విజయమహల్ సెంటర్ కథలు సమీక్ష

2025 జనవరి నెలలో నా రెండవ కథల సంపుటి “విజయమహల్ సెంటర్ కథలు” గురించి, కథల్లోని నరసమ్మ, రమణయ్య, రూపాయి దేవుడు గురించి బుజ్జమ్మ చెప్పిన కథల కబుర్లను హృద్యంగా వివరించారు శ్రీనివాస్ గౌడ్ గారు. ఇంత చక్కటి సమీక్షతో నా సాహితీ ప్రయాణం ప్రారంభమవడానికి కారణమైన శ్రీనివాస్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమీక్షను ప్రచురించి ఎనలేని ప్రోత్సాహం అందించిన సాహిత్య ప్రస్థానం సంపాదకులకు కృతఙ్ఞతలు.
సమీక్షను చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపండి. విజయ మహల్ సెంటర్ కథల పుస్తకాల కోసం క్రింది నెంబర్ కి మీ అడ్రస్ మెస్సేజ్ చేయండి. 9000594630

ఎవరి జీవితంలో అయినా బాల్యం ఒక జ్ఞాపకాల నిధి. బాల్యంలోకి తిరిగి తొంగిచూసుకోని మనిషి వుండడు. అదే రచయిత(త్రు)లు అయితే బాల్యజ్ఞాపకాలు పలవరించని వారి రచనే వుండదు. వారి కవిత్వం, కథలలో బాల్యం ఒక వస్తువుగా తప్ఫనిసరిగా వుంటుంది. సహజంగానే కథలు ఆయా స్థలకాలాదులను, చరిత్రను ఏదొక మేరకు రికార్డు చేస్తాయి. బాల్యంలో జరిగిన సంఘటనలను కథలుగా నమోదు చేయడం అనేది ఏనాటి నుంచో వుంది.

పురుష రచయితలు రాసినవి అటుంచితే స్త్రీ రచయితల బాల్య జ్ఞాపకాల నమోదు ఆసక్తికరం. ఎంతో స్వచ్ఛంగా, అమాయకంగా ,ఆనందంగా సీతాకోక చిలుకలా ఎగిరే రంగురంగుల బాల్యం, బాలికల బాల్యావస్థ దాటిన తర్వాత వచ్చే కట్టుబాట్లు, నిర్భందాలు; మిగిలిన జీవిత అనుభవాలు అన్నీ తమ సహజ వర్ణాలతో కథలలోకి నడచి వస్తాయి. అలాంటి ప్రయత్నం చేసిన స్త్రీ రచయితలలో బాగా పాత రచయితలని మినహాయిస్తే, తెలియవస్తున్న రచయితలు మా ఊరి ముచ్చట్లు – పాకాల యశోదారెడ్డి, ఉళేనూరు క్యాంపు కథలు – మన్నం సింధు మాధురి, జాజిమల్లి – కె.ఎన్.మల్లీశ్వరి, జైలు కథలు – బి.అనూరాధ, గూడెం చెప్పిన కథలు – నాదెళ్ళ అనూరాధ, శిలువగుడి కతలు – పూదోట శౌరీలు, రేల పూలు – సమ్మెట ఉమాదేవి, పొయ్యిగడ్డ కతలు – రామక్క గారి సుమ, ఇల్లేరమ్మ కతలు – సోమరాజు సుశీల, ఇర్లచెంగి కతలు – తిరునగరి దేవకీదేవి, రేగడి నీడల్లా.. – మార్టూరు సంజనా పద్మం మొదలయినవారు కాగా బాల సాహిత్యంలో ఇలాంటి ప్రయత్నం ‘మా పిల్లల ముచ్చట్లు, చిలక పలుకులు’ పుస్తకాల ద్వారా సమ్మెట ఉమాదేవి గారు పిల్లలతో తన ఉపాధ్యాయిని అనుభవాలు రికార్డు చేసారు. ఎండ్లపల్లి భారతి కూడా తన మాదిగ పల్లెల కతలను సజీవంగా తన కథల సంపుటులలో తీసుకువచ్చారు. ‘రమాయణం ‘ శీర్షికన నెల్లుట్ల రమాదేవి గారు రాస్తున్న బాల్య జ్ఞాపకాల కథలు నమస్తే తెలంగాణలో వస్తున్నాయి. ఈ కథలని పూర్వం గొలుసుకట్టు కథలు అనేవాళ్ళు. ఇప్పుడు నాజూగ్గా ‘కథామాలికలు’( Series of Stories ) అంటున్నారు. నెల్లూరు నడిబొడ్డులో విజయమహల్ సెంటర్‌లో తన బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనలను కథల రూపంలో ‘ విజయ మహల్ సెంటర్ కథలు ‘ గా నమోదు చేసారు రచయిత్రి రోహిణి వంజారి గారు.

“ఈ కథామాలికలు ఆయా ప్రాంతాల సంస్కృతినీ, చరిత్రనూ అలవోకగా రికార్డు చేస్తూ, చరిత్రకొక

ప్రత్యామ్నాయంగా తయారవుతాయి.” అని మధురాంతకం నరేంద్ర గారు అన్నది నూరుపాళ్ళు నిజం. ఈ కథల్లో రచయిత్రి రోహిణి వంజారి నెల్లూరు పట్టణ భౌగోళిక స్వరూపాన్ని మన కళ్ళకు కడుతుంది. నెల్లూరు ప్రాంతంలో ఆ కాలంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంస్కృతులను, పండగలు జరుపుకునే విధానాలను కూలంకషంగా చెపుతుంది. మనుషులందరూ కలివిడిగా బతికిన ఆనాటి రోజులను జ్ఞప్తికి తెస్తుంది.

‘విజయమహల్ సెంటర్ కథలు’ ( ఫిబ్రవరి,2024 ) సంపుటిలో మొత్తం 21 కథలు వున్నాయి. వీటిలో కొన్ని విశాలాక్షి మాసపత్రిలో ధారావహికంగా యేడాది పాటు 2020-2021 మధ్య ప్రచురితమయ్యాయి. మిగిలిన కథలు వివిధ పత్రికలలో ప్రచురణ అయ్యాయి.

‘వొజ్రం విలువ’ కథ చదివితే హృదయం ద్రవిస్తుంది. బడిలో ఫీసు కట్టమని ఇచ్చిన ‘ పావలా ‘ బిళ్ళ

సావాసగత్తెతో ఆడుకుంటూ సైడు మురుగు కాలవలో పారేసుకుంటుంది మనకు కథ చెప్పే చిన్నారి బుజ్జమ్మ. ఇంటికి ఏడుచుకుంటా వెళ్ళి నాయినకు చెపితే ఆ నాయిన ఆ పావలా కోసం ఏం చేసాడనేది కథ. కథ చివరలో బుజ్జమ్మ నాయిన (బుజ్జమ్మకు) చలమయ్యకు చెప్పిన మాటలు నిత్యసత్యాలు. ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించదగ్గవి. ఆనాటి నుండి బుజ్జమ్మ కూడా ఏనాడూ డబ్బులు పారేసుకోకపోవడం ఈ కథ ఫలశ్రుతి.

ఈ సంపుటిలో మరో వొజ్రం లాంటి కథ ‘ కర్పూర దీపం ‘. బొంబాయి మరుగుదొడ్లు ఏవీ వాడుకలో లేని ఆ కాలాన మానవ అశుద్ధాన్ని చేతులతో ఎత్తివేసే పనిని ఒక నిర్థిష్ట కులం వారు చేయవలసి వచ్చేది. అటువంటి పని చేసే నరసమ్మ, ఒక గాలివాన కొట్టిన కాలాన నాలుగురోజులు పనికి రాకపోతే ఆ వాడకట్టులో వున్న జనం ఎంత అసౌకర్యంగా, పరిసరాలు ఎంత గబ్బుగొట్టడం అనుభవి‌ంచి, ఇక భరించలేక నరసమ్మ ఇంటిని వెతుక్కుంటూ వెళతారు. అక్కడ జరిగిన సంఘటన చూసి బిక్కచచ్చిపోతారు. ఆ తర్వాత నరసమ్మను చూసి పీతి వాసనని, ఆ బకెట్టు తగులుద్దని తప్పుకు తిరిగిన మనుషులే నిజమైన మనుషులవడం చూసి కళ్ళు చెమరుస్తాయి. కథను నడిపిన రచయిత్రి ఒడుపు కూడా ఎదను హత్తుకుంటుంది. ప్రతి ఒక్కరిలో మానవత్వం మేల్కొలిపే ఈ కథ చదివి కదిలిపోయిన డా.జెల్ది విద్యాధర్ గారు ఈ ఒక్క కథ మీదే ఈ సంపుటిలో తన అభిప్రాయం రాసారు. విద్యాధర్ గారు రాసినదానితో ఎవరైనా ఏకీభవించాల్సిందే. చాలా కాలం పాటు గుర్తుండే ఈ కథ చదివితే సొలొమాన్ విజయ్ కుమార్ ‘ పియ్యెత్తే మాదిగ సుబ్బులు’; డా.వినోదిని ‘ కట్ట ‘ కథలు గుర్తుకువస్తాయి. తెలుగు సాహిత్య ప్రపంచంలో మంచి కథలుగా గుర్తింపు పొందిన వీటి సరసన కర్పూర దీపం వుంచవచ్చు.

మనసులు కదిలించే మరో కథ ‘మహారాజు’. తన ఇంటి ముందర రిక్షాలు నిలుపుకొని, రిక్షాలు తోలుకొని జీవనం సాగించే బడుగుల జీవనగాధ ఈ మహారాజు కథ. రిక్షా తోలుకొని జీవించే రవణయ్య గుణానికి తాగుబోతు అయినా మనసుకు మహారాజు. అంటు వ్యాధి వచ్చి చనిపోయిన సుబ్రమణ్యం అనే ఒక మంచి మనిషిని చూసి అందరూ దూరంగా తప్పుకుపోతుంటే సుబ్రమణ్యం వల్ల కొద్దోగొప్పో మేలు పొందిన రవణయ్య మాత్రం తెగించి తన రిక్షా తీసుకొని ముందుకు వస్తాడు. వారించబోయిన తోటి రిక్షావాడు సుధాకర్‌తో “ తూ..ఏం బతుకులురా మనయి..ఆడకూతురు కట్టంలో ఏడస్తా వుంటే, నేను తాగుబోతు ఎదవనేగానీ, మానవత్వం లేకుండా పోలేదురా. నాకెందుకని ఇదిలిచ్చుకోబోవడానికి నేను గొడ్డును కాదురా..” అని తన తన ఉదారమయిన మనసును చాటుకుంటాడు. దసరా వచ్చినప్పుడు అక్కడ రిక్షా వాళ్ళంరూ కలిసి వేషాలు కట్టి ఇంటింటికి తిరిగి దసరా మామూలు వసూలు చేసుకొని నాలుగు డబ్బులు చేసుకుంటారు. అటువంటి దసరా వేషాలలో రవణయ్య శవం వేషం కడతాడు. ఈసారి కట్టిన దసరా వేషాలలో రవణయ్య కట్టిన శవం వేషంతో రిక్షావాళ్ళు ఏం చేసారు ? ఆ సంవత్సరం దసరా వేషదారుల సంపాదన ఎలా వుంది ? రవణయ్య ఎందుకు మహారాజు అయ్యాడు ? తెలుసుకోవాలంటే మహారాజు కథ చదవాల్సిందే. కథ చివరలో ఊహించని సంఘటనకి మనసు చివుక్కుమంటుంది. అక్కడి రిక్షావాళ్ళతో పాటు, అక్కడ చూడవచ్చిన జనాలతో పాటు మన కళ్ళలోనూ కన్నీటిపొర కన్నీటితో చిరిగిపోతుంది.

అక్క వరసయే పద్మ, కులం కాని శ్రీనివాసరావుని పెళ్ళి చేసుకున్న వైనం ‘ బాపనోళ్ళ పిల్ల..ముత్తరాసి యానాది పిలగోడు’ కతలో చెపుతే, వీళ్ళకి పుట్టిన చిన్న పిలగాడు సునీలు తప్పిపోయి, దొరికిన సంగతి ‘సునీలు ఏమయ్యాడో’ కతలో చెపుతుంది. ‘ చిరంజీవే నా మొగుడు’ కథ అలనాడు నెల్లూరులో ఎక్కడెక్కడ సినిమా హాళ్ళలో ఎప్పుడెప్పుడు ఏయే చిరంజీవి సిమాలు ఆడాయో చదువరులకు ఆశ్చర్యం కలిగేలా ఏకరువు పెడుతుంది. ఆడ పిల్లల్లో సినిమా నటుల పట్ల వుంటే ఇష్టం, ఆకర్షణ ఏ వరకు వుంటుందో ఈ కత చెబుతుంది. ‘గంగరాయి చెట్టు కొంద ఇరగాలమ్మో..’ బడుగుల జీవితాల్లో పండుగలు, జాతరలు ఏ విధంగా వుంటాయో వివరిస్తుంది. అంతేకాకుండా పూనకాలు ఎందుకు బడుగుబలహీన వర్గాల కులస్తుల్లోనే వస్తాయన్న సందేహానికి మస్తానమ్మ జీవితం ద్వారా మనకు అన్యాపదేశంగా చెప్పే ప్రయత్నం సఫలీకృతంగా చెసిందీ రచయిత్రి.

కుడుముల స్వామి కథ కూడా వ్యవసాయిక ఆధారిత కుటుంబాలు తమ పంటలను పండించించుకునే క్రమంలో ఎలాంటి ఆచారాలు, పద్దతులను పాటిస్తారు, ఎలా తమ చుట్టూ వున్న శ్రామిక ప్రజలను కూడా తమ వ్యవసాయిక పనుల్లో భాగం చేస్తారు అనేది వివరంగా చిత్రించే ప్రయత్నం చేసింది. ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా వైద్య సేవలు అందించే పుల్లయ్య లాంటి మనుషులకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే ప్రజల ప్రతిస్పందన ఎలా వుంటుందో, ఎలా వాళ్ళు తల్లడిల్లిపోతారో చెప్పిన కథ ‘రూపాయి దేవుడు’. పేద ప్రజల ప్రేమను ఇంతగా సంపాయించుకున్నానా అని డాక్టర్ పుల్లయ్యతో పాటు మనమూ ఒక క్షణం ఆలోచనలో తప్పిపోతాం. ‘ తట్టుడీ తీయబడును ‘ అన్య మతంలోని మధురభావ గీతాలకు, క్రమశిక్షణాయుత పాఠశాల నడవడికకు అణుగుణంగా తనకు తాను ఒదిగిపోయే ఒక విద్యార్థిని కనపడితే, షీర్ కుర్మా కథలో అన్యమత భేదం పెట్టుకోకుండా షీర్‌కుర్మా తినాలనే అమాయకమైన బాలిక కనిపిస్తుంది.

మొత్తంగా ఈ కథల్లో రచయిత్రి తనకు తెలియకుండానే మానవత్వమున్న సజీవ పాత్రలను మనకు పరిచయం చేసింది. మనుషులకు మనుషులకు మధ్య తరతమ భేదాలు పెట్టుకోని రక్తమాంసాలున్న మనుషులను చూయించింది. ఏ కల్మషం లేకుండా, ఏ అభిజాత్యాలు, పట్టింపులు తెలియని ఒక Pure Soul గా రచయిత్రి మనకు ఈ కథల్లో కనిపిస్తుంది. అందరినీ భేషరతుగా ప్రేమించే ఒక ప్రేమమయి కనిపిస్తుంది. ఆపిల్ పండ్లు తినాలనే తన చిన్ని కోరికను తీర్చిన రెడ్డమ్మను ‘ దేవత అయిన రెడ్డమ్మ’ అంటుంది.

ఈ కథలు చెప్పిన విధానంలో రోహిణి వంజారి నేర్పును ప్రదర్శించింది. ఎక్కడా కూడా ప్రతికూలమైన వాక్యం రాయకుండా, ఎక్కడా ఎవరి పక్షం తీసుకోకుండా, నిర్మోహంగా కథను నిర్వహించడం వల్ల కథలకు పఠనీయత వచ్చింది. ఎక్కడా నీతి వాక్యాలు, ప్రభోదాలు చేయకపోవడం వల్ల, కథను చదివిన పాఠకుడు తన భావనా ప్రపంచానికి అనుగుణంగా కథను అనుభూతి చెందడానికి వీలు చిక్కింది. కథల్లో వాడిన నెల్లూరు స్థానీయ యాస కథల్లో సహజంగా ఒదిగిపోయింది. ఆ యాస ఒకింత కథలకు జీవం అద్దింది. యదాళంగా, మందల, బిన్నా, ఆ వాటాన లాంటి పదాలు పాయసంలో జీడిపప్పుల్లా రుచి తగులుతాయి.

“ఈ కథా మాలికల్ని రాయడం ఏ రచయితకయినా తొలిదశలో చేసే సాధన మాత్రమే.” అని ముందుమాటలో నరేంద్ర గారు అనడం కొద్దిగా ఆశ్చర్యంగా వుంది. నామిని సుబ్రమణ్యం నాయుడు ‘సినబ్బ కతలు, మిట్టూరోడి కతల’తోనే పేరు తెచ్చుకున్నాడు. ఖదీర్‌బాబు ‘దర్గామిట్ట కతలు, పోలేరమ్మ బండ కతలు’ రాసి ప్రఖ్యాతుడయ్యాడు. అసలు సత్యం శంకరమంచి ‘అమరావతి కథలు’ కథాసాహిత్యంలోనే గుర్తుంచుకోదగ్గ కథలు. ఇలా ఈ కథామాలికలు రాసి పేరు తెచ్చుకున్న కథకులు, కథకురాళ్ళు చాలా మంది వున్నారు. తొలిసారి కథలు రాసే రచయితలు అయినా, మలిదశలో కథలు రాసే రచయితలు అయినా వారి కథన సామర్థ్యాన్ని బట్టి కదా మనం అంచనా వేయవలసింది.

నరేంద్రగారు ఇవి ఆరేడేళ్ళ అమ్మాయి చెప్పే కథలు అన్నారు. కానీ రోహిణి గారు ఇవి తన ఏడవ తరగతి లోపు జరిగిన విషయాలని రాసిన కథలు అన్నారు. ఈ విధంగా చూస్తే ఇవి బుజ్జమ్మకు ఉహ వచ్చిన తర్వాత రాసిన కథలే. అంటే అప్పటికి పదకొండు, పన్నెండు యేండ్లు కనీసంగా వచ్చి వుంటాయనమాట.

కొన్ని కథల్లో బుజ్జమ్మా అని , కొన్ని కథల్లో చిట్టీ అనడం కనిపిస్తుంది. షీర్ ఖుర్మా కథ స్థల, యాసభాషలు మారిపోవడం వల్ల ఈ కథ మిగతా కథలకున్న పొంతన గురించి కొంత అయోమయానికి గురవుతాము. అన్ని కథలు నెల్లూరు కేంద్రంగా, నెల్లూరు యాసలో నడిస్తే, ఈ కథ మాత్రం abrupt గా హైదరాబాదు అమీర్‌పేటకు చేరి, తెలంగాణ యాస మాట్లాడుతుంది. మహారాజు కథ, విజయ్ మహల్ రిక్షా సెంటర్ కథల వస్తువు ఒకటే. ఈ సంపుటిలో నుంచి ఈ రిక్షా సెంటర్ కథ పరిహరించడం వల్ల ఈ సంపుటికి వచ్చిన నష్టం ఏంలేదు.

ఈ కథలు ప్రచురించిన ఆదర్శినీ మీడియా ఒక నాణ్యత గల పుస్తకం పాఠకులకు అందించింది. వంజారి రోహిణి గారి నుండి మరిన్ని మంచి కథల కోసం ఎదురుచూడవచ్చని ‘ విజయ మహల్ సెంటర్ కథలు ‘ ఆశ పెడుతున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *