ముగ్గంటే

పండుగ అయిపోయినా జ్ఞాపకాలు గుండెల నిండా ఉంటాయి. నేటి నిజం పత్రికలో నా కవిత “ముగ్గంటే”. బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 17-2-2024 మా పెళ్ళి రోజు సందర్భంగా ఆశీస్సులు అందించిన మిత్రులందరికీ ప్రేమాత్మకమైన ధన్యవాదాలు 🌹❤️

వాకిట్లో నాలుగు చుక్కలు పెట్టి

రంగులేయడం కాదు ముగ్గంటే

నలుగురు మనుషులను కూడగట్టడం

వాకిళ్లు చిమ్మి కళ్ళాపి చల్లే పనిమనుషుల సందడి

పేడకళ్ళకోసం వీధుల్లో పోటీపడి తిరిగే అమ్మలక్కలు

రాతి ముగ్గుపిండి రతనాల పిండి మల్లెపువ్వంటి పిండి

సమయానికి తగుమాటలల్లి

ముగ్గుపిండి అమ్మే వీరయ్య తాత కేకల ప్రతిధ్వని వీధంతా

ఇంద్రధనుస్సు రంగులను నేలమీదికి దింపి

పొట్లాలు కట్టి రంగులమ్మే రమణమ్మ సృజన

ముగ్గులోన పెట్టే గొబ్బెమ్మ కోసం

పచ్చపచ్చని తంగేడు పూలను గంపకెత్తుకుని

పొద్దుపొద్దునే ఇల్లిల్లు తిరిగే ఈశ్వరమ్మ

ముగ్గు వేసి వేయగానే వాకిట్లోకి వచ్చి

పశువు ఆశీసులు శిశువులకు మంచిదని

గంగిరెద్దులాడించే దంపతుల జంట

పళ్లెంలో గొబ్బెమ్మను పెట్టుకుని

‘గొబ్బియల్లో గౌరమ్మ సల్లంగ చూడే

గొబ్బియల్లో గౌరమ్మ మంచి వానలు పడనీయవే

గొబ్బియల్లో గౌరమ్మ సంపదలనీయవే ‘

గొబ్బి పాటలు పాడుతూ ముంగిళ్ళను

ముత్యాల పందిరిని చేసే ముదితల పాట కచ్చేరీలు

హరిదాసుల కీర్తనలు బుడబుక్కలవాని డబుడక్క ఢమరుక నాదాలు

పండుగ దానాలు చేయమని గడపగడప తిరిగి

జోలెల్లో బియ్యం, అరిసెలు, మణుగుపూలు నింపుకుని

గుండె నిండిన ఆనందంతో పరవశించే అల్పసంతోషులు

ముగ్గు వేయడమంటే జన జాతర

పండుగ అంటేనే పలువురినీ కలిపే వేడుక

ఇచ్చిపుచ్చుకునే వాయనం

సాయమందించే సంప్రదాయం

సరదాలు, సంతోషాలను కలగలిపి

అల్లుకునే అనుబంధాల పూలమాల

పండుగ అంటేపదిమంది కలిసిమెలిసి

పాడుకునే తియ్యనైన పాట

రోహిణి వంజారి

9000594630

19-1-2024.