో కీలక మలుపుని, చక్కని ముగింపుని రచయిత్రి ఇచ్చి మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలగజేస్తారు. సహజంగా ముగిసిపోయే కులాంతర వివాహాల విషాదంతాలకు పూర్తి భిన్నంగా ముగింపు ఉండటంతో పాఠకులను ఆశ్చర్యచకితులను చేసి కులాంతర వివాహాలపై రచయిత్రి గారికి ఉన్న సానుకూల దృక్పథాన్ని, పురోగమన భావాలనీ ఈ కథ మనకు తేటతెల్లం చేస్తుంది. ఈ కథలో విశేషమేంటంటే బుజ్జమ్మే వారిద్దరికీ రాయబారిగా, లేఖా సేకరణ కార్యకర్తగా పనిచేసి వారిద్దరి జీవితాలకూ శుభం కార్డు పడేటట్టు చేస్తుంది. బాల్యంలోనే రచయిత్రికున్న అభ్యుదయ భావాలు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సమూల సమాజ మార్పు కోసం ఇటువంటి కథలు కదా సమాజంలో ప్రస్తుతం రావాల్సింది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంపుటిలో ప్రతి కథ ఒక వజ్రం లాంటిది. అన్నట్లు ఈ పుస్తకంలో “వొజ్రం విలువ” అనే కథ కూడా ఉంది. బుజ్జమ్మ అనబడే కథానాయకి ఉరఫ్ రచయిత్రి ఊరఫ్ రోహిణి వంజారి స్కూల్లో చదువుతూ చేతి ఖర్చులకోసం తండ్రి ఇచ్చిన పావలా నాణేన్ని మురికి కాలువలో ఆడుకునేటప్పుడు పడవేసుకొని దానికోసం స్నేహితులతో చేసే విశ్వ ప్రయత్నం ఈ కథలో మనకు కనిపిస్తుంది. చివరకు తండ్రి వచ్చి దాన్ని వెతికి సాధించి తిరిగి ఇచ్చినప్పుడు బుజ్జమ్మ పొందే మహదానందం మనల్ని కూడా సంతోషభరితులను చేస్తుంది. తండ్రి గంటసేపు మురికి కాలువలో భరించలేని వాసన నడుమ చేతులు పెట్టి వెతకటాన్ని రచయిత్రి వర్ణిస్తూ పిల్లలకు డబ్బుల విలువ తెలియజేయాలని ఆయన చేసిన త్యాగం, పొందిన శ్రమ, పడిన తపనలను వర్ణిస్తూ అది మొదలు “నేను ఇంకెప్పుడు డబ్బులు అజాగ్రత్తగా పారేసుకోలేదు” అంటూ ముగిస్తారు. తల్లిదండ్రుల కష్టాన్ని, హృదయ స్పందనను గుర్తించిన బిడ్డలే కదా నిజమైన వారసులంటే అనే విషయం ఈ కథ ద్వారా రుజువవుతుంది.
కథలలోనూ కవిత్వంలోనూ తనదైన ముద్రను ప్రస్ఫుటంగా తెలుగు సాహిత్యం పై ముద్రించిన శ్రీమతి రోహిణి వంజారి గారు భవిష్యత్తులో మరిన్ని సామాజిక చైతన్యాన్ని రగిల్చే, అభ్యుదయానికి ఆలవాలమైన మరిన్ని సంపుటాలను వెలువరించి సమాజంలో చీకట్లను నిలువరించి సమూలంగా పారదోలే కృషిని చేస్తారని విశ్వసిస్తూ ఇంతటి చక్కటి కథలను విరచించినందుకు వారికి నా అభినందనలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ సమీక్షను ముగిస్తున్నాను. ఇంతటితో స్వస్తి.
ఇంతటి గొప్ప పుస్తకం కావలసినవారు రచయిత్రి గారిని వారి ఫోన్ నెంబర్ @ 90005 94630 లో సంప్రదించగలరు
డాక్టర్ జెల్ది విద్యాధర్; హైదరాబాద్