అందుకేనేమో

సముద్రం… కొందరికి వినోదం, కొందరికి విషాదం, మరి కొందరికి సముద్రమే జీవితం. విశాలాక్షి పత్రిక వారు నిర్వహించిన సముద్రం కథల పోటీ లో బహుమతి పొందిన నా కథ ‘ అందుకేనేమో’ లో సముద్రం ఎవరికి ఏమైంది చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. శ్రీ కోసూరు రత్నం గారికి, శ్రీఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో..

రాత్రంతా నిద్రలేదు. కళ్ళు ఉసముద్రం… కొందరికి వినోదం, కొందరికి విషాదం, మరి కొందరికి సముద్రమే జీవితం. విశాలాక్షి పత్రిక వారు నిర్వహించిన సముద్రం కథల పోటీ లో బహుమతి పొందిన నా కథ ‘ అందుకేనేమో’ లో సముద్రం ఎవరికి ఏమైంది చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. శ్రీ కోసూరు రత్నం గారికి, శ్రీఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో..బ్బి ఎర్రబడ్డాయి. ఒకటే ఆలోచన. ఎడతెగని ఆలోచన. ఇవాళెందుకో మనసు అసలు బాగలేదు. అంటే రోజు ఏదో గొప్ప ఆనందంగా ఉన్నానని కాదు. కాకపోతే ఇన్నిరోజులు చీకట్లో మిణుకుమిణుకుమంటున్న ఒకే ఒక్క ఆశా దీపం ఈ రోజు చప్పున ఆరిపోయింది. మనసును కమ్మేస్తూ నిరాశ మబ్బులు.

మనసు బాగలేనప్పుడు ఎవరితోనూ మాట్లాడాలనిపించదు నాకు. నా మనోవేదననంతా నివేదించుకోవడానికి నాకున్న ఒకే ఒక్క నేస్తం దగ్గరకు పోవాలనుకున్నాను. ఇక ఇంట్లో క్షణం కాలు నిలవలేదు. నా శ్రీమతి సుజాత ఒక్కటే నిద్ర లేచినట్లు ఉంది. పంచలో ఉన్న పాత స్కూటీని బయటకు తీసి, చెక్క తలుపు గొళ్ళెం చప్పుడు కాకుండా మెల్లగా లాగి తలుపు తీసి, స్కూటీతో సహా వీధిలోకి వచ్చాను. సీటు మీద కూర్చుని కిక్ రాడ్ ను గట్టిగా నొక్కాను. బండి స్టార్ట్ అయింది. వెనుక నుంచి సుజాత పిలుస్తున్నా ఆగకుండా వచ్చేసాను.

ఇంటికి తూరుపు తట్టు నుంచి రైల్వేస్టేషన్ దాక వచ్చాక నా ప్రమేయం లేకుండానే స్కూటీ మైపాడు తట్టుకి తిరిగింది. పది నిమిషాల్లో సముద్రం ఒడ్డు వచ్చేసింది. ఇక ఇసుకలో స్కూటీ ముందుకు పోలేనని మొరాయించింది. అక్కడ ఉన్న ఓ పాత చెక్క పడవ పక్కన వారగా స్కూటీని పెట్టి లాక్ వేసి, ముందుకు నడిచాను. పొద్దున ఎనిమిది గంటలవుతున్నా ఎండ పొడ జాడే లేదు సముద్రం ఒడ్డున. ఎవరి మీద కోపమొచ్చి సూర్యుడు దాక్కున్నాడో ఏమో కానీ, నల్లటి మబ్బులు మాత్రం ఏదో కొంపలు ముంచే పని ఉన్నట్లు అటూఇటూ హడావిడిగా తిరుగుతున్నాయి.

నాలుగడుగులు వేసాను. అరిగిపోయిన పాత చెప్పులు కూడా ఇసకలో నడవడానికి సహకరించడంలేదు. చెప్పులు తీసేసి పక్కన పెట్టాను. ఆ చెప్పులు పోతాయని భయం లేదు. చివికిపోయి చిల్లులు పడిన ఆ చెప్పులు తీసుకునేంత దరిద్రులు ఎవరూ ఉండరనుకుంటాను. చెప్పులు కూడా తీసేసాక సర్వబంధానాలను వదిలించుకున్నట్లు అనిపించింది. అది ఒక్క క్షణమే. మనసును చుట్టుముట్టిన ఇనుప సంకెళ్లను వదిలించుకునేదెలా అని..?

అదిగో ఎదురుగా నా ప్రియ నేస్తం ఎగిసెగిసి పడుతూ వస్తున్న అలలతో నన్ను రారమ్మంటూ పిలుస్తోంది. తడిచిన ఇసుకలో కాళ్ళు దిగబడ్డాయి. అబ్బా చల్లటి స్పర్శతో నా కాళ్ళను ముద్దాడి వెనుకకు మరలాయి నీళ్ళు. సంతోషమొచ్చినా, బాధ కలిగినా నేనొచ్చేది ఇక్కడికే కదా..! గంటల తరబడి ఒంటిమీద స్పృహ లేకుండా కూర్చుని ఈ సముద్రాన్ని చూడడమంటే ఎంతిష్టమని నాకు. సముద్రం కంటే గొప్ప ఓదార్పునిచ్చేదెవరు ?

సముద్రం ఒడ్డున పట్టపోళ్ళ పిలకాయలు కాబోలు ఇసుక తిన్నెల మీద ఆడుకుంటున్నారు. ఏ చీకు చింత లేకుండా. వరుసగా నాలుగైదు పడవలు ఒడ్డున నిలిపి ఉన్నాయి. మాములుగా ఆదివారం పూట సముద్రం ఒడ్డుకు వచ్చే జనాలు ఎక్కువ ఉంటారు. కానీ ఈ రోజెందుకో ఎక్కువ జనాలు లేరు. నాలుగైదు జంటలు, వాళ్ళ పిల్లలతో వచ్చినట్లు ఉన్నారు. ఆ పిల్లలు ఇసుకలో పొర్లుతూ, గవ్వలు ఏరుకుంటున్నారు. వాళ్లలో ఒక పిల్లాడికి చిన్న శంఖు దొరికినట్లుంది. సంబరంతో ఎగిరి గంతేసి వాళ్ళ మ్మకు చూపిస్తున్నాడు. తెల్లగా మెరిసిపోతోంది ఆ శంఖు.

చిన్నప్పుడు తాత వేలు పట్టుకుని ఎన్ని సార్లు ఈ ఒడ్డున తిరిగి వుంటాడు తను. ఇప్పుడు పిల్లలు చూసే “పైరేట్స్ అఫ్ ది కరేబియన్స్” సినిమాల్లాంటివే, తాత చెప్పే సముద్రపు దొంగల కథలు, జయంతుడు-జలకన్య, గుప్తనిధి లాంటి కథలు ఎంత వింతగా తోచేవి. ఎన్ని సార్లు తాతతో కలిసి ఈ సముద్రంలో ఈత కొట్టలేదు తను. ఒడ్డు నుంచి సముద్రంలోకి ఎంత దూరం పోయినా, ఎన్ని అడుగుల లోతులో అయినా ఒడుపుగా ఈతకొట్టడం తనకు తాత ఎంత బాగా నేర్పాడని. తర్వాత అమ్మ, నాన్నలతో ఎన్ని సార్లు ఇక్కడకి వచ్చాడో లెక్కేలేదు. పుట్టిన రోజైతే ఇక్కడికే, పరీక్ష పాసైన రోజు ఇక్కడికే. తాత చనిపోయినప్పుడు, తాతని మరచిపోలేక ఏడుస్తుంటే, ఓదార్పుకు నాన్న తనను తీసుకువచ్చింది ఇక్కడికే. ఆ తర్వాత సుజాత, పిల్లలని తీసుకుని ఎన్నిసార్లు వచ్చాడని..! ఇదిగో ఈ ఒడ్డున ఇసుకలో తను ఎన్ని సార్లు నడిచి ఉంటాడు, ఎన్ని గవ్వలను ఏరి పోగేసి ఉంటాడు..! ఎన్ని జ్ఞాపకాలు నెమరేసుకుని ఉంటాడు..!

ఎంట్రకాయలు ఒడ్డుకి వచ్చి అక్కడక్కడా ఇసుకలో బొరియలు చేస్తున్నాయి. ఒడ్డునంతా కాస్తా నీచు వాసనా వస్తోంది. ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో..! అయినా నేను వచ్చిన పని గురించి ఆలోచించకుండా, పరిసరాల గురించి ఈ ఆలోచనలు ఏంటి నాకు? బహుశా దీన్నే పలాయనవాదం అంటారేమో. ఎంత తప్పించుకుందామని ప్రయత్నిస్తే అంత బిగుసుకుంటున్నాయి ఆలోచనలు. కానీ ఈ సముద్రం, ఈ పరిసరాలు చూస్తుంటే వచ్చిన పనిని కాసేపు వాయిదా వేద్దాం అనిపించింది.

సముద్ర తీరపు అంచు వెంబడి ఇసకలో నడుచుకుంటూ వెళ్లడం నాకు చాల ఇష్టమైన అలవాటు. అలలు ఒడ్డును తాకినప్పుడల్లా చల్లగా నీళ్ళు పాదాలను తడిపి వెళుతున్నాయి, అమ్మ ఆత్మీయ స్పర్శలా. తీరం వెంట నడుస్తూ ఉన్నాను. ఒకపక్క కొన్ని ఉప్పు కయ్యలు, కొంత దూరం నడిచాక పట్టపోళ్ళ గుడిసెలు వరుసగా. సముద్రాన్ని నమ్ముకుని ఉన్న జాలరి బతుకులు వాళ్ళవి. గుడిసెల ముందు తీగల మీద ఎండు చేపల దండలు వేలాడదీసి ఉన్నాయి. గుప్పున వాసన ముక్కులకు కొట్టింది. జాలరి యువకులు చేపల వేటకు పడవల మీద వెళ్లినట్లు ఉంది. పట్టపోళ్ల ఆడవాళ్ళు కూడా తట్టలను నెత్తిమీద పెట్టుకుని ఇల్లిల్లు తిరుగుతూ చేపలమ్ముకునేదానికి నెల్లూరుకు పోయినట్లు ఉంది. గుడిసెల దగ్గర పెద్దగా సందడి లేదు. ముసిలి, ముతక గుడిసెల ముందు కూర్చొని చేపల వలలను బిగించుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే ఇంటిదగ్గర ఉన్న అమ్మా, నాన్నలు గుర్తుకువచ్చారు. ఇంకా నిద్ర లేచారో లేదో వాళ్లిద్దరూ! అమ్మ ఎందుకో ఈ మధ్య చాల నీరసంగా కనిపిస్తోంది. ఇంటి నుంచి ఎంత దూరం వచ్చేసినా బంధాలు ముందరి కాళ్ళకు బంధనాలు అవుతున్నాయే!

ఒడ్డు వెంబడి రెండు మైళ్ళు నడిచి, మళ్ళీ వెనుదిరిగి నడక మొదలుపెట్టిన చోటుకే చేరాను. పది గంటలవుతున్నా సూర్యుడు దుప్పటి ముసుగు తీసినట్లు లేదు. ఆ.. రాత్రి సుజాత చెప్పింది గుర్తుకు వచ్చింది. ‘ఆదివారం, అమావాస్య కలిసొస్తాయి రేపు. మధ్యాన్నం దిష్టి తీయించుకోవాలని.’ అయినా నాకు దిష్టెవరు పెడతారని..? నేనేమైనా ధనవంతుడినా..! పోనీ బతకనేర్చిన తెలివిమంతుడినా..!

సముద్రానికి ఎదురుగా ఎప్పుడూ కూర్చునే తావులో కాళ్ళు బారా జాపుకుని, చేతులు ఇసుకలో వెనక్కి పెట్టి కూలబడ్డాను. అల్లంత దూరం నుంచి ఊరకలేస్తూ వస్తున్న అలలు ఒడ్డును చేరి నన్ను పూర్తిగా తడిపేసి వెళుతున్నాయి. ఈ రోజు సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువ ఉన్నట్లున్నాయి. విపరీతమైన అలజడితో కెరటాలు నింగినంటుతూ వేగంగా దూసుకొచ్చి, మళ్ళీ శక్తి ఉడిగినట్లు చప్పున పడిపోతున్నాయి. తీరప్రాంతమంతా నల్లగా చీకట్లు కమ్ముకుంటూ ఎప్పుడూ లేని భీతిని కలిగిస్తున్నాయి ఎందుకో. వచ్చిన వాళ్లు వెళుతుంటే, ఇంకొందరు అప్పుడే వస్తున్నారు సముద్రపు ఒడ్డున సేదదీరాలని. సన్నగా వాన తుప్పర మొదలైంది. సముద్రం మీద వాన పడడం చూస్తుంటే మనసు పులకించిపోతోంది. ఇల్లు, వాకిలి, డబ్బు, ఈ బంధాలు, సమస్యలు అన్నివదిలించుకుని ఈ సముద్రంలో కలిసిపోతే ఎంత బాగుంటుంది. అసలందుకే కదా తను ఇంటి నుంచి ఇక్కడకు వచ్చింది.

పిల్లలెవరో ఇసుకలో గూళ్ళు కడుతున్నారు. ఆ గూడు లాంటి ఇంటి కోసమే కదా తాను అప్పు చేసింది. “పందుము తిన్నా పరగడుపే, ఏదుము తిన్నా ఏకాసే” అన్నట్లు ఎంత జాగ్రత్తగా వ్యాపారం చేసినా ఎప్పుడూ లాభాలు వచ్చింది లేదు. ఇంత కాలం నోట్లోకి నాలుగు వెళ్లైనా పొయేవి. సొంత ఇల్లు కావాలనుకున్న అత్యాశ నన్ను ఈ స్థితికి తెచ్చింది.

చినుకులు రాలడం తగ్గింది కానీ, సముద్రంలో అలల అలజడి మాత్రం తగ్గలేదు. ఒడ్డునుంచి చూస్తుంటే నల్లని మబ్బులు సముద్రాన్ని, ఆకాశాన్ని కలిపేసాయి. గంట పదకండైనా చీకటి వీడక మరింత చిక్కగా అమలుకుంటోంది ఒడ్డు చుట్టూతా. అంత అలజడితో కూడా పిల్లలు, పెద్దవాళ్ళు మోకాళ్ళ లోతు నీళ్ళల్లో నిలబడి, నీళ్ళు చల్లుకుంటూ కేరింతలు కొడుతున్నారు.

ఎంత నిశ్చింత వాళ్ళ బతుకుల్లో. తన పరిస్థితి..! ఇంటి కోసం చేసిన అప్పు, వడ్డీ తో సహా పెరిగి “ఇంతింతై వటువింతై” చందాన కొండ చిలువంతై ఇప్పుడు తనని మింగేయాలని చూస్తోంది. ఆ ఇంటిమీదే లోన్ తీసుకుని కొంత అప్పు అయినా తీరుద్దామనుకుంటే, తీరా లోన్ శాంక్షన్ అయ్యే సమయంలో చెక్ ఒకటి బౌన్సు అయి, లోన్ రావడం ఆగిపోయింది. నా గుండె ఆగినంత పనైంది. ఈ నెల్లో వడ్డీతో సహా అప్పు తీర్చేస్తానని కొందరికి మాట ఇచ్చాను. ఇప్పుడు ఇక ఏం చేయాలి నేను..? ఎంత ఆలోచించినా ఈ సముద్రపు ఆవలి తీరంలాగా, సమస్యకు పరిష్కారం కనపడడం లేదు. రేపటి నుంచి అప్పుల వాళ్ళు ఇంటి ముందర వరుస కడతారు. ఏం చేయాలి..? ఎలా తప్పించుకోవాలి..? అందుకే నా ఆవేదనంతా విన్నవించుకుని నా నేస్తంలో కలిసిపోవాలని రాత్రే నిర్ణయించుకున్నాను.

దింపుడు కళ్ళెం ఆశలాగా జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి ఇంకోసారి చూసుకున్నాను. లోన్ కి అనుమతి వచ్చినట్లు మెసేజ్ ఏమైనా ఉందా అని. అయినా నా పిచ్చి కానీ, చెక్ బౌన్సు అయి లోన్ క్యాన్సిల్ అయినట్లు రాత్రి మెసేజ్ వస్తే, పొద్దున లోపల ఏం అద్భుతం జరుగుతుందని. మెసేజ్ రాలేదు కానీ, సుజాత ఫోన్ నుంచి పది మిస్సుడ్ కాల్సు ఉన్నాయి. పాపం తను ఏం చేస్తుంది. నా అప్పుల బాధలో పడి ఇంటిని, ఇంట్లోవాళ్ళని పట్టించుకోవడమే మానేసాను. అయినా ఇప్పుడిక ఇవన్నీ ఆలోచించకూడదు.

ఈ సముద్రం ఉంది చూశారు..! ఎంత లోతైనదని, అంతకంటే ఎంత గంభీరమైనదని..! ఎన్ని రహస్యాలను తనలో దాచుకొని ఉందో! నిధులు, నిక్షేపాలు, ముత్యపు జీవులు, పగడపు దీవులు, జల జీవరాసులు. ఒకటా, రెండా.. ఎన్ని నదులు వచ్చి తనలో కలిసినా ప్రేమగా సాదుకుంటుంది కానీ, ఏ నదిని వెనక్కి తిరిగి పొమ్మనదు. ఎంత మంచి నీరు తనలో కలిసినా తన ఉప్పదనాన్ని కోల్పోదు. మళ్ళీ తనలోని ఆ ఉప్పు నీళ్ళే సూర్యుడి వేడికి ఆవిరై, మేఘాలై వాన కురిస్తే, ఆ నీటిలో ఒక్క చుక్కైనా ఉప్పదనం ఉండదు. ఎంత విచిత్రం సముద్రం తత్వం. తనకు ఇష్టమైన వాటిని కలిపేసుకోవడంతో పాటు, తనకు భారం అయినవాటిని ఒడ్డుకు ఈడ్చిపారేస్తుంది. నా ఈ ఒక్క దేహాన్ని తనలో కలిపేసుకోవడం సముద్రానికి ఎంత తేలికని. ఇక్కడ నేను తనలో కలిసిపోతే, ఇంకెక్కడో, ఏదో తెలియని తీరానికి ఈ నిర్జీవ దేహాన్ని తేల్చిపారేస్తోంది. ఇంట్లో వాళ్ళు నాలుగు రోజులు నా కోసం ఏడుస్తారు. అప్పుల వాళ్ళు ఇంకో నాలుగు రోజులు ఇంటి చుట్టూ తిరిగి, నన్ను తిట్టుకుని వెళ్ళిపోతారు. ఇన్సురెన్సు డబ్బు రావచ్చు. సుజాత, పిల్లలు, అమ్మ,నాన్న ఎలాగో బతుకుతారు. నాకు మాత్రం ఈ రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. దృఢంగా నిర్ణయించుకున్నాను. ఈ క్షణమే నా ప్రియ నేస్తం సముద్రంలో కలిసిపోవాలని.

మెల్లగా లేచి నిలబడ్డాను. కాళ్ళ కింద ఇసక జారిపోతోంది. తడబాటుగా పడబోయి, మెల్లగా నిలదొక్కుకున్నాను. అంత బాధలో కూడా నవ్వు వచ్చింది. సముద్రంలో కలసిపోవాలనుకున్న నాకు ఈ జాగ్రత్త ఎందుకిపుడు..! చుట్టూ చూసాను. అందరు సముద్రం ఒడ్డునే ఉన్నా, ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. పిల్లలు, పెద్దల అరుపులతో అంతా జాతరలా ఉంది. అంతకు మించిన గాంభీర్యంతో సముద్రపు అలల ఘోష మరోవైపు. ఓ క్షణం గుండెల నిండుగా గాలి పీల్చుకుని వదిలాను. అదిగో అల్లంత దూరం నుంచి ఘోషిస్తూ నింగినంటుతున్నట్లు ఉవ్వెత్తున ఎగిసిన కెరటం ఒడ్డు వైపుకు దూసుకువస్తోంది. నాలుగడుగులు ముందుకు వేసి ఛాతీ లోతు నీళ్ళలోకి వెళ్ళాను. ఇంకొక్క క్షణం. కెరటం నన్ను తనలోకి లాగేసుకుంటుంది. సముద్రం నన్ను తనలో కలిపేసుకుంటుంది. నన్నెవరూ గమనించడం లేదు. చేతులు బారాజాపి, కళ్ళు మూసుకున్నాను.

ఒక్క నిముషం గడిచింది. నా పక్కనే ఏదో కలకలం. కళ్ళు తెరిచాను. పెద్దగా అరుపులు, వెనువెంటనే పెద్దపెట్టున ఏడుపులు. అప్పటిదాకా నాకు కాస్త దూరంలో ఆడుకుంటున్న పదేళ్ల పిల్లాడు కెరటం తాకిడికి నీళ్ళల్లో కొట్టుకుపోయాడు. జనాలు చుట్టూ చేరి అరుస్తున్నారు కానీ, సముద్రంలోకి దిగడానికి ఎవరూ సాహసించలేదు. పిల్లాడి తండ్రి కొంత లోతుకి వెళ్ళి, అరుస్తున్నాడు. అందరూ చూస్తుండగానే పిల్లాడు నీళ్ళల్లో కొట్టుకుపోతూ మాయమైనాడు. ఒడ్డున పిల్లాడి తల్లి తల బాదుకుంటూ ఏడుస్తోంది.

చేష్టలుడిగి నిలబడ్డాను నేనుఒకేఒక్క క్షణం. ఏం జరుగుతోంది అసలు..! ఆ కెరటం నన్ను కదా తనతో తీసుకెళ్లాల్సింది. ఇదేంటి ఇలా జరిగింది. సముద్రంలోకి కొట్టుకుపోవాల్సింది తను కదా. ఇంకేం ఆలోచించలేదు నేను. ఒక్క ఉదుటన సముద్రంలోకి దూకాను. ఊపిరి బిగబట్టి లోతుకి వెళ్ళి నలుమూలల ఈదుతూ గాలిస్తున్నాను. మధ్యలో ఓసారి నీళ్ళపైకి వచ్చి, గాఢంగా ఊపిరి పీల్చుకుని, మళ్ళీ నీళ్ళలోకి ఈదుకుంటూ పోయాను. ఐదు నిమిషాల నా అన్వేషణ ఫలించింది. పిల్లాడి చేయి తగిలింది. క్షణం ఆలస్యం చేయకుండా పిల్లాడిని దొరకబుచ్చుకుని భుజాన వేసుకుని ఒడ్డుకి ఈదుకుంటూ వచ్చి, వాడిని ఇసుకలో వెల్లకిలా పడుకోబెట్టాను. చుట్టూ జనాలు చేరారు. ముక్కుల్లోకి, పొట్టలోకి నీళ్ళు పోయిన పిల్లాడు స్పృహ కోల్పోయి, కళ్ళు తేలవేసాడు. పిల్లాడి పొట్ట మీద చేతులు పెట్టి ఒడుపుగా ఒత్తాను. రెండు,మూడు సార్లు ఒత్తగానే నోట్లోనించి నీళ్ళను బయటకి కక్కాడు. అందరు ఆత్రంగా పిల్లాడి వంక చూస్తున్నారు. మెల్లగావాడి పొట్ట నొక్కుతూ, గుండెలమీద అరచేత్తో రాస్తున్నాను. పది నిముషాలు గడిచింది. చిన్నగా దగ్గుతూ, పిల్లాడు కళ్ళు తెరిచాడు. అప్పటిదాకా ఏడుస్తున్న పిల్లాడి తల్లి ఆనందంగా వాడిని హత్తుకుని ముద్దులు కురిపిస్తోంది. చుట్టూ ఉన్న జనం తేలికగా ఊపిరిపీల్చుకున్నారు. పిల్లాడి తండ్రి అమాంతం నా కాళ్ళ మీద పడిపోయాడు.

“సార్, మీరెవరో తెలియదుకానీ, ఈ రోజు దేవుడిలా వచ్చి మా బాబుని కాపాడారు. మీరే లేకుంటే ఈరోజు మా బిడ్డ మాకు దక్కేవాడు కాదు. ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేనిది” అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. పిల్లాడి తల్లి కూడా కృతజ్ఞతా దృక్కులతో నావైపు చూస్తూ చేతులెత్తి నమస్కరించింది. చుట్టూ ఉన్న జనాలు నన్ను పిల్లాడి ప్రాణాన్ని కాపాడిన హీరోలా చూస్తూ, పొగుడుతూ తేలికగా ఊపిరిపీల్చుకుని ఎవరిదారిన వాళ్ళు వెళుతున్నారు.

జరిగిందంతా నాకు కలగా ఉంది. చనిపోవాలనుకుని వచ్చిన నేను పసివాడిని కాపాడడం విధిలిఖితం కాక మరేమిటి? ఏదేమైనా పిల్లాడిని ప్రాణాలతో కాపాడగలిగాను అనే తృప్తి నాకు చాల ఆనందం కలిగించింది . ఈ రోజు అందుకేనేమో నా మనసు ఇటువైపు మళ్ళింది. అంటే నా వల్ల కూడా ఒక ప్రయోజనం ఉందన్నమాట. నా వల్ల జరగాల్సిన మంచి పనులు ఇంకా కూడా ఉన్నాయేమో? నేను చేయబోయిన పనికి నా నేస్తం మాత్రం హర్షిస్తుందా? లేదు కాబట్టే ఈ రోజు తనో పాఠం నేర్పింది నాకు. త్వరపడి తను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఎంత మూర్ఖపు నిర్ణయం..! నేను ఎక్కడికి వెళ్ళానో తెలియక ఇంటిదగ్గర అమ్మా, నాన్న, సుజాత ఎంత కంగారు పడుతున్నారో. ఆ ఆలోచన రాగానే ఇక అక్కడ క్షణం కాలు నిలవలేదు నాకు. కాలం ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం చూపుతుంది. మంచి రోజులు వచ్చేవరకు సహనంతో ఎదురు చూడడమే తన ప్రస్తుత కర్తవ్యము.

తీరం చుట్టూతా వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి. అప్పటిదాకా ఉన్న అలజడి తగ్గి సముద్రం ప్రశాంతతని సంతరించుకుంది. పిల్ల తెమ్మెరలు మెల్లగా వీస్తున్నాయి. నా మనసులోని అలజడి కూడా తగ్గింది. ఓసారి సముద్రం వంక తృప్తిగా చూసి, స్కూటీ ఎక్కి ఇంటిదారి పట్టాను.

రోహిణి వంజారి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *