సుతిమెత్తని పరిమళం

పారిజాత పువ్వులం
పగడపు వన్నె కాడలతో
వెండి చందమామ రేకులతో
ముట్టుకుంటే చాలు
చిన్నిపాప మేనులా సుతిమెత్తగా
మీ చేతివేళ్ళ కొనలకి
దివ్యపరిమళాలు అద్దుతాము..
సత్యభామ కోసం కృష్ణుడు
దివి నుంచి భువికి తెచ్చిన
దేవలోక పుష్పాలు అంటారు కానీ
ఆ దైవత్వాన్ని అంటగట్టకండి మాకు
ఆడపిల్లలను అమ్మవారు శక్తి స్వరూపిణి
అంటూనే కాలరాచిపారేసినట్లు..
అచ్చంగా భువిలో మీకోసం పూచే కుసుమాలం
సాయంత్రాలు రేకులనువిచ్చుకుంటాం
విరిసిరుల సుగంధాలను మీకందిస్తాం
పొద్దున కి నేలరాలి పగడాల తివాచీని
చిక్కగా పరుస్తాం మీ కోసం..
అప్పుడే పుట్టిన పసికందును
చేతుల్లోకి తీసుకున్నంత మృదువుగా
మమ్మల్ని మీ దోసిట్లోకి తీసుకోండి
వాసన చూసి నలిపిపారేయకండి
వావివరస చూడక ఆడదేహాన్ని చిదిమేసినట్లు..
మేం వెదజల్లే పరిమళాలను గుండె నిండుగా
ఆస్వాదించండి
మీ ప్రేమను మాత్రం మాకు
అందించండి బిడ్డను ఒడిచేర్చుకుని
లాలించే తల్లిలాగా..
కంగారు కడుపుసంచిలో పిల్లలను
దాచుకున్నట్లు
కోడి తన రెక్కల కింద పసివాటిని
అదుముకున్నట్లు
మీ ప్రేమలో పొదువుకోండి
మమ్మల్ని మీ బిడ్డల్ని..
ఎందుకంటే మేం పారిజాతాలం
సుతిమెత్తని పువ్వులం
మీ పసిపాప నవ్వులంత
మెత్తని దేహం మాది..


రోహిణి వంజారి
24-12-2022