పెరుమాళ్ళకెరుక

కొందరు పైకి ఎంత నిజాయితీపరులుగా కనిపిస్తారు. వారి లోగుట్టు మాత్రం పెరుమాళ్ళకే తెలియాలి. నేను మెహిదీపట్నం నుంచి చిలుకూరు బాలాజి గుడికి బస్సు లో వెళుతున్నప్పుడు నా కళ్ళ ముందర జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా వ్రాసిన ఈ కథ “పెరుమాళ్ళకెరుక” ఈ నెల [జులై] ధర్మశాస్త్రం మాసపత్రికలో ప్రచురితం అయింది. సంపాదకులకు ధన్యవాదాలతో.. ఈ చిన్న కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా..

ఆగిఆగడంతోనే జనాలు బస్సు ను చుట్టుముట్టారు. బస్సు దిగి ” కాళీ మందిర్..బాలాజీ టెంపుల్.. కాళీ మందిర్..చిలుకూరు బాలాజీ టెంపుల్.. ” వృత్తి ధర్మాన్ని తెలిసిన వసపిట్టలా అరుస్తోంది కండక్టర్ ఝాన్సీ.
మెహిదీపట్నం బస్టాండ్ చౌరస్తా నిత్యం వచ్చి, పోయే జనాలతో రద్దీగా ఉంది. గమ్యం చేరాలని కొందరు తొందర పడుతూ బస్సు కోసం ఎదురు చూస్తుంటే , గమ్యం చేరాక చేసేదేముంది ప్రయాణాన్నే ఆస్వాదిద్దాం అని మరికొందరు నిదానంగా పోవచ్చని బస్టాండ్లో చక్కర్లు కొడుతున్నారు. ఓ పక్క ఎవ్వరితో మాకు పని లేదు, కానీ మిమ్మలని మీ గమ్యం చేర్చడమే మా పని అంటూ బస్సులు, మరోపక్క నేనెవరికోసం అసలు ఆగను అంటూ కాలం పరుగులు తీస్తూనే ఉన్నాయ్.
కండక్టర్ ఝాన్సీ ఐదు నిముషాలు వసపిట్టలా అరిచి ఇంకెవరు బస్సు ఎక్కరని నిర్ధారించుకున్నాక బస్సు ఎక్కింది. మెహిదీ పట్నం పెద్ద స్టాప్ కావడంతో చాలామంది జనం ఎక్కారు. బ్యాగ్ లో టికెట్స్, డబ్బులు, చిల్లర పైసలు మూడు అరల్లో పొందికగా అమర్చుకుని బస్సు ఎక్కి నిలబడి ఉన్నవాళ్లను బస్సు లోపలికి పొమ్మని కాస్త నిదానంగా చెబుతూ, చెప్పినా కదలని రాతి శిల్పాల్లా బస్సు రాడ్ పట్టుకుని వ్రేలాడుతున్న వాళ్ళకి కాస్త కటువుగా హెచ్చరిస్తూ, చక చక టికెట్ కొడుతోంది ఝాన్సీ. డ్రైవర్ మల్లేశం బస్సు ని ముందుకి ఉరికించాడు. కొత్త పెళ్లి ఇల్లులా నిండుగా జనాలతో ఉన్న బస్సు లంగర్ హౌస్ వైపు పరుగు తీసింది.
లంగర్ హౌస్ లో కొంత మంది దిగారు. మరికొంత మంది ఎక్కారు. అప్పటికే సమయం ఉదయం పదకండు అయింది. పొద్దున ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ తినడానికి తీరిక లేక బాటిల్ లో నుంచి మరికొన్ని నీళ్ళు గొంతులో పోసుకుంది. తను కండక్టర్ గా డ్యూటీలో చేరిన రోజు నుంచి ఒక్క సారి కూడా పనిలో పొరపాటు చేయలేదు.ఒక్కరిని కూడా విసుక్కుంది లేదు ఆమె. బస్సు నిండా జనం క్రిక్కిరిసి ఉన్నా ఎంతో చాకచక్యంతో అందరికి టికెట్స్ కొట్టేది. డిపోలో మంచి కండక్టర్ గా పేరు తెచ్చుకుంది. డ్రైవర్ బస్సుని కాళీ మందిర్ ముందు ఆపాడు. ఆ రోజు శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి చాలామంది వచ్చినట్లు ఉన్నారు. మందిర్ అంతా జనాలతో నిండి పోయి ఉంది. బస్సు లో జనాలు కూడా చాల మంది అక్కడ దిగేసారు. బస్సు మళ్ళీ ముందుకు ఉరికింది. బస్సు లో జనం పల్చబడ్డారు. శనివారం బాలాజీ టెంపుల్ కి ఎక్కువ మంది వెళతారు.
హిమాయత్ సాగర్ క్రాస్ రోడ్ దగ్గర గుంపుగా జనాలు చేతులు ఊపుతూ నిలబడి ఉన్నారు. డ్రైవర్ బస్సు ఆపగానే బిల బిలమంటూ పదిహేను మంది పైనే బస్సు ఎక్కారు. కండక్టర్ ఝాన్సీ” రైట్ రైట్ ” అనగానే బస్సు ముందుకు కదలపోతుండగా “బస్సు ఆపండి అంటూ అరుస్తూ వచ్చి బస్సు ని పూర్తిగా ఆపకముందే అదలా బదలా బస్సు వెనుక వైపు డోర్ నుంచి ఎక్కాడు బాబ్జి. ఆ వెనుకే కంగారుగా అతని భార్య మీనా ఎక్కింది. బస్సు ముందు పక్క ఎక్కిన వాళ్ళకు టికెట్స్ ఇస్తోంది కండక్టర్ ఝాన్సీ. ఇంకో అర్ధ గంటలో బాలాజీ టెంపుల్ వచ్చేస్తుంది.
” మేడం ఇక్కడ రెండు టికెట్స్ ఇవ్వండి ” బస్సు అంతా వినపడేట్లు అరిచాడు వెనుక పక్క నిల్చుని ఉన్న బాబ్జి. అతను అరిచిన అరుపుకు జనాలంతా తలతిప్పి అతని వంక చూసారు.
” ఒక్క నిముషం ఆగండి సార్. ముందు ఉన్న వాళ్ళకు టికెట్స్ ఇచ్చి వస్తాను ” స్వరంలో మర్యాద ధ్వనిస్తుండగా చాల నెమ్మదిగా చెప్పింది ఝాన్సీ.
” అదేంటి మేడం, టికెట్ ఇవ్వమంటే ఒక్క నిముషం అంటారు. ఇంకో పది నిముషాల్లో టెంపుల్ వచ్చేస్తుంది. మీరు టికెట్ ఇవ్వకుంటే చెకింగ్ ఆఫీసర్ బస్సు ఎక్కితే మా పరువేం కాను. తొందరగా టికెట్ ఇవ్వండి” గొంతు పెంచి మరింత బిగ్గరగా అరిచాడు బాబ్జి.
” ఊరుకోండి. ఆమె వచ్చి టికెట్స్ ఇస్తుందిలే. పెద్దగా అరవకండి. అందరు మనల్నే చూస్తున్నారు. ” మోచేత్తో బాబ్జిని పొడుస్తూ అతనికి వినపడేంత చిన్నగా చెప్పింది అతని భార్య మీనా.
” నీకేం తెలీదు. నువ్వు ఊరుకో..” మండ్ర గబ్బ కుట్టిన వాడిలా పెళ్ళం మీద చిందులు తొక్కాడు బాబ్జి.
” సార్..ప్లీజ్ అరవబాకండి. ఈ రూట్లో మిమ్మలని చాల సార్లు చూసాను నేను. తెలిసినవారే మీరు. ముందు సైడ్ వాళ్ళకు టికెట్స్ ఇచ్చి వస్తానంటే అర్ధం చేసుకోండి దయచేసి ” మృదువుగా చెప్తూనే ముందు ఉన్నవాళ్లందరికి టికెట్స్ ఇచ్చేసింది ఆమె.
” ఏంటి మేడం.. నా మాటలు మీకు అరుపులుగా ఉన్నాయా..? పరువు, మర్యాద గల కుటుంబం మాది. టికెట్ తీసుకోకుండా ఎగ్గొట్టి మోసం చేసేవాళ్ళం కాదు మేము. నిజాయితీకి మారు పేరుగా నిలిసిన వాళ్ళు అనే పేరు ఉంది మా ఫ్యామిలీకి. తొందరగా టికెట్స్ ఇవ్వండి “. పెద్దగా పెద్దగా అరిచేస్తున్నాడు బాబ్జి.
అతని భార్య మీనాకి ఈ అరుపులకి తల కొట్టేసినట్లు అయింది. బస్సు లో ఉన్న జనాలంతా తనవంక జాలిగా చూస్తూ ” పాపం. ఈ తగువులా మారి మనిషితో ఈమె ఎలా వేగుతోందో అని చూస్తున్నట్లు అనిపించి సిగ్గుతో ముడుచుకుపోయింది.
ఇద్దరు ముగ్గురు ” ముందు వాళ్ళకి ఇచ్చివస్తుంది లేండి. ఎందుకు చిన్న విషయానికి ఇంత గొడవ చేస్తారు” అని సర్ది చెప్పబోయి, అతని అరుపులతో భంగ పడి అతను వినే ఘటం కాదని ” చేరి మూర్కుని రంజిపరాదని” గమ్మున ఉండిపోయారు.
అతని అరుపులకు డ్రైవర్ బస్సు ఆపేసాడు. ” ఝాన్సీ మేడం.. ముందు అతనికి టికెట్ ఇవ్వండి ” అన్నాడు డ్రైవర్ మల్లేశం. జనాలందరినీ తోసుకుంటూ వెనుకకి వచ్చి బాబ్జికి, అతని భార్యకి టికెట్ కొట్టింది ఝాన్సీ. ఇరవై రూపాయల టికెట్స్ కి ఐదు వందల కాగితం ఇచ్చాడు బాబ్జి.
” సార్.. ఐదు వందలు ఇస్తే ఎలా..? ఇరవై రూపాయలు ఇవ్వండి. నా దగ్గర అంత చిల్లర లేదు”. అంది ఝాన్సీ టికెట్స్ ఇస్తూ.
” అది మీ భాద్యత మేడం. చిల్లర లేకుండా బస్సు లు ఎలా నడపాలని..? ” మళ్ళీ సీన్ పెద్దది కాబోయే ప్రమాదం గ్రహించి డ్రైవర్ తన సొంత డబ్బుల నుంచి ఐదువందలకి చిల్లర తీసి ఇచ్చాడు.
విజయ గర్వంతో బాబ్జి బింకంగా చుట్టూ జనాలని చూసాడు. బస్సు ముందుకు వెళుతోంది.ఇంకో పది నిముషాల్లో టెంపుల్ వస్తుంది.
హటాత్తుగా డ్రైవర్ బస్సు ఆపాడు. డ్యూటీ యూనిఫామ్ లో ఉన్న ఇద్దరు అధికారులు వెనుక నుంచి బస్సు ఎక్కారు. వెనుక ఉన్న కొందరి దగ్గర టికెట్స్ చెకింగ్ చేసారు. తలుచుకోగానే దయ్యాలు వస్తాయి అంటారు. కానీ ఇక్కడ ఎప్పుడో కానీ రాని టికెట్ చెకింగ్ ఆఫీసర్ ఈ రోజు బాబ్జి తలచుకోగానే తన అసిస్టెంట్ తో సహా వచ్చాడు.
ఆఫీసర్ బాబ్జిని టికెట్ అడిగాడు. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బాబ్జి జేబులో నుంచి టికెట్ తీసి చూపించాడు. ఇక బస్సు దిగబోతూ ఏదో గుర్తుకు వచ్చినట్లు ఆఫీసర్ వెనుదిరిగి బాబ్జి ముందుకు వచ్చి “నీ పేరు బాబ్జి కదా ” అన్నాడు. అతని వంక చూపుడు వేలు చూపిస్తూ.
” అవును సార్.. మీకెలా తెలుసు” విస్మయంగా అన్నాడు బాబ్జి.
” మొన్న విజయవాడ రూట్లో టికెట్ కొనకుండా పట్టుబడి అరెస్ట్ చేస్తే స్టేషన్ కి వచ్చి తప్పైపోయింది అని బతిమిలాడి వేయి రూపాయల ఫైన్ కట్టింది నువ్వే కదా..అప్పుడు స్టేషన్ లో నేను ఉన్నాను ” అన్నాడు బాబ్జి వంక అనుమానంగా చూస్తూ..
“ఔరా..! ఇప్పటిదాకా పరువు, నీతి అంటూ మాట్లాడాడు. తెలిసిన రూట్లో అయితే టికెట్ కోసం దబాయింపు, అదే తానెవరో తెలియని రూట్లో దొంగ బ్రతుకు. మనిషి లోగుట్టు పెరుమాళ్ళకెరుక . ఏమి మనిషిరా ఇతను. ” అని అందరు ముక్కున వేలేసుకున్నారు.
” అప్పటిదాకా అంబోతులా రంకె వేసిన బాబ్జి తన గుట్టు రట్టవడంతో తేలు కుట్టిన దొంగల తలవంచుకున్నాడు.

6 thoughts on “పెరుమాళ్ళకెరుక”

  1. ఆనంద్ కుమార్

    చాలా బాగుంది రోహిణి గారు.. ఓ సామాన్యుడి అసహనం ఆ అరుపులు కేకలు అతని భార్య పడే ఇబ్బంది అద్భుతంగా ఉంది.. చివర్లో బాబ్జీ గారికి ట్విస్ట్ బాగా ఇచ్చారు.. మీకు నా అభినందనలు

  2. MANCHIKATLA LAKSHMAN

    కొందరు పైకి ఎంతో నిజాయితీ పరులుగా కనిపిస్తారు. వారి లోగుట్టు మాత్రం పెరుమాళ్ళకే తెలియాలి. తను తన కుటుంబం తన వంశమే నిజాయితీ పరులని మని గొంతెత్తుకున్న మనిషి స్వరూపం బట్టభయాలయ్యింది ఒక్కసారే….
    బాగుంది కథ.. 🙏

  3. శ్రీనివాస్ మాదాల

    రోహిణి గారు చాలా బాగా చెప్పారు అండి.

Comments are closed.